పశ్చిమగోదావరి

కొవ్వూరులో తాత్కాలిక టోల్‌ప్లాజా తొలగించాలి:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 15 : జాతీయ రహదారి నిర్మించకుండా కొవ్వూరులో తాత్కాలిక టోల్‌ప్లాజా పెట్టి ప్రజల నుండి టోల్‌ఫీజు వసూలుచేసే వారిపై కేసు నమోదు చేసి తక్షణమే తాత్కాలిక టోల్‌ప్లాజాను తొలగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ కొవ్వూరు ఆర్‌డివోను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం సేద్యపునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల ప్రగతి తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టోల్‌ప్లాజా ఏర్పాటుకు ఇంకా స్థలం నోటిఫై చేయకుండానే ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా కొవ్వూరులో తాత్కాలిక టోల్‌ప్లాజా పెట్టి ప్రజల నుండి సొమ్ములు వసూలు చేసే వారికి తక్షణమే నోటీసులు ఇచ్చి తొలగించాలని చెప్పారు. జాతీయ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఎక్కడ టోల్‌ప్లాజా ఏర్పాటు చేయాలో అందుకు అవసరమైన స్థలాన్ని జిల్లా యంత్రాంగం కేటాయించిన తర్వాత దానికి కేంద్ర మంత్రి అనుమతికి పంపిస్తామని ఆ తర్వాత మాత్రమే టోల్ పన్ను వసూలు జరగాలే తప్ప ఎవరికి వారే ఇష్టానుసారంగా కనీస వౌలిక వసతులు కూడా లేకుండా తాత్కాలిక టోల్‌ప్లాజా పేరుతో ప్రజలను దోపిడీ చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. నరసాపురం నుండి కోటిపల్లి వరకు వశిష్ట గోదావరిపై రైల్వే శాఖ నిర్మిస్తున్న బ్రిడ్జితో పాటు రోడ్డు కం రైల్ బ్రిడ్జి నిర్మిస్తే వాహనాల రాకపోకలకు కూడా ఎంతో అనువుగా వుంటుందని ఈ మేరకు ఆర్ అండ్ బి తగు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని దీనిపై రైల్వే, ఆర్ అండ్ బి ఉన్నతాధికారులతో తాను చర్చిస్తానని కలెక్టర్ చెప్పారు.
రైతులంటే అంత నిర్లక్ష్యమా?
పశ్చిమ ప్రజానీకం ముఖ్యంగా రైతాంగం ఎంతో సహనం, ఓపికతో ఉంటారని వారి మంచితనాన్ని ఆసరా చేసుకుని సేద్యపునీటి ప్రాజెక్టు పనులు ఇష్టానుసారంగా తీవ్ర జాప్యం చేస్తున్నారని శెట్టిపేట ఇ ఇ శ్రీనివాస్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రబీ పంట కాలంలో ప్రతీ ఏటా డెల్టాలో మురుగునీటిని పంటకాల్వల్లోకి తాత్కాలిక పద్దతిలో మోటార్ల ద్వారా నీరును తోడుతున్నారని ప్రతీ ఏటా తాత్కాలిక పనులు చేపట్టి లక్షలాది రూపాయలు వృధా చేసే బదులు మూడేళ్లు ఖర్చుపెట్టే సొమ్ముతో శాశ్వత ప్రాతిపదికన మోటార్లు ఏర్పాటు చేయాలని రెండు నెలల క్రితం చెప్పినప్పటికీ నేటికీ తగు ప్రతిపాదనలెందుకు సిద్ధం చేయలేదని ప్రశ్నించారు. రైతులంటే అంత నిర్లక్ష్యమా? మీరు చేసే దుర్మార్గాల వల్ల రైతు బలైపోవాలా? ఈ జిల్లాలో అడిగేవాడు లేడని మీ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, మీ ఆటలు సాగుతున్నాయని వచ్చే రబీ పంటకు శాశ్వత ప్రాతిపదికన 24 ప్రాంతాల్లో నీటిని మళ్లించేందుకు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి మోటార్లు బిగించకపోతే తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. గత మూడేళ్ల నుండి తాత్కాలిక పద్దతిపై లక్షలాది రూపాయలు సొమ్ము వెచ్చించానని ఇకపై శాశ్వత ప్రాతిపదికపై రైతులకు సకాలంలో సమృద్ధిగా సేద్యపునీరు అందించాల్సిందేనని స్పష్టం చేశారు. మే నెలలో 30 రోజులు పంట కాల్వలు మూసివేస్తున్న దృష్ట్యా కాల్వలు పూడికతీత పనులు ఇప్పటి నుండే సిద్ధం చేయాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. యనమదుర్రు డ్రైన్‌పై మూడేళ్ల నుండి బ్రిడ్జీలు నిర్మాణ పనులు పూర్తి చేయలేదని ఎప్పుడు చూసినా రెండు ఫిల్లర్స్ కొన్ని చోట్ల శ్లాబ్ పనులు మాత్రమే దర్శనమిస్తున్నాయని ఈ సీజన్‌లో నూరుశాతం డెల్టా ఆధునీకరణ పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. డెల్టాలోని ఇన్‌లాండ్ వాటర్ ప్రాజెక్టు పధకం కింద నిడదవోలు నుండి ఏలూరు వరకూ 74 కిలోమీటర్ల పొడవునా కాల్వను విస్తరించి అభివృద్ధి చేయడానికి ఏమేరకు భూసేకరణ అవసరమో తగు ప్రతిపాదనలను ఈ నెల 18వ తేదీ నాటికల్లా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పోణంగి పుంత పనులు కూడా ఎందుకు జరగడం లేదని భూసేకరణ అవార్డు అయిన తరువాత పంట వేస్తుంటే ఏమి చేస్తున్నారని పనిచేయాలని లేదా? భూమి అప్పగించినప్పుడే పని ఫ్రారంభిస్తే పంటలు వేసే పరిస్థితి ఉండబోదని వచ్చే సమావేశానికి ఖచ్చితంగా కృష్ణాడివిజన్ ఇరిగేషన్ ఇ ఇ సమావేశానికి రావాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అధికారులు ఖరారు చేసిన డిజైన్లనే అమోదిస్తామని తిరిగి దానిని మార్చాలని ఎవరడిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చబోనని కలెక్టర్ స్పష్టం చేశారు. డిజైన్ మార్చమని కొంతమంది రైతులను ఇరిగేషన్ ఇ ఇ చినబాబు పంపడాన్ని కలెక్టర్ తప్పుపడుతూ అసలు మీ ఆలోచనేమిటీ ఎందు వలన మీరు రైతులను రెచ్చగొడుతున్నారు, పనులు చేయకుండా ఇటువంటి ఆలోచనలు చేయడం వలన పనులు ముందుకు సాగడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జెసి పి కోటేశ్వరరావు, జెసి-2 ఎంహెచ్ షరీఫ్, స్పెషల్ కలెక్టర్ భాను ప్రసాద్, ఐటిడి ఏ పివో షాన్‌మోహన్, నరసాపురం ఆర్‌డివో దినేష్‌కుమార్, ఆర్డీవోలు తేజ్‌భరత్, బి శ్రీనివాసరావు, పోలవరం ఎస్ ఇ శ్రీనివాసయాదవ్, డ్వామా పిడి వెంకటరమణ, ఇరిగేషన్ ఎస్ ఇ శ్రీనివాసరావు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.