పశ్చిమగోదావరి

టిడిపికి డిసెంబర్ కాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 4: అధికార తెలుగుదేశం పార్టీకి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో చిక్కులు తప్పడం లేదు. డిశంబర్ మాసంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రెండవ దశ పాదయాత్రను పశ్చిమ గోదావరి జిల్లాలో చేయనున్నారు. అదే విధంగా ఇప్పటికే వాయిదాపడిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సభ ఈ నెలలో జరగనున్నట్లు సమాచారం. కాపు సామాజిక వర్గానికి చెందిన వీరి పర్యటనలు విజయవంతం చేసేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి నుండే పనులు ప్రారంభించారు. కాపులను బిసీల్లో చేర్చాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 16వ తేదీ నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి ప్రారంభిస్తామని చర్చలు జరిగినా..రావులపాలెం నుంచి ప్రారంభించాలని ముద్రగడ నిర్ణయించారు. దీంతో రావులపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర అంతర్వేదిలో ముగుస్తుంది. సుమారు 200 కిలో మీటర్లు మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. ఆయన పాదయాత్ర ముగిసిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగనుంది. కాగా ఇంకా రూట్ మ్యాప్ ఖరారుకావాల్సివుంది. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో ప్రకటించినట్లు ప్రతీ జిల్లాలోను ప్రత్యేక హోదాపై సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తొలి సభ పశ్చిమ గోదావరి జిల్లాలో జరగాల్సివుండగా, అప్పట్లో సినీ హీరో ప్రభాస్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సభను తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటుచేశారు. రెండోవ సభ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటుచెయ్యాల్సివుండగా, తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు వల్ల ఆయన సభను వాయిదా వేశారు. ఇక్కడ కులాల పోరు జరుగుతుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభను ఏర్పాటుచేస్తే దాని ప్రభావం గ్రామాల్లో ఎక్కువగా ఉంటుందని వాయిదా వేసుకున్నారు. ఇక ఈ నెలలో అనంతపురం సభ ముగిసిన తర్వాత మూడవ సభను జిల్లాలో ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే ఆయన తన ఓటును పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నమోదు చేసుకోనున్నట్లు ప్రకటించారు. అక్కడే కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఆలోపే ఈ పనులు పూర్తిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అటు ముద్రగడ పద్మనాభం..ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. జిల్లాలో కాపు సామాజిక వర్గీయుల బలం అధికమే. వంగవీటి మోహన్ రంగా, ముద్రగడ , పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ‘పి’ బ్రదర్స్ పర్యటనలను విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు.