పశ్చిమగోదావరి

ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించడమే లోక్ అదాలత్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 8 : లోక్ అదాలత్ ద్వారా పెండింగ్‌లో వున్న కోర్టు కేసులలో ఇరుపక్షాల వారిని విచారించి కేసుల పూర్వాపరాలు, రికార్డులు పరిశీలించి సుహృద్భావ వాతావరణంలో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం ఇవ్వడమే లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశ్యమని రెండవ అదనపు జిల్లా జడ్జి కె సాయి రమాదేవి చెప్పారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు సమావేశ మందిరంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సాయి రమాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు సివిల్ కోర్టు తీర్పుతో సమానంగా పరిగణించబడుతుందని చెప్పారు. కోర్టు వరకు కేసు వెళ్లని పక్షంలో సదరు పార్టీల వారు తగాదాను పరిష్కరించుకోవడానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థను కోరవచ్చని తెలిపారు. తక్కువ వ్యవధిలో, ఖర్చు లేకుండా లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. లోక్ అదాలత్‌లో కేసు వేయుటకు ఎటువంటి ఫీజు చెల్లించనక్కర్లేదని తెలిపారు. లోక్ అదాలత్‌పై విస్తృత ప్రచారం చేయడం ద్వారా కక్షిదారులకు అవగాహన పెంపొందించడం ద్వారా లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని మీడియా సహకారం తప్పనిసరిగా అవసరమని, రానున్న రోజులలో పశ్చిమగోదావరి జిల్లా ఎక్కువ కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించి రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. న్యాయవాది కానాల రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రజారోగ్య చట్టంపై సరైన అవగాహన ప్రజల్లో కలిగిస్తే సమాజాభివృద్ధి, గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ వై సాయి శ్రీకాంత్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలలో ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రజల్లో కూడా పరివర్తన రావాలని అప్పుడే గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా వుంటాయని తెలిపారు. పురసేవా యాప్ ద్వారా పట్టణంలో పలు సమస్యలు వెంటనే ఫొటోలు తీసి సమస్య వివరం తెలియజేసి యాప్ ద్వారా ప్రజలు నేరుగా పంపవచ్చని తద్వారా వెంటనే సమస్యలు పరిష్కరించి పట్టణ అభివృద్ధికి కృషి చేయవచ్చని కమిషనర్ చెప్పారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎ విజయకుమార్ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నివారించవలసిన అవసరం వుందని, అదే విధంగా పట్టణంలో వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ సౌకర్యాలు కూడా లేకపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవలసి వుందని చెప్పారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎ నరసింహమూర్తి వందనసమర్పణ చేశారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ పరిష్కారం కొరకు వచ్చిన ప్రజలు, కోర్టు సిబ్బంది, లాయర్లు పాల్గొన్నారు.

తండ్రి కొట్టిన ఘటనలో మరణించిన
బాలిక మృతదేహానికి పంచనామా
పెదవేగి, అక్టోబర్ 8 : మండలంలోని రామశింగవరం గ్రామంలో తండ్రి కొట్టిన ఘటనలో మృతిచెందిన బాలిక మల్లీశ్వరి (11) మృతదేహానికి శనివారం ఇరువురి డాక్టర్ల సమక్షంలో శవపంచనామా జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. రామశింగవరం గ్రామంలో గత నెల 22వ తేదీన బడికి వెళ్లలేదని తండ్రి కొట్టిన దెబ్బలకు మరణించిన యలమర్తి మల్లీశ్వరిని అదే గ్రామంలో కమతం ఉంటున్న తోటలో ఖననం చేసేశాడు. విషయం ఎవరికన్నా చెబితే చంపేస్తానని భార్యను బెదిరించాడు. ఈ కారణం చేత భార్య పరిస్థితిని చూసి చుట్టు ప్రక్కల వారికి అనుమానం వచ్చి వారిరువురిని నిలదీయగా గురువారం రాత్రి మల్లీశ్వరి మృతిచెందిన విషాదకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఖననం చేసిన మల్లీశ్వరి మృతదేహాన్ని తహశీల్దార్ ఎం ఇందిరాగాంధీ సమక్షంలో సి ఐ ఎ నాగమురళీ ఆధ్వర్యంలో శనివారం మృతదేహాన్ని వెలికి తీశారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు డాక్టర్ ఎ సూర్యనారాయణ, వై ప్రవీణలు ఖననం చేసిన ప్రదేశంలోనే మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించారు. శవపరీక్ష అనంతరం మల్లీశ్వరి మృతదేహాన్ని ఆమె చిన్నాన్న రాజుకు అప్పగించారు. నిందితుడు మల్లీశ్వరి తండ్రి రాజారత్నంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ వి రామకోటేశ్వరరావు తెలిపారు.

అగ్నిప్రమాదంలో
ఫ్యాన్సీషాపు దగ్ధం
నిడమర్రు, అక్టోబర్ 8: అగ్నిప్రమాదంలో ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్ షాపు అగ్నిప్రమాదానికి గురై రూ. 10 లక్షలు ఆస్తినష్టం వాటిల్లినట్లు నిడమర్రు తహసీల్దారు ఎస్‌ఎం ఫాజిల్ తెలిపారు. నిడమర్రు మండలం బువ్వనపల్లి మెయిన్ సెంటరులో ఉన్న వాణి ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. అత్తిలి ఫైర్‌స్టేషన్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బువ్వనపల్లి గ్రామానికి చెందిన వంకాయల నాగవెంకట కృష్ణ షాపు యజమానిదన్నారు. విఆర్వో ఎఆర్‌కె ప్రసాద్ తదితరులు విచారణ జరిపారు.

మత్స్యకారుల వలలో కొండచిలువ
మొగల్తూరు, అక్టోబర్ 8: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని ఉప్పుటేరులో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో పది అడుగుల కొండ చిలువ శనివారం బయటపడింది. గ్రామానికి చెందిన తిరుమాని భోగేశ్వరరావు, కొల్లాటి బలిచక్రవర్తిలకు చెందిన వలకు కొండ చిలువ చిక్కి గ్రామస్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల కాలంలో వేట మత్స్యకారులకు కొండ చిలువలు తరచూ వలలకు రావడంతో గ్రామానికి చెందిన పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ మహాలక్ష్మి అలంకరణలో మావుళ్లమ్మ దర్శనం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, అక్టోబర్ 8: మావుళ్ళమ్మ అమ్మవారు శనివారం శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జువ్వలపాలెం రోడ్డులో వేంచేసియున్న శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి వారి దేవస్ధానంలో పద్మావతి అమ్మవారు విద్యాలక్ష్మిగా దర్శనమిచ్చారు. స్ధానిక గునుపూడి క్షేత్రంలో వేంచేసియున్న శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పొలేరమ్మ అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఆంధ్రాలో రికార్డు సృష్టించిన ‘విష్ణు’ విద్యాసంస్థలు

ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, అక్టోబర్ 8: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంనకు చెందిన ‘విష్ణు’ విద్యాసంస్థలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌లోని గత మూడు మాసాల్లో జరిగిన బహుళజాతి సంస్థల ప్రాంగణ నియామకాల్లో విష్ణు విద్యాసంస్థలకు చెందిన 502 మంది మహిళా ఇంజనీరింగ్ విద్యార్థినులు ఎంపికై ప్రథమస్థానంలో నిలిచారు. ఐబిఎంకు 179, క్యాప్‌జెమినీ 167, టెక్ మహేంద్ర 82, ఇన్ఫోసిస్ 54, జాన్‌డీర్ 7, కోనీల్యాబ్స్ 6, ధర్మాక్స్ 2, టాలెంట్ స్పింట్‌కు 3, ఎన్‌టిటి డేటాకు ఇద్దరు విష్ణు మహిళా ఇంజనీరింగ్ నాల్గొవ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న వారు ఎంపికయ్యారు. శనివారం క్యాంపస్‌లో విష్ణు విద్యాసంస్థల ఛైర్మన్ కెవి విష్ణురాజు, వైస్ ఛైర్మన్ ఆర్ రవిచంద్రన్ విద్యార్థుల సమక్షంలో భారీ కేకు కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖర్ల సమావేశంలో ఛైర్మన్ కెవి విష్ణురాజు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విష్ణు ప్రథమస్థానంలో నిలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎంపికైన మహిళా విద్యార్థుల్లో దాదాపు 45 శాతం మంది గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారని చెప్పారు. వీరిలో పశ్చిమగోదావరి, తూర్పు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ట్ఫియల్ ఇంటెలిజెన్స్, ఆటోమెషన్, బిగ్‌డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే నవీన సాంకేతిక పరిజ్ఞానాల వైపు విద్యార్థులు దృష్టిసారించి, నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకుంటే పారిశ్రామిక రంగాల్లో ఒడిదుడుకులు కూడా తట్టుకోగలరన్నారు. రానున్న రోజుల్లో మరో 23 బహుళజాతి సంస్థలు ఇక్కడకు రానున్నాయని చెప్పారు.