పశ్చిమగోదావరి

డెంగ్యూ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లపూడి/పెరవలి, ఆగస్టు 16: జిల్లాలో డెంగ్యూ మరణాలు కలకలం సృష్టిస్తున్నాయ. సోమ, మంగళవారాల్లో తాళ్లపూడి, పెరవలి మండలాల్లో డెంగ్యూ లక్షణాలతో ఇద్దరు మృతిచెందారు. తాళ్లపూడి మండలంలోని అన్నదేవరపేట గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువకుడు శ్రీకాంత్ గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడి సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందాడు. ఇతనికి చికిత్స అందించిన వైద్యులు డెంగ్యూ కారణంగా మృతిచెందినట్లు చెప్పారని మృతుని కుటుంబ సభ్యులు చెప్పడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నదేవరపేటకు చెందిన ప్రత్తిపాటి వెంకట నర్సమ్మ కుమారుడు శ్రీకాంత్ జ్వరంతో బాధపడుతుండగా నాలుగు రోజుల క్రితం స్థానిక ఆర్‌ఎంపి, రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలోను చికిత్స చేయించారు. వైద్యుల సలహాతో మరింత మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తమ కుమారుడు మృతిచెందాడని, డెంగ్యూ వ్యాధితో మృతిచెందాడని వైద్యులు తెలిపినట్లు వెంకటనర్సమ్మ, అతని బంధువులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సంఘటనా ప్రదేశమైన అన్నదేవరపేటలోని అంబేద్కర్ నగర్‌లో దోమల బెడద ఎక్కువవుతోందని, మురుగునీరు పోవడం లేదని దానివల్లనే రోగాలు విజృంభిస్తున్నాయన్నారు. ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోని పంచాయతీ సిబ్బంది శ్రీకాంత్ మృతి తర్వాత దోమల మందును ఆ ప్రాంతంలో స్ప్రే చేయడం గమనార్హం. డెంగ్యూ వ్యాధి సమస్యపై అన్నదేవరపేట పిహెచ్‌సి వైద్యాధికారిని కిరణ్‌కుమారిని ప్రశ్నించగా శ్రీకాంత్ మరణం డెంగ్యూ వ్యాధివల్ల కాదన్నారు. నాలుగు రోజుల క్రితం శ్రీకాంత్ తమ ఆసుపత్రికి వచ్చాడని, జ్వరంగా ఉందని చెప్పడంతో మందులు ఇచ్చి పంపించామన్నారు. ఆపై ఆర్‌ఎంపిలు, ప్రైవేటు వైద్యశాలలను అతను ఆశ్రయించాడన్నారు. తమ సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామంలో పర్యవేక్షించి, జ్వరాలు ఉన్నవారికి మందులు అందజేస్తున్నారని, అలాగే పంచాయతీ ద్వారా స్ప్రేయింగ్ చేయించడానికి యాంటీ లార్వా లిక్విడ్‌ను గత నెలలోనే తాము సరఫరా చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా ప్రజలు ప్రైవేటు వైద్యానికి వెళ్లడం వల్ల రోగ నిర్థారణ లేకుండానే వైద్యం జరిగి ఉండవచ్చుననే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
కాగా పెరవలి మండలంలోని పిట్టల వేమవరంలో మంగళవారం డెంగ్యూ లక్షణాలతో ఒకరు మృతిచెందినట్టు తెలిసింది. గ్రామానికి చెందిన కొవ్వూరి తేజస్వీబిందు (15)కు వారం రోజుల క్రితం జ్వరం సోకడంతో ణుకులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు వున్నట్టు ప్రైవేటు వైద్యులు తెలిపినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వారం రోజుల క్రితం జ్వరం రాగా గ్రామంలో తగ్గకపోవడంతో బిందును తణుకులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి మెరుగుకాకపోవడంతో మరో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుచూ మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై పెరవలి ప్రభుత్వ వైద్యాధికారి ఆర్‌వి వరప్రసాద్‌ను సంప్రదించగా బిందు మృతికి డెంగ్యూ కారణం కాదని వివరించారు. మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే వైద్యం జరిగిన ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళి వివరాలు సేకరించామన్నారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి జ్వరాల నివారణకు తగిన చర్యలు చేపడతామని తెలిపారు.