పశ్చిమగోదావరి

డ్వాక్రా మహిళలకు రెండో విడత రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 5: జిల్లాలో రెండవ విడత రుణమాఫీ కింద డ్వాక్రా మహిళలకు 181.54 కోట్ల రూపాయలు ఈనెల 10వ తేదీ నుండి మహిళా గ్రూపుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం డి ఆర్‌డి ఏ, వెలుగు పధకాల ప్రగతి తీరు, ధాన్యం కొనుగోలు, చంద్రన్న బీమా పధకం తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామన్న ఎన్నికల హామీలో భాగంగా తొలి విడతగా జిల్లాలో 6 లక్షల 5 వేల 117 మంది డ్వాక్రా మహిళలకు 181.54 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగిందని రెండవ విడత బ్యాంకుల్లో జమ చేసే ఈ సొమ్ము నేరుగా మహిళా గ్రూపులు వినియోగించుకునే వెసులుబాటును కల్పించినట్లు చెప్పారు. జిల్లాలో 2016-17 ఆర్ధిక సంవత్సరంలో 1270 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించాలని లక్ష్యంగా నిర్ణయించామని ఇప్పటి వరకు 400 కోట్ల రూపాయల రుణాలు మహిళలకు అందించగా మార్చి లోగా 870 కోట్ల రూపాయల రుణాలు అందించడానికి ప్రతీ మండలంలో ప్రత్యేక డ్వాక్రా రుణమేళా కార్యక్రమాన్ని అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో డ్వాక్రా మహిళల ఆర్ధిక పురోభివృద్ధి కోసం చిన్న తరహా యూనిట్ల స్థాపన వైపు దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యంగా మండల స్థాయిలో స్థానిక వనరుల ఆధారంగా చిన్న తరహా పరిశ్రమలను డ్వాక్రా మహిళలే చేపట్టేలా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని దీని వలన ఆయా ప్రాంతాలలో డ్వాక్రా మహిళలకు ఉపాధితోపాటు పరిశ్రమల వలన ఆయా గ్రామాలు కూడా అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. జిల్లాలో ప్రతీ పేద కుటుంబం నెలకు పది వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయలు సంపాదించుకునే విధంగా వివిధ వృత్తుల్లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుండి పెద్ద ఎత్తున వృత్తి శిక్షణ ఇచ్చి రెండు లక్షల మందికి ఉపాధి సౌకర్యాలు కలిగేలా పటిష్టమైన ఒక ప్రణాళికను అమలు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాలో 1860 పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని డ్వాక్రా మహిళలకు అప్పగించామని, దీని వలన మహిళలు ఉపాధి పొందగలుగుతున్నారని నిరుద్యోగ సమస్య నిర్మూలించడానికి ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పలు పరిశ్రమలు త్వరలోనే స్థాపన జరుగుతుందని 2019 నాటికల్లా జిల్లాలో లక్ష కోట్ల పెట్టుబడితో పలు భారీ మధ్య తరహా పరిశ్రమలను స్థాపించడానికి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించనున్నట్లు మంత్రి చెప్పారు. జిల్లాలో ప్రతీ ఏటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి 174 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్నామని దీని వలన గత ఏడాది 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మహిళలు కొనుగోలు చేసి 41 కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో ఆర్జించారని చెప్పారు. జిల్లాలో పెద్ద ఎత్తున కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించి మాంసం ఉత్పత్తులను పెంచడానికి ఒక ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతీ నెలా 3 లక్షల 38 వేల మంది పేదలకు 37 కోట్ల రూపాయలు పెన్షన్లు రూపంలో అందిస్తున్నామని, ఏడాదికి 442 కోట్లు కేవలం వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతుల కోసం పెన్షన్ల రూపంలో అందిస్తున్న ఘనత దేశ చరిత్రలో మరో రాష్ట్రం లేదని చెప్పారు. వివిధ రంగాలో పనిచేసే కార్మికులకు భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో చంద్రన్న బీమా పధకాన్ని ప్రవేశపెట్టామని, కార్మికుడు పదిహేను రూపాయలు చెల్లిస్తే 134 రూపాయలు ప్రభుత్వం బీమా కంపెనీకి చెల్లించి ప్రమాద వశాత్తూ కార్మికుడు మరణించినా పూర్తి అంగవైకల్యానికి గురైనా పదిహేను రోజుల్లో అయిదు లక్షల రూపాయలు పరిహారం అందేలా తగు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పిడి కె శ్రీనివాసులు, ఎపిడి పూర్ణచంద్రరావు, ఎపి ఎం ఝాన్సీ, భానుమతి తదితరులు పాల్గొన్నారు.

అధికారుల అలసత్వంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు
ఏలూరు ఎంపి మాగంటి బాబు
పోలవరం, నవంబర్ 5: ప్రభుత్వ అధికారుల అలసత్వం కారణంగా ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఏలూరు ఎంపి మాగంటి బాబు అన్నారు. పోలవరం మండలం ఎల్‌ఎన్‌డి పేట గ్రామంలో మంత్రి కామినేని కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముందుగా వచ్చిన ఎంపి మాగంటి ప్రజలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎల్‌ఎన్‌డి పేటలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని ప్రజా ప్రతినిధులను, అధికారులను అడిగితే వారి వద్ద ఏ వివరాలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపికి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సమస్యలు ఏకరవు పెట్టారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ ప్రభుత్వాధికారులకు కరెన్సీ నోటు ఇస్తేనే పనులు అవుతున్నాయన్నారు. ప్రభుత్వం ఎంతో చేస్తున్నా అధికారుల వల్ల చెడ్డ పేరు వస్తోందని, ప్రజా ప్రతినిధులమైన తాము ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఎంత చేసినా తక్కువేనని, వారికి న్యాయం చేయాలని అధికారులను కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదని, వ్యవస్థలో మార్పు తీసుకురాకపోతే అధికారుల వల్ల ప్రజలు కష్టాలు పడాల్సి వస్తుందని ఎంపి మాగంటి బాబు అన్నారు.