పశ్చిమగోదావరి

‘పోలవరం’లో విస్తృత తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, నవంబర్ 3: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని గురువారం నుండి విస్తృత తనిఖీలు చేపట్టారు. నిర్మాణ ప్రాంతం వైపు వెళ్లే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి, వివరాలు రాసుకుని పంపుతున్నారు. అలాగే నిర్మాణ ప్రాంతం దాటిన తరువాత ఇంకా ఖాళీ చేయాల్సిన గ్రామాలు 19 ఉన్నాయి. అదీగాక తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం వెళ్లేందుకు కూడా ప్రాజెక్టు నిర్మాణం వైపు నుండే వెళ్లాలి. పాత పోలవరం చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం దాటిన తరువాత చేగొండపల్లి గ్రామం వద్ద ఉన్న మరో చెక్‌పోస్టు వద్ద కూడా వివరాలు రాసుకుంటున్నారు. వంద మంది ప్రత్యేక పోలీస్ బలగాలతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం చుట్టూ కొండలు ఉండటంతో నిత్యం కూంబింగ్ చేస్తున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. కొండ చుట్టూ 4 బ్యారెక్కులు నిర్మించామని, అక్కడి నుండి నిత్యం నిఘా ఉంటుందని ఆధునిక బైనాక్యులర్ల ద్వారా పరిసరాల్లో గమనిస్తుంటామని అధికారులు తెలిపారు. ఈ బైనాక్యుర్లతో 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రతి విషయాన్ని పరిశీలించవచ్చు. నిఘాలో డ్రోన్ కెమెరాను కూడా ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. డ్రోన్ కెమెరా 800 మీటర్ల వరకు పంపించ వచ్చని, దూరంగా జరుగుతున్న రాకపోకలను గుర్తించేందుకు, ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే తక్షణం స్పందించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. పోలీసులు అన్ని భద్రతా చర్యలూ తీసుకుంటున్నారు. అలాగే బ్లాస్టింగ్ మెటీరియల్‌ను కూడా పోలీసులు తనిఖీల తర్వాతే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి పంపుతున్నారు. రాజమహేంద్రవరం నుండి వారం రోజులకు సరిపడ బ్లాస్టింగ్ మెటీరియల్ వస్తుంది. ఆ రోజుకు వాడగా మిగిలిన మెటీరియల్ నిల్వవున్న వాహనాన్ని పోలీసుల రక్షణలో ఉంచుతున్నారు.

ఏడుగురి సస్పెన్షన్
*సొమ్ము జమ చేయించని ఫలితం
*ఉత్తర్వులు జారీ చేసిన డిఎఫ్‌ఒ

ఏలూరు, నవంబర్ 3 : విధుల నిర్వహణ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు నిధులు జమ చేయించాల్సిన విధుల విషయంలోనూ వైఫల్యం కారణంగా ఏడుగురు అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించిన వివరాలను అటవీ శాఖ డి ఎఫ్ ఓ ఎన్ నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని చింతలపూడి, నల్లజర్ల, యర్రగుంటపల్లి పరిధిలో అటవీ శాఖకు సంబంధించి వన సంరక్షణా సమితుల ఆధ్వర్యంలో 11 జామాయిల్ తోటలు సాగవుతున్నాయి. వీటికి గత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రభుత్వం తరఫున వేలంపాటలు నిర్వహించగా ఇద్దరు కాంట్రాక్టర్లు 2.07 కోట్ల రూపాయలకు వేలంపాటను దక్కించుకున్నారు. ఈ వేలంపాటలో పాల్గొనే ముందు మొత్తం సొమ్ములో నాల్గవ వంతును చెల్లించాల్సి వుంటుంది. వేలం అనంతరం నిర్ణీత గడువులోగా పాడుకున్న జామాయిల్‌ను అక్కడి నుంచి తరలించే సమయంలో మిగిలిన 75 శాతం మొత్తాన్ని అటవీ శాఖకు తప్పనిసరిగా చెల్లించాలి. తొలుత నాల్గవ వంతు చెల్లించిన కాంట్రాక్టర్లు అనంతరం మరో 87 లక్షల రూపాయలు అటవీ శాఖాధికారులకు చెల్లించారు. అయితే జామాయిల్‌ను తరలించుకుని వెళ్లే సమయంలో మిగిలిన 68.5 లక్షల రూపాయల మొత్తాన్ని చెల్లించకుండానే