పశ్చిమగోదావరి

మార్కెట్‌కు చిల్లర దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 15: పెద్దనోట్ల రద్దు నిర్ణయం నల్లకుబేరులపై ఏవిధమైన ప్రభావం చూపుతోందన్న ఆంచనా పైకి తేలకపోయినా ఆ ప్రభావం మాత్రం మార్కెట్‌పై దారుణంగా కన్పిస్తోంది. చిల్లర దెబ్బకు ఏకంగా దుకాణాలే మూతపడే పరిస్దితి నెలకొంది. ఈ నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత ఒకటి,రెండురోజులు ఉన్న చిల్లర నోట్లతో వ్యాపారాలు చేసిన వారంతా ఆతర్వాత దాదాపుగా చేతులెత్తేశారు. వినియోగదారులను కాదనలేక, పెద్దఖాతాలను వదులుకోలేక ఎలాగోలా వ్యాపారాలు చేసిన వారంతా చివరకు చిన్ననోట్లు అనుకున్న స్ధాయిలో అందుబాటులోకి రాకపోవటంతో ప్రతిఒక్కరూ పెద్దనోట్లే ఇస్తుండటంతో ఇలా అయితే వ్యాపారం చేయలేమంటూ దుకాణాలను మూసుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులోనే కాకుండా జిల్లావ్యాప్తంగా చిన్నచిన్న పచారీ దుకాణాలు, కర్రీ పాయింట్లు, సెల్‌పాయింట్లు ఇలా అవిఇవీ అనికాకుండా అన్నిరకాలుగా చిన్ననోట్లతో ఎక్కువగా వ్యాపారం చేసే దుకాణాలు దాదాపుగా మూతపడుతున్నాయి. మరికొన్నిచోట్ల మీసేవా కేంద్రాలు కూడా మూతపడుతున్నాయి. అధికశాతం మంది కరెంటు బిల్లులు, ఆస్తిపన్నులు, ఇతరత్రా ప్రభుత్వ బిల్లుల చెల్లింపు నిమిత్తం పెద్దనోట్లు చలామణి అవుతాయని చెప్పటంతో ప్రైవేటుగా ఇలాంటి కేంద్రాలు పెట్టుకున్న వారంతా వీటిని మూసివేస్తున్నారు. ప్రతిఒక్కరి వద్ద నుంచి పెద్దనోట్లు తీసుకుంటే ఆతర్వాత ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకోలేక, బ్యాంకుల్లో పరిస్దితులు చక్కబడకపోవటంతో చివరకు దుకాణాల మూతే శరణ్యమన్న భావనకు వచ్చేశారు. అయితే ఇక్కడితో ఈప్రభావం ఆగిపోలేదు. చుట్టల కంపెనీల నుంచి ఎక్కువగా కార్మికులతో పనులు చేయించుకునే చిన్నతరహా వ్యాపారాలు, మిల్లులు వంటివాటిపై కూడా గట్టిగానే ఈప్రభావం కన్పిస్తోంది. పెద్దనోట్లు ఇవ్వలేక, బ్యాంకుల నుంచి చిన్ననోట్లు అందుబాటులోకి రాక ప్రతివారం ఇచ్చే చెల్లింపులను ఈసంస్ధలన్నీ నిలిపివేశాయి. ఫలితంగా నగదు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియక కార్మికులు కూడా రోజువారీ పనుల్లోకి వెళ్లడం తగ్గించేశారు. ఇలా మరో రెండు,మూడు రోజులు సాగితే ఈసంస్ధలు కూడా తాత్కాలికంగా మూతపడే పరిస్దితి లేకపోలేదని చెపుతున్నారు. క్రమంగా చిల్లర ప్రభావం చిన్న దుకాణాల నుంచి పెద్ద సంస్ధల వరకు విస్తరిస్తే ఆతర్వాత పరిస్ధితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన అన్నిచోట్లా వ్యక్తమవుతోంది.
తాజాగా చూస్తే ఏలూరులో జూట్‌మిల్లులో కార్మికులకు చెల్లింపులు నిలిచిపోవటంతో కార్మికసంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈవిధంగానే చుట్టల కార్మికుల సంఘాలు, భవన నిర్మాణకార్మిక సంఘాలతో పాటు మిగిలిన సంఘాలు కూడా ఈ ఆందోళన జాబితాలోకి చేరిపోతున్నాయి. మొత్తంమీద రానున్న రోజుల్లో మార్కెట్ సంక్షోభం పెద్దఎత్తున నెలకొనే పరిస్థితి కన్పిస్తోందని సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఈపరిణామాలతో జనంలో కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతుండగా మరోవైపు రవాణా రంగంపై కూడా చిల్లర ప్రభావం గణనీయంగా ఉందని తెలుస్తోంది. కొన్ని సంస్ధలు తమ వాహనాలను నిలిపివేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. రవాణా విషయంలోనూ ఈప్రతిష్ఠంభన కొనసాగితే కూరగాయల నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు దారుణంగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఉల్లి ధరలపై ఈప్రభావం కన్పిస్తోంది. మరోవిధంగా చూస్తే సంక్షోభం ఉన్న పరిస్థితుల వల్ల వచ్చిందా, లేక కృత్రిమ కొరత ద్వారా ధరలు పెరుగుతున్నాయా అన్న అంచనాలు ఎలా ఉన్నా మార్కెట్‌లో మాత్రం ధరలు మరింతగా పెరుగుతాయన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది.
ఈనేపధ్యంలో ఏలూరు వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం నుంచి నాలుగు రోజులపాటు సెలవు ప్రకటించారు. దీనికి ఆన్‌సీజన్ కావటమే కారణమని యార్డు వర్గాలు చెపుతున్నా ఇంతకుముందు ఎప్పుడూ ఇలా ఆన్‌సీజన్‌లో సెలవులు ప్రకటించి యార్డును మూసివేసిన పరిస్దితి లేదని కార్మికసంఘాలు పేర్కొంటున్నాయి. చిన్ననోట్ల చెలామణి లేకపోవటం, పెద్ద నోట్లను తీసుకునే పరిస్ధితి లేకపోవటం వల్లే చివరకు యార్డుకు సెలవు ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదీఏమైనా నిర్ణయంలో ఎంత మంచి ఉన్నా దాన్ని అమలుచేసే తీరు మాత్రం దారుణంగా ఉందని సామాన్య ప్రజానీకం ధ్వజమెత్తుతున్నారు. రోజువారీ ఖర్చులకు కూడా బ్యాంకుల వద్ద గంటలతరబడి నిలబడాల్సి వస్తోందని, ఇప్పుడున్న పరిణామాలు చూస్తుంటే ధరలు పెరిగి, దుకాణాలు మూతపడి, ఆదాయం లేకపోతే వచ్చే రెండు, మూడు వారాలు ఎలా గడుస్తాయోనన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.