పశ్చిమగోదావరి

కొవ్వూరు కౌన్సిలర్ హత్య కేసులో ఇద్దరు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, ఏప్రిల్ 2: సంచలనం కలిగించిన కొవ్వూరు టిడిపి సీనియర్ నాయకుడు, అధికార పార్టీ కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇందుకు సంబంధించి ఇరువురు వ్యక్తులను అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం సిసిఎస్‌లో డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు విలేఖరులతో మాట్లాడుతూ పాకా గోపాలకృష్ణ హత్యకేసులో ఔరంగాబాద్‌కు చెందిన తోట శ్రీరాములు, చదలవాడ మధుబాబు అనే ఇరువురిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఈ ఇరువురూ దీప్తి కానె్వంటు రోడ్డులో మోటారు సైకిల్‌పై వస్తుండగా అరెస్టుచేసి, వారి నుండి హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇసుక వ్యాపార లావాదేవీలే గోపాలకృష్ణ హత్యకు కారణమని భావిస్తున్నట్టు డిఎస్పీ తెలిపారు. ఈ హత్యోదంతం వెనుక ఇంకా కొంత మంది ఉన్నారనే సమాచారం ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
ఔరంగాబాద్‌కు చెందిన తోట శ్రీరాములు గోంగూర తిప్ప-2లో కొంత భూమిని ఇసుక వ్యాపారం నిమిత్తం అదే గ్రామానికి చెందిన సవాబు వద్ద నోటిమాట ద్వారా లీజుకు తీసుకున్నట్టు డిఎస్పీ తెలిపారు. ఆ స్థలం అభివృద్ధికి శ్రీరాములు సుమారు రూ.4 లక్షలు వరకు వెచ్చించాడన్నారు. అయితే గోపాలకృష్ణ సవాబు వద్ద ఆ స్థలాన్ని రాతపూర్వకంగా లీజుకు తీసుకున్నారన్నారు. గోపాలకృష్ణ కారణంగా స్థలంతోపాటు, రూ.4 లక్షలు నష్టపోయానని శ్రీరాములు అతనిపై కక్ష పెంచుకున్నాడన్నారు. ఎలాగైనా గోపాలకృష్ణను అంతమొందించాలని శ్రీరాములు పథకం పన్ని అందుకు తన బంధువైన చదలవాడ మధుబాబును సహాయం కోరాడన్నారు. వీరిరువురూ కలిసి శుక్రవారం ఔరంగాబాద్ వస్తున్న గోపాలకృష్ణను మోటారు సైకిల్‌పై వెంబడించి, మార్గమధ్యంలో మలుపువద్ద అడ్డుకుని కత్తితో అతనిపై దాడిచేసి హత్యకు పాల్పడ్డారన్నాని చెప్పారు. చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును పట్టణ సిఐ పి ప్రసాదరావు, పట్టణ ఎస్‌ఐ ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్, క్రైం ఎస్‌ఐ కె వెంకటరమణ, కానిస్టేబుల్స్ వి ఏడుకొండలు, డి ప్రసాదబాబు, ఎ ఏడుకొండలు, హోంగార్డు హుస్సేను ఛేదించారని, వీరిని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ అభినందించారని డిఎస్పీ తెలిపారు. డిఎస్పీ వెంకటేశ్వరరావు విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తనకు ప్రాణహాని ఉందని కౌన్సిలర్ గోపాలకృష్ణ తన దృష్టికి ఏనాడూ తీసుకురాలేదని స్పష్టం చేశారు.
రైతుల ప్రయోజనాలే ముఖ్యం
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, ఏప్రిల్ 2 : అర్ధరాత్రి సమయంలోనూ ఫైళ్లను పరిష్కరిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికార యంత్రాంగానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. మార్చి 31వ తేదీ రాత్రి 11 గంటలకు కూడా ఎపి ఎం ఐపికి చెందిన ఫైళ్లను పరిష్కరించారు. రైతులకు సంబంధించిన అంశం కావడంతో తాను ఆ ఫైలు కోసం నిరీక్షించానని పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శనివారం అధికారులతో సమావేశం జరుగుతున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై మాట్లాడుతూ మార్చి 31వ తేదీ రాత్రి 11 గంటలకు ఎపి ఎంఐపి పిడి రామారావు తనకు ఫోన్ చేసి బిందు సేద్యం విషయంలో రైతుల దరఖాస్తులు పంపిస్తున్నానని, అర్ధరాత్రి అయినా ఆన్‌లైన్‌లో ఆ ఫైలుపై సంతకం పెట్టాలని కోరారని ఈ విషయంపై ఒక అధికారి కలెక్టరుకు ఫోన్‌చేసి ఇలాచెప్పడమేమిటని తాను అనుకున్నప్పటికీ రైతు ప్రయోజనాలు కోసం ప్రజా శ్రేయస్సుకోసం ఎన్ని అర్ధరాత్రులైనా తాను మేల్కొని పనిచేస్తానని కానీ రామారావు 365 రోజులూ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ ఒక్క రోజూ అర్ధరాత్రి తనను నిద్రపోనీయకుండా చేయడం ఆశ్చర్యంగా వుందని కలెక్టరు చెప్పగానే సభలో నవ్వులు వినిపించాయి. 11 గంటల నుండి కంప్యూటర్ వద్ద కూర్చుని మైక్రో ఇరిగేషన్ ఫైలు ఎప్పుడు వస్తుందా అని తాను ఎదురు చూసానని కచ్చితంగా అర్ధరాత్రి 11.59 గంటలకు ఫైలు ఆన్‌లైన్‌లోచూసి మరుక్షణంలోనే ఫైలుపై సంతకం చేసి పంపించానని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 5410 హెక్టార్లలో బిందు సేద్యాన్ని అమలుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించిందని అయితే జిల్లాలోని మెట్ట ప్రాంతంలో బిందు సేద్యాన్ని అమలుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించిందని భూగర్భ జలాలు అడుగంటకుండా ఉంటాయనే ఉద్దేశ్యంతో పది వేల హెక్టార్లలో బిందు సేద్యాన్ని అమలు చేయాలని ఏడాది నుండి చెబుతూ వచ్చానని, కానీ దానిపై దృష్టి పెట్టకుండా మార్చి 31వ తేదీ ఒక్కరోజు హడావిడిగా 1037.68 హెక్టార్లకు సంబంధించి బిందుసేద్యం ఫైలును తనకు పంపించారని రైతుల శ్రేయస్సు దృష్ట్యా అర్ధరాత్రి అయినా ఆ ఫైలును ఆమోదించానని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 6637 హెక్టార్లలో బిందు సేద్యం చేపట్టినప్పటికీ వాటిలో రెండు వేల ఎకరాలకు కేవలం పరిపాలనామోదం మాత్రమే పొందారని క్షేత్రస్థాయిలో బిందు సేద్యాన్ని ఇంకా అమలు చేయలేదని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 50 నుండి 90 శాతం వరకూ బిందు సేద్యానికి రైతులకు సబ్సిడీ చేకూరుతుందని ఎస్‌సి, ఎస్‌టి తదితర రైతులైతే నూరుశాతం సబ్సిడీతో బిందు సేద్యాన్ని అమలు చేయవచ్చునని ఇటువంటి మంచి బృహత్తర కార్యక్రమాన్ని కూడా రైతులకు చేర్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వహించడం బాధాకరమని రాత్రికి రాత్రి కష్టపడినట్లు కాకుండా ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నుండే నిర్ధేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు శ్రద్ధ చూపిస్తే హడావిడిపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ చెప్పారు. దీనిపై రామారావు మాట్లాడుతూ జిల్లా కలెక్టరు కృషి, పట్టుదల వల్లే 6687.30 హెక్టార్లలో బిందు సేద్యాన్ని అమలు చేయగలిగామని చెప్పారు.
