వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలతెలవారుతుండగా ఓ పేషెంట్‌కి ఏదో అవసరం అయి వార్డ్‌బాయ్‌ని పిల్చింది.
అయితే ఇంకా అతను మత్తులోనే ఉన్నాడు.
‘వీడు తప్పతాగి పడినట్టున్నాడు’ అని విసుక్కుంటూ వాచ్‌మన్‌ని లేపింది. అతను విసుక్కుంటూ లేచి-
‘ఏంటి?’ అన్నాడు కొట్టినట్లు. ఆమె చెప్పింది.
‘అది వార్డ్‌బాయ్ నడుగు’ అంటూ మళ్లీ పడుకోబోయిన వాచ్‌మన్ ఆమె చెప్పిన మాట విని తుళ్లిపడి లేచి కంగారుగా పరుగెత్తికెళ్లి వార్డ్‌బాయ్‌ని లేపి, వాళ్లెవరూ వినకుంటే నాలుగు చివాట్లు పెట్టాడు. అతనూ అలర్టయి ఏం ఎరగనట్టు పేషెంట్‌క్కావల్సిందిచ్చి, రామయ్య దగ్గరకొచ్చి అతని పరిస్థితి చూసి క్షణం బిగుసుకు పోయాడు. తర్వాత తేరుకుని వార్డ్‌బాయ్ సహాయంతో రామయ్య మొహాన నీళ్లు చల్లి, ఎలాగయితేనేం అతనికి స్పృహ తెప్పించారు.
అతను వణికిపోతూ జరిగింది చెప్పాడు. అప్పటికే విషయం పేషెంట్లందరికీ తెలిసిపోయి గందరగోళం అయిపోయింది. రామయ్యా వాళ్లు భయంతో వణికిపోతున్నారు. తాము చేసిన పనికి యజమాని ఎలాంటి శిక్ష వేస్తాడో అని. వాళ్లు లూసీని గురించి ఆలోచించే లోపలే, ఎప్పుడూ లేట్‌గా వచ్చే అనిల్ ఆ రోజు చీకటితోనే వచ్చేశాడు. హాస్పిటల్ దగ్గర హడావిడి చూసి, ఏ పేషెంట్‌కి ప్రాణం మీదికొచ్చిందో అని కంగారుగా లోపలికొచ్చాడు.
‘ఏమైంది? లూసీ ఏదీ?’ వణికిపోతున్న వాచ్‌మన్‌కేసి చూస్తూ అన్నాడు అరిచినట్టు. నోట మాటరాని రామయ్య, చేత్తో ఆమె గదికేసి చూపించాడు. పేషెంట్స్ దొంగల గురించి చెప్పేశారు.
అయోమయంగా అటుకేసి పరుగెత్తాడు అనిల్. తన గదిలోని వస్తువులేం పోయాయో అని. అక్కడేం పోలేదు.
ఇంత జరుగుతుంటే ఈ లూసీ ఏం చేస్తోంది?’ అని విసురుగా ఆమె గదిలోకెళ్లాడు అనిల్. అంతే కొయ్యబారిపోయాడు.
లూసీ నోట్లో గుడ్డలు కుక్కి, పటిష్టంగా కట్టిపడెయ్యబడి ఉంది.
* * *
‘బావా’ అరుస్తున్నట్టు పిలుస్తూ ఆవేశంగా వచ్చింది చిన్ని.
ఎప్పుడూ ప్రేమగా ‘బావా’ అంటూ పిల్లిలా వచ్చే చిన్ని, పరిసరాలు అదిరేలా అరుస్తూ వచ్చేసరికి క్షణం బిత్తరపోయాడు జింబో.
‘ఏవిఁటి?’ అన్నాడు తింటున్న పిట్ట మాంసాన్ని పక్కనే వున్న మూకుళ్లో పడేస్తూ.
‘ఆమెనెందుకు బంధించావ్?’
‘ఎవర్ని?’ తాపీగా అన్నాడతను.
‘ఏం తెలియనట్టు నాటకాలాడకు. గౌతమిని ఎందుకు బంధించావ్?’ ఆవేశంగా అంది చిన్ని.
‘ఆమె నేరం చేసింది’
‘ఏవిఁటి ఆవిడ చేసిన నేరం? మన అడవినంతా దోచేసిందా?’
‘నీకు తెలియదు. నువ్వు మాట్లాడకు’ విసుగ్గా అన్నాడతను.
‘ఏవిఁటి నాకు తెలియంది, నీకు తెలిసింది? తను బాబా కోసం వచ్చింది. ఆయన ఆదరించాడు. మధ్య నీకొచ్చిన బాధేమిటి?’ నిలదీసినట్టు అంది చిన్ని.
