పశ్చిమగోదావరి

జన్మనిచ్చిన తల్లిని, భాషను మరువవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 25 : జన్మనిచ్చిన తల్లిని, భూమిని, భాషను మరువకూడదని, జాతి మూలాలు అక్కడే వుంటాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. స్థానిక వై ఎంహెచ్ ఏ హాలులో జరుగుతున్న వై ఎంహెచ్ ఏ 111 వసంతాల ఉత్సవాల్లో శుక్రవారం ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాతృభాష ప్రాధాన్యతను ఆయన వివరించారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పుకాదని, అయితే అదే క్రమంలో తెలుగును విడనాడకూడదని అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎందరో మహానుభావులు అన్నారన్నారు. తెలుగును ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఇంటి వద్ద అమ్మ, నాన్న అనిపించుకోవాలి గానీ, మమీ, డాడీ అని అనిపించుకోకూడదని, అమ్మా అనే పదం గుండె లోతుల్లోనుంచి వస్తుందని, నాన్న అనే పదం కూడా మనస్సాక్షిగా వస్తుందని, మమీ, డాడీ అనే పదాలు పైపైనే వస్తాయన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. సామాజిక స్పృహ అవసరమని, మానవసేవే మాధవ సేవగా భావించాలన్నారు. హిందూ అనేది మతం కాదని పేర్కొన్నారు. మతం పేరుతో నిలువుబొట్లు, అడ్డబొట్లు పెట్టుకున్నా ఇబ్బంది లేదని, దేశానికి మాత్రం పంగనామాలు మాత్రం పెట్టవద్దని చలోక్తిగా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వారసత్వం ముఖ్యం కాదని, సిద్ధాంతాలు నమ్మడం, క్రమశిక్షణతో వుండటం కర్తవ్యాలుగా భావించాలని పేర్కొన్నారు. నేటి యుగంలో సాంప్రదాయాలు మారాయని, సినిమాలు, టివిల వ్యామోహం పెరిగిందని, ప్రాచీన కళలను, నాటకాలను, నాటికలను మరచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళారత్న కెవి సత్యనారాయణ లాంటి వ్యక్తులు మన రాష్ట్రంలోనే పుట్టిన కూచిపూడి నాట్యాన్ని ప్రపంచ దేశాల్లో శిష్యులను తయారు చేసి ప్రదర్శనలు ఇవ్వడం తెలుగుజాతికే గర్వకారణమని ఆయన అభివర్ణించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టి ఆర్ తెలుగుకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. సినిమాలలో గతంలో పాత్రల్లో జీవించేవారని, నేడు ఒళ్లు కనిపించే విధంగా దర్శనమిస్తున్నారని, పాత సినిమాల్లో హీరో హీరోయిన్లు కూడా ముట్టుకోకుండా శృంగారాన్ని తెలియజేసేవారని, కానీ నేడు రాసుకోవడం, పూసుకోవడం వంటి వెకిలిచేష్టలు చేస్తున్నారన్నారు. నాటి హీరోలు తరాలు మారినా గానీ వారు జీవించిన పాత్రలను నేటికీ ఆదరిస్తున్నారన్నారు. అదే విధంగా ఘంటసాల, సుశీల, బాలసుబ్రహ్మణ్యం గాత్రాలు ప్రజలు మరచిపోలేకపోతున్నారన్నారు. నేడు వస్తున్న హీరోలు ఒక సినిమాకే పరిమితమవుతున్నారని, వారి పేర్లు కూడా మరచిపోయే స్థాయికి దిగజారిపోయాయని పేర్కొన్నారు. దేశ ప్రధాని మోడీ దేశాభివృద్ధి సాధిస్తారన్న ఆశతో దేశవ్యాప్తంగా ఆయనకు ప్రధానిగా పట్టం కట్టారని, ఆయన నేతృత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, పురాతన సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ప్రతీ ఒక్కరూ పాటిస్తూ రానున్న తరాలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత నేటి తరంపై వుందని స్పష్ట చేశారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, కేంద్ర హిందీ కమిటీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, ఏలూరు ఆర్‌డివో