వెళ్లిపోయారు. ఈ విషయమై సంబంధిత అటవీ శాఖాధికారులను ఉన్నతాధికారులు పలుమార్లు ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నెలలు గడుస్తున్నా ప్రభుత్వ ఖజానాకు సొమ్ము జమ కాకుండా పోవడంతో ఉన్నతాధికారులు స్పందించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. యర్రగుంటపల్లి సెక్షన్ ఆఫీసర్ డి వెంకటేశ్వరరావు, యర్రగుంటపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇ సుధాకర్, చింతలపూడి సెక్షన్ ఆఫీసర్ కె కుమార్ సింగ్, చింతలపూడి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె వెంకటస్వామి, గతంలో చింతలపూడి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేసి ప్రస్తుతం పదోన్నతిపై పోలవరం సెక్షన్ ఆఫీసరుగా పనిచేస్తున్న కె శ్రీనివాస్, వెంకట్రామన్నగూడెం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎండి మెహబూబ్, దూబచర్ల అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ బి కోటేశ్వరరావులను సస్పెండ్ చేస్తూ డి ఎఫ్‌వో నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రామాలభివృద్ధితోనే దేశాభివృద్ధి
మంత్రి సుజాత
కామవరపుకోట, నవంబర్ 3 : గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ పురోభివృద్ధి వుంటుందని మంత్రి పీతల సుజాత అన్నారు. గురువారం రాత్రి కామవరపుకోట మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో జన చైతన్యయాత్రలో ఆమె పాల్గొన్నారు. ముందుగా స్థానిక రహదారి బంగ్లా వద్ద నుంచి పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఉప్పలపాడు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం అయిదు లక్షల రూపాయలతో గ్రామంలో ఏర్పాటుచేసిన సిసి రోడ్డును ఆమె ప్రారంభోత్సవం చేశారు. అనంతరం చవల శ్రీనివాసరావుతో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఉప్పలపాడు గ్రామంలో అపరిష్కృతంగా వున్న విద్యుత్ సమస్యను మంత్రి సుజాత దృష్టికి తీసుకురాగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే విద్యుత్ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 24 గంటల్లోగానే సమస్య పరిష్కారం చేయాలని హుకుం జారీ చేశారు. గ్రామాల్లోని ఎస్‌సి, ఎస్‌టి వీధులన్నీ సిసి రోడ్లన్నీ సిసి రోడ్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే గ్రామాల్లో శ్రీకారం చుట్టామన్నారు. ఎన్ ఆర్ ఇజి ఎస్ పధకం నిధులతోపాటు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ఎస్ ఆర్ ఆర్‌కె రామకృష్ణరాజు, జడ్పీటిసి గంటా సుధీర్‌బాబు, ఎంపిపి మద్దిపోటి సుబ్బలక్ష్మి, మాజీ మండల టిడిపి అధ్యక్షులు కోనేరు వెంకట సుబ్బారావు, సర్పంచ్ పాల జలాచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో నాగుల చవితి

భీమవరం, నవంబర్ 3: నాగుల చవితి పట్టణంలో భక్తిశ్రద్దలతో చేసుకున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన భీమవరంలో అన్ని ఆలయాలు భక్తులతో గురువారం నాడు కిటకిటలాడాయి. స్ధానిక టూటౌన్‌లోని పద్మాలయా దియేటర్ సమీపంలో ఉన్న పాము పుట్టలకు భక్తులు పూజలు జరిపారు. 5వ తరగతి చదువుతున్న చిన్నారి గాయత్రి సర్పాలతో ఆటలాడుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిన్నారికి చిన్నతనం నుంచి సర్పాలతో ఆడుకోవడం మహాఇష్టమని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా నాగుల చవితి నాడు అక్కడకు పాములోళ్ళు తీసుకువచ్చే సర్పాలతో ఆటలాడుకోవడం స్ధానికులకు కాసింత భయాందోళనకు గురిచేసింది.
ఏలూరు : నగరంలోని వివిధ డివిజన్లలో గల నాగేంద్ర స్వామి ఆలయాల వద్ద పలు ప్రాంతాల్లోని పుట్టల వద్ద గురువారం నాగుల చవితి పండుగ సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పుట్టలో పాలుపోసి కోడిగుడ్లు వేసి దీపాలను వెలిగించి పసుపుకుంకుమాలతో అర్చనలు జరిపి నివేదనలు సమర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులకు చెవిపోగులు కుట్టే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దీపావళి అనంతరం వచ్చే పండుగ నేపధ్యంలో చిన్నారులు పుట్టల వద్ద, ఆలయాల వద్ద బాణాసంచా కాల్చి ఆనందాన్ని వెలిబుచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు, పుట్టల వద్దకు తరలి రావడంతో భక్తులతో ఆయా ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. నాగేంద్రస్వామి నామస్మరణతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. రామకృష్ణాపురం, అశోక్‌నగర్, పత్తేబాద, కోడేలు, బావిశెట్టివారి పేట, తదితర ప్రాంతాల్లో గల నాగేంద్రస్వామి ఆలయాల వద్ద, శివాలయాల ప్రాంగణాల్లోని నాగేంద్రస్వామి ఉప ఆలయాల వద్ద భక్తులు పాలుపోసి ఆరాధించారు.

పేదల ఆర్ధిక అభివృద్ధికి
బ్యాకెండ్ సబ్సిడీ రుణాలు
ఏలూరు, నవంబర్ 3 : జిల్లాలో పేదల ఆర్ధిక అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున బ్యాకెండ్ సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం మధ్యాహ్నం వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో రుణాల పంపిణీ తీరుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ రుణాల కోసం దరఖాస్తు చేసే వారి సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోందని దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇచ్చిన రుణాలకు రెట్టింపు రుణాలను వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి పేదలకు అందించి వారి జీవితాలలో ఆర్ధిఖ పురోభివృద్ధి అందించగలుగుతామని చెప్పారు. సమాజంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను అమలుచేస్తున్నప్పటికీ కొంతమంది కేవలం సబ్సిడీ కోసం రుణాలు పొందుతూ బ్యాంకులకు సకాలంలో సొమ్ము చెల్లించడం లేదని, ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం వచ్చే ఆర్దిక సంవత్సరం నుండి నూతన రుణ విధానాన్ని అమలు చేస్తోందని చెప్పారు. కాపు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, బ్రాహ్మణ, గిరిజన కార్పొరేషన్ల ద్వారా ఆయా పేద కుటుంబాలకు సబ్సిడీతో కూడిన రుణాలను ఇస్తోందని, కొంతమంది సబ్సిడీ తీసుకుని యూనిట్ కూడా స్థాపించడం లేదని, ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి ఇకపై బ్యాకెండ్ సబ్సిడీ విధానాన్ని అమలుచేస్తామని చెప్పారు. లబ్ధిదారునికి యూనిట్ విలువ 2 లక్షల రూపాయలు అయితే ప్రభుత్వపరంగా ఇచ్చే లక్ష రూపాయల సబ్సిడీని లబ్ధిదారుని పేరుతో బ్యాంకులో జమ చేయడం జరుగుతుందని, బ్యాంకర్లు లబ్ధిదారనికి లక్ష రూపాయల రుణాన్ని అందిస్తారని, రెండేళ్ల తరువాత లబ్ధిదారుని పరిస్థితిని పరిశీలించి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని, దీని వల్ల బోగస్ యూనిట్ల బెడద తొలగిపోతుందని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ రుణాల యూనిట్లు ఎలా