పశ్చిమగోదావరి

ఆంధ్రాలో విమానవేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్‌గజపతిరాజు తెలిపారు. రాష్ట్రంలో ఈ రంగంలో 56 శాతం మేరకు ప్రగతి కనిపించడం అభినందనీయమన్నారు. స్థానిక ఆర్ ఆర్ పేటలోని ఎంపి మాగంటి బాబు క్యాంపు కార్యాలయంలో మంత్రి అశోక్ గజపతిరాజు విలేఖరులతో మాట్లాడుతూ ఒకప్పుడు విమానాశ్రయాలంటే ఎలా ఉంటాయో కూడా తెలియని పరిస్థితి ఉండేదని, అయితే ఇప్పుడు విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న చొరవ కారణంగానే ఈ ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రపంచంలో విమానయానంలో భారతదేశం అగ్రస్థానంలో వుంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రధమస్థానంలో నిలుస్తోందని చెప్పారు. తెలంగాణాలో భేగంపేట విమానాశ్రయం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టును ఆధునీకరించిన తరువాత ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరిగందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విమానాశ్రయాల ఆధునీకరణ, విస్తరణ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతోందన్నారు. గన్నవరం విమానాశ్రయాన్ని విస్తరించడానికి 700 ఎకరాల స్థలం అవసరమవుతోందని, దానితోపాటు విమానాశ్రయం ప్రక్కనే కృష్ణాకాలువ, జాతీయ రహదారి వుండటంతో విస్తరణ కొంత కష్టతరమైనా ప్రజల సౌకర్యం కోసం అవసరమైతే కృష్ణాకాలువను మళ్లింపు కార్యక్రమాన్ని చేపట్టి విమానాశ్రయాన్ని విస్తరిస్తామన్నారు..దీని కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయినా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాలను ఏర్పాటు చేశామని, విమాన రాకపోకలు మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్యను అభివృద్ధి చేయడంతోపాటు సరుకు రవాణాపై కూడా దృష్టి పెట్టామన్నారు. ఖరీదైన ఔషధాలు, పూలు, పండ్లు త్వరితగతిన నిర్ధేశించిన ప్రాంతాలకు చేర్చేందుకు కార్గో విమానాలను కూడా పెంపొందించాల్సిన అవసరం వుందన్నారు. రానున్న రోజుల్లో 105 టన్నుల బరువును చేరవేసే కార్గో విమానాలను కూడా మన ప్రాంతంలో ప్రవేశపెట్టే ఆలోచన వుందన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎయిర్‌షోలో ఈ భారీ కార్గో విమానాన్ని ప్రజల సందర్శనార్ధం వుంచామన్నారు. విమాన సౌకర్యాలు పెంపొందడం వలన పర్యాటక రంగం కూడా అభివృద్ధి సాధించగలదని, ప్రధానంగా ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలను విస్తరించడమే కాకుండా కొత్త విమానాలను ప్రవేశపెట్టడంతో వివిధ ప్రాంతాల మధ్య సంబంధాలు మరింత దగ్గరయ్యాయన్నారు. బెంగుళూరు విమానాశ్రయంలో కొద్దికాలంలోనే 20కి పైగా విమానాలు కేవలం గులాబీ పూలను రవాణా చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కాగా రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి 1307 కోట్ల రూపాయల కొత్త పధకాలను సాధించుకోగలిగామని, అయితే రైల్వే జోన్ సాధించేందుకు కృషి జరుగుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం గమ్మత్తుగా మారిందని, విభజన సమయంలోనే బిల్లులో ఈ అంశాన్ని ప్రకటించి వుంటే ప్రస్తుతం ఈ ఇబ్బందులు వచ్చేవి కావన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో చర్చించి రాష్ట్రానికి తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా వ్యవహరించిందని, తెలంగాణాకు మిగులు బడ్జెట్ ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఆర్ధిక లోటును మిగిల్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలతో సమాన స్థాయికి ఎదగడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపి మాగంటి బాబు, వ్యాపార వేత్త అంబికా రాజా తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మరో వ్యక్తికి తీవ్రగాయాలు