‘అవును జింబో! దొర ఆమెని నమ్మి ఆదరించాడు. వెళ్తూ మా అందరితోనూ, ఆమెని జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పాడు’ అంది చంద్రమ్మ అనే ఓ నడివయస్కురాలు.
‘అయ్యో పెద్దమ్మా! ఆమె మాటలు మీరంతా నమ్మేశారు. ఎంత ధైర్యస్థులైతే మాత్రం ఒంటరిగా ఈ అడవిలో ప్రవేశించగలదా? ఆమె కచ్చితంగా పోలీసుల మనిషే. మన పాతాళ స్వర్గం గురించిన వివరాలు ఆమె తెలుసుకోవడానికీ, మామని పట్టించి లక్షలు సంపాదించాలనీ వచ్చింది. అలాంటి దాన్ని బంధించి, తిండి పెట్టకుండా మాడిస్తేనే గానీ నిజాలు బైటికి రావు’ అన్నాడు జింబో కోపంగా. నిస్సహాయంగా చూసిందామె.
‘సరే! అలాగే చెయ్యి. బాబా వచ్చాక నీకు సేవ చేస్తాడు’ కోపంగా అంది చిన్ని.
‘నా పాట్లు నేను పడతాను గానీ, ఆమెని అడవంతా తిప్పి చూపించావట. మీ ఇంట్లోనే పడుకోబెట్టుకున్నావట. కొంపతీసి పాతాళస్వర్గం గురించి కూడా చెప్పేశావా?’ కంగారుగా అన్నాడు జింబో.
‘నేనేం అంత తెలివితక్కువ దాన్ని కాదు. అసలు తనని మా ఇంటికే తీసికెళ్లలేదు. దర్బారులోనే పడుకున్నాం. పాపం సరైన తిండి కూడా లేదు. రాగిజావలు అవీ సయించక నేరేడుపళ్లు అవీ తిని కడుపు నింపుకుంది’ చిన్ని కళ్లల్లో నీళ్లూరాయి.
‘అయితే ఏమంటావ్? ఆమెని రాజమహల్లో వుంచి పట్టుపరుపుల మీద పడుకోబెట్టి నెమలి మాంసం వేపుడుతో భోజనం పెట్టమంటావా?’ చిరాగ్గా అన్నాడు జింబో.
‘ఛీఛీ. ఆమె మాంసం కాదు కదా, గుడ్డు కూడా తినదు. పళ్లూ తేనె తప్ప’ అంది చిన్ని.
‘మరింకేం. అవి పెట్టారుగా చాలు!’
‘నువ్వు బంధించిందగ్గర్నించీ అవి కూడా తినడంలేదు!’
‘అయితే మాడి చావనీ. నేను మాత్రం ఆమెని వదల్ను’ కచ్చితంగా అన్నాడు జింబో.
‘సరే! అయితే జరిగిందంతా బాబా రాగానే చెప్తాను. ఆయన వేసే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు’ అంటూ గిరుక్కున తిరిగింది చిన్ని. ఎందుకో అతను కంగారుపడిపోయాడు.
‘చిన్నీ’ అన్నాడు ఆదుర్దాగా. ఆమె వెనక్కి తిరిగింది.
‘ఆమె పేరేమిటన్నావ్?’ అన్నాడు ఏదో ఆలోచిస్తూ.
‘గౌతమి అని నీకు తెలియదా?’ విసురుగా అంది చిన్ని.
‘సరే.. గౌతమికి ఆమెక్కావల్సిన తిండి పెట్టండి. నేను ఆమెతో మాట్లాడాక ఆమెని బైటికి తెచ్చే సంగతిని గురించి ఆలోచిద్దాం’
‘ఆమెతో కొత్తగా ఏం మాట్లాడతావ్? బాబాకి చెప్పినవన్నీ మేం నీకు చెప్పాంగా’ రోషంగా అంది చిన్ని.
‘అబ్బే.. వాటిని గురించి కాదు. ఓసారి ఆమెని చూసి..’ బుర్ర గోక్కున్నాడతను.
‘వీడికేమైంది?’ అనుకుంటూ వెళ్లిపోయారు చంద్రమ్మ వాళ్లు.
‘బావా! ఇప్పుడెళ్దామా?’ ఉత్సాహంగా అంది చిన్ని.
‘పద’ అన్నాడతను మరింత ఉత్సాహంగా.
ఆమెకి చిన్నారి గౌతమి కళ్ల ముందు నిల్చింది.
