పశ్చిమగోదావరి

సీజనల్ వ్యాధులకు చికిత్సకు మొబైల్ క్లీనిక్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 18: ఇటీవల వ్యాప్తి చెందుతున్న మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాల నివారణకు మొబైల్ మలేరియా, డెంగ్యూ క్లీనిక్‌లు సోమవారం నుండి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖల మంత్రి పీతల సుజాత వెల్లడించారు. స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం సీజనల్ వ్యాధుల నివారణపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా, వైరల్ ఫీవర్లు సోకకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, వేడి ఆహారం తీసుకోవాలని మంత్రి సూచించారు. పట్టణ ప్రాంతంలో మలేరియా, డెంగ్యూ తదితర జ్వరాల నివారణకు మొబైల్ క్లీనిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్లీనిక్‌లో వైద్య బృందం నెల రోజులు ప్రజల వద్దకు వెళ్ళి వైద్య సేవలందిస్తాయని చెప్పారు. జిల్లాలో అన్ని వ్యాధులకు సరిపడా మందులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మొబైల్ క్లినిక్‌లతో పాటు అన్ని రకాల జ్వరాలకు పిహెచ్‌సిలలో మందులు అందుబాటులో ఉంచాలని డిఎంహెచ్‌ఒను మంత్రి ఆదేశించారు. పట్టణంలో పారిశుద్ధ్యం మరింత మెరుగు పరచాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావును ఆదేశించారు. తెల్లవారుజామునే వీధుల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు పరిశీలించాలని, బ్లీచింగ్, సున్నం చల్లించాలని, యాంటీ లార్వా మందులు స్ప్రే చేయించాలని ఆదేశించారు.
ఐటిడిఎ పిఒ సాగిలి షణ్మోహన్ మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిలో ఏజన్సీ ప్రాంతం నుండి వచ్చే గిరిజనులకు సరైన వైద్య సేవలు అందడం లేదన్నారు. కాన్పు కోసం, సిజేరియన్ ఆపరేషన్ కోసం వచ్చినవారిని చిన్న చిన్న కారణాలతో ఏలూరు రిఫర్ చేస్తున్నారని, మార్గమధ్యంలో వారు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. చేయగలిగిన వైద్య సేవలు కూడా చేయకుండా రిఫర్ చేసేస్తూ, రోగుల మరణాలకు కారకులవుతున్న వైద్యులపై ముఖ్యంగా మెడికల్ సూపరింటెండెంట్‌పై క్రిమినల్ కేసులు పెట్టిస్తానని హెచ్చరించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కె కోటేశ్వరి మాట్లాడూతూ సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు ఈ నెల 19 నుండి ఇంటెన్సివ్ డ్రైవ్ యాక్షన్ ఫ్లాన్ అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె శంకరరావు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు వైద్యులు కృషి చేయాలన్నారు. ప్లేట్‌లెట్స్ కౌంట్ పడిపోతే డెంగ్యూ కాదని, మెక్‌ఎలీషా టెస్ట్ పాజిటివ్ అయితేనే డెంగ్యూ జ్వరమని గుర్తించాలన్నారు. జిల్లాలో డెంగ్యూ జ్వరాలు నమోదు కాలేదని, ప్లేట్‌లెట్స్ పడిపోతే డెంగ్యూ అని భావించి వేలాది రూపాయలు ఖర్చు చేసుకోవద్దని హితవు పలికారు. డయేరియా కూడా ఈ సీజన్‌లో వస్తుందని, దీని నివారణకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో ఎస్ లవన్న, డిఎస్పీ జె వెంకటరావు, ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డి భాస్కరరావు, మున్సిపల్ కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావు, టిడిపి సీనియర్ నేత మండవ లక్ష్మణరావు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ దల్లి కృష్ణారెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపిపి కొడవటి మాణిక్యాంబ, జడ్పీటిసి శీలం రామచంద్రరావు, పట్టణ టిడిపి అధ్యక్షుడు షేక్ ముస్త్ఫా తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సుజాత పట్టణంలోని 2వ వార్డులో మురుగుంటను పరిశీలించి, పట్టణంలో మురుగు నివారణకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఛైర్‌పర్సన్ శివలక్ష్మి, కమిషనర్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. ఏరియా ఆసుపత్రి వద్ద మలేరియా, డెంగ్యూ మొబైల్ క్లినిక్‌ను మంత్రి ప్రారంభించారు.