భీమడోలు, మార్చి 24 : గుండుగొలను - దేవరపల్లి - కొవ్వూరు రాష్ట్రీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. భీమడోలు పోలీసుల కధనం ప్రకారం ఏలూరు ప్రాంతంలో గల ఒక కర్మాగారంలో ఉద్యోగులుగా పనిచేస్తున్న మర్రోపు వెంకట దుర్గ శివకుమార్, నిక్కల కూర్మారావు, మణికంఠ స్నేహితుని వివాహంలో పాల్గొనేందుకు ఏలూరు నుంచి ద్వారకాతిరుమలకు బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న మోటారు వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. సంఘటనలో మాదేపల్లికి చెందిన వెంకట దుర్గ శివకుమార్ (22), విజయనగరం పట్టణానికి చెందిన నిక్కల కూర్మారావు ఘటనా స్థలిలోనే మృతిచెందారు. వీరితోపాటు ప్రయాణం చేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణికంఠ తీవ్రంగా గాయపడి ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఏలూరు తరలించిన పోలీసులు కేసును నమోదు చేసి భీమడోలు సి ఐ ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఎసిబి వలలో స్పెషల్ బ్రాంచ్ ఎఎస్సై
రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, మార్చి 24: పెనుమంట్ర, పోడూరు, పెనుగొండ మండలాల స్పెషల్ బ్రాంచ్ ఎఎస్సై కొల్లా విజయ్‌భాస్కర్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) సాక్ష్యాలతో పట్టుకుంది. రూ.5వేలు లంచం తీసుకుంటున్న సమయంలో డిఎస్పీ రాజేంద్ర పట్టుకున్నారు. గురువారంరాత్రి ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్టు వద్ద ఈ సంఘటనా చోటుచేసుకుంది. పెనుమంట్రకు చెందిన తోట నగేష్ విదేశాలకు పని నిమిత్తం వెళ్ళడం జరిగింది. తిరిగి వస్తున్న సందర్భంలో తన పాస్‌పోర్టు పొగొట్టుకున్నాడు. దీంతో స్ధానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా క్లియరెన్స్ సర్ట్ఫికెట్ ఇవ్వడం జరిగింది. దీంతో కొత్త పాస్‌పోర్టు పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. విచారణకు వచ్చిన స్పెషల్ బ్రాంచ్ ఎఎస్సై కొల్లా ఉదయ్‌భాస్కర్ అనుకూలంగా రాసేందుకు రూ.5వేలు డిమాండ్ చేయడం జరిగింది. బాధితుడు నగేష్ ఎంతో కొంత తగ్గమని బతిమాలినా ససేమిరా అనడంతో ఏం చేయాలో పాలుపోక నగేష్ అవినీతి నిరోధకశాఖను ఆశ్రయించాడు. దీంతో ఏసిబి డిఎస్పీ రాజేంద్ర రంగంలోకి దిగారు. పెనుమంట్ర, పోడూరు, పెనుగొండ మండలాలకు చెందిన స్పెషల్ బ్రాంచ్ ఎఎస్సై ఉదయ్‌భాస్కర్‌ను చెక్‌పోస్టు వద్దకు రమ్మని రూ.5వేలు ముట్టచెప్పారు. ఇంతలో ఉదయ్‌భాస్కర్ కారు డ్రైవర్ కిల్లా సురేష్ ముందు ఆ నగదును తీసుకుని ఎఎస్సై ఉదయ్‌భాస్కర్‌కు అందించారు. నగదు తీసుకున్న ఇద్దరు చేతులు కూడా రంగులు మారడంతో డిఎస్పీ రాజేంద్ర ప్రత్యక్షంగా డ్రైవర్ సురేష్, ఎఎస్సై ఉదయ్‌భాస్కర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. డిఎస్పీతో పాటు మరో 8 మంది సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.