అప్పుడే దొర వచ్చాడన్న వార్త అందించాడు జోగి. అంతే జింబోతో సహా అందరూ అటుకేసి పరుగెత్తారు.
బాగా అలసిపోయిన దొర సిద్దు అందించిన నీళ్లు తాగుతూ జింబోని పలకరించి వివరాలు తెలుసుకుంటున్నాడు. మిగతా వాళ్లు దొర చూడ్డానికెళ్లిన వ్యక్తి ఆరోగ్యంగానే వున్నాడని విని తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు.
‘గౌతమి ఏదీ?’ హఠాత్తుగా అడిగాడు దొర.
తుళ్లిపడి చూశారంతా. అతను మరోసారి అడిగేసరికి-
‘నేరేడు చెట్టు కిందుంది. తీసుకొస్తాను’ అంటూ ఒక్క అంగలో బైటికి పరుగెత్తి గౌతమితో సహా తిరిగొచ్చాడు జింబో.
ముసిముసిగా నవ్వుకున్నారంతా. గౌతమి దొర కాళ్లంటి నమస్కరించింది.
‘ఎలా వున్నావమ్మా?’ ఆప్యాయంగా ఆమెని పక్కన కూర్చోబెట్టుకుంటూ అన్నాడు దొర.
‘బావున్నాను దొరా! మీ జింబో నన్ను మరింత ఆప్యాయంగా చూస్తున్నాడు’ ఓరగా అతనికేసి చూస్తూ అంది గౌతమి.
అతను కంగారుగా చూశాడు.
‘అవునమ్మా! వాడిది చాలా మంచి మనసు!’ ప్రేమగా అతని కేసి చూస్తూ అన్నాడు దొర.
‘సరే దొరా! ముందు లేచి కాస్త ఎంగిలిపడు. బాగా అలసిపోయావ్’ అంది ఓ వృద్ధురాలు.
అతను నవ్వుతూ లేవబోయి, గుండె చేత్తో పట్టుకుని కుప్పకూలిపోయాడు. హడలిపోయారంతా.
‘దొరా’ అంటూ అతన్ని లేవదీయాలని ప్రయత్నించారు. దొర మాట్లాడలేదు. బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది. ఆడవాళ్లు శోకాలు పెడితే కొందరు మగాళ్లు పసర్లేవో తేవడానికి పరుగెత్తారు. అతని పరిస్థితి చూసిన గౌతమి మొహం వెలవెలబోయింది.
‘మైగాడ్! హార్టెటాక్’ అంది వణుకుతున్న గొంతుతో.
‘హర్టిటాకా?’ అన్నారెవరో.
‘హార్టెటాక్.. అంటే గుండె నొప్పి. చాలా సివియర్‌గా వచ్చింది’ అతని పల్స్ చూస్తూ కంగారుగా అంది గౌతమి.
గొల్లుమంటూ మూగారంతా.
‘దయచేసి మీరంతా బైటికెళ్లండి. ఇతను చాలా ప్రమాద పరిస్థితిలో వున్నాడు. గాలి బాగా తగలాలి’ అంటూ అందర్నీ దూరంగా పంపేసి-
‘ఇక్కడేమైనా మందులు దొరుకుతాయా?’ అంది గౌతమి ఆతృతగా.
‘ఆఁ! మా అడవిలో చాలా మందులున్నాయి. మా వాళ్లు వెళ్లారు కూడా!’ ఏడుస్తూ అంది చిన్ని.
‘ఆ పసర్లు కాదు. ఇంగ్లీషు మందులు కావాలి. ఇక్కడికి దగ్గర్లో ఏవైనా మందుల షాపులున్నాయా?’
‘మందుల షాపులా?’ అందొకామె.
‘వుంది గౌతమా! పక్కన మునిపల్లెలో ఉంది. దాన్ని వాళ్లు మెడికల్ షాపు అని కూడా అంటారు’ అమాయకంగా అన్నాడొకతను.
‘అయితే వెంటనే ఈ మందులు తీసుకురండి. తొందరగా రావాలి. ఈలోగా నా దగ్గరున్న మందులు వేస్తాను’ అంటూ హేండ్‌బేగ్‌లో నించి పెన్ను పేపర్ తీసి ప్రిస్క్రిప్షన్ రాసి అతనికివ్వబోతుంటే-
‘నేను తెస్తాను’ అంటూ ఆమె చేతిలోని కాయితం లాక్కున్నట్టు తీసుకుని పరుగెత్తాడు జింబో.
