పశ్చిమగోదావరి

తుప్పు పట్టిన తుపాకులతో యుద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 19: తుప్పుపట్టిన తుపాకులిచ్చి యుద్ధంలో గెలవమంటే ఎలా?... ఆ తుపాకులతో కాల్చితే ఆ బుల్లెట్‌లు తిరిగి మనకే తగులుతాయని, రెండున్నర ఏళ్ల నుండి డెల్టా ఆధునీకరణ పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇంజనీరింగ్ వ్యవస్ధ కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తుంటే ఇక యుద్ధంలో ఎలా గెలుస్తామని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అధికారులను ప్రశ్నించారు. స్ధానిక కలెక్టరేట్‌లో శనివారం సేద్యపునీటి ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్షించారు. డెల్టా ఆధునీకరణకు సంబంధించి 47పనులు చేయకుండా రెండున్నర ఏళ్ల నుండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరో 15రోజుల్లో పంటకాల్వలు మూసివేస్తున్న తరుణంలో ఇంకా ఆపనులకు టెండర్లు పిలవకుండా కొత్త ఏజన్సీలను సమాయత్తం చేయకపోతే ఈసీజన్‌లో కూడా పనులు జరగకపోతే సీట్లో కూర్చొవడం దండుగేనని పేర్కొన్నారు. రెండున్నర ఏళ్లుగా పనులు చేయని కాంట్రాక్టర్లకే ఈ పనులు అప్పగిస్తే ఎలా అని, డబ్బులు లేక గత సీజన్‌లో పనులు చేయలేదని చెప్పిన కాంట్రాక్టరు ఈ సీజన్‌లో ఎలా పనులు చేస్తారని, ఎందుకంత ప్రేమ ఒలకపోస్తున్నారని ఇరిగేషన్ అధికారులను కలెక్టరు ప్రశ్నించారు. డెల్టాలో 12 స్ట్రక్చర్లు నిర్మించాలని కానీ ఒక్క అండర్‌టనె్నల్ కూడా కట్టే స్ధితిలో కాంట్రాక్టరు లేరని, ఇలాంటి తుప్పుపట్టిన తుపాకులు, పదునులేని కత్తులతో యుద్ధం చేసి గెలవమంటే కలెక్టరుగా తనకు సాధ్యం కావటంలేదన్నారు. ఒకవేళ కాంట్రాక్టరుపై, సంబంధిత ఇంజనీర్లపై తుపాకీ ఎక్కుపెడితే ఆ బుల్లెట్‌లు తిరిగి తనకే తగులుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు ఏళ్లు అయినా తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పధకాలు, పోలవరం కుడి ప్రధాన కాల్వ పనులు నత్తనడకతో నడుస్తుంటే ఇంకా సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. తాడిపూడి ఎత్తిపోతల పనుల విషయంలో ఐఎల్‌ఎఫ్‌ఎస్ ఏజన్సీ గత ఏడాదిన్నర కాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆ సంస్ధను బ్లాక్‌లిస్టులో పెట్టమని ఏడాదిన్నర నుండి చెపుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులకు ఇంకా నష్టపరిహారం చెల్లించలేదని, రైతులు కోర్టుకు వెళితే సంబంధితాధికారులు జైలుకు వెళతారని కలెక్టర్ హెచ్చరించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, భూసేకరణ ప్రత్యేక కలెక్టరు భానుప్రసాద్, జాయింట్ కలెక్టరు-2 ఎంహెచ్ షరీఫ్, డిఆర్వో కట్టా హైమావతి, ఇరిగేషన్ ఎస్‌ఇ శ్రీనివాస్, సబ్‌కలెక్టర్లు దినేష్‌కుమార్, షాన్‌మోహన్, గృహనిర్మాణసంస్ధ పిడి ఇ శ్రీనివాసరావు, ఎస్‌డిసి ఆర్‌వి సూర్యనారాయణ, డ్వామా పిడి ఎం వెంకటరమణ, ఆర్డీవోలు ఎన్ తేజ్‌భరత్, శ్రీనివాసరావు, లవన్న తదితరులు పాల్గొన్నారు.
జనమే బిజెపి బలం:ఎంపి గంగరాజు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, నవంబర్ 19: భారతీయ జనతా పార్టీకి జనమే బలమని నరసాపురం ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు అన్నారు. ప్రజల అండదండలతోనే ప్రధానిగా నరేంద్ర మోదీ కాగలిగారన్నారు. శనివారం భీమవరంలోని ఎంపి కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. అనంతరం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆశీస్సులతోనే బిజెపి దేశాన్ని పాలిస్తుందన్నారు. ఈ నెల 26న జరగబోయే అమిత్ షా సభను వైభవోపేతంగా నిర్వహించాలన్నారు. తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కును కాలుష్య రహితంగా నిర్మిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఫుడ్ పార్కును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తాయని, దీని వల్ల స్థానికులకు ఎటువంటి హాని ఉండదని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబిజ, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ అల్లూరి సాయిదుర్గరాజు, ఆకివీడు మండల ప్రతినిధి నేరేళ్ళ పెదబాబు, గోకరాజు రామరాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

శారీరక రుగ్మతల
చిన్నారుల కోసం

త్వరలో రెసిడెన్షియల్ పాఠశాల

ఏలూరు, నవంబర్ 19 : జిల్లాలో శారీరక రుగ్మతలతో రెండు వేల మంది చిన్నారులు పాఠశాలలకు వెళ్లలేక బాధపడుతున్నారని, అటువంటి వారి కోసం ఏలూరులో త్వరలోనే రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు సందర్భంగా స్థానిక ఇండోర్ స్టేడియంలో శనివారం జిల్లాస్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రీడాపోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ జ్యోతి వెలిగించి సభా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజంలో కొంతమంది శారీరక మానసిక అంగవైకల్యంతో జన్మిస్తున్నారని, అటువంటి వారి పట్ల జాలికన్నా తోటిమానవులుగా గుర్తించి గౌరవించి ఆదరిస్తే విభిన్న ప్రతిభావంతులు ఎవరికీ తీసిపోరని చెప్పారు. జిల్లాలో పోలియో వ్యాధి సమూ

పోలవరం డిఎస్పీగా రవికుమార్ బాధ్యతల స్వీకారం

పోలవరం, నవంబర్ 19: పోలవరం డిఎస్పీగా ఎటివి రవికుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. డిఎస్పీ రవికుమార్‌కు పోలవరం సిఐ కె బాలరాజు, ఎస్‌ఐ కె శ్రీహరిరావు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నుండి వచ్చిన డిఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ పోలవరం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతమైనందున అనేక సున్నిత సమస్యలు ఉత్పన్మమయ్యే అవకాశాలున్నాయని, అన్ని శాఖల సమన్వయంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్‌డివిజన్ నుండి ఏజెన్సీ మండలాలతో కొత్తగా పోలవరం సబ్‌డివిజన్ ఏర్పాటు చేశారు. ఈ సబ్‌డివిజన్‌లో పోలవరం మండలంతోపాటు బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఉంటాయి.
రూ.21 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలలు

ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, నవంబర్ 19 : రాష్ట్రంలో 21 కోట్ల రూపాయలతో 8 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. ఏలూరు సమీపంలోని వట్లూరులో వున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతి గృహాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ నూరుశాతం విద్యార్ధులు గురుకుల పాఠశాలల్లో చదవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని విద్యార్ధులకు కార్పొరేట్ స్థాయికి మంచి విద్యను అందించేందుకు విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంబేద్కర్ ఓవర్‌సీస్ పధకం ద్వారా 200 మంది విద్యార్ధులను ఉన్నత చదువులకై పంపించడం జరిగిందని ఇంకెవరైనా ఆసక్తి, అర్హత ఉన్న వారిని కూడా పంపించడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నదని పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదవడానికి కృషి చేయాలని మంత్రి విద్యార్ధులకు సూచించారు. విద్యార్ధులకు చదువుతోపాటు వృత్తి విద్యలు, డ్యాన్సు, సంగీతం, యోగా వంటి వాటిల్లో శిక్షణనిచ్చి వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడం జరుగుతుందన్నారు. 35 మంది విద్యార్ధులను ఎంపిక చేసి వారికి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేందుకు డార్జిలింగ్‌లో శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ పాఠశాలకు వౌలిక సౌకర్యాలతోపాటు ప్రహరీగోడ నిర్మించడం జరుగుతుందని విద్యార్ధినీల రక్షణకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు చెప్పారు. హాస్టళ్లలో విద్యార్ధులకు అందించే భోజనాలు మంచి నాణ్యతతో కూడిన పదార్దాలతో అందించాలని ప్రభుత్వం సూచించిన విధంగా మెనూను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అంతకుముందు మంత్రి హాస్టల్‌లో విద్యార్ధులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. కిచెన్‌లోకి వెళ్లి అప్పటికే వండి విద్యార్ధులకు వడ్డించేందుకు సిద్ధంగా వున్న కూరలు, సాంబారు, అన్నంను పరిశీలించారు. విద్యార్ధులతో కలిసి భోజనం చేసి ఆయన సంతృప్తిని వ్యక్తంచేశారు. హాస్టల్ ఆవరణలో ఉన్న సిబ్బంది క్వార్టర్‌ను పరిశీలించి అవి పడిపోవడానికి సిద్ధంగా ఉండడంతో ఎపిఇడబ్ల్యుఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి వెంకటరత్నరావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనీసం రిపేర్లు చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. క్వార్టరు రిపేర్లకోసం పై అధికారులకు లేఖలు వ్రాయడం జరిగిందని ప్రిన్సిపల్ టి ఉమాదేవి మంత్రికి వివరించగా లెటరు పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని వెంటనే మరమ్మతులు చేయించి నివాసానికి అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ రెసిడెన్షియల్ పాఠశాలలోనూ నూరుశాతం ఉత్తీర్ణత సర్వసాధారణంగా జరుగుతోందని ఏ-గ్రేడ్ వచ్చేలా విద్యార్ధులను తీర్చిదిద్దాలన్నారు.
ప్రలోభాలకు లొంగకండి
-రద్దయన పెద్ద నోట్ల జమపై కలెక్టర్ హెచ్చరిక
ఏలూరు, నవంబర్ 19 : వెయ్యి, అయిదు వందల రూపాయల నోట్లు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సందర్భంగా ఎవరైనా రద్దయిన నోట్లను డ్వాక్రా డిపిఎంలు, ఎపిఎంల ఖాతాలో జమచేస్తామని ఆశకల్పిస్తే అటువంటి ప్రలోభాలకు లొంగవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో డి ఆర్‌డి ఏ చేపట్టే పధకాల అమలుపై కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రద్దుచేసిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు నల్లకుబేరులు వివిధ మార్గాలను అవలంభిస్తున్నారని, వారు ప్రలోభాలకు గురిచేసి మీ ఖాతాలో జమ చేసి అందుకు కొంత సొమ్ము ఇస్తామని ఆశ పెడుతున్నారని అటువంటి చర్యలకు పాల్పడితే కేంద్ర ప్రభుత్వం, ఐటి, సిబిఐ వారు ప్రతీ పైసాను నిఘా పెట్టి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే అవకాశం వుంటుందని హెచ్చరించారు. అటువంటి చర్యలకు పాల్పడితే జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కరూ మిమ్మల్ని ఆదుకోలేరని ఆయన చెప్పారు. సమావేశంలో డిఆర్‌డిఏ పిడి కె శ్రీనివాసులు, మెప్మా పిడి శ్రీనివాసరావు, డిపిఎంలు, ఎపిఎంలు తదితరులు పాల్గొన్నారు.
అంగట్లో ఆలయ భూములు
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, నవంబర్ 19: చివరకు ఆలయ భూములు కూడా అధికారంగానే అంగట్లోకి వచ్చేస్తున్నాయి. ఉన్న ప్రతి భూమిని వాణిజ్యపరంగా ఉపయోగించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా దాతల స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఆలయ భూములను కూడా ఈ జాబితాలోకి చేర్చేశారు. నేరుగా అమ్మకాలంటే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉన్నందున బిఓటి ప్రాతిపదికన ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాకు సంబంధించి ఏడు ఆలయాలు, ధార్మికసంస్ధలకు చెందిన భూములను ఈవిధంగా సిద్దం చేసేశారు. ఇక టెండరు పిలవటం, వచ్చి భూములు ఎగరేసుకుని పోవటమే తరువాయిగా మారింది. వాస్తవంగా దశాబ్ధాల క్రితం అయా ఆలయాలకు దాతలు ఎన్నో ఎకరాలను వాటి నిర్వహణ నిమిత్తం అప్పగించారు. అవన్నీ ఇప్పుడు కొన్ని పట్టణ ప్రాంతాల్లోనూ, నగరాల్లోనూ కూడా ప్రముఖమైన స్ధలాలుగా మారిపోయాయి. వాటి రేట్లు కూడా అప్పటితో పోలిస్తే భారీగా తేడా ఉంది. ఇలాంటి భూములపై రాజకీయనేతల కన్ను పడుతుండటం, భారీగా అన్యాక్రాంతానికి గురికావటం, మరికొన్నిచోట్ల పూర్తిస్దాయి కబ్జా కోరల్లో ఉండిపోవటం తెల్సిందే. ఇలాంటి వాటిపై దేవాదాయధర్మాదాయ శాఖ ఓపిక తెచ్చుకుని తమ భూములను పరిరక్షించుకోవాలనే ఆలోచన ఆలస్యంగా వచ్చినా ఎంతోకొంత ప్రయత్నం చేస్తూ వచ్చింది. అయితే వాటి అన్నింటిని పూర్తిగా తుంగలో తొక్కే విధంగా తాజా ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. అన్యాక్రాంతం అయ్యే ప్రమాదాన్ని తప్పించుకునేందుకు చివరకు ప్రైవేటుకే ఆ భూములను అప్పగించేస్తే ఫలితం ఉంటుందనుకున్నారో ఏమోగాని అదేపరిస్దితికి ఇప్పుడు ఆలయ భూములను సిద్ధం చేస్తున్నారు. ఒకప్పుడు దొంగ చేతికే తాళాలు ఇస్తే మంచిదన్న నానుడి అందరికి తెల్సిందే. ఇప్పుడు ఉన్న భూములను కాపాడుకోలేక ఎలాగూ తమ చేతుల్లో ఉండే అవకాశం లేనందున ముందుగానే ప్రైవేటుకు అప్పగిస్తే వత్తిళ్లు, బాధ్యతలు తగ్గుతాయన్న ఆలోచనలో దేవాదాయశాఖ ఉన్నట్లు కన్పిస్తోంది. ఈనేపధ్యంలోనే జిల్లాకు సంబంధించి ఏడు ఆలయాలు, థార్మిక సంస్ధలకు చెందిన భూములు అయా ప్రాంతాల్లో వాణిజ్యపరమైన ప్రదేశాల్లో ఉండటం, ఆభూములకు విపరీతమైన డిమాండ్ ఉండటాన్ని గుర్తించింది. అయితే ఇక్కడ కూడా మరో మెలిక లేకపోలేదు. ఈ భూములు వాణిజ్యపరంగా విలువైనవని, వాటిని లీజుకు ఇవ్వటం ద్వారా ఆదాయం భారీగా వస్తుందన్న ఆలోచన శాఖ నుంచి పుట్టిందో లేక ఫలానా భూములు కావాలంటూ బయట వత్తిళ్లు పెరగటంతో ఈభూములను ఆజాబితాలో పెట్టారో తెలియదుగాని మొత్తానికి విలువైన భూములే బిఓటి ప్రాతిపదికన అప్పగించేందుకు సిద్ధమయ్యాయి. ఈనిర్ణయం పూర్తిస్ధాయిలో అమలులోకి వస్తే రానున్న రోజుల్లో ఆలయ భూములను కాపాడాల్సిన బాధ్యత నుంచి శాఖ తప్పుకుని ఒకరకంగా ప్రైవేటుకు అప్పగిస్తోందనే చెప్పాలి. ఈవిధంగా జిల్లాలో నర్సాపురంలో ఉన్న మనే్న నాగమ్మ ధర్మసత్రంనకు చెందిన ఆరు సెంట్ల భూమి, నర్సాపురంలోని మదనగోపాలస్వామి ఆలయానికి చెందిన 450 చదరపు గజాల భూమి, ఆదికేశవ ఎంబెరుమన్నార్ ఆలయానికి చెందిన 1130 చదరపు గజాల భూమి, భీమవరంలోని డిజిఆర్ సత్రంనకు చెందిన 16 సెంట్ల భూమి, తణుకులోని బాలసరస్వతి స్ర్తిసమాజంనకు చెందిన 1450 చదరపు గజాల భూమి, పెంటపాడు మండలం తాళ్లముదునూరుపాడులోని బాల వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 4900 చదరపు గజాల భూములను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపటం జరిగింది.
అతిగా ప్రవర్తిస్తున్నారు
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, నవంబర్ 19 : జిల్లాలో పెళ్లిళ్లకు అవసరమైన డబ్బును డ్రా చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించిందని, ఎవరికైతే పెళ్లికోసం డబ్బు కావాలో శుభలేఖను పరిశీలించి బ్యాంకు మేనేజరు రూ.2.5 లక్షలు వారి బ్యాంకు ఖాతా నుండి డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని, ప్రతీ విషయానికి జిల్లా కలెక్టరు సంతకం కావాలంటూ అందరినీ కలెక్టరు వద్దకు పంపించవద్దని జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. ఏలూరు మండలం చొదిమెళ్ల గ్రామానికి చెందిన రావూరి నాగ వెంకట సత్యనారాయణ (నాగేంద్ర) కుమార్తె నాగలక్ష్మి వివాహం డిసెంబరు 8వ తేదీన జరుగనుంది. పెళ్లి ఖర్చులకోసం బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసుకోవడానికి ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు దగ్గరకు వెళితే తమ వద్ద పర్మిషన్ లేదని, జిల్లా కలెక్టరును గానీ, ఎస్‌పిని కానీ కలిసి లెటరుపై సంతకం చేయిస్తే డబ్బిస్తామని చెప్పారని సత్యనారాయణ సోదరుడు మురళీకృష్ణ స్థానిక కలెక్టరేట్‌లో శనివారం సాయంత్రం తన గోడును కలెక్టరుకు వెళ్లబోసుకున్నాడు. దీనిపై కలెక్టరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెళ్లిళ్లకు బ్యాంకు నుండి డబ్బు డ్రా చేయాలన్నా తన సంతకం కావాలా? బ్యాంకు మేనేజర్లు కొంతమంది అతిగా ప్రవర్తిస్తున్నారని, రిజర్వు బ్యాంకు నిబంధనలు ప్రకారం పెళ్లి కోసం వారి ఖాతాలో డబ్బు ఉంటే పెళ్లికూతురు తరఫున రెండున్నర లక్షలు, పెళ్లి కొడుకు తరఫున రెండున్నర లక్షలు విడుదల చేసుకునే వెసులుబాటును కల్పించినప్పుడు ప్రతీ విషయానికి కలెక్టరు సంతకం అంటూ మేనేజర్లు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని తక్షణమే ఐ ఓబి మేనేజరును అక్కడికక్కడే పిలిపించారు. పెళ్లికి కావాల్సిన డబ్బు డ్రా చేసుకోవడానికి కలెక్టరు సంతకం దేనికని ఐఓబి మేనేజర్ శరవణ్‌ను కలెక్టరు ప్రశ్నించగా తమకు ఇంకా రిజర్వు బ్యాంకు నుండి ఆదేశాలు రాలేదని