పశ్చిమగోదావరి

అర్ధాంతర బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 14: అంతా నిక్కచ్చే...రూల్స్ మీరేది లేదంటున్న యంత్రాంగంలో అర్ధాంతరంగా జరిగిన బదిలీలు పలు సందేహాలకు తావిస్తున్నాయి. దీనిలోనే ఒత్తిళ్లకు యంత్రాంగం తలొగ్గిందన్న విమర్శలు కూడా విన్పిస్తున్నాయి. మొత్తంమీద అటుఇటు కాని సమయంలో జిల్లాలో ఆరుగురు తహసిల్దార్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈవిధంగా జిల్లాలో పనిచేస్తున్న ఒక తహసిల్దార్‌ను మాతృశాఖకు పంపగా మరొకరు హైదరాబాద్ నుంచి జిల్లాకు కేటాయించటంతో ఆమెకు పోస్టింగ్ ఇవ్వటంతోపాటు మరో నలుగుర్ని బదిలీ చేశారు. దీనిలో జీలుగుమిల్లి తహసిల్దార్ ద్రోణంరాజు వెంకట సుబ్బారావును కుకునూరు సబ్‌కలెక్టరు ఆఫీసు ఎఓగా బదిలీ చేశారు. ఆయన స్ధానంలో ప్రస్తుతం శెలవులో ఉన్న ఎం రాజశేఖరరావును నియమించారు. పోడూరు తహసిల్దార్ వి స్వామినాయుడును యలమంచిలి తహసిల్దార్‌గా నియమించారు. అక్కడ ఉన్న సి గురుప్రసాదరావును ఆయన మాతృశాఖ అయిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సుకు పంపించివేశారు. ప్రస్తుతం శెలవులో ఉన్న చవ్వాకుల ప్రసాద్‌ను భీమవరం తహసిల్దార్‌గా నియమించారు. హైకోర్టులో లైజినింగ్ ఆఫీసర్‌గా పనిచేసి ప్రస్తుతం కొవ్వూరులో కెఆర్‌సి తహసిల్దార్‌గా పనిచేస్తున్న కె శ్రీరమణిని పోడూరు తహసిల్దార్‌గా నియమించారు. ఇక బదిలీలో అయిన తహసిల్దార్లలో కొంతమంది రాజకీయంగా పెద్దస్దాయిలో ఒత్తిళ్లు చేసి తమ పంతం నెగ్గించుకున్నట్లు కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత బదిలీలలో భాగంగా రాజశేఖర్‌ను పెనుగొండ తహసిల్దార్‌గా నియమించారు. అయన బాధ్యతలు స్వీకరించారు. ఈలోగా కుకునూరు సబ్‌కలెక్టరు కార్యాలయ ఎఓగా బదిలీ అయి బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ పెద్దస్దాయిలో వత్తిడి తీసుకురావటంతో కొద్దిరోజులకే పెనుగొండ తహసిల్దార్‌గా శ్రీనివాస్‌ను నియమించారని, ఆయన స్దానంలో సబ్‌కలెక్టరు ఆఫీసు ఎఓగా రాజశేఖర్‌ను బదిలీ చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో రాజశేఖర్ కొత్త స్ధానంలో చేరకుండా శెలవులో వెళ్లారు. ఇప్పుడు ఆయనను జీలుగుమిల్లి తహసిల్దార్‌గా నియమించారు. ఇక గతంలో డెల్టా ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో తహసిల్దార్‌గా పనిచేసిన చవ్వాకుల ప్రసాద్ గత బదిలీల్లో భాగంగా ఏలూరు తహసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే చేరిన కొద్దినెలలకే ఆయన శెలవుపై వెళ్లిపోవటంతో ఇక్కడ ఇన్‌ఛార్జిని నియమించారు. తొలినుంచి తనకు భీమవరం తహసిల్దార్ పోస్టు కావాలని పట్టుపట్టడంతో గత ఆగస్టు నెలలో ఖాళీ అయిన పోస్టును నేటివరకు భర్తీ చేయకుండా ఆపివేశారని, ఇప్పుడు ఆయనకే ఆ పోస్టును కేటాయించారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక రాష్ట్రంలో కీలక మంత్రి పదవిలో ఉన్న ఒక ప్రజాప్రతినిధికి బంధువైన ఒక తహసిల్దార్ విషయంలో కూడా జిల్లా యంత్రాంగం తొలినుంచి మెతకవైఖరితో కొనసాగుతోందని, తాజా బదిలీల్లోనూ అదే పరిస్దితి కన్పించిందన్న విమర్శలున్నాయి. ఆయన పనిచేస్తున్న మండలానికి పక్క మండలానికే బదిలీ చేసి తమ స్వామిభక్తిని నిరూపించుకున్నారని కలెక్టరేట్ వర్గాలు గుసగుసలు అడుతున్నాయి. వచ్చే సంవత్సరం ఉద్యోగ విరమణ చేయనున్న ఒక తహసిల్దార్‌ను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారని అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాజకీయ సిఫార్సులు లేనందునే ఈవిషయంలో మాత్రం పోస్టులో ఉన్న వ్యక్తి ఇష్టానికి భిన్నంగా ఉత్తర్వులు వెలువడ్డాయని చెపుతున్నారు. మొత్తంమీద అర్ధాంతరంగా జరిగిన ఈ బదిలీలపై పలు సందేహాలు, అంతకుమించిన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.