పది రోజుల్లో పునరావాస కాలనీల్లోకి నిర్వాసితులు
జెసి కోటేశ్వరరావు
జంగారెడ్డిగూడెం, మార్చి 24: జంగారెడ్డిగూడెం పట్టణంలోను, పట్టణానికి సమీపంలో పేరంపేట రోడ్డులో గురవాయిగూడెం పంచాయతీ పరిధిలోను పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీల్లోకి పదిరోజుల్లో నిర్వాసితులను తరలించనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు తెలిపారు. పేరంపేట రోడ్డులో పైడిపాక, రామయ్య పేట నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీ, వైఎస్సార్ నగర్ సమీపంలో పైడిపాక నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీలను గురువారం జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీల్లో నిర్మించిన గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, కిటికీలు, తలుపులు ఏర్పాటు, తాగునీరు తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. అనంతరం జె.సి విలేకరులతో మాట్లాడుతూ పది రోజుల్లోగా పునరావాస కాలనీల నిర్మాణ పనులు పూర్తి అవుతాయని చెప్పారు. గురవాయిగూడెం పంచాయతీ పరిధిలో నిర్మించిన కాలనీలో 265 మందికి గృహాలు కేటాయించగా, వాటిలో 239 ఇళ్లు పూర్తి చేసినట్టు తెలిపారు. వీటిలో 105 ఇళ్ళకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కూడా పూర్తి చేసినట్టు చెప్పారు. మరో 134 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పురోగతిలో ఉన్నట్టు చెప్పారు. నిర్మాణమైన ఇళ్ళలో 43 ఇళ్లకు కిటికీలు బిగించాల్సి ఉందన్నారు. రక్షిత మంచినీటి పథకానికి తెలుపురంగు వేయించాల్సిందిగా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. నిర్వాసితులు గోదావరి నది నుండి తాగునీటిని అందించే శ్రీ సత్యసాయి పథకం ద్వారా తాగునీరు కోరారని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు జె.సి వివరించారు. ఇప్పటి వరకు ఈ కాలనీలోకి 39 కుటుంబాలు కాపురానికి వచ్చాయని, మిగిలిన కుటుంబాలు కూడా పది రోజుల్లో వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వైఎస్సార్ నగర్ వద్ద పైడిపాక నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న కాలనీలో 67 ఇళ్లు నిర్మాణం జరుగుతున్నట్టు తెలిపారు. వీటిలో నాలుగు కుటుంబాలు ఇప్పటికే కాపురానికి వచ్చినట్టు జెసి చెప్పారు. నిర్వాసితుల కోరికలు మన్నించి అన్ని విన్నపాలు నెరవేర్చినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జివివి సత్యనారాయణ, ఆర్‌ఐ సాయిబాబ, గృహనిర్మాణ శాఖ ఇఇ బి సోములు, ఆర్‌డబ్ల్యుఎస్ డిప్యుటి ఇఇ, ఎ.ఇ రాజాతిలక్, ఎలక్ట్రికల్ ఎడిఇ గోపాలకృష్ణ, పంచాయతీరాజ్ ఎ.ఇలు మంతెన రామచంద్రరాజు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళిక
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, మార్చి 24 : జిల్లాలో క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని క్షయవ్యాధిగ్రస్తులకు నేరుగా మందులు అందించే డాట్ ప్రొవైడర్స్ సేవలు పొందాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధిని గుర్తించిన వెంటనే తప్పనిసరిగా మందులను వేసుకుని వ్యాధినిర్మూలనకు తోడ్పడాలని మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో మందులు మానకూడదని అన్నారు. హెచ్ ఐవి వ్యాధి ఉన్న వారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా వుందన్నారు. మన జిల్లాలో డాట్ ప్రొవైడర్స్ ఉన్నారని వ్యాధిగుర్తించిన వెంటనే వారిని సంప్రదించి మందులు తప్పనిసరిగా వేసుకోవాలని మధ్యలో మందులు మానివేస్తే