పశ్చిమగోదావరి

కష్టాలు రెండు రెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 2 : నిను వీడని నీడను నేనే... అన్న రీతిలో గత 24 రోజులుగా సామాన్య జనాన్ని వెంటాడుతున్న నగదు కష్టాలు ఈ నెల మొదటి వారంలోనూ తప్పే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. వేతన జీవులు జీతం బ్యాంకులో పడినా తీసుకునే అవకాశం లేకపోవడంతో చేతికందినా నోటికందడం లేదని విలవిల్లాడుతున్నారు. మరోవైపు ఇచ్చే పెన్షన్‌పై ఆదారపడి వున్న వృద్దులు, వికలాంగులు, విభిన్న ప్రతిభావంతులు ఇలా ప్రతీ ఒక్కరూ బ్యాంకుల ముందు గంటల తరబడి గడిపేస్తున్నారు. మరోవైపు వందలాది ఎటిఎంలు వున్నట్లు కనిపిస్తున్నా వాటిలో పనిచేసేవి కొనే్న అయితే, ఆ కొన్నింటిలోనూ నగదు ఉన్నవి మరింత తక్కువగా వుండటం జనం కష్టాలను రెట్టింపు చేస్తోంది. మొత్తం మీద ఈ నగదు కష్టాలు శుక్రవారం కూడా కొనసాగడమే కాకుండా ఒక రకంగా రెట్టింపు అయ్యాయంటే అతిశయోక్తి కాదు.
నెల మొదటి వారం కావడంతో సహజంగానే వేతన జీవులంతా ఎటిఎంల చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరుగుతుంటుంది. వేతన జీవులకు హోం బ్యాంక్‌లో పది వేల రూపాయల నగదు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు సంబంధించి దాదాపుగా 33 వేల మంది ఉద్యోగులు వున్నారు. వీరిలో ఎవరికీ పది వేల రూపాయలు నగదు అందలేదనే చెప్పాలి. వచ్చిన కొద్దిమందికి మూడు నుంచి అయిదు వేల వరకు నగదు ఇచ్చి బ్యాంకులో నిల్వలు లేవంటూ పంపేశారు. మరో 6800 మందికి 5 నుంచి 6 వేల రూపాయలు మాత్రమే నగదు అందించారు. మొత్తం మీద వేతన జీవుల పరిస్థితి ఈ పరిణామాలతో విలవిల్లాడుతున్నట్లే కనిపిస్తోంది. ఇచ్చిన కొద్ది మొత్తంతో ఎంతకాలం ఇల్లు గడపాలి, ఎవరెవరికి బిల్లులు చెల్లించాలి, పనివాళ్ల జీతాలు ఎలా ఇవ్వాలి అన్న అంచనాల్లో వారంతా బిజీగా ఉండిపోయారు. జిల్లాలో దాదాపుగా 579 ఎటిఎంలు ఉండగా వాటిలో 369 మంది మాత్రమే పనిచేస్తున్నాయి. వీటిలోనూ 62 ఎటిఎంలలో మాత్రమే వందరూపాయలు నోట్లు అందుబాటులో వున్నట్లు తెలుస్తోంది. మిగతా అన్ని చోట్లా రెండు వేల రూపాయల నోటే కార్డుదారులకు దర్శనమిచ్చి ఒక రకంగా షాకిస్తోంది.
ఈ పరిణామాలు ఇలా వుంటే మరోవైపు ప్రతీ నెలా మొదటి వారంలో అత్యంత ప్రధానంగా ఉండే సామాజిక పింఛన్ల మంజూరు ప్రక్రియ ఒక రకంగా కుదేలైనట్లే కనిపిస్తోంది. జిల్లాలో మొత్తం 3.38 లక్షల మంది పింఛనుదారులు వుండగా వారిలో 1100 మందికి బ్యాంకు ఖాతాలు లేనందున వారిని ఈ జాబితానుంచి మినహాయించారు. మిగిలిన వారికి దాదాపుగా 37 కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరగాల్సివుంది. సాధారణంగా ప్రతీ నెలా మొదటి రెండు రోజుల్లో దాదాపు 25 కోట్ల రూపాయల వరకు ఈ సామాజిక పింఛన్ల పంపిణీ జరుగుతుంటుంది. అయితే ఈసారి తొలి రెండ్రోజుల్లోనూ కేవలం ఏడు కోట్ల రూపాయలు మేరకు మాత్రమే ఈ పింఛన్ల పంపిణీ జరగడం