పనిచేస్తున్నాయో ఇకపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి యూనిట్ ముందు లబ్ధిదారుడు, ఎంపిడివో కలిసి దిగిన ఫొటో ఆన్‌లైన్‌లో పొందుపరచాలని, దాని వల్ల నిజమైన లబ్ధిదారులు ఎవరో స్పష్టమవుతుందన్నారు. జిల్లాలో పెండింగ్‌లో వున్న రుణాలను తక్షణమే అందించడానికి ఆయా కార్పొరేషన్లు నిధులు విడుదల చేసేలా ఆయా శాఖల అధికారులు శ్రద్ధ వహించాలని ఆదేశించారు. సమావేశంలో జెసి-2 ఎంహెచ్ షరీఫ్, బిసి కార్పొరేషన్ ఇడి పుష్పమణి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఝాన్సీరాణి, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇన్‌ఛార్జి సి ఇవో కె శ్రీనివాస్, మైనార్టీస్ కార్పొరేషన్ ఇడి శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరకీ ప్రభుత్వ పథకాలు చేరాలి
ఎంపి సీతారామలక్ష్మి
చాగల్లు, నవంబర్ 3:ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించి, మహిళా, కర్షక, యువత, కార్మిక,గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పన , అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఆయన కృషికి అన్నివర్గాలు చేయూతనివ్వాలని జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎంపి తోట సీతారామలక్ష్మి అన్నారు. గురువారం మండలంలో బ్రాహ్మణగూడెంలో జన చైతన్య యాత్రలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే కెఎస్ జవహార్ మాట్లాడుతూ లోటు బడ్జెట్, అప్పులతో విభజించిన రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి గుర్తింపు పొందేవిధంగా అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ఆమె వివరించారు. చాగల్లు మండలంలో రూ.7కోట్లతో వేముల కాలువపై నందమూరు-పశివేదల రహాదారిలో వంతెన నిర్మాణంతో అన్నివర్గాలకు ఎంతో మేలు చేకూరిందన్నారు. రాబోయే రెండేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో నూరు శాతం సిసిరోడ్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తొలుత గ్రామంలో ప్రధాన వీధుల్లో చైతన్య యాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకొన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును ఎంపి సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఎన్టీయార్, డాక్టరు బి ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఆమె పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గామసర్పంచ్ తమ్మినేని లక్ష్మి, ఎంపిపి కోడూరి రమామణి, ఎఎంసి ఛైర్మన్ ఆళ్ల హరిబాబు, తెలుయువత నాయకులు బొడ్డు రాజు, నాదెళ్ళ శ్రీరామ్ చౌదరి, కొఠారు సురేంద్రనాధ్, గారపాటి కాశీ , ఉప సర్పంచ్ పత్తిపాటి నారాయణ, తహసీల్దార్ ఎం మెరికమ్మ, ఎంపిడివో కె పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు. కలవలపల్లిలో
మండలంలో కలవలపల్లిలో జన చైతన్య యాత్ర నిర్వహించారు. గ్రామాల్లో పర్యటించారు. నూతనంగా ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ అయిన పాఠశాల తరగతి గదులను ఎంమ్మెల్యే కెఎస్ జవహార్ ప్రారంభించారు. సిసి రోడ్లకు శంకుస్థాపనచేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండేపాటి విశాలక్షి, ఎంపిటిసి కె హరినాద్, వెంకటేశ్వరరావు , కార్యాకర్తలు నాయకులు అధికారులు పాల్గొన్నారు.
వసతిగృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు
రూ.67 కోట్లతో ప్రణాళిక: కలెక్టర్
ఏలూరు, నవంబర్ 3 : జిల్లాలో ప్రభుత్వ వసతిగృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి 67 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం విద్యాశాఖ ప్రగతి తీరుపై కలెక్టరు అధికారులతో సమీక్షించారు. జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఇటువంటి స్థితిలో హాస్టల్స్‌లో ఉంటూ బయట ప్రాంతాలలో విద్య నేర్చుకోవడానికి విద్యార్ధినీ విద్యార్ధులు వెళుతూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని తొలగించి జిల్లాలో 383 తరగతి గదులను నిర్మించి ప్రస్తుతం ఉన్న హాస్టల్స్‌నురెసిడెన్షియల్ పాఠశాలలుగా తీర్చిదిద్దగలిగితే 12 వేల మంది విద్యార్ధినీ విద్యార్ధులకు అదనంగా సీట్లు ఇచ్చే అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ప్రస్తుతం హాస్టల్ నిర్వహణకు 30 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, కేవలం 67 కోట్ల రూపాయలతో 12 వేల మంది అదనంగా ఆశ్రమ పాఠశాలల్లో ప్రవేశం కల్పించగలుగుతామని, దీని వల్ల విద్యార్ధినీ విద్యార్ధులు బయట పాఠశాలలకు వెళ్లకుండా ఉన్నచోటే చదువుకునే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే గిరిజన హాస్టల్స్‌ను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్పు చేయడం జరిగిందని, కేవలం 30 లక్షల రూపాయల వ్యయంతో 4 తరగతి గదులను నిర్మిస్తే నూరు శాతం ఆశ్రమ పాఠశాలల లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో బిసి విద్యార్ధినీ విద్యార్ధులకు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో 52 తరగతి గదులు నిర్మిస్తే పూర్తి స్థాయిలో ఆశ్రమ పాఠశాలుగా మార్పు చేయగలుగుతామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఎస్‌సి విద్యార్ధినీ విద్యార్ధుల కోసం 63 కోట్ల రూపాయల వ్యయంతో 327తరగతి గదులు నిర్మిస్తే రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్పు చేయగలుగుతామని స్పెషల్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయగలదని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 16 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రతీ పాఠశాలలోనూ విధిగా గ్యాస్ ద్వారా వంట చేయాలే తప్ప, కట్టెల పొయ్యి కనిపించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో అంగన్‌వాడీ చిన్నారులతోపాటు పాఠశాలల్లో చదివే విద్యార్ధినీ విద్యార్ధులకు ప్రతీ నెలా 60 లక్షల కోడిగుడ్లను పెట్టి వారిలో పోషక విలువలు పెంపొందించాలే తప్ప చిన్నారుల నోటికాడ కూడుకు కక్కుర్తిపడి 30 లక్షల గుడ్లను స్వాహా చేసే ఆలోచనలకు వెల్లవద్దని కలెక్టర్ హితవు పలికారు. ఈ నెల 18వ తేదీన టీచర్ లెర్నింగ్ మెటీరియల్ తనిఖీ నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డి ఇవో మధుసూధనరావు, డిప్యూటీ డి ఇవోలు డి ఉదయ్, జి విలియమ్స్, జె సోమరాజు, తిరుమలదాసు, ఎం రామారావు తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో ఇరువురు మహిళలు మృతి