ఇల్లు కట్టడమే తరువాయి
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, సెప్టెంబర్ 18 : ఇంతకాలం ఊరిస్తూ వచ్చిన ఎన్‌టి ఆర్ గృహ నిర్మాణ పధకం ఇక వాస్తవ రూపం ధరించనుంది. దీనికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆదివారం నుంచి మొదలయ్యాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ ఒకటి రెండు రోజుల్లో గృహ నిర్మాణాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఎన్‌టి ఆర్ రూరల్ హౌసింగ్‌లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు వేగవంతం కానున్నాయి. ప్రస్తుతానికి ఈ పధకానికి సంబంధించి సాంకేతిక అంశాలన్నీ పూర్తికాగా లబ్ధిదారుల ఎంపిక చివరి దశకు చేరడంతో ఇప్పుడు వారికి మంజూరు పత్రాలు ఇచ్చి నిర్మాణాలు వేగంగా చేపట్టాలని సూచనలు జారీ చేసే ప్రక్రియ మొదలైంది. దాదాపుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గృహ నిర్మాణ అంశం సందిగ్ధంలోనే కొనసాగుతూ వచ్చింది. పాత పధకం కొనసాగే అవకాశాలు తక్కువగా వుండటంతో కొత్త పధకం ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా వేచిచూస్తూ ఉండిపోయారు. దాదాపుగా రెండున్నర సంవత్సరాలు గడచిపోతున్న నేపధ్యంలో ఒక దశలో ఎన్‌టి ఆర్ గృహ నిర్మాణ పధకానికి రూపకల్పన చేసినా దానిలో యూనిట్ వ్యయం విషయంలో రకరకాల వాదనలు చెలరేగుతూ వచ్చాయి. దీనితో ఈ చర్చ ఎప్పటికి పూర్తవుతుందో యూనిట్ వ్యయం ఖరారు చేసి ప్రభుత్వం ఎప్పటికి రంగంలోకి దిగుతుందోనన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమైంది. దీనికి తోడు నెలలు గడచిపోతుండటంతో లబ్ధిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో స్థలాల అందుబాటు తక్కువగా వున్న నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టేందుకు అత్యధిక శాతం మంది ముందుకు వచ్చారు. అయితే పట్టణాల్లోనూ పలు చోట్ల లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూనే వచ్చినా పశ్చిమగోదావరి జిల్లా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల శాతం అధికంగా వుండటంతో ఇక్కడ లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగానే కనిపిస్తోంది. అయితే ఎన్‌టి ఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పధకానికి సంబంధించి జిల్లాలోని 15 నియోజకవర్గాలకు కలిపి మొత్తం 12950 గృహాలను కేటాయించారు. 14 నియోజకవర్గాలకు 900 గృహాలు చొప్పున కేటాయించగా ఏలూరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల శాతం తక్కువగా వున్న పరిస్థితుల్లో 360 గృహాలను కేటాయించారు. ఆ విధంగా ఈ పధకానికి సంబంధించి అసలు ప్రక్రియలో స్పష్టత రావడంతోపాటు యూనిట్ వ్యయాన్ని 1.50 లక్షల రూపాయలుగా తేల్చడం, నెలాఖరు నుంచి నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ పరిణామాలు చురుగ్గా ముందుకు కదులుతూ వచ్చాయి. ఏది ఏమైనా తాజా పరిణామాల్లో ఆదివారం నుంచి గృహ నిర్మాణ పధకం నేరుగా వాస్తవ రూపం ధరించే దిశగా అడుగులు వేసిందనే చెప్పాలి. ఇప్పటికే ఒకటి రెండు నియోజకవర్గాల్లో గృహ నిర్మాణ పధకం ప్రారంభోత్సవ పధకాలు మొదలు కాగా మిగిలిన నియోజకవర్గాల్లో ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పధకంలో భాగంగా 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించాల్సి వుంటుంది. దీని నిమిత్తం 1.50 లక్షల రూపాయలను యూనిట్ వ్యయంగా నిర్ణయించారు. ఈ మొత్తంలో ప్రభుత్వ సబ్సిడీ కింద 55 వేలు, ఉపాధి హామీ పధకం కింద 95 వేల రూపాయల