‘జింబో! అవి చాలా ఖరీదైన మందులు. డబ్బు తీసుకెళ్లు’ అన్న గౌతమి మాటలు గాల్లో కలిసిపోయాయి.
‘మీరేం కంగారుపడకండి. ఈ ప్రాంతంలోని పల్లెల్లో వాళ్లందరికీ దొరంటే ప్రాణం. ఆయన కోసం ఏమైనా చేస్తారు’ అన్నాడు జీవా.
అప్పటికే దొరకి ప్రథమ చికిత్స మొదలుపెట్టింది గౌతమి. ఆమె చేసే చర్యల్ని వింతగా ఊపిరి బిగించి మరీ చూస్తున్నారు దొరకి సంబంధించిన వాళ్లంతా.
‘మీరేం కంగారుపడకండి. ఆ భగవంతుడి దయ వల్ల దొర కోలుకోవచ్చు. దొరకి చిన్ని తప్ప పిల్లల్లేరా?’ తన పని తను చేస్తూనే అంది గౌతమి.
‘లేరు. చిన్నీ వాళ్లమ్మ పోయి కూడా చాలా రోజులయింది’ దిగులుగా అంది ఓ యువతి.
అంతమంది అక్కడున్నా గౌతమి అడిగిందానికి తప్ప ఎవరూ మాట్లాడ్డంలేదు ఆమె చెప్పడం వల్ల.
‘అయ్యో!’ చిన్నగా అంది గౌతమి దొరని చూస్తూనే. అది గమనించి హడలిపోయారంతా. కొంతమంది ఆడవాళ్లు దుఃఖాన్ని ఆపుకోలేక బైటికెళ్లిపోయారు.
రానురాను దొరలో ఆయాసం పెరిగిపోతోంది. ఇంతలో మందులతో తిరిగొచ్చాడు జింబో. అంత తొందరగా ఎలా వచ్చాడా అని అతని వాళ్లు సైతం ఆశ్చర్యపోయారు.
క్షణం ఆలస్యం చేయకుండా, ఆ గుహనే ఓ హాస్పిటల్‌గా మార్చేసినట్టు ట్రీట్‌మెంట్ మొదలుపెట్టింది గౌతమి. దొరకి ఇంజక్షన్స్ చేస్తుంటే అందరికీ దుఃఖం వచ్చేసింది.
అంతవరకూ శవాకారంలా పడున్న దొర నాలుగ్గంటల తర్వాత మెల్లగా కళ్లు తెరిచాడు.
అందరి కళ్లల్లోకి కాంతి వచ్చింది.
‘ఇప్పుడెలా వుంది దొరా?’ ఆప్యాయంగా అతని తల మీద చెయ్యేసి నిమురుతూ అంది గౌతమి.
అతను నీరసంగా నవ్వాడు.
లేవడానికి ప్రయత్నిస్తుంటే ఆపేసింది గౌతమి.
అతనికి మరో ఇంజక్షన్ చేసి, అతను మత్తులోకెళ్లగానే లేచి బైటికొచ్చింది.
‘ఇప్పుడెలా వుందమ్మా. మా దొరకేం భయంలేదుగా?’ అంటూ చుట్టుముట్టారంతా.
‘ప్రస్తుతానికేం భయం లేదు. కానీ ప్రమాదం తప్పినట్టు కాదు. అందుకే ఇతన్ని హాస్పిటల్లో చేరిస్తే మంచిది’ ఏదో ఆలోచిస్తూ అంది గౌతమి. ఆ మాటకి కెవ్వుమన్నంత పని చేశారంతా.
‘వద్దు. బాబాని హాస్పిటల్‌కి తీసుకెళ్లొద్దు’ గొల్లుమంది చిన్ని.
‘తప్పదు చిన్ని. బాబా ప్రాణాలు కాపాడాలంటే అంతకన్నా మార్గం లేదు. ఇది మీరనుకున్నంత చిన్న జబ్బు కాదు. హాస్పిటల్‌లో చేర్చి ప్రత్యేక వైద్యం చెయ్యాలి’ అంటూ వాళ్లకర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించింది గౌతమి.
‘వద్దు గౌతమి. మావఁనిక్కడే వుండనీ!’ అన్నాడు జింబో.
‘జింబో! నువ్వు కూడా...!’
‘నేనే కాదు. ఎవరైనా అదే అంటారు. నీకు మాత్రం తెలియదా మావనెవరైనా గుర్తుపడితే ఏం జరుగుతుందో?’ అన్నాడతను.
ఆమె మొహం గంభీరంగా మారిపోయింది.