దెందులూరు, నవంబర్ 3 : మండల కేంద్రమైన దెందులూరులోని ప్రభుత్వాసుపత్రి సమీపంలో బట్టలు ఆరేస్తున్న ఒక మహిళకు విద్యుత్ షాక్ తగలడంతో ఆ మహిళను రక్షించే ప్రయత్నంలో మరో మహిళ వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. గురువారం మధ్యాహ్నం ఆసుపత్రి సమీపంలో ఫాతిమా అనే మహిళ బట్టలు ఆరేస్తోంది. విద్యుత్ షాక్‌కు గురై అతుక్కుపోయింది. ఆమె ఇంటికి ఎదురుగా వున్న రాటాలు అనే మహిళ చూసి ఆమెను రక్షించేందుకు వెళ్లా లాగే ప్రయత్నం చేయగా ఆమె కూడా షాక్‌కు గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సంఘటనా ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు సకాలంలో ఇప్పిస్తానని హామీ ఇచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మావోయిస్టుల బంద్ ప్రభావం నిల్
జంగారెడ్డిగూడెం, నవంబర్ 3: ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ఇచ్చిన బంద్ పిలుపు ఏజన్సీ, మెట్ట ప్రాంతాలపై ఎటువంటి ప్రభావం చూపలేదు. బంద్ అనేది జరగలేదు. అయితే బంద్ పేరుతో ఏజన్సీలో నిత్యం నిడిచే ఆర్టీసీ బస్సులు రద్దు చేయడంతో ప్రజలు కొంత వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ నిర్ణయం వల్ల ప్రైవేటు వాహనాలకు గిరాకీ పెరిగింది. జంగారెడ్డిగూడెం డిపో నుండి ఏజన్సీకి నడిచే 11 బస్ సర్వీసులు రద్దు చేసినట్టు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. ఏజన్సీలోని దొరమామిడి, అంతర్వేదిగూడెం, టేకూరు, గోగుమిల్లి, వేలేరుపాడు, రెడ్డికుంకాల, పోలవరం బస్ సర్వీసులతో పాటు తెలంగాణలోని అశ్వారావుపేట, భద్రాచలం బస్ సర్వీసులు నిలిపివేసినట్టు డిఎం తెలిపారు. కాగా, జరగని బంద్‌కు బస్సులు నిలిపివేసిన ఆర్టీసీ, ముందుగా పిలుపునిచ్చి ఏపీకి ప్రత్యేక హోదా కావాలని బంద్ చేస్తుంటే పోలీసు రక్షణతో బలవంతంగా బస్సులు నిడిపిన వైనం ప్రతిపక్ష, వామపక్ష పార్టీల నేతలు గుర్తు చేస్తున్నారు.
అసంఘటిత కార్మికులు మృతి చెందితే
చంద్రన్న బీమా కాల్ సెంటర్‌కు వివరాలు అందజేయాలి
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, నవంబర్ 3 : జిల్లాలో అసంఘటిత కార్మికులకు యాక్సిడెంట్ మరణం లేదా సాధారణ మరణం సంభవించినప్పుడు సంబంధిత గ్రామ పంచాయితీ, వి ఆర్‌వో అధికారుల ద్వారా చంద్రన్న బీమా కాల్ సెంటర్‌కు తక్షణమే చనిపోయిన వారి పేరు, ఆధార్ నెంబరుతో పాటు ఊరు, పేరు వివరాలను అందజేయాలని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరు చాంబరులో నిర్వహించిన చంద్రన్న బీమా అమలుపై డి ఆర్‌డి ఏ, లేబరు, డ్వామా, మెప్మా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో దురదృష్టవశాత్తూ వాహన ప్రమాదం లేదా సాధారణ మరణం సంభవించినప్పుడు గ్రామంలో ఉన్న కాల్ సెంటరు నెంబరు 155214కు సంబంధిత గ్రామ వి ఆర్‌వో, పంచాయితీ కార్యదర్శి తప్పనిసరిగా చనిపోయిన వారి వివరాలు ఎస్ ఎం ఎస్ ద్వారా అందజేయాలని చెప్పారు. గ్రామ మహిళా సంఘ సమాఖ్య కాల్ సెంటర్ వివరాలను అదే రోజు ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ డేటాలో పొందుపరుస్తారని అనంతరం రిజిష్టరు చేస్తారని చెప్పారు. ఈ పాలసీలో యాక్సిడెంటల్‌గా మరణించిన వారి కుటుంబానికి అయిదు లక్షలు, సహజ మరణానికి 30 వేలు, కార్మికునికి ప్రమాదవశాత్తూ పూర్తి అంగవైకల్యం