పశ్చిమగోదావరి

ఏజన్సీ బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, సెప్టెంబర్ 9: గిరిజనుల విద్య, వైద్యరంగాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, భూముల అక్రమ కొనుగోలు, పోడు భూములకు పట్టాలు, తదితర సమస్యల పరిష్కారం కోరుతూ ఎపి గిరిజన సంఘం శుక్రవారం తలపెట్టిన బంద్ మండలంలో విజయవంతమైంది. మండలంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్ట్ఫాస్, దుకాణాలు సాయంత్రం వరకు మూతపడ్డాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు బస్సులు, ఆటోలు కూడా నడపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో జడ్పీ హైస్కూల్ నుండి ప్రారంభించిన ర్యాలీ స్థానిక నెహ్రూబొమ్మ సెంటర్ వరకు కొనసాగి, మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.సీతారాం మాట్లాడుతూ ఏజన్సీలో గిరిజనులు విష జ్వరాలు, మలేరియాతో బాధపడుతున్నారన్నారు. గిరిజనుల ఆరోగ్యంపై ఐటిడిఎ కాని, ప్రభుత్వం కాని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పోలవరం, జల్లేరు, చింతలపూడి, పోగొండ ప్రాజెక్టుల నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం ప్యాకేజీ అమలు చేయకుండా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పోలోజు నాగేశ్వరరావు మాట్లాడుతూ గిరిజనులు మూడు దశాబ్దాలకు పైబడి సాగుచేసుకుంటున్న సుమారు పదివేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈబంద్‌కు సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించినట్లు నాగేశ్వరరావు చెప్పారు. కార్యక్రమానికి గిరిజనసంఘం నేతలు చోడెం దుర్గ, కె.శ్రీను, తామా సీతయ్య, పాయం కన్నయ్య, పొడియం అన్నమ్మ, ఉడతా వెంకటేశు, సిపిఎం నేతలు బొడ్డు రాంబాబు, ఎ శ్యామలారాణి నాయకత్వం వహించారు.
పోలవరం మండలంలో...
పోలవరం: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఇచ్చిన పిలుపుమేరకు ఏజన్సీ మండలాల బంద్ శుక్రవారం పోలవరంలో ప్రశాంతంగా జరిగింది. వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు పోలవరం గ్రామంలోకి ప్రవేశించకుండా ఊరు బయట నుండే వెనుతిరిగాయి. బంద్ నిర్వాహకులు పోలవరం మెయిన్ రోడ్డులో ఊరేగింపు నిర్వహించి ఏటిగట్టు సెంటర్ వద్ద మానవ హారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి ఎ రవి మాట్లాడుతూ ఏజన్సీ గ్రామాల్లో కనీస వైద్యం కరవై గిరిజనులు మృత్యువాత పడుతున్నారన్నారు. ఏజన్సీలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గిరిజన ప్రాంతంలో 170 చట్టం అమలు చేయకుండా గిరిజన భూములను భూస్వాములకు కట్టబెట్టేందుకు చూస్తోందని విమర్శించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన ప్యాకేజీల్లో కూడా లోప భూయిష్టంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి బి భూచంద్రం, సిపిఎం మండల కార్యదర్శి జి వెంకట్రావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎస్ సాయికృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి వై సాయికిరణ్ పాల్గొన్నారు.
కుకునూరు మండలంలో...
కుకునూరు: కుకునూరు మండలంలో ఏజెన్సీ బంద్ విజయవంతమైంది. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలు, దుకాణాలు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించి అనంతరం ఈ కార్యక్రమానుద్దేశించి కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వలన ఏజెన్సీ మండల ప్రజలు నిరాశ్రయులవుతున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా విస్మరించిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని, కనీసం వైద్య సిబ్బంది ద్వారా వైద్య శిబిరాలు కూడా గిరిజన ప్రాంతాల్లో నిర్వహించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏజెన్సీలోని సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి శ్యామల లక్ష్మణరావు, పి లక్ష్మయ్య, సున్నం వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు మహబూబ్ పాషా, వలీ పాషా, కె రమేష్, వెంకటేశ్వర్లు, పి సత్యనారాయణ, పి రమేష్ తదితరులు పాల్గొన్నారు.