పశ్చిమగోదావరి

పశ్చిమ పోలీసు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 6 : పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు ప్రశంసనీయమైన పనితీరు కనపరుస్తున్నారని రాష్ట్ర డిజిపి సాంబశివరావు అభినందించారు. జిల్లాలో అమలుచేస్తున్న ఇ- ఆఫీస్ విధానం రాష్ట్రంలోనే ఉత్తమంగా వుందని చెప్పారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న డిజిపి సాంబశివరావు స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. 2015-16 సంవత్సరంతో పోలిస్తే జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణలో మంచి ఫలితాలను రాబట్టగలిగారని చెప్పారు. ఇదే విధానాన్ని మిగిలిన రెండు జాతీయ రహదారుల విషయంలోనూ అమలు చేయాలని సూచించారు. ఇక జిల్లాలో అమలుచేస్తున్న ఇ- ఆఫీస్ విధానం రాష్ట్రంలోనే ఉత్తమంగా వుందని ప్రశంసించారు. ఇక్కడున్న ఐటి బృందం సమర్ధంగా పనిచేస్తోందని చెప్పారు. ఇ- ఆఫీస్ విధానం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని పేర్కొన్నారు. చలానాల ద్వారా నాలుగు కోట్ల రూపాయల అపరాధ రుసుము వసూలు చేశారని, దీనిలో 1.46 లక్షల కేసులు హెల్మెట్ లేకపోవడం పైనే కావడం గమనార్హమని చెప్పారు. ఈ విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తతో వుండాలని చెప్పారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సంస్కరణలపై ప్రధానంగా దృష్టి పెట్టామని, రాష్ట్రంలో 800 పోలీసు స్టేషన్లు ఉండగా ప్రస్తుతం గుంటూరు, విజయవాడ పరిధుల్లో నాలుగు స్టేషన్లను మోడల్ పోలీసు స్టేషన్లుగా మార్చామని, త్వరలోనే ఈ సంఖ్యను వంద పోలీసు స్టేషన్లకు తీసుకువెళతామని చెప్పారు. కృష్ణాపుష్కరాల సందర్బంగా పోలీసు సిబ్బంది సేవ చేయడమే లక్ష్యంగా పనిచేశారని, తిరుమలలో జరుగుతున్న ఉత్సవాల సందర్భంగాను అదే స్ఫూర్తి కనపరుస్తున్నారని చెప్పారు. సేవను లక్ష్యంగా చేసుకుని పోలీసులు విధి నిర్వహణలో ముందుకు వెళ్లాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో మొబైల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, దీనిలో 50 సిసి కెమేరాలతోపాటు రెండు డ్రోన్లు, సిసి టివిలు అన్ని వుంటాయని, ఎక్కడైనా ఉత్సవాలు, జాతర్లు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినప్పుడు ముందుగానే ఈ మొబైల్ కంట్రోల్ రూమ్ అక్కడకు చేరుకుని రోజుల వ్యవధిలో సిసి కెమేరాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. మరో నెలరోజుల్లో ఈ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆందోళనలు జరిగే సమయాల్లో పోలీసు అధికారులపై ఆరోపణలు చేయడం సాధారణంగా మారిందని, ఇటువంటి సమస్యలను పరిష్కరించేందుకు డిజిటల్ వాచ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఆయా సందర్భాల్లో బందోబస్తుకు వెళ్లే అధికారులకు బాడీ ఓన్ కెమేరాలను ఏర్పాటుచేస్తామని, ఫలితంగా ఆ ప్రదేశాల్లో జరిగే అన్ని ఘటనలు దానిలో రికార్డు అవుతాయని చెప్పారు. దీని వలన ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా, ఒక వేళ ఏర్పడినా అవసరమైన చర్యలు తీసుకునే అవకాశముంటుందన్నారు. పోలీసు సిబ్బందికి వార్షిక ఆరోగ్య తనిఖీలు కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే 400 వేకెన్సీలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో తుందుర్రుకు సంబంధించి డిజిపి మాట్లాడుతూ 144 సెక్షన్ విధించడంలో ప్రజలను ఇబ్బందిపెట్టే ఉద్దేశ్యం లేదని చెప్పారు. అయితే ఇక్కడ అపోహల వెంట కాకుండా వాస్తవాలను ప్రజలకు పూర్తిస్థాయిలో సంబంధిత శాఖలు అవగత పరిస్తే సమస్య కొనసాగకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనకు సంబంధించి సి ఐడి విచారణ చేస్తోందని, సరైన సమయంలో తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పోలీసు యంత్రాంగం చట్ట ప్రకారం ముందుకు వెళితే ఎక్కడా ఎటువంటి సమస్యలు వుండవని, అదే లక్ష్యంతో సేవ ఉద్దేశ్యంతో పోలీసు స్టేషన్లను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఫలితంగా సిబ్బంది గర్వంతో విధులు నిర్వర్తించే పరిస్థితి తీసుకురావాలన్నదే తమ అభిప్రాయమని పేర్కొన్నారు. సమావేశంలో ఏలూరు రేంజ్ డి ఐజి రామకృష్ణ, జిల్లా ఎస్‌పి భాస్కర్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.