ఎన్ తేజ్‌భరత్, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ఉషాపిక్చర్స్ అధినేత వివి బాలకృష్ణారావు, నగర ప్రముఖులు మడుపల్లి మోహన్‌గుప్తా, ఎం ఎం గుప్తా, అంబికా రాజా, వై ఎంహెచ్ ఏ హాలు కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్ లునాని, యర్రా సోమలింగేశ్వరరావు, కెవి సత్యనారాయణ, సిహెచ్ నరసింహారావు గోపి, గాదంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడును వై ఎంహెచ్ ఏ హాలు ప్రతినిధులు దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి మెమెంటోలను అందజేశారు. వెంకయ్యనాయుడు వై ఎంహెచ్ ఏ హాలు 111 వసంతాల సావనీర్‌ను విడుదల చేశారు
2 నుండి అఖిల భారతస్థాయి నాటిక పోటీలు
వీరవాసరం, మార్చి 25: వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో సప్తమ అఖిల భారతస్ధాయి నాటిక పోటీలు ఏప్రిల్ 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కళాపరిషత్ అధ్యక్షులు గుండా రామకృష్ణ తెలిపారు. శుక్రవారంనాడు కళాపరిషత్ కార్యాలయంలో శుక్రవారంనాడు ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎంతోమంది కళాకారులు, రాజకీయప్రముఖులను సన్మానించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించే నాటిక పోటీలకు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాకారులు హజరుకానున్నారని పేర్కొన్నారు. 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన రిటైర్డ్ జాయింట్ రిజిస్టార్ ఎంఎస్‌కె. ప్రభుని సన్మానిస్తామన్నారు. సభకు రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాష్టమ్రంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఏపి శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్,ప్రభుత్వ చీఫ్ విప్ అంగర రామ్మోహన్‌రావు, ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజులు హజరవుతారని తెలిపారు. అదేరోజు మొదటి ప్రదర్శనగా పాలకొల్లుకు చెందిన దీప్తి స్కూల్ వారిచే అమ్మఒడి నాటిక, రెండవ ప్రదర్శనగా కాకినాడకు చెందిన శ్రీమూర్తి కల్చరల్ అసోసియేషన్ వారిచే సౌందర్యభారతం నాటిక ప్రదర్శించడం జరుగుతుందన్నారు. 3వ తేదీన సినీడైరెక్టర వీరశంకర నారాయణకు సన్మానంతో పాటు అదేరోజు రాత్రి శ్రీ సాయి ఆర్ట్స్ కొలుకులూరు వారిచే పెండ్లిచేసి చూడు నాటిక, శ్రీ లిఖితసాయి శ్రీ క్రియేషన్స్ వారిచే పంపకాలు నాటిక ప్రదర్శిస్తారన్నారు. 4వ తేదీన తాడేపల్లిగూడెంకు చెందిన అరవింద్ ఆర్ట్స్ వారిచే రంకే నాటిక, కళావాణీ ఉభయగోదావరుల వారిచే ఆశ్రయం నాటిక ప్రదర్శిస్తామన్నారు. 5వ తేదీన పాలకొల్లుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బోను కృష్ణమూర్తి, డాక్టర్ భవానీలను సన్మానంతో పాటు అదేరోజు శ్రీకాకుళంకు చెందిన మిత్ర సాంస్కృతిక కమిటీ వారిచే రౌలిపులి నాటిక, హైదరాబాద్‌కు చెందిన ఉషోదయ కళాపరిషత్ వారిచే యాది నాటిక ప్రదర్శిస్తారన్నారు. 6వ తేదీన ప్రముఖ సినీ హాస్యనటులు గుండు సుదర్శన్‌ను సన్మానంతో పాటు గుంటూరుకు చెందిన అభినయ ఆర్ట్స్ వారిచే సరికొత్త మనుషులు నాటిక ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఈ నాటికలను స్వర్గీయ గుండా లక్ష్మీ రత్నావతి వేదికలోని చిలకమర్తి కళాప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశంలో వలవల రామకృష్ణ, పాలా ఆంజనేయులు, గుండా శ్రీనివాస్, శీనయ్య తదితరులు పాల్గొన్నారు.

నరసాపురం డిఎస్పీగా పూర్ణచంద్రరావు
నరసాపురం, మార్చి 25: నరసాపురం డిఎస్పీగా పి పూర్ణచంద్రరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ డిఎస్పీగా పనిచేసిన అమరనాధనాయుడు నుండి ఆయన చార్జి తీసుకున్నారు. 1989లో పోలీసు సర్వీసులో చేరిన పూర్ణచంద్రరావు జిల్లాలోని ఏలూరు రూరల్, ఏలూరు టౌన్, కాళ్ళ, ఆకివీడు, తణుకు ప్రాంతాల్లో ఎస్సైగా పనిచేశారు. ప్రస్తుతం విజయవాడ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిఎస్పీగా పనిచేస్తున్న ఆయన నరసాపురం డిఎస్పీగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా డిఎస్పీ పూర్ణచంద్రరావు విలేఖర్లతో మాట్లాడుతూ శాంతిభధ్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తానన్నారు. మహిళలు, బాలికలను వేధించే వ్యక్తులు, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని డిఎస్పీ పూర్ణచంద్రరావు హెచ్చరించారు.
పారిజాతగిరిలో గోశాల నిర్మాణం
దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ ఆదేశం
జంగారెడ్డిగూడెం, మార్చి 25: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గోశాల నిర్మాణం చేపట్టాల్సిందిగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వైవి అనూరాధ ఆదేశించినట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు(శివ) శుక్రవారం విలేకరులకు తెలిపారు. కమిషనర్ అనూరాధ గురువారం పారిజాతగిరిని సందర్శించి అభివృద్ధి కమిటీ సభ్యులతో ఆలయ అభివృద్ధిపై చర్చించినట్టు తెలిపారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, పూజలు చేసారని, అనంతరం ఆలయం ఉన్న మూడు కొండల చుట్టూ నిర్మిస్తున్న ఫెన్సింగ్ పనులు పరిశీలించినట్టు తెలిపారు. కొండపైకి రెండవ ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాలని, కొండపై మొక్కల పెంచేందుకు అటవీ శాఖను సంప్రదించాలని కమిషనర్ ఆదేశించినట్టు తెలిపారు. తొలుత కమిషనర్ అనూరాధకు ఆలయ ప్రధానార్చకులు నల్లూరు రవికుమారాచార్యులు పర్యవేక్షణలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికినట్టు చెప్పారు. ఈ కార్యక్రమాలలో దేవాదాయ శాఖ అసిస్టెంటు కమిషనర్ వి సత్యనారాయణ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచర్ల జగపతిరాజు, కాకాని శ్రీహరిరావు, డికెడి సత్యనారాయణ, రెడ్డి రంగప్రసాదరావు, బిక్కిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నట్టు తెలిపారు.
మాసూళ్లు ప్రారంభమైనా రైతులకు మద్దతు ధర కరవు
నిడమర్రు, మార్చి 25: నిడమర్రు మండలంలో మాసూళ్లు ప్రారంభమై 10 రోజులైందని రైతులకు కనీస మద్దతు ధర లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రూ. 900లు ధాన్యం మద్దతు ధర ఉంటే ప్రభుత్వం రూ. 1200లు కొనుగోలు చేస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతులకు మద్దతు ధర వచ్చేలా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సందక చంద్రయ్య, రామకృష్ణ, నాగేశ్వరరావు, దారాబత్తుల ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.