పశ్చిమగోదావరి

ఎపికి హోదా తెచ్చేది, ఇచ్చేది మేమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 13 : ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేసి కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపిలు అధికారంలోకి వచ్చాయని, ఎపికి ప్రత్యేక హోదా తెచ్చేది, ఇచ్చేది మేమేనంటూ కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విజభన తరుణంలో విభజన తీర్మానం తలుపులు వేసి ప్రజా స్వామ్యానికి విరుద్ధంగా నిర్వహించారంటూ దుష్ప్రచారం చేశారని, అది అవాస్తవమని అన్నారు. పార్లమెంటు నియమ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ద్రోహం చేసింది బిజెపి, టిడిపీలేనని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేకపోయాయని, ప్రజలను నయవంచనకు గురిచేశారన్నారు. రైతు రుణాలన్నింటినీ భేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తామని, డ్వాక్రా గ్రూపులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని, తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను కూడా విడిపిస్తామని చెప్పి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. విభజన తరుణంలో రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు అయిదు సంవత్సరాలు ఇస్తామని నాడు ప్రకటిస్తే కాదు పది సంవత్సరాలు ఇవ్వాలంటూ కేంద్ర మంతి వెంకయ్యనాయుడు వాదించారని అన్నారు. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా తిరుపతిలో శ్రీనివాసుని సన్నిధిలోనే నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదాను విస్మరించి ప్రత్యేక ప్యాకేజీ అంటూ కాలం గడుపుతున్నారని, పైగా కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని, ఆర్ధిక సంఘం ఒప్పుకోవడం లేదని వంకలు చెబుతున్నారన్నారు. ఎన్నికల హామీలు ఇచ్చే తరుణంలో ఆ విషయం వారికి తెలియదా అంటూ బిజెపిపై దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా వల్లే అనేక ప్రయోజనాలున్నాయని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలించాల్సింది ప్రభుత్వాలేనన్నారు. హోదా కావాలా? వద్దా? అనే విషయంపైనే ప్రజాబ్యాలెట్‌ను కూడా నిర్వహించామని, 98 శాతం మంది ప్రజలు ప్రత్యేక హోదాయే కావాలని తెలియజేశారన్నారు. ఈ నెల 19వ తేదీన ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలను కర్నూలు నగరంలో నిర్వహిస్తున్నామని, రైతు సదస్సును కూడా ఏర్పాటు చేశామని, అనంతరం ప్రతీ జిల్లాలో కూడా రైతు సదస్సులు నిర్వహిస్తామని, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలోపేతం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం సరైనదే అయినప్పటికీ విధానం సరైంది కాదని, ఈ ప్రక్రియ వల్ల క్రిందితరగతి, మధ్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పెడుతున్నారని, అవస్థలకు గురవుతున్నారని చెప్పారు. స్వామినాధన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు మద్దతు ధర చెల్లిస్తామని, 500 కోట్లతో మార్కెట్ ఇంటర్ పెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తామని బిజెపి హామీ ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. మద్యం షాపులు రద్దు చేయకుండా ఉత్పత్తిని కూడా పెంచారన్నారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్ధులకు ఉచితంగా సైకిళ్లు ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వలేదని, కళాశాల విద్యార్ధులకు ట్యాబ్‌లు ఇస్తామని, నిరుద్యోగులకు నెలకు 2000 రూపాయలు చొప్పున భృతి ఇస్తామని, జాబు రావాలంటే బాబు రావాలంటూ ప్రచారాలు చేసుకుని ప్రచారాలకే పరిమితమైందన్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని, సమయం, సందర్భం వచ్చినప్పుడు వారే హామీలను విస్మరించిన బిజెపి, టిడిపి ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు ఎండి రఫీయుల్లా భేగ్, రాజనాల రామ్మోహనరావు, డాక్టర్ ఎవి ఎస్ పద్మరాజు, చిట్టిబొమ్మ వెంకటస్వామి, కారే బాబూరావు, రాఘవయ్య చౌదరి, పాకలపాటి సుభద్రాదేవి, నరహరిశెట్టి నరసింహారావు, గాడి సరోజిని దేవి, దారం బాబూరావు తదితరులు వున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో భవిష్యత్తు కార్యాచరణపై, కర్నూలులో జరిగే సదస్సు విజయవంతానికి తగు సలహాలు, సూచనలు ఇచ్చారు.
ఏజన్సీ పోలీస్ సబ్ డివిజన్‌గా పోలవరం
జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్‌లో ఉండేది మైదాన మండలాలే!
జంగారెడ్డిగూడెం, నవంబర్ 13: విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులతో కలిపి జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాలను కలుపుతూ పోలవరం కేంద్రంగా ఒక పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేశారు. పోలవరంలో సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయ నిర్మాణం చేపట్టగా, డిఎస్పీగా రవికుమార్‌ను నియమించారు. ఈ పోలీస్ సబ్ డివిజన్‌లో కుక్కునూరు, పోలవరం సర్కిల్స్ ఉంటాయి. పోలవరం సర్కిల్‌లో ఇప్పటి వరకు ఉన్న కొయ్యలగూడెం, గోపాలపురం పోలీస్ స్టేషన్లను తప్పించి, కొత్తగా బుట్టాయగూడెం, జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లు చేర్చారు. విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను కలిపి కుక్కునూరులో మరో సర్కిల్ ఏర్పాటు చేసి, ఈ రెండు సర్కిల్స్‌తో పోలవరం పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేసారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండటం, పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తవడంతో వాటి భద్రత దృష్ట్యా, ఏజన్సీలో భూసేకరణ, భూమికి భూమి అప్పగింత, నిర్వాసితులకు పునరావాసం వంటి కార్యకలాపాలు జరుగుతుండటంతో దూరాభారమైనప్పటికీ పోలవరం కేంద్రంగా పోలీస్ శాఖ సబ్ డివిజన్ ఏర్పాటు చేసినట్టు స్థానిక డిఎస్పీ జె వెంకటరావు తెలిపారు. కాగా, జంగారెడ్డిగూడెం సర్కిల్‌లో ఉన్న బుట్టాయగూడెం, జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లను పోలవరం సర్కిల్‌లో కలపడంతో ఇప్పటివరకు పోలవరం సర్కిల్‌లో ఉన్న కొయ్యలగూడెం, గోపాలపురం స్టేషన్లను జంగారెడ్డిగూడెం సర్కిల్‌లో కలిపారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి సర్కిల్స్‌తో జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్ కొనసాగుతుందని డిఎస్పీ వెంకటరావు స్పష్టం చేశారు.
మావుళ్లమ్మను దర్శించుకున్న మంత్రి అయ్యన్నపాత్రుడు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, నవంబర్ 13: భీమవరం ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదివారం నాడు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయ అర్చకులు అమ్మవారికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పాలకవర్గ సభ్యులు మంత్రిని సత్కరించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు మంత్రికి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు
ఆర్టీసీ బస్టాండ్లలో చోరీ కేసులో మైనర్ బాలిక అరెస్టు
30 కాసుల బంగారం స్వాధీనం: డిఎస్పీ వెంకటరావు
జంగారెడ్డిగూడెం, నవంబర్ 13: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో చోరీలకు పాల్పడిన మైనర్ బాలికను అరెస్టుచేసి, ఆ బాలిక వద్ద ఏడు లక్షల రూపాయల విలువైన 30 కాసుల(240 గ్రాములు) బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు స్థానిక డిఎస్పీ జె.వెంకటరావు తెలిపారు. ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో గత కొంత కాలంగా ఆర్టీసీ బస్టాండులో పర్సులు, బ్యాగుల దొంగతనాలు జరుగుతుండటంతో స్థానిక సిఐ జి శ్రీనివాస్, ఎస్సై ఎం కేశవరావు నిఘా ఉంచగా, ఆదివారం మునసబుగారి వీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 15 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక బాలికను క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్స్ ఎన్‌వి సంపత్‌కుమార్, ఎన్ రాజేంద్రప్రసాద్, కానిస్టేబుల్స్ రాజశేఖర్, కిరణ్‌కుమార్, సునీత సహకారంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట బిసి కాలనీకి చెందిన ఈ బాలిక అక్కడే సంతల్లో చిల్లర పర్సులు చోరీ చేసేదని చెప్పారు. ఈమెపై గతంలో ఏలూరు పోలీసులు పర్సు దొంగతనం కేసులో అరెస్టు చేయగా, జువైనల్ హోమ్‌కు పంపించారని, బయటకు వచ్చిన తరువాత గత ఏడాది చివరిలో జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న మహిళల బ్యాగ్‌ల నుండి బంగారంతో ఉన్న పర్సులు చోరీ చేసిందని తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ నెల ఒకటో తేదీన భద్రాచలం బస్సు ఎక్కుతున్న ఒక ముస్లీం మహిళ బ్యాగ్ నుండి బంగారం, నగదు ఉన్న పర్స్ దొంగిలించినట్టు చెప్పారు. తరువాత 15 రోజులకు పిల్లలతో ఉన్న ఒక మహిళ కర్రల సంచిలోనుండి నగదు, బంగారంతో కూడిన చిన్న పర్సు దొంగిలించినట్టు తెలిపారు. దొంగిలించిన పర్సుల్లో నగదు ఖర్చులకు వాడేసుకుందని, దొంగిలించిన బంగారాన్ని అమ్మడానికి జంగారెడ్డిగూడెం రావడంతో ఆదివారం సిఐ జి శ్రీనివాస్ అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఆమె వద్ద జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో నమోదైన మూడు కేసుల్లో చోరీ సొత్తు 30 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ చోరీ సొత్తు జంగారెడ్డిగూడెంనకు చెందిన షేక్ సమీలా సుల్తానా, నల్లజర్ల మండలం పోతవరంనకు చెందిన నున్న లక్ష్మీకుమారి, ఖమ్మం జిల్లా దమ్మపేటకు చెందిన తెల్లమేకల లక్ష్మిలకు చెందినదని డిఎస్పీ వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా దొంగతనాలకు పాల్పడుతున్న ఈ మైనర్ బాలికను అరెస్టు చేసి, చోరీ సొత్తు రికవరీ చేసిన సిఐ జి శ్రీనివాస్, ఎస్‌ఐ ఎం కేశవరావు, క్రైంపార్టీ పోలీసులను డిఎస్పీ అభినందించారు. వీరికి రివార్డుల కోసం సిఫార్సు చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ జి శ్రీనివాస్, ఎస్సై ఎం కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
నిర్వాసితులకు అండగా నిలుస్తాం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
పోలవరం, నవంబర్ 13: పోలవరం ప్రాజెక్టులో ముంపుగ్రామాల నిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ వారికి అండగా ఉంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఆదివారం పోలవరంలోని పెంటపాటి పుల్లారావు నివాసం వద్ద ఉభయ గోదావరి జిల్లాల నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న గిరిజనులు, గిరిజనేతరులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిర్వాసితులకు చట్టం అనుకూలంగా ఉన్నప్పటికీ పూర్తి నష్టపరిహారం అందకపోవడం శోచనీయమన్నారు. వీరికి అన్యాయం చేసి అన్ని ప్రాంతాల వారికీ న్యాయం చేస్తామనడం సరికాదన్నారు. బహుళార్థక సాధక ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణంతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం ఉందని, లక్షలాది ఎకరాలకు సాగునీరు, విశాఖ పారిశ్రామిక అవసరాలు తీరడానికి ఉపయోగపడుతుందన్నారు. 960 మెగావాట్ల విద్యుత్తు వినియోగంలోకి వస్తుందన్నారు. 11 జిల్లాల ప్రజలకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టు ఉభయగోదావరి జిల్లాలలో ఉన్న నిర్వాసితులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు ఇస్తున్నప్పుడు నిర్వాసితులకు న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరమేమిటని ప్రశ్నించారు. ఈ నెల 26న టిడిపితో సహా అన్ని పార్టీల వారితో ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై రౌండు టేబుల్ సమావేశం నిర్వహించి, చర్చిస్తామన్నారు. అలాగే సిఎంను కలిసినప్పుడు నిర్వాసితుల సమస్యలు మొదటి ప్రాధాన్యత అంశంగా ఆయనకు వివరిస్తామని నిర్వాసితులకు హామీ ఇచ్చారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ ముందుగా ఖాళీ చేసిన పది గ్రామాల నిర్వాసితులకు ప్యాకేజీ సక్రమంగా అమలు చేయలేదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 2.5 లక్షల కుటుంబాల వారు నిర్వాసితులుగా మారుతున్నారన్నారు. ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు నిర్వాసితులు అధికారులు చేసిన మోసాలకు తామేవిధంగా ఇబ్బందులు పడుతున్నారో వివరించారు. ఈయన వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి మధు, దుర్గాప్రసాద్, శేఖర్ తదితర్లు ఉన్నారు.