నిధులను అందజేస్తారు. ఉపాధి హామీ పధకం కింద ఇచ్చే 95 వేల రూపాయలలో 90 రోజులపాటు రోజుకు 194 రూపాయలు చొప్పున పనిదినాలు కింద 17490 రూపాయలు, ఇటుకల తయారీ కింద 22540 రూపాయలు, మరుగుదొడ్డి నిర్మాణం కింద 12 వేల రూపాయలను అందజేస్తారు. ఈ పధకాన్ని త్వరితగతిన అమలు చేయాలని ప్రభుత్వం తలపోసినా సాంకేతిక అంశాల విషయంలో కొన్ని ఇబ్బందులు రావడంతో వాటిని పరిష్కరించేందుకు ఆ శాఖ మంత్రి కె మృణాళిని, ఇతర నాయకులు రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురాగలిగారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ మంత్రి మృణాళిని పధకాన్ని ఖరారుచేసే విషయంలో కీలకపాత్ర పోషించారు. ఏది ఏమైనా ఆదివారం నుంచి పధకం ప్రారంభోత్సవాలు మొదలు కాగా నెలాఖరు లోగా గృహాల నిర్మాణ పనులు ఊపందుకుంటాయని భావిస్తున్నారు.
జంగారెడ్డిగూడెంలో న్యూట్రిషన్ రీహేబిలిటేషన్ సెంటర్
-అక్టోబర్‌లో ప్రారంభం:మంత్రి సుజాత
జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 18: పోషకాహార లోపంతో బాధపడేవారి కోసం, రక్తహీనతతో బాధ పడేవారి కోసం జంగారెడ్డిగూడెంలో న్యూట్రిషన్ రీహేబిలిటేషన్ సెంటర్ (ఎన్‌ఆర్‌సి) మంజూరైనట్టు రాష్ట్ర స్ర్తి,శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖల మంత్రి పీతల సుజాత తెలిపారు. ఆదివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ వచ్చే నెలలో ఈ సెంటరును ప్రారంభించనున్నట్టు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఏజన్సీ ముఖద్వారమని, ఈ పట్టణం అయిదు గిరిజన మండలాలకు అందుబాటులో ఉందని అందుకే ఎన్‌ఆర్‌సి సెంటరు ఇక్కడ ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. ఏజన్సీ ప్రాంతంలో సరైన పోషకాహారం లేక వేలాది మంది పిల్లలు సరైన ఎదుగుదల లేకుండా ఉన్నారని, వీరికి సరైన కేలరీలతో కూడిన పోషకాహారం అందించే లక్ష్యంతో ఎన్‌ఆర్‌సి సెంటరు ఏర్పాటుచేస్తున్నట్టు మంత్రి వివరించారు. కాగా, ఏరియా ఆసుపత్రిలో రక్తనిధి ఏర్పాటు చేసినప్పటికీ రక్తం కొరత తీవ్రంగా ఎదుర్కొంటున్నారని, ఈ ఆసుపత్రికి వచేచ్చే కాన్పుకేసుల్లో ఎక్కువగా రక్తహీనత ఉంటోందని మంత్రి చెప్పారు. బ్లడ్ బ్యాంక్ ఉన్నప్పటికీ 1,050 రూపాయలు తీసుకుని ఒక ప్యాకెట్ ఇస్తున్నారని, పైగా రక్తం మరొక వ్యక్తితో ఇప్పించాల్సి వస్తోందని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ ప్రాంతంలో రక్తదాతలకు కొదువలేదని, రక్తదానంపై కళాశాలలు, ఇతర ప్రదేశాలలో అవగాహన కల్పించాలని వైద్యులను ఆదేశించారు. ఇక నుండి ప్రతి గురువారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ శిబిరంలో వచ్చే రక్తం రెడ్‌క్రాస్ సొసైటీ తీసుకెళ్లకుండా ఇక్కడే రక్తపరీక్షలు చేసి ఈ బ్లడ్ బ్యాంక్‌లోనే వినియోగించుకునే వీలు కల్పిస్తామని మంత్రి సుజాత చెప్పారు. సమావేశంలో టిడిపి సీనియర్ నాయకుడు మండవ లక్ష్మణరావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపిపి కొడవటి మాణిక్యాంబ, జడ్పీటిసి శీలం రామచంద్రరావు, టిడిపి నేతలు నంబూరి రామచంద్రరాజు, షేక్ ముస్త్ఫా, దల్లి కృష్ణారెడ్డి, చిట్రోజు తాతాజి, రాజాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
2019 నాటికి స్వచ్ఛ్భారత్ కావాలి