మళ్లీ వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉంటుందని వారి కుటుంబ సభ్యులు గమనించాలన్నారు. జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ప్రతీ ఒక్క మనిషిలో సేవా భావం ఉండాలని సేవాభావం ఉన్నప్పుడే ఎటువంటి వ్యాధులనైనా తరిమికొట్టడం అసాధ్యం కాదని అన్నారు. ప్రతీ ఒక్కరూ ఒక బాధ్యతతో రోగిని దేవుడుగా అనుకుని వారికి సహాయం చేయాలన్నారు. డిసిహెచ్ ఎస్ డాక్టర్ శంకరరావు మాట్లాడుతూ ప్రతీ నిమిషం ఎయిడ్స్, క్షయ వ్యాధి, ఇతర వ్యాధులతో మరణాలు సంభవిస్తున్నాయని, వాటిని అరికట్టడానికి అందరూ కృషి చేయాలన్నారు. డి ఎంహెచ్ ఓ డాక్టర్ ఎస్ విజయగౌరి మాట్లాడుతూ క్షయ వ్యాధి గుర్తించిన రోగి కళ్లెను తీసి పరీక్షకై విశాఖపట్నంలో ఉన్న వైరస్ ల్యాబ్‌కు పంపేవారమని, అది నిర్ధారించడానికి రెండు వారాలు పట్టేదని, ఇప్పుడు జిల్లా ఆసుపత్రిలోనే ‘సిబిఎన్ ఎన్‌ఎటి’ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముందుగా జిల్లా కలెక్టర్ భాస్కర్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో కాట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లియర్ టెస్ట్ పరికరాన్ని ప్రారంభించారు. చివరిగా ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా క్షయ వ్యాధి నివారణపై వైద్యులు, ఎ ఎన్ ఎంలు, నర్సులతో కూడి ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎవి ఆర్ మోహన్, జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ మద్ది క్షేత్రంలో రూ.కోటితో నిత్యాన్నదాన భవనం
ఈ-టోకెన్ల విధానం, మజ్జిగ చలివేంద్రం ప్రారంభం: దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ
జంగారెడ్డిగూడెం, మార్చి 24: శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో నిత్యాన్నదానం కోసం మరొక పక్క్భావన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ వై.వి.అనూరాధ(ఐ.ఎ.ఎస్) దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు(శివ)ను ఆదేశించారు. కోటి రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించిన సత్వరమే పంపనున్నట్టు ఇఒ తెలిపారు. దేవాదాయ కమిషనర్ వైవి అనూరాధ గురువారం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చారు. ఆలయం వద్ద ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి పూజల అనతరం ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు వేదాశీస్సులు అందజేశారు. ఇఒ విశ్వనాధరాజు(శివ) ఆలయ మర్యాదలతో కమిషనర్‌ను సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలు అందజేసారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకోసం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కమిషనర్ అనూరాధ ప్రారంభించారు. ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏర్పాటు చేయనున్న ఈ-టోకెన్ల విధానాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ-టోకెన్ల విధానం ద్వారా భక్తులకు ఆలయం నుండి ఏ కౌంటర్‌లో అయినా అన్ని రకముల పూజల టిక్కెట్లు, అన్నదానం విరాళముల రశీదులు పొందవచ్చని వివరించారు. అనంతరం కమిషనర్ ఆలయ ప్రాంగణాన్ని నిశితంగా పరిశీలించారు. ప్రాంగణంలో వాహనముల పార్కింగ్, ఆలయ అవసరాల కోసం ఆలయాన్ని ఆనుకుని ఉన్న భూమిని సేకరించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఇఒని ఆదేశించారు. నిత్యాన్నదాన సత్రంకు మరొక భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో గల శిథిలావస్థకు చేరిన పాత కట్టడములు(పెంకుటిల్లు తదితరాలు) వెంటనే తొలగించాలని ఆదేశించారు. వీటి స్థానే నూతన భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలని, ఆలయ అభివృద్దికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషర్ వేములపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాలి
*కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు
ఏలూరు, మార్చి 24 : సంస్కృతి, సంప్రదాయాలు హరించిపోకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ముందు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత నేటి తరంపై వుందని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి పి అశోక్‌గజపతిరాజు అన్నారు. అగ్రహారంలోని వై ఎంహెచ్ ఎ హాలు వద్ద జరుగుతున్న హిందూ యువజన సంఘం 111 వసంతాల సాంస్కృతిక కళా ఉత్సవాల్లో భాగంగా గురువారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూచిపూడి, సాంస్కృతిక, సాంప్రదాయ నృత్యాలు వై ఎంహెచ్ ఏ వంటి సంస్థలు ఆదరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతీ మూడు నెలలకు కూడా పురాతన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగినదని పేర్కొన్నారు. నేటి విద్యావిధానంలో అనేక మార్పులు వచ్చాయని, కంప్యూటర్ పరిజ్ఞానం ఇంగ్లీష్ కానె్వంట్ల వలన తెలుగును కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదముందని, వాటిని పరిరక్షించేందుకు వై ఎంహెచ్ ఏ వంటి సంస్థలు ప్రతీ ఏరియాలో, ప్రతీ గ్రామంలోనూ వుండాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాయని, ప్రజాదరణ వుంటే అవి మరింత ఆసక్తిగా మారతాయని అన్నారు. పాఠశాలల్లోను, సంస్థల్లోనూ తెలుగు తేజం ఉత్తేజపడే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ఉషా పిక్చర్స్ అధినేత వివి బాలకృష్ణారావు, వై ఎంహెచ్ ఏ హాలు ప్రతినిధులు వేణుగోపాల్ లునాని, కెవి సత్యనారాయణ, అంబికా రాజా తదితరులున్నారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు 111 వసంతాల సందర్బంగా నిర్వహించే కార్యక్రమాల బ్రోచర్‌ను పరిశీలించి మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేశారని నిర్వాహకులను అభినందించారు.
మున్సిపల్ కమిషనర్లుగా ఇతర శాఖల ఉద్యోగులను నియమిస్తే ఊరుకోం
* ప్రభుత్వం నియామక ఆలోచనను విరమించుకోవాలి* ఎపి మున్సిపల్ మినిస్ట్రీరియల్ *ఎంప్లారుూస్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమోహన్
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, మార్చి 24: మున్సిపల్ కమిషనర్లుగా ఇతర శాఖల ఉద్యోగులను నియమిస్తే ఊరుకోమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్ట్రీరియల్ ఎంప్లారుూస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ కృష్ణమోహన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విధానం వల్ల మున్సిపల్ సిబ్బందికి అన్యాయం జరుగుతుందని గురువారం తెలిపారు. 1993కు పూర్వం జిఒ 225లో డిఎంఎ కార్యాలయాల్లో పనిచేసే వారికి, సెక్రటేరియేట్‌లో పనిచేసే వారికి ప్రాధాన్యత కల్పిస్తూ అప్పట్లో జిఒను కూడా విడుదల చేసిందన్నారు. దీనిపై ఉద్యోగులు ఆందోళన చేయగా, సుప్రీంకోర్టు ఇది మంచి విధానం కాదని ఆదేశిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిందని కృష్ణమోహన్ తెలిపారు. పురపాలక సంఘాల్లో పనిచేసే క్షేత్రస్థాయి వారికి లేదా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కమిషనర్లను నియమించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు. ఇప్పటికి అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జిఒ ప్రకారం కొంతమంది కమిషనర్లుగా ఆయా పురపాలక సంఘాల్లో కొనసాగుతున్నారన్నారు. వీరు తమ తమ శాఖలకు వెళ్ళకుండా ఇంకా పురపాలక సంఘాల్లో కమిషనర్లుగా కొనసాగుతున్నారన్నారు. గత ప్రభుత్వం ఇటువంటి నిర్ణయమే తీసుకునే ఆలోచన చేసిన సమయంలో ఆందోళన కూడా చేశామన్నారు. అంతే కాకుండా 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంకు ఈ విషయాన్ని వ్యక్తిగతంగా వెల్లడించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర మున్సిపల్ మినిస్ట్రీరియల్ ఎంప్లారుూస్ అసోసియేషన్, కమిషనర్ల సంఘం వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశామని కృష్ణమోహన్ తెలిపారు. అయితే మళ్లీ ఈ ప్రభుత్వం ఇతర శాఖల ఉద్యోగులను కమిషనర్లుగా నియమించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇతర శాఖల ఉద్యోగుల్ని మున్సిపల్ కమిషనర్లుగా నియమిస్తే, వారికి స్థానిక సమస్యలపై అవగాహన లేకపోవడంతో పాటు పరిపాలన అస్తవ్యస్తంగా మారుతుందన్నారు. నగర పంచాయతీ నుండి వివిధ గ్రేడ్‌లు కలిగిన పురపాలక సంఘాల స్థాయిని బట్టి కమిషనర్లను ఆ స్థాయిలో నియమిస్తారన్నారు. ప్రస్తుతం ఉన్న కమిషనర్ పోస్టుల ఖాళీలను ఆన్‌ఓన్ పే, డిప్యూటేషన్ పద్ధతిలో నియమించడం సమంజసం కాదన్నారు. ఇటువంటి విధానం ఏ శాఖల్లోనూ లేదని, కేవలం దొడ్డిదారిన పురపాలక సంఘాల్లోని ఇతర శాఖల ఉద్యోగుల్ని కమిషనర్లుగా నియమించడం సరైన విధానం కాదన్నారు. దీనివల్ల పైరవీలకు గేట్లు తెరుచుకోవడమే కాకుండా నైపుణ్యతలు కొరవడి పురపాలక సంఘాలు అధోగతి పాలవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తప్పుడు సాంప్రదాయమన్నారు. డిపిసి అనే ప్యానల్ కమిటీ ద్వారా కమిషనర్ పోస్టుల ఖాళీలను భర్తీచేయాలని, దిగువ స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కృష్ణమోహన్ ప్రభుత్వాన్ని కోరారు.
1వ తేదీ నుండి ధాన్యం కొనుగోళ్లు
*జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు
జంగారెడ్డిగూడెం, మార్చి 24: జిల్లాలో రైతులు రబి సీజన్‌లో పండించిన ధాన్యం కొనుగోలు ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రారంభిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక రెవెన్యూ అతిథి గృహం వద్ద గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్‌లో 13 లక్షల మెట్రక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో వలే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులెవరూ ధాన్యం మిల్లర్లకు, దళారులకు, మధ్యవర్తులకు అమ్మవద్దని హితవు పలికారు. ప్రభుత్వమే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల పేరుతో ధాన్యం కోనుగోలు చేపడుతుందని చెప్పారు. ఖరీఫ్ సీజన్‌లో 471 కేంద్రాలు ఏర్పాటు చేసామని, వెలుగు, సహకార శాఖల ద్వారా మరల రబీ సీజన్‌లోను 471 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కేంద్రాల్లో బస్తాకు 1,040 రూపాయల ధర ఇవ్వనున్నట్టు వివరించారు. ధాన్యం అమ్మిన సొమ్ము నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు వివరించారు. ఖరీఫ్ సీజన్‌లో 13.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు తెలిపారు. రబీలో పంట విస్తీర్ణం తగ్గినప్పటికీ దిగుబడులు పెరిగే సూచనలు ఉన్నందున కనీసం 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరంచే అవకాశం ఉన్నట్టు జెసి వివరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జివివి సత్యనారాయణ పాల్గొన్నారు.
పునరావాస గ్రామానికి తరలిన నిర్వాసితులు
పోలవరం, మార్చి 24: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామమైన చేగొండపల్లికి చెందిన నిర్వాసితులు గురువారం సాయంత్రం నాటికి గ్రామాన్ని ఖాళీచేసి, పునరావాస గ్రామానికి తరలి వెళ్లారు. నాలుగు నెలల క్రితమే పునరావాస గ్రామం సిద్ధమైనా అదనపు ప్యాకేజీల కోసం గ్రామాన్ని ఖాళీ చేయడానికి నిర్వాసితులు అంగీకరించలేదు. దాంతో జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్ లవన్న, తహసీల్దారు ముక్కంటి ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో ఆ గ్రామానికి చేరుకుని గ్రామస్థులను ఒప్పించే ప్రయత్నం చేసేవారు. గ్రామంలోని కొన్ని కుటుంబాల వారు మాత్రమే ఖాళీచేసి, పునరావాసానికి తరలి వెళ్లారు. దాదాపు 150 కుటుంబాలకు పైగా ఆ గ్రామంలో ఉండి పరిహారం అధికంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఒక దశలో బెదిరింపు ధోరణి ప్రదర్శించడంతో తహసీల్దారును రెండుసార్లు నిర్బంధించారు. మొదటి సారి నిర్బంధించి గ్రామస్థులే వదిలేశారు. రెండోసారి నిర్బంధించినపుడు పోలవరం ఎస్‌ఐ కె శ్రీహరిరావు ఆ గ్రామానికి వెళ్లి నిర్వాసితులకు నచ్చజెప్పి, తహసీల్దారు ఎం ముక్కంటిని విడిపించుకుని తీసుకొచ్చారు. ఈనేపధ్యంలో తహసీల్దారు చేగొండపల్లి నిర్వాసితులపై కేసు కూడా పెట్టారు. ఆ తరువాత గ్రామానికి వెళ్లిన వైసిపి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నిర్వాసితులకు భరోసాగా ఉంటానని హామీ ఇవ్వడంతో ఆయనపై రెవెన్యూ అధికారులు కేసు పెట్టారు. చేగొండపల్లి గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గ్రామంలో ఉన్న వారు నీళ్లకు ఇబ్బందులు పడేవారు. అలాగే ఆశ్రమ పాఠశాలతోపాటు అంగన్‌వాడీ కేంద్రం, రేషన్ డిపోను కూడా పునరావాస గ్రామానికి తరలించారు. అయినా నిర్వాసితులు పునరావాస గ్రామానికి తరలి వెళ్లలేదు. గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిన అనంతరం ప్రభుత్వం ఏమైనా అదనపు ప్యాకేజీ ప్రకటించినట్టయితే అందజేస్తామని జంగారెడ్డిగూడెం ఆర్డీవో నిర్వాసితులకు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా మీకు న్యాయం జరిగేలా చూస్తామని ఆర్డీవో చెప్పడంతో గ్రామాన్ని ఖాళీ చేసేందుకు నిర్వాసితులు అంగీకరించి నాలుగు రోజుల నుండి పునరావాస గ్రామానికి తరలి వెళ్తూ గురువారం సాయంత్రానికి గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేశారు. దీనిపై ఆర్డీవో ఎస్ లవన్న మాట్లాడుతూ చేగొండపల్లి గ్రామంలో 291 కుటుంబాల వారు పునరావాస గ్రామానికి తరలి వెళ్లారని, భూమిలేని కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, 18 సంవత్సరాలు నిండిన యువతులకు రూ.5.83 లక్షలు చొప్పున చెక్కులు ఇచ్చినట్టు చెప్పారు. అలాగే 367 ఎకరాలకు సంబంధించి భూమికి భూమి ఇచ్చినట్టు తెలిపారు. ప్రభుత్వం నిర్వాసితులకు అదనపు ప్యాకేజీ ప్రకటించినట్టయితే గ్రామాలు ఖాళీచేసిన నిర్వాసితులకు కూడా ప్యాకేజీ చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్టు తెలిపారు. దీంతో ముందుగా ఖాళీ చేయాల్సిన ఏడు గ్రామాల్లో నాలుగు గ్రామాలు ఖాళీ అయ్యాయి. ఇంకా సింగనపల్లి, రామయ్యపేట, పైడిపాక గ్రామాలు ఖాళీ చేయాల్సి ఉంది. ఈ గ్రామాల్లో నిర్వాసితులు ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా, ఖాళీ చేసి పునరావాస గ్రామాలకు ఎప్పుడు వెళ్తామా అని ఎదురు చూస్తున్నారు. ఏడు గ్రామాలు పూర్తిగా ఖాళీ అయితే ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతమవడానికి మార్గం సుగమమవుతుంది. అలాగే స్పిల్‌వే, స్పిల్ ఛానల్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవడానికి 5 కోట్ల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తీయాల్సి ఉంది. తీసిన మట్టి డంపింగ్ చేయడానికి అవసరమైన 400 ఎకరాలు సేకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. 400 ఎకరాలు సేకరిస్తే పోలవరం నిర్మాణ పనులు వేగవంతమవుతాయి.