పశ్చిమగోదావరి

చుక్కలు చూపిస్తున్న డిసిసిబి...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, నవంబర్ 14: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు మండలంలోని ప్రజలకు ప్రాణసంకటంగా తయారయ్యింది. వీరవాసరంలో ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్, ఇండియన్ బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసిబి) శాఖలున్నాయి. గ్రామీణ ప్రాంతం కావడంతో రైతులు ఎక్కువగా డిసిసిబిపై ఆధారపడుతుంటారు. రూ.1000, రూ.500 నోట్ల రద్దు ప్రకటనతో ఖాతాదార్లంతా గత కొద్ది రోజులుగా తమ వద్ద ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేయడానికి బ్యాంకు శాఖల ముందు బారులుతీరుతున్నారు. అయితే మిగిలిన అన్ని బ్యాంకులకు భిన్నంగా డిసిసిబిలో మాత్రం డిపాజిట్లు స్వీకరిస్తున్నా, చెల్లింపులు మాత్రం జరగడంలేదు. దీనితో హడావుడిగా తమవద్ద ఉన్న పాత నోట్లు డిసిసిబిలో డిపాజిట్ చేసిన ఖాతాదార్లు లబోదిబోమంటున్నారు. నోట్ల రద్దు జరిగి ఆరు రోజులు కావస్తున్నా డిసిసిబిలో ఆదివారం సాయంత్రం వరకు ఎటువంటి చెల్లింపులు చేయలేదు. ఆ తర్వాత కేవలం రూ.3 లక్షల కొత్త కరెన్సీ రావడంతో అదే ఖాతాదార్లకు చెల్లించారు.
వీరవాసరం ఎస్‌బిఐ శాఖలో మాత్రమే పాత నోట్ల స్వీకరణతోపాటు, రూ.10వేల వరకు విత్‌డ్రా సౌకర్యం కల్పిస్తున్నారు. ఎస్‌బిహెచ్, ఇండియన్ బ్యాంకు శాఖల్లో నగదు వచ్చినపుడు మాత్రమే ఖాతాదార్లకు చెల్లిస్తున్నారు. ఈ బ్యాంకుల్లో రోజుకు 2-3 గంటలు మాత్రమే నగదు పంపిణీ జరుగుతోంది.
అయితే డిసిసిబిలో మాత్రం పంపిణీ లేక ఖాతాదార్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డిసిసిబిలో మాత్రం ఆదివారం సాయంత్రం వరకు నగదు పంపిణీ జరగలేదు. కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నా డిసిసిబికి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేవలం రూ.3 లక్షలు మాత్రమే కేటాయించారు. ఖాతాదార్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.2000 వంతున మాత్రమే చెల్లిస్తున్నామని బ్రాంచి మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం మధ్యాహ్నానానికి నగదు నిండుకోవడంతో ఆ చెల్లింపులూ నిలిచిపోయాయి. దీనితో నగదు కోసం బారులుతీరిన ఖాతాదార్లు నిరాశగా వెనుదిరిగారు. ఇచ్చే రూ.2000 నగదు కూడా కొత్త రూ.2000 నోటు కావడంతో దాన్ని మార్చుకోవడానికి చిల్లర లేక ఖాతాదార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికార్లు స్పందించి, తమకు కూడా నిబంధనల మేరకు గరిష్ఠంగా నగదు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఖాతాదార్లు కోరుతున్నారు.