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 18: 2019 నాటికి భారతదేశం స్వచ్ఛ్భారత్‌గా రూపొందించాలనే ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ్భారత్‌లో పాల్గొనాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. భారతీయ రైల్వే నిర్వహిస్తున్న స్వచ్ఛ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మంత్రి మాణిక్యాలరావు స్వచ్ఛమైన రైల్వేస్టేషన్ కార్యక్రమంలో పాల్గొని బూజులు దులిపి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో నిరంతర ప్రక్రియగా ప్రతి ఆదివారం పట్టణంలో జరుగుతున్న స్వచ్ఛ్భారత్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్చాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన వౌలిక వసతులు కల్పించి అభివృద్ది చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ బి.వెంకట్రావు, బీజేపీ నాయకులు కర్రి ప్రభాకర బాలాజీ, యెగ్గిన నాగబాబు, కోట రాంబాబు, కంచుమర్తి నాగేశ్వరరావు, సిఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి, కర్రి సీతారామయ్య, పి.సదాశివరావు, రైల్వేస్టేషన్ మేనేజర్ సివివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలి
గూడెం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు వౌలిక వసతులు కల్పించి స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని రైల్వే జనరల్ మేనేజర్‌ని కోరుతూ రైల్వే డిప్యూటీ చీఫ్ సేఫ్టీ అధికారి బి.వెంకట్రావుకు మంత్రి మాణిక్యాలరావు లేఖను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గూడ్స్‌షెడ్డును నవాబ్‌పాలెంలో ఏర్పాటుచేసి ఆ ప్రాంతంలో ఫ్లాట్‌ఫారం అభివృద్ధి చేసి టు టౌన్ టిక్కెట్ కౌంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు రోడ్డు వరకూ ఫుట్‌బ్రిడ్జిని పొడిగించాలన్నారు. ప్లాట్‌ఫారమ్‌ను 1ని పొడిగించేందుకు ఎఫ్‌సీఐ గొడౌన్‌ను తొలగించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. ప్లాట్‌ఫారమ్ 1 నుంచి 2కు వెళ్లడానికి ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. విశాఖపట్నం-కొల్లం ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-షిర్డీ, విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్, హటియా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ-్భవనగర్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-రామేశ్వరం ఎక్స్‌ప్రెస్, పూరీ-వోకా ఎక్స్‌ప్రెస్, సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్, నాంథేడ్ ఎక్స్‌ప్రెస్‌లను తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌లో హాల్టు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
పని కల్పించిన అధికార్లకు ధ్యాంక్స్
యలమంచిలి, సెప్టెంబర్ 18: అధికారుల పనితీరుపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినూత్న తరహాలో నిరసన తెలిపారు. నియోజకవర్గంలో రహదారుల వెంబడి ఉన్న పిచ్చి మొక్కలను తొలగించమని యలమంచిలి, పోడూరు, పాలకొల్లు మండలాల ఎంపిడిఒలు, పంచాయతీ కార్యదర్శులను ఎమ్మెల్యే ఆదేశించినా వారు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పోడూరు మండలం వేడంగి గ్రామంలో ఆదివారం రహదారి వెంబడి గుబురుగా పెరిగిన మొక్కలను ఆయనే స్వయంగా తొలగించారు. ఈ సందర్భంగా ‘నాకు పని కల్పించిన అధికారులకు ధన్యవాదాలు..’ అనే బోర్డుపెట్టి మరీ ఈ మొక్కలను తొలగించారు. ఇప్పటికైనా అధికారులు వారి వైఖరిని మార్చుకుని రోడ్డు మార్జిన్లో ఉన్న మొక్కలను తొలగించాలని కోరారు. వారం రోజుల్లో ఈ పనిచేయకపోతే అధికారులు ఉండే నివాసాల వద్దకు వెళ్లి వారి ఇంటి పెరడులను శుభ్రంచేసి వారిలో పరివర్తన వచ్చేలా చేస్తానన్నారు.
పనితీరు బాగాలేదు
జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 18: పట్టణంలో వంద పడకల ఏరియా ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు అందించడంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, ఆసుపత్రిలో సక్రమంగా ఎవరూ పని చేయడం లేదని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖల మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆసుపత్రిలో సీజనల్ వ్యాధులపై నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతుండగా పలువురు ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది పనితీరు ప్రస్తావించారు. ఐఎఎస్ అధికారి అయిన ఐటిడిఎ పిఒ ఎస్ షణ్మోహన్ కూడా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తీరుపై విరుచుకుపడటంతో మంత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డి భాస్కరరావుపై మండిపడ్డారు. ‘పని చేయలేక పోతే వలంటరీ రిటైర్మెంట్ తీసేసుకోండి’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. చిన్న చిన్న కేసుల్లో కూడా వైద్యం చేయకుండా ఏలూరు పంపివేస్తున్నారని, ఏజన్సీ ప్రాంతం నుండి వచ్చే గిరిజన గర్భిణిలకు రక్తం సరిగాలేదంటూ ఏలూరు పంపిస్తుండటంతో మార్గమధ్యంలో చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 19 రోజులుగా సిజేరియన్, ఇతర ఆపరేషన్లు చేయక పోవడంపై కూడ మంత్రి అసహనం వ్యక్తంచేశారు. ఆసుపత్రిలో ప్రతి ఒక్కరి వెనుక ఒక నాయకుడున్నాడని వ్యాఖ్యానిస్తూనే, మంత్రి ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొత్తవారిని నియమించాలని డిసిహెచ్‌ఎస్ డాక్టర్ శంకరరావును ఆదేశించారు. ఇక నుండి ఆపరేషన్లు చేయాలని, సరైన వైద్య సేవలందించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిలో ఆపరేషన్లు చేసేందుకు మరో గైనకాలజిస్టును నియమించినట్టు డిసిహెచ్‌ఎస్ డాక్టర్ శంకరరావు చెప్పారు. ఆసుపత్రిలో ఇటీవల జరిగిన ఒక సంఘటనతో ఆపరేషన్లు చేసేందుకు వైద్యులు భయపడుతున్నారని, అన్నింటికీ తానే లక్ష్యం అవుతున్నానని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ భాస్కరరావు మంత్రికి వివరణ ఇచ్చుకున్నారు.
పంచాయితీ కార్యదర్శుల నూతన కార్యవర్గం
ఏలూరు, సెప్టెంబర్ 18 : తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తామని గ్రామ కార్యదర్శులకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎపి పంచాయితీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎంపికైన పి నాగేశ్వరరావు, కెవిఎల్ తనూజ అన్నారు. ఆదివారం ఐ ఎడిపి హాలు వద్ద గ్రామ కార్యదర్శుల జిల్లా మహాసభను నిర్వహించారు. సంఘ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సి ఆర్‌కె మోహనరావు జెండాను ఆవిష్కరించగా విజి ఎంవిఆర్ కృష్ణారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సహాధ్యక్షులుగా వివిఎస్‌ఆర్‌కె కొండలరావు, ఎల్ సత్యనారాయణ, ఆర్‌వి బ్రహ్మం, ఎ సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా కె శ్రీనివాసరెడ్డి, ఎస్ భూపతి, ఎ నాగరాజు, బిఎస్ చంద్రరాజు, బి విజయభాస్కరకుమార్, ఎన్‌వి ఎస్ నాగేంద్రకుమార్, పి దుర్గాప్రసాద్, కార్యదర్శులుగా జిటివి శ్రీనివాస్, పి సరళ, వై అలేఖ్య సువర్చల, ఎం ధర్మారావు, డి రంగనాయమ్మ, వి పద్మావతి, ఎం సునీల్, జెడివి ప్రసాద్, రుద్రరాజు, ప్రచార కార్యదర్శులుగా ఎస్ రాధాకృష్ణ, పి శ్రీనివాసచౌదరి, కోశాధికారిగా పిఎస్‌శ్రీనివాస్ ఎంపికయ్యారు.
3న కలెక్టరేట్ల ముట్టడి
ఏలూరు, సెప్టెంబర్ 18 : సిఎం చంద్రబాబు ఎన్నికల ముందు మోసపూరితమైన హామీలను ఇచ్చి మ్యానిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కటీ కూడా అమలు చేయలేదని, వాటి సంగతి ఏమిటంటూ ఆలిండియా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మానస్ మల్లిక్ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తారేమోనని రెండున్నర సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నామని, అమలు చేసే ధోరణిలో లేకపోవడంతో ప్రజాపోరాటానికి సిద్ధమయ్యామని చెప్పారు. ఇచ్చిన హామీలపై అక్టోబర్ 2వ తేదీ లోగా చంద్రబాబు బహిరంగంగా ప్రకటించకపోతే అక్టోబర్ 3వ తేదీన హామీలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఆయన వెంట యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి సుబ్బారావు, సవలం రోహిత్, గెడ్డం ప్రశాంత్, కాళ్ల మండలం నాయకులు చోడదాసి గంగయ్య, నిడదవోలు సంఘ నాయకులు పోలిరెడ్డి వెంకటరత్నం, అంకెన సీతారామ్, ఏలూరు కాంగ్రెస్ నగరాధ్యక్షులు రాజనాల రామ్మోహనరావులు వున్నారు. తొలుత ప్రత్యేక హోదాకు సంబంధించిన కరపత్రాలను, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
పంపుల చెరువు రహదారి అభివృద్ధికి చర్యలు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, సెప్టెంబర్ 18: భీమవరం పట్టణ శివారున ఉన్న మున్సిపాల్టీకి చెందిన పంపుల చెరువుకు వెళ్లే రహదారి అభివృద్ధికి రూ.2 కోట్లతో ప్రణాళికలను ఆర్‌అండ్‌బి శాఖ సిద్దం చేసింది. ఆదివారం ఈ రహదారిని పరిశీలించేందుకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావులు వెళ్లారు. ఆర్‌అండ్‌బి శాఖ అధికారులు కొలతలు వేస్తున్న సమయంలో రహదారిని ఆక్రమించి నిర్మించిన కొన్ని గృహాలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానికులు ఈ పనులను కొంతసేపు అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని ఎమ్మెల్యే సముదాయించారు. భీమవరం పట్టణం నుండి పంపుల చెరువుకు వెళ్లే రహదారి పూర్తిగా గోతులమైందని, ఈ పనులకు ప్రత్యేకంగా ఆర్‌డిఎఫ్ నిధులతో చేయించనున్నట్టు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. శాంతించిన స్థానికులు అభివృద్ధి పనులకు సహకరించారు. విస్సాకోడేరు వంతెన కింద 400 మీటర్ల మేర సిసి రహదారిని నిర్మించి ఆ పైన 5.5 మీటర్ల వెడల్పుతో 3.6 కిలోమీటర్ల పొడవునా రూ.2కోట్లతో ఆర్‌అండ్‌బి ఈ రహదారిని నిర్మించనుంది. వారి వెంట టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన వెంకట సుబ్బారావు, 6వ వార్డు కౌన్సిలర్ గూడూరి రామకృష్ణ, కోళ్ల నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ తదితరులున్నారు.
ఆలిండియా తల్ సైనిక్ క్యాంపునకు భీమవరం ఎన్‌సిసి క్యాడెట్లు

ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, సెప్టెంబర్ 18: న్యూ ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఆలిండియా తల్ సైనిక్ క్యాంప్ (టిఎస్‌సి)కు భీమవరానికి చెందిన ఇద్దరు ఎన్‌సిసి క్యాడెట్లు ఎంపికయ్యారు. వీరు కాకినాడ గ్రూపులో పోటీపడి ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్‌కు ఎంపికయ్యారు. ఎపి డైరెక్టరేట్ తరపున వీరు న్యూఢిల్లీలో జరిగే టిఎస్‌సి పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్‌సిసి క్యాడెట్లు పాల్గొంటారు. ఈ పోటీల్లో గెలుపొందినవారు ప్రధాన మంత్రి, రాష్టప్రతి చేతుల మీదుగా బహుమతులు అందుకుంటారు. ఈ నెల 19 నుంచి 30వ తేదీ వరకు న్యూ ఢిల్లీలో జరిగే తల్ సైనిక్ శిబిరం-2016కు ఎన్‌సిసి క్యాడెట్లు జోల సంతోష్‌కుమార్, కడలి దుర్గాప్రసాద్‌లు ఎంపికయ్యారని డిఎన్నార్ కళాశాల ప్రిన్సిపాల్ పి రామకృష్ణంరాజు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా క్యాడెట్లను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) ప్రత్యేకంగా అభినందించారు. న్యూ ఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి తెలుగు రాష్ట్రాల తరపున డైరెక్టరేట్ పతకాలు సాధించి తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఎన్‌సిసి క్యాడెట్లకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నర్సింహరాజు, కార్యవర్గ సభ్యులు, వైస్ ప్రిన్సిపాల్ ఎంవి రఘుపతిరాజు, అధ్యాపకులు తదితరులు క్యాడెట్లను అభినందించారు.
వెయట్ లిఫ్టింగ్ అండర్-19 జట్ల ఎంపిక
ఉంగుటూరు, సెప్టెంబర్ 18: రాష్టస్థ్రాయి అండర్ 14, 17, 19 రోప్ స్కిప్పింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఉత్సాహపూరితంగా జరుగుతున్నాయి. బాలుర. బాలికల అండర్ 19 వెయిట్ లిఫ్టింగ్ రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు. వివిధ జిల్లాలకు చెందిన ప్రతిభావంతుల క్రీడాకారులను ఎంపిక చేశారు. వెయిట్ లిఫ్టింగ్ (56 కేజీలు) విభాగంలో సిహెచ్‌ఎస్‌కె గౌస్ మహ్మద్ (కడప), 62 కిలోల విభాగంలో ఎస్‌కె సద్దాం హుస్సేన్ (కర్నూలు), 69 కిలోల విభాగంలో సిహెచ్ చైతన్య కరుణ్ (తూర్పుగోదావరి), 77 కిలోల విభాగంలో జి హేమంత్‌కుమార్ (కడప), 85 కిలోల విభాగంలో బి మనోజ్ (పశ్చిమ గోదావరి), 94 కిలోల విభాగంలో జి మోహన్‌సాయి (కృష్ణా), 105 కిలోల విభాగంలో ఎస్‌కె ఇమామ్ సాహెబ్ (కర్నూలు), 105 కిలోలపైన విభాగంలో డి సిద్దయ్యను ఎంపిక చేశారు.
బాలికల అండర్ 19 వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 48 కేజీలో ఎల్ అనూరాధ (విజయనగరం), 53 కిలోల విభాగంలో బి శ్రీశరణ్య (విశాఖ), 58 కిలోల విభాగంలో బి ఆదిలక్ష్మి (శ్రీకాకోళం), 63 కిలోల విభాగంలో డి సత్యవేణి (తూర్పుగోదావరి), 69 కిలోల విభాగంలో డి ఇంద్ర (తూర్పుగోదావరి), 75 కిలోల విభాగంలో బి ఉష (తూర్పుగోదావరి), 75 కిలోలపైన విభాగంలో వై మానస సాయి (విశాఖ)లు ఎంపికయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు.