పశ్చిమగోదావరి

పరిహారంపై ప్రభుత్వం యోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 20: భారీ వర్షాలకు నష్టపోయిన వరి చేలకు హెక్టారుకు రూ.15 వేలు వంతున అందజేయడానికి ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా పంట నష్టం అంచనాను నివేదించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సమీక్షచేసి ఏ రూపంలో ఎంతవరకు పరిహారం ఇవ్వగలుగుతామో ప్రకటిస్తామన్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కువగా వరి పంటకు నష్టం జరిగిందని, మంత్రుల బృందం అన్ని జిల్లాల్లో పర్యటించి, నష్టపోయిన రైతులకు తమ ప్రభుత్వం తరపున భరోసా ఇస్తున్నామన్నారు. జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, ఆచంట, భీమవరం, ఉండి, ఉంగుటూరు తదితర నియోజకవర్గాల్లో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర స్ర్తి,శిశుసంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకరరావు, ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖర్ల సమావేశంలో మంత్రి పుల్లారావు మాట్లాడారు. రైతులకు తక్షణ సహాయం అందించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వరి పంటకు అపారమైన పంట నష్టం కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారన్నారు. పంట దెబ్బతిన్న రైతులకు తక్షణ సహాయ సహకారాలు అందించడానికి పంట నష్టం వివరాలు సేకరిస్తున్నామన్నారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. బీమా, ఇన్‌పుట్ సబ్సీడి అందించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. రబీలో రైతులకు అవసరమైన వివిధ రకాల పంటల విత్తనాలను సబ్సీడిపై అందిస్తామన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల పంట నష్టంపై సర్వే పూర్తికాగానే రైతులు, కౌలు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉందని మంత్రి పుల్లారావుతెలిపారు. త్వరలోనే రెండవ విడత రైతు రుణమాఫీ చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, తెలుగుదేశం పార్టీ రాష్టక్రార్యనిర్వాహక కార్యదర్శి మెంటే పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖకు జాతీయ అవార్డు
డిఇఒ మధుసూధనరావు
ఏలూరు, నవంబర్ 20: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపులో విశేష కృషి చేసిన జిల్లా విద్యాశాఖకు జాతీయ స్ధాయి అవార్డు లభించిందని డిఇఓ డి మధుసూధనరావు తెలిపారు. స్ధానిక విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంతకుముందు డిఇఓగా పనిచేసిన నరసింహరావు సంకల్పం అనే పధకాన్ని ప్రారంభించారని, ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన తాను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లానని చెప్పారు. పది అంశాల ప్రతిపాదికగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్లామని, దీనికి సంబంధించి జాతీయ స్ధాయిలో జిల్లాకు అవార్డు లభించిందని తెలిపారు. 2013 నుంచి పాఠశాలలను జాతీయ స్ధాయి బృందం తనిఖీలు చేసిందని, ఈసందర్భంగా సంకల్పం పధకం అమలుకు జాతీయ స్ధాయిలో గుర్తింపు లభించి సమర్ధంగా అమలుచేసినందుకు జాతీయస్దాయిలో తాను, గత డిఇఓ నరసింహరావు ఉత్తమ విద్యాధికారులుగా ఎంపికయ్యామని తెలిపారు. వచ్చే నెల 9,10 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే సదస్సులో కేంద్ర మానవనరుల శాఖ మంత్రి స్మృతిఇరానీ ఈ అవార్డులను అందజేస్తారని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఎస్‌ఎ పిఓ బ్రహ్మనందరెడ్డి, ఎఎంఓ సర్వేశ్వరరావు, ఎఎఎంఓ శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో నిరాశ్రయుల వసతిగృహం
కలెక్టరు భాస్కర్
ఏలూరు, నవంబర్ 20: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో ప్రప్రధమంగా నిరాశ్రయులకు ప్రత్యేక షెల్టర్ హోంను ఏర్పాటుచేయటం జరిగిందని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ చెప్పారు. స్ధానిక 31వ డివిజన్ పత్తేబాద రైతుబజారు వద్ద ఏలూరు కార్పోరేషన్ ఆధ్వర్యంలో ప్లాష్ టీమ్ నిర్వాహణలో ఏర్పాటుచేసిన నిరాశ్రయులకు వసతిగృహాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టరు భాస్కర్ మాట్లాడుతూ రోడ్లపై తిరిగే నిరాశ్రయులను చేరదీసి వారికి సౌకర్యాలు కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఈమేరకు జిల్లాలో ప్రప్రధమంగా ఏలూరు నగరంలో 50మందికి పైగా ఆశ్రయం కల్పించే ఈ షెల్టర్ హోమ్‌లో నిరాశ్రయులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామన్నారు. రోడ్లపై అనాధలు కన్పిస్తే వారిని ఈవసతిగృహంలో చేర్పించి ఆశ్రయం కల్పించాలని, ఈవిషయంలో కార్పోరేషన్ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ దిక్కుమొక్కులేని ఎంతోమంది నిరాశ్రయులు రోడ్లపై భిక్షాటన చేస్తూ కన్పిస్తున్నారని వారందరికి ఈ వసతిగృహంలో ఉచిత భోజన సౌకర్యంతోపాటు రాత్రివేళ హాయిగా నిద్రించేలా పలు సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. సమాజంలో సాటిమనిషిని ఆదుకోవడానికి ఇది ఒక పుణ్యకార్యంగా భావించి ఈవసతిగృహం నిరంతరం కొనసాగించడానికి దాతల సహకారం కూడా అందించాలన్నారు. నగర కమిషనర్ వై సాయిశ్రీకాంత్ మాట్లాడుతూ నిరాశ్రయులు స్వేచ్చగా ఇక్కడ ఆశ్రయం పొందడానికి నిశ్చింత అనే నామకరణతో ఈ వసతిగృహాన్ని ఏర్పాటుచేశామని, ప్లాష్ సంస్ధ నిర్వాహణ బాధ్యతలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు, కార్పోరేషన్ పిఓ భాస్కర్, ఇంజనీరు ప్రదీప్‌కుమార్, ఎలక్ట్రికల్ ఎఇ సాయిప్రసాద్ పాల్గొన్నారు.