‘మీ ఇష్టం. ఓ డాక్టర్‌గా నేను చెప్పాల్సింది చెప్పాను. తాత్కాలికంగా కాపాడగలిగాను. తర్వాతేం చేసుకుంటారో మీయిష్టం!’ అంది నాలుగడుగులు వేస్తూ.
తుళ్లిపడ్డారంతా.
‘నువ్వు డాక్టర్‌వా?’ విస్మయంగా అన్నాడు జింబో.
‘అవును.. నేను పట్నంలో చదివాను. మా వూళ్లోనే ఓ హాస్పిటల్‌లో పని చేస్తున్నాను’ అంటూ వివరాలు చెప్పింది గౌతమి.
ఆ మాట వినగానే అందరికీ ఆమె మీద గౌరవం పెరిగిపోయింది. చిన్ని మాత్రం-
‘ఇది నిజంగా మా కొండదేవర మహిమే! లేకపోతే నువీ అడవికి రావడం ఏమిటి, మావాళ్ల కంటపడ్డం ఏమిటి? ఇప్పుడే మా బాబాకి గుండెనొప్పి రావడం ఏమిటి? నువ్వు గంటల తరబడి కూర్చుని బాబా ప్రాణాలు కాపాడ్డం ఏమిటి? మా నాన్నకి మందులు నువ్వే ఇవ్వు. ఆ ఆసుపత్రులూ అవేం వద్దు’ ఆమె చేతులు పట్టుకుని కళ్లకద్దుకుంటూ అంది. మిగతా వాళ్లూ అదే పాట పాడ్డంతో సరే అనక తప్పలేదు గౌతమికి. అందరూ ఆమెని ఆకాశానికెత్తేశారు. అందరూ వెళ్లాక -
‘నిజంగా సమయానికి నువ్వుండడం మా అదృష్టం గౌతమీ’ మనస్ఫూర్తిగా అన్నాడు జింబో.
గౌతమి నవ్వింది.
‘్థంక్స్! నీతో రెండు మాటలు మాట్లాడ్డానికి అవకాశం ఇస్తావా? అదీ నీతో మాత్రమే’ ఎవరూ వినకుండా అతనితో అంది. అతను పొంగిపోతూ - ‘రేపు సాయంత్రం ఏటి ఒడ్డున’ అంటూ పరుగెత్తాడు.
* * *
హాస్పిటల్‌లో దొంగతనం ఏం జరక్కపోయినా, తన మనుషుల నిర్లక్ష్యం, పేషెంట్స్ భయాలు, జనాల కట్టుకథలు వింటున్న అనిల్‌కి పిచ్చిపట్టేలా ఉంది. లూసీకి క్షమాపణలు చెప్పుకున్నాడు. ఆవేశంతో రామయ్యా వాళ్లని పీకేసేవాడే గానీ, దానికి అడ్డు పడింది లూసీనే. ఆమె మాట మీదే వాళ్లని ఇంకా తన దగ్గరుంచుకున్నాడు. అయితే ఆ దొంగలు ఏం ఆశించి వచ్చారో అతనికర్థం కాలేదు. లూసీ చెప్పిందాన్నిబట్టి ఆమె మీద అఘాయిత్యం లాంటిదేం చెయ్యలేదు. ఎంతసేపూ ‘డాక్టర్ డబ్బెక్కడ దాచాడు?’ అంటూ వేధించారే తప్ప ఏం చెయ్యలేదు. అదే అతనికి అర్థంకాక మరింత డల్‌గా అయిపోయాడు. ఈ సంఘటనతో లూసీ కూడా ఉద్యోగం వదిలి వెళ్లిపోతుందేమో అన్న అనుమానం కూడా వచ్చిందతనికి.
ఆ రోజు నీరసంగా వచ్చిన అనిల్‌కి ఇంత మొహం చేసుకుని ఎదురొచ్చింది లూసీ. ఎందుకో ఆమె మొహంలో వెర్రి ఆనందం కనిపిస్తోంది. అతనికి విష్ చేసి-
‘సార్! మీకో శుభవార్త’ అంది ఉత్సాహంగా.
‘శుభవార్తా? నాకా?’ పేలవంగా అన్నాడు అనిల్.
‘అవును సర్! మామూలు శుభవార్త కాదు. మీరు ఎగిరి గంతేసే శుభవార్త’ కాస్త సరదాగా అంది లూసీ.
‘ఏవిఁటి?’ అన్నాడు అనిల్ అనాసక్తిగా.
‘మేడమ్ క్షేమంగా ఉన్నారు’
‘వ్వాట్??’ ఆమె చేతులు పట్టుకుని కుదిపేస్తూ అన్నాడతను.
(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్