సంభవిస్తే 3.75 లక్షలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. మరణించిన వ్యక్తి పేరు కాల్ సెంటరులో రిజిష్టరు చేయించిన ఏడు రోజులలోపు పంచాయితీ లేదా మున్సిపల్ కార్యాలయం నుండి మరణ ధృవపత్రం, పోలీసు శాఖ నుండి యాక్సిడెంట్ ఎఫ్ ఐ ఆర్‌లను లేదా శవపంచనామా రిపోర్టును మెడికల్ డిపార్టుమెంట్ ద్వారా తీసుకుని ఆన్‌లైన్ ద్వారా సంబంధితాధికారులు కా సెంటర్‌కు పంపవలసి వుంటుందని చెప్పారు. జిల్లాలో ఇ- ఆఫీస్ ద్వారా రిజిష్టరు అయిన వెంటనే మరణించిన వ్యక్తి వివరాలను పంచాయితీ, మున్సిపాల్టీ, పోలీసు, మెడికల్, బీమా మిత్ర వారికి పంపించేందుకు సంబంధితాధికారులు డిజిటల్ సంతకంతో మరణించిన వ్యక్తి డెత్, ఎఫ్ ఐ ఆర్, పోస్టుమార్టింగ్, తదితర వివరాలను కాల్ సెంటర్‌కు పంపే విధంగా సాఫ్ట్‌వేర్ డేటాను తయారు చేయవలసిందిగా డి ఆర్ డి ఏ పిడి శ్రీనివాస్‌ను సంబంధితాధికారులను ఆదేశించారు. ఈ వివరాలు ద్వారా మరణించిన క్లెయిమ్ చెల్లించుటకు ఎల్ ఐసి, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌కు పంపి ఏడు రోజులలో డబ్బు చెల్లించే విధంగా చేపట్టాలని కలెక్టరు చెప్పారు.

మొత్తం ప్రక్రియ 15 రోజులలో పూర్తి చేసే దిశకు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు అసంఘటిత కార్మికులు 14 లక్షల మంది సభ్యత్వం పొందారని చెప్పారు. జిల్లాలోకాల్ సెంటర్‌లో 376 మంది చంద్రన్న బీమాలో క్లెయిమ్‌లు నమోదైనాయని దీనిలో 369 మంది అర్హత ఉన్నట్లు గుర్తించామని, 232 మంది క్లెయిమ్‌లు ఇన్సూరెన్స్‌కు పంపామని 144 క్లెయిమ్‌లకు పంపవలసి వుందని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో డి ఆర్‌డి ఏ పిడి కె శ్రీనివాసులు, మెప్మా పిడి, లేబర్ డిప్యూటీ కమిషనర్, డ్వామా ప్రతినిధి పి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి ఆధ్వర్యంలో 26న రైతు మహాసభ
జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాక

తాడేపల్లిగూడెం, నవంబర్ 3: బిజెపి ఆధ్వర్యంలో రైతు మహాసభను ఈనెల 26 శనివారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె హరిబాబు, రాష్ట్ర మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎంపి గోకరాజు గంగరాజు, పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు చేపట్టిన చర్యలు, రైతు సమస్యలు పరిష్కారంచేసి వారి ఆదాయాన్ని పెంపుదల చేసేందుకు చేపట్టిన చర్యలు అమలు చేస్తున్న పథకాలను రైతులకు తెలియజేసేందుకు ఈ మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల నుంచి లక్ష మంది రైతులు ఈ సభకు హాజరవుతారన్నారు. ఈ సభలో రైతాంగ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ధేందుకే నవోదయం
జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస చౌదరి
జంగారెడ్డిగూడెం, నవంబర్ 3: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో నవోదయం కార్యక్రమం చేపట్టిందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై శ్రీనివాస చౌదరి అన్నారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ శాఖ, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో గురువారం స్థానిక విద్యావికాస్ ఉన్నత పాఠశాల ఆవరణలో 1,350 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మానవత మండల శాఖ అధ్యక్షుడు చావా రమేష్‌బాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారా ప్రభావిత గ్రామాలు గుర్తించి, ఆ గ్రామాల్లో ప్రజల్లో చైతన్యం కలిగించడం, సేవా కార్యక్రమాలు చేపట్టడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. జిల్లాలో ఎక్సైజ్ డిప్యుటీ కమిషనర్ వైబి భాస్కరరావు సారధ్యంలో ఫిబ్రవరి నెలలో నవోదయం ప్రారంభించినట్టు చెప్పారు. రెవెన్యూ, పోలీసు, అటవీ, పంచాయతీరాజ్ శాఖల సహకారంతో నవోదయం అమలు చేస్తున్నట్టు చెప్పారు. తొలివిడతగా జంగారెడ్డిగూడెంలో దుప్పట్లు పంపిణీ ప్రారంభించినట్టు తెలిపారు. ఈ నెల 26న జిల్లా కలెక్టర్ కె భాస్కర్, ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్‌కుమార్ మీనా చేతుల మీదుగా పెద్ద ఎత్తున దుప్పట్ల పంపిణీ చేయనున్నట్టు వివరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఆర్డీవో ఎస్ లవన్న మాట్లాడుతూ వయో వృద్ధులను నిర్లక్ష్యం చేయవద్దని హితవు పలికారు. తల్లితండ్రులను ప్రేమించాలని, ప్రేమ ఒక్కటే గర్వంగా జీవించడానికి దైవమని చెప్పారు. ఈ సందర్భంగా మానవత సంస్థకు పది వేల రూపాయల ఆర్థిక సహాయం ఆర్డీవో అందజేశారు. సభలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావు మానవత సేవా కార్యక్రమాలకు స్పూర్తిపొంది సభలోనే సభ్యత్వం స్వీకరించారు. ఈ సభలో మానవత జిల్లా అధ్యక్షుడు పి రవివర్మ, జిల్లా కమిటీ సభ్యులు వాసిరెడ్డి చంటియ్య, ఎవి రమణమూర్తి, మానవత మండల కార్యదర్శి టివిబిఎఎస్‌ఆర్ గోపాలరావు, విద్యావికాస్ కరస్పాండెంట్ పి సతీష్‌చంద్, స్థానిక ఎక్సైజ్ సిఐ బి శ్రీనివాసరావు, పలువురు ఎక్సైజ్ అధికారులు, మానవత ప్రతినిధులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో
ఆన్‌లైన్ సేవలు: ఆర్డీవో తేజ్‌భరత్

తాడేపల్లిగూడెం, నవంబర్ 3: జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టీసీ ఎస్ కంపెనీ అందిస్తున్న వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ధాన్యం సేకరణ, రైతులకు ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లింపు జరుగుతుందని ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్ పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాలులో 16 మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎపిఎంలు, ఎఒలు, మహిళా సంఘాల ప్రతినిధులకు ఆన్‌లైన్ వివరాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ్‌భరత్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. సంచుల పంపిణీ, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సొమ్ము చెల్లింపుకూడా ఆన్‌లైన్‌లో జరుగుతుందన్నారు. రైతులు పండించిన పంటల వివరాలు, రెవిన్యూ రికార్డులు ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో వెలుగు ప్రాజెక్టు ద్వారా 161 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయిస్ డీ ఎం గణపతిరావు, వెలుగు ఏపీడీ రవీంద్రబాబు, ఏసీ అనిత, తహశిల్దారు పాశం నాగమణి, పెంటపాడు తహశిల్దారు ఎ.మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.