శరవణ్ చెప్పడంతో కలెక్టరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి విషయాల్లో పై అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుందని, ప్రతీదానికి రిజర్వు బ్యాంకు నుంచి ఆదేశాలు రావాలంటే నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. అయితే ఆదేశాలు లేనందున తానేమి చేయలేనని శరవణ్ చెప్పడంతో పెళ్లి కాకపోతే మా అమ్మాయి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే దానికి బ్యాంకు అధికారులు బాధ్యత వహిస్తారా? అంటూ మురళీకృష్ణ ప్రశ్నించడంతో కలెక్టర్ జోక్యం చేసుకుని నిబంధనలు ఆన్‌లైన్‌లో వున్నాయని, వాటిని చూసి తక్షణమే ఖాతాదారులకు సొమ్ము ఇచ్చి పంపించాలని చెప్పినా బ్యాంకు మేనేజరు వినకపోవడంతో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేసు పెట్టి అరెస్టు చేయిస్తానని కలెక్టర్ హెచ్చరించడంతో మేనేజర్ డబ్బు ఇవ్వడానికి అంగీకరించారు.
మాతాశిశు ఆరోగ్యానికి ప్రాధాన్యత
నిడదవోలు, నవంబర్ 19: గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం ద్వారా మాతాశిశు మరణాలు తగ్గించి పిల్లలందరినీ పూర్తి ఆరోగ్యవంతులను చేసేదిశగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గనులు, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం పట్టణంలోని 135 అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పిల్లల హాజరు శాతాన్ని చూసి, వారికి అందించే పౌష్టికాహారం గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ టీచర్ల రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలకు సంవత్సరానికి రూ.1100 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, ఖర్చు చేసే ప్రతి పైసా పూర్తిగా సద్వినియోగం జరిగేలా చూస్తున్నామన్నారు. చదువు విషయంలో కానె్వంట్ తరహాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్, ఎల్‌కెజి, యుకెజి తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం నుండి పైలెట్ ప్రాజెక్టుగా మండల కేంద్రంలో ఒక స్కూలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది నుండి అంచెలంచెలుగా పూర్తిస్థాయిలో పెంచుతామన్నారు. పక్కా అంగన్‌వాడీ భవనాలు నిర్మించాలని సిఎం కృతనిశ్చయంతో ఉన్నారని చెబుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలకు 257 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. ఇందులో 35 వేల భవనాలు అద్దెకు తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం 7 వేలు పక్కా భవనాలు నిర్మిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. మార్చి నాటికి ఆయన భవనాల నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. మంత్రి వెంట సిడిపిఒ నిర్మలాకుమారి, అంగన్‌వాడీ టీచర్ విజయ, కార్యకర్తలు ఉన్నారు.
రూ. 2000 నోటుకు నకిలీ

యలమంచిలి, నవంబర్ 19: పోడూరు మండలం మట్టపర్రు గ్రామంలో రూ.2వేల నకిలీ కరెన్సీని మార్చిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి..మట్టపర్రుకు చెందిన గుడాల శ్రీనివాసు, పోడూరు మండల కేంద్రంలో వెస్ట్రన్ మనీ జిరాక్స్ యంత్రాన్ని నిర్వహిస్తున్నాడు. మట్టపర్రు గ్రామంలో తన ఇంట్లో ఉన్న జిరాక్స్ మిషన్ ద్వారా రూ.2వేల నకిలీ కరెన్సీ నోటును ముద్రించి అదే గ్రామానికి చెందిన గుడాల ఏడుకొండలు, కోళ్ల శ్రీనివాస్‌కు ఇవ్వగా ఆ నోటును తీసుకుని గ్రామ సర్పంచ్ తంగెళ్ల వెంకటలక్ష్మి కిరాణా దుకాణానికి వెళ్లి స్వయంగా ఆమెకే ఆ నోటిచ్చి రూ.150ల కిరాణా సామాగ్రిని కొనుగోలు చేశారు. ఆమె చిల్లర ఇవ్వగా ఆ సొమ్ములో రూ.550 మద్యం దుకాణంలో ఖర్చుచేశారు. మిగిలిన రూ.1300లు వారి వద్ద ఉన్నాయి. అయితే ఈ లోగా ఆ నోటు నకిలీదని తెలిసి సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనిపై ఏడుకొండలు, శ్రీనివాస్‌లను అదుపులోనికి తీసుకుని ప్రశ్నించగా, గుడాల శ్రీనివాస్ తమకీ నోటును ఇచ్చినట్టు చెప్పారు. దీంతో గుడాల శ్రీనివాస్‌ను పోడూరు ఎస్సై రవీంద్ర ప్రశ్నించగా జిరాక్స్ మిషన్లో ఎస్సైకు మరో రెండు నోట్లను తీసి చూపించాడు. గుడాల శ్రీనివాస్, ఏడుకొండలు, కోళ్ల శ్రీనివాసులను అదుపులోనికి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవీంద్ర తెలిపారు. వీరిపై కేసు నమోదుచేశామన్నారు.

ప్రగడవరంలో అగ్నిప్రమాదం
చింతలపూడి, నవంబర్ 19: విద్యుత్తు షార్టు సర్క్యూట్‌తో పాటు, గ్యాసు సిలెండర్ పేలడంతో నాలుగు ఇళ్లు కాలి బూడిద కాగా, ఎనిమిది కుటుంబాలకు చెందిన వారు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో శనివారం సాయంత్రం సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో ఇళ్లతోపాటు బంగారం, నగదు, గృహోపకరణాలు కాలి బూడిదకావడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. స్థానికుల, బాధితుల కథనం ప్రకారం ఈ గ్రామంలోని పొన్నుబోయిన నాగేష్‌కు చెందిన తాటాకుల ఇంట్లో విద్యుత్తు షార్టు సర్క్యూట్ వల్ల తొలుత మంటలు వ్యాపించాయి. అయితే ఈ మంటలకు అదే ఇంట్లోని గ్యాసు సిలెండర్ పేలడంతో మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరో మూడు తాటాకుల ఇళ్లకు మంటలు వ్యాపించాయి. ఫలితంగా మానికల సత్యనారాయణ, మానికల వెంకటేశ్వరరావు, పొన్నుబోయిన గోపయ్యలకు చెందిన మూడు ఇళ్లు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఈ మొత్తం నాలుగు గృహాలలోను మొత్తం ఎనిమిది కుటుంబాల వారు నివసిస్తున్నారు. హఠాత్తుగా పెద్దశబ్దంతో జరిగిన ఈ సంఘటనతో ఎనిమిది కుటుంబాల వారు ప్రాణ భయంతో కట్టుబట్టలతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని ఏ ఒక్క వస్తువూ బయటకు తెచ్చుకునే పరిస్థితులు లేకపోవడంతో ఈ కుటుంబాల వారు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.2 లక్షలకు పైగా నగదు, దాదాపు 8 కాసుల బంగారం, గృహోపకరణాలు, దుస్తులతోపాటు రేషన్‌కార్డు, ఆధార్ కార్డులు, భూమికి సంబంధించిన పత్రాలు మొత్తం కాలి బూడిదయ్యాయని బాధితులు వాపోతున్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ప్రగడవరం గ్రామంలోని గొల్లగూడెంలో జరిగిన ఈ అగ్ని ప్రమాద బాధితులందరూ వ్యవసాయ కూలీలేనని తెలుస్తోంది. చింతలపూడి నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. రెవెన్యూ సిబ్బంది బాధిత కుటుంబాలకు 10 కిలోల వంతున బియ్యం అందజేశారు.