సొంత నిర్ణయాలు... పనుల్లో నిర్లక్ష్యం
ఏలూరు, ఏప్రిల్ 2: సొంత నిర్ణయాలు తీసుకుంటున్న, పనుల్లో నిర్లక్ష్యం విహిస్తున్న జలవనరుల శాఖకు చెందిన ముగ్గురు ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భాస్కర్ నిర్ణయించారు. తాడిపూడి ఎత్తిపోతల పంపిణీ కాలువ ఎలైన్‌మెంట్ మార్చిన ఇఇ చినబాబు, డెల్టా ఆధునికీకరణ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్ ఎస్‌ఇ వెంకటరమణ, శెట్టిపేట ఇఇ శ్రీనివాస్‌లపై చర్యలు తీసుకోనున్నారు. శనివారం జలవనరుల శాఖ పనుల ప్రగతిపై జరిగిన సమీక్షా సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తాడిపూడి ఎత్తిపోతల డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ఎలైన్‌మెంట్‌ను మారుస్తూ జలవనరుల శాఖ ఇఇ చినబాబు ఆదేశాలు జారీచేశారు. కలెక్టరేట్‌లో శనివారం తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల ప్రగతిపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తాడిపూడి లిఫ్ట్ పంపిణీ కెనాల్‌కు సంబంధించి గోపాలపురం మండలం కొత్తగూడెం గ్రామంలో 3.78 ఎకరాల భూమిని ఎందుకు సేకరించలేదని భూసేకరణ అధికారిని ప్రశ్నించారు. ఆ భూమి సేకరించవద్దని ఇఇ చినబాబు చెప్పారని భూసేకరణ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని రాతపూర్వకంగా ఇచ్చారని సమాధానం చెప్పడంతో కలెక్టరు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఎలైన్‌మెంట్ మార్చే అధికారం ఎవరిచ్చారు.. చెప్పిన పని చేయకుండా ఇష్టానుసారం సొంత నిర్ణయం తీసుకునే అధికారం మీకెక్కడిది’ అంటూ ఇరిగేషన్ ఇఇ చినబాబుపై కలెక్టరు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు 70 అడుగుల లోతుకు పడిపోయాయని, ఇటువంటి స్థితిలో కాల్వ కూడా లేకపోతే పరిస్ధితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాదని సొంత నిర్ణయం తీసుకున్న ఇఇ చినబాబుపై చర్యలు తీసుకోవాలని, సాయంత్రంలోగా ఇఎన్‌సికి లేఖ రాయాలని పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఇ శ్రీనివాసయాదవ్‌ను కలెక్టరు ఆదేశించారు.
జిల్లాలో డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తిచేయాలని ఏడాది నుండి చెబుతున్నప్పటికీ పనుల విషయంలో పూర్తిస్థాయి నిర్లక్ష్యం వహించిన ఇరిగేషన్ ఎస్‌ఇ వెంకటరమణ, శెట్టిపేట ఇఇ శ్రీనివాస్‌లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని కలెక్టర్ చెప్పారు. భూసేకరణ పూర్తయినప్పటికీ డెల్టా ఆధునికీకరణ పనులకు సంబంధించి ఇంకా ఎంతకాలం ఈ నిర్లక్ష్యమని ఆయన ప్రశ్నించారు. ఏప్రిల్ 10వ తేదీ నుండి పంటకాల్వలు మూసివేస్తుంటే అప్పటికే టెండర్లు ఖరారుచేసి పనులు చేయాల్సి ఉండగా ఇంకా టెండర్లు పిలిచే స్థాయిలో ఉండటమేమిటని, ఇలా అయితే ఈ సీజన్‌లో కూడా డెల్టా ఆధునికీకరణ పనులు జరగటం అనుమానమేనా అని ఆయన నిలదీశారు. శెట్టిపేట ఇఇ శ్రీనివాసరావు మాట్లాడుతూ అయిదుకోట్ల రూపాయల విలువైన పనికి టెండరు పిలిచామని, ఈనెల 8వ తేదీన టెండరు ఖరారు కావచ్చునని చెప్పారు.

వచ్చే ఏడాది నుండి ఉమ్మడి పరీక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఏప్రిల్ 2: రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో తీసుకువస్తున్న మార్పుల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివే వారితో సమానంగా ముందుకు సాగేందుకు ఈ చర్యలు ఎంతో దోహదపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సర్కారు బడుల్లో చదివే బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు తాజాగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల మంచి ఫలితాలుటాయని పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో 6 నుండి 9వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి ఉమ్మడి పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటోంది. ఇదే విధంగా పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు ముందుగా జరిగే త్రైమాసిక, అర్థసంవత్సర పరీక్షలకు కూడా ఉమ్మడి పరీక్షల విధానం వర్తింపచేస్తారు. ఒకటి నుండి ఐదవ తరగతి వరకు మాత్రం ప్రస్తుత విద్యా విధానంలో పరీక్షలు జరుగుతాయి. దీనికి సంబంధించి రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర విద్య పరిశోధనా శిక్షణా సంస్థ ద్వారా సమ్మెటివ్-1,2,3(త్రైమాసిక, అర్థసంవత్సర, వార్షిక పరీక్షల) ప్రశ్నపత్రాలు తయారుచేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. జంబ్లింగ్ విధానంలో జవాబు పత్రాల మూల్యంకనం (మిగతా 6వ పేజీలో)
చేపడతారు. ప్రతి 8 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలల్లో జరిగే పరీక్షల పరిశీలనకు సీనియర్ పాఠశాల సహాయకుడిని నియమిస్తారు. సంబంధిత ప్రశ్నాపత్రాల మూల్యంకన ఫలితాన్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చుతారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఈ పాఠశాలతో పాటు ప్రైవేటు యాజమాన్యాలు కూడా దీని పరిధిలోకే వస్తాయి. ఇందులో చదువుకున్న విద్యార్థులు దాదాపుగా ఉమ్మడి పరీక్షల విధానంలోకి వస్తారు. దీనివల్ల విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయి. ఉమ్మడి పరీక్షల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుంది. రాష్టవ్య్రాప్తంగా అన్ని యాజమాన్యాల కింద పనిచేసే పాఠశాలల్లో ఒకే విధమైన సిలబస్‌తో పాఠ్యాంశాలు బోధించే అవకాశం కలుగుతుంది. ఎటువంటి పోటీ పరీక్షలకు ఎదుర్కొనేందుకైనా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతో ముందుకు వెళ్ళేందుకు వీలు కలుగుతుంది. ఉపాధ్యాయుల్లో సైతం పోటీతత్వం పెరుగుతుంది. కష్టపడి పనిచేసేందుకు ఉత్సాహం కలుగుతుంది. సబ్జెక్టుల్లో పట్టున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన బోధన అందించే అవకాశాలు కలుగుతాయి. ప్రైవేటు, కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారు ముందుకు వెళ్లేందుకు వీలుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్ మెరుగుపడుతుంది. నిరుపేదలు, ఇతర సామాన్య కుటుంబాల వారు తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించ లేదనే భావన నుండి ఉపశమనం కలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల నుండి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు తమ పిల్లలను పంపించాల్సిన అవసరం తగ్గి ఖర్చులు, అప్పుల నుండి విముక్తి పొందుతారు. పుస్తకాల బరువు, ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది. అందుబాటులో ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. కనుక ప్రశాంతమైన వాతావరణంలో ఒత్తిడికి, శ్రమకు లోను కాకుండా ఎక్కువ సమయం చదువుకునేందుకు వీలు కలుగుతుంది. దీనివల్ల పేదింటి విద్యార్థులు మరింత ప్రతిభావంతులైన విద్యార్థులుగా తయారవుతారు.
2బివిఆర్‌ఎం-9: విద్యార్థులు

సీసాలకు సీలు... మద్యం మాత్రం నిల్!
ఆకివీడు, ఏప్రిల్ 2: సీల్డ్ సీసాలు.. మద్యం నిల్. ఈ తరహాలో మద్యం దుకాణాలకు మద్యం సీసాలు సరఫరా అవుతున్నాయి. ఉండి నియోజకవర్గంలోని మద్యం దుకాణదారులకు ఏలూరు పవర్‌పేటలోని ఎపి బెవరేజెస్ కార్పొరేషన్ కేంద్రం నుండి మద్యం సీసాల సరఫరా జరుగుతుంది. దుకాణాల అమ్మకాలను బట్టి లైసెన్సుదారులు వారానికి మూడు నుండి నాలుగుసార్లు ఏలూరు పాయింట్ వద్దకు వెళ్ళి మద్యం కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల కాలంలో బ్యాగ్‌పైపర్, విస్కీ, ఓల్డ్ అగ్మిరల్ బ్రాందీ, మెన్స్‌క్లబ్, రాయల్ స్టాగ్ మద్యం సీసాలకు సీలువేసి ఉన్నప్పటికీ మద్యం లేకుండా ఖాళీగా దర్శనమిచ్చాయి. సరఫరా చేసే పాయింట్ వద్ద 48 సీసాలు చెక్‌చేసి, ఒక అట్టపెట్టెలో అమర్చి పెట్టెకు సీల్డ్ వేస్తారు. చెక్ చేసినందుకు పెట్టెకు వచ్చి రూ.50 మద్యం దుకాణదారులు రుసుము చెల్లిస్తారు. గత కొంతకాలంగా మద్యం దుకాణదారుల అవసరాల నిమిత్తం బ్రాండ్‌ల సరుకును అట్టెపెట్టెలో సీలువేసి సరఫరా చేస్తున్నారు. అయితే మద్యం దుకాణదారులకు ఈ తరహా తంతు వల్ల కొన్నిసార్లు ఖాళీ సీసాలు ఉంటున్నాయని తెలిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
గత కొంతకాలంగా మద్యం దుకాణాల వద్ద కొనుగోలు చేసిన మందుబాబులు సగం మద్యం ఉన్న బాటిల్స్, ఖాళీ బాటిల్స్ దర్శనమిస్తుండటంతో ఆయా దుకాణాలతో ఘర్షణకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇటీవల కాలంలో రాత్రిపూట బీరు కొనుగోలుచేసిన కొంతమంది సగం బీరే సీసాలో దర్శనమివ్వడంతో దుకాణ యజమానితో ఘర్షణకు దిగిన దాఖలాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని పలుమార్లు ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. మద్యం లేకుండా వస్తున్న బాటిల్స్ వల్ల తాము నష్టపోతున్నామని దుకాణదారులు చెబుతున్నారు. ఇలా సీల్డ్ వేసి ఖాళీగా వచ్చిన బాటిల్స్ వరుస క్రమంలో ఉంచి వాటి నష్టాన్ని ఎప్పుడు భర్తీ చేస్తారా అని దుకాణదారులు ఎదురుచూస్తున్నారు.
కళాపరిషత్‌ల కృషి అభినందనీయం
వీరవాసరం, ఏప్రిల్ 2: కళాకారులను ఆదరించడానికి కళాపరిషత్తులు చేస్తున్న కృషి అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కొనియాడారు. వీరవాసరం కళాపరిషత్ సప్తమ అఖిల భారత స్థాయి నాటిక పోటీలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. స్వర్గీయ గుండా లక్ష్మీ రత్నావతి కళావేదిక వద్ద చిలకమర్తి కళాప్రాంగణంలో అఖిల భారత స్థాయి నాటిక పోటీలను ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. తొలుత చిలకమర్తి విగ్రహానికి పూలమాలలువేసి ఘన నివాళులు అర్పించారు. కళాపరిషత్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ ప్రస్తుతం సినిమా వ్యామోహంలో ప్రజలు నాటిక, నాటకాలపై ఆసక్తి చూపించడం లేదన్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వీరవాసరం కళాపరిషత్‌ను ఏర్పాటుచేసి, గత 7 సంవత్సరాలుగా ఎందరో కళాకారులకు సన్మానాలు నిర్వహించి, వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారిని తీసుకువచ్చి వారిని సముచిత రీతిన సత్కరిస్తున్న కళాపరిషత్ అధ్యక్షుడు రామకృష్ణ అభినందనీయులన్నారు. ప్రస్తుతం నాటిక పోటీలు నిర్వహించడమంటే సాధారణ విషయం కాదని, ఎంతో ఓర్పు కలిగి పరిషత్తులు నిర్వహిస్తున్న రామకృష్ణలాంటి వ్యక్తులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ జాయింట్ రిజిస్ట్రార్ ఎంఎస్‌కె ప్రభు మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే న్యాయ వ్యవస్థ ఎంతో సక్రమంగా నడవాలన్నారు. అలాగే సమాజాభివృద్ధి జరగాలంటే కళాకారులు, కళాపరిషత్‌లను ఆదరించాలన్నారు. వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా అఖిల భారత స్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్న రామకృష్ణను అభినందించారు. మాజీ జడ్పీటీసీ పోలిశెట్టి సత్యనారాయణ తదితరులు ఈ సభలో ప్రసంగించారు.
ప్రభుకు సత్కారం
సినీ రచయిత, కళాకారుడు ఎపి హైకోర్టు మాజీ జాయింట్ రిజిస్ట్రార్ ఎంఎస్‌కె ప్రభును కళాపరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సన్మానగ్రహీత ప్రభు మాట్లాడుతూ కళాకారులను ఆదరించడం వల్ల సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముందుగా గుండా లిఖితరత్న స్వాగత ఉపన్యాసం ఆకట్టుకుంది. రాయకుదురు సొసైటీ అధ్యక్షుడు ఆకుల బాలరాజు, తాడేపల్లిగూడెం బివిఆర్ కళాకేంద్రం అధ్యక్షుడు బివి రామారావు, భీమవరం వెంకట సాయిబాబా మందిరం వ్యవస్థాపకుడు మల్లినీడి తిరుమలరావు, తోలేరు కళాపరిషత్ అధ్యక్షుడు చవ్వాకుల సత్యనారాయణ, తాడేపల్లిగూడెం ఎక్సైజ్ సిఐ పెద్దిరాజు, కోళ్ల నాగేశ్వరరావు, వలవల రామకృష్ణ, దాడి కాశీనాయుడు, నాగరాజు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
హరితవనంలా ప్రభుత్వాసుపత్రి
ఏలూరు, ఏప్రిల్ 2: ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి ఆవరణాన్ని పచ్చని మొక్కలతో ప్రత్యేక గార్డెన్ ఏర్పాటు చేసి నాణ్యమైన కూరగాయల పెంపకాన్ని చేపడతామని జిల్లా ప్రభుత్వాసుపత్రి కమిటీ ఛైర్మన్, శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు చెప్పారు. స్థానిక ప్రభుత్వాసుపత్రి పాతబ్లడ్ బ్యాంకు వద్ద చెట్టుకింద కూర్చుని సూర్యారావు పలువురు రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకునే నూతన కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలు ఎంతో చెత్తాచెదారంగా ఉంటున్నాయని ఖాళీ స్థలం ఎక్కడుంటే అక్కడ పచ్చని మొక్కలు, పండ్లు, కూరగాయల తోటల పెంపకాన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆసుపత్రిలో అడుగుపెడితే ఎటుచూసినా పచ్చని పూలమొక్కలు, ఆహ్లాదకర వాతావరణం కనిపించేలా ఆసుపత్రిని తీర్చిదిద్దుతామని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ భాస్కర్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని చెప్పారు. కార్పొరేట్ వైద్య శాలల్లో మాదిరిగా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తామని రోగులకోసం వచ్చే వారికి సమగ్ర సమాచారాన్ని ఈ కౌంటర్‌లో అందించేలా చూస్తామని చెప్పారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రోగుల సౌకర్యార్ధం ప్రస్తుతం ఉన్న 13 బెంచీలకు అదనంగా మరో 30 బెంచీలను సమకూర్చాలని, ఆసుపత్రిలో మరిన్ని వౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరిన వెంటనే జిల్లా కలెక్టరు అంగీకరించారని, ఏలూరు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారని సూర్యారావు కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాలో 200 జనరిక్ మందుల షాపులు
-డిఆర్‌డిఎ పిడికి కలెక్టర్ భాస్కర్ ఆదేశం
ఏలూరు, ఏప్రిల్ 2: ప్రజలకు తక్కువధరకే నాణ్యమైన జనరిక్ మందులను అందించేందుకు జిల్లాలో 200 జనరిక్ మందుల షాపులు ఏర్పాటుకు తగుచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ డిఆర్‌డిఎ పిడిని ఆదేశించారు. స్థానిక సత్రంపాడులోని టిటిడిసిలో జనరిక్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌ను శనివారం ఆయన పరిశీలించారు. రూ.125 విలువైన కాల్షియం బిళ్ళలు జనరిక్ మందుల షాపుల్లో కేవలం రూ.17కే లభిస్తాయని, రూ.121 విలువైన సుగర్ వ్యాధి నివారణ పది బిళ్ళలు రూ.17 కే లభిస్తాయన్నారు. రూ.200 విలువచేసే ప్రోటీన్ డబ్బా రూ.50కే లభిస్తుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో ప్రస్తుతం 20 సంజీవని మందుల షాపుల ద్వారా జనరిక్ మందులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, త్వరలో పాలకోడేరు, ఇరగవరం, పెంటపాడు, పోలవరం, పెదవేగిలో ప్రారంభిస్తామన్నారు. ఈ నెలాఖరులోపు ప్రతీ మండలంలో ఒక జనరిక్ మందులషాపు ఏర్పాటు చేయాలని, ఈ ఏడాది చివరినాటికి 200 జనరిక్ మందుల షాపులు ఏర్పాటుచేయాలన్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌ను మరింత విస్తరించాలని, అన్నిరకాల మందులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. డిఆర్‌డిఎ పిడి కె శ్రీనివాసులు మాట్లాడుతూ వివిధ కంపెనీలతో చర్చించి అవసరమైన మందులను కొనుగోలు చేస్తున్నామన్నారు.
భారీ బందోబస్తు నడుమ కౌన్సిలర్ మృతదేహానికి పోస్టుమార్టం
కొవ్వూరు, ఏప్రిల్ 2: హత్యకు గురైన టిడిపి సీనియర్ నాయకుడు, కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ మృతదేహానికి కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో భారీ బందోబస్తు నడుమ శనివారం పోస్టుమార్టమ్ నిర్వహించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆసుపత్రి ప్రాంగణం నిండిపోయింది. పోస్టుమార్టమ్ అనంతరం గోపాలకృష్ణ మృతదేహాన్ని ఆయన బంధువులకు అప్పగించారు.
గోపాలకృష్ణ అంతిమయాత్ర
కౌన్సిలర్ గోపాలకృష్ణ భౌతికకాయాన్ని పూలతో అలంకరించిన వాహనంపై ఉంచారు. కొవ్వూరు ప్రభుత్వాసుపత్రి నుండి శనివారం మధ్యాహ్నం అంతిమయాత్ర ప్రారంభమైంది. పట్టణంలోని మెయిన్ రోడ్డు, మెరకవీధి సెంటరు, విజయవిహార్ సెంటరు, ఫ్యాక్టరీ రోడ్డు మీదుగా సాగిన అంతిమ యాత్ర ఔరంగాబాద్‌లోని గోపాలకృష్ణ గృహానికి చేరుకుంది. గోపాలకృష్ణ అంతిమ యాత్రలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషగిరిరావు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావుతోపాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు కార్యకర్తలు పెద్దయెత్తున పాల్గొన్నారు.
ఔరంగాబాద్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ గోపాలకృష్ణ హత్యను తీవ్రంగా ఖండించారు. హత్యకు పాల్పడిన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. గోపాలకృష్ణకు ప్రాణహాని ఉందని చెప్పినా డిఎస్పీ వెంకటేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఈ నెల 4వ తేదీన టిడిపి జిల్లా స్థాయి సమావేశం ఉందని, ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని సమావేశం అనంతరం ఏలూరు రేంజ్ డిఐజిని కలిసి వినతిపత్రం అందిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. గోపాలకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఛైర్మన్ బాపిరాజు అన్నారు. ఎమ్మెల్యే కెఎస్ జవహర్ మాట్లాడుతూ డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయాలని, గోపాలకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యేలు హత్యను తీవ్రంగా ఖండించారు. హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ హత్యకు నిరసనగా పట్టణంలో శనివారం టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. గోపాలకృష్ణ హత్యకు గురైన ప్రదేశాన్ని శనివారం డాగ్ స్క్వాడ్ పరిశీలించింది. ఏలూరు నుండి వచ్చిన డాగ్ స్క్వాడ్ ఆ పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ డి గంగాభవాని, ఎ రఘు, ప్రవీణ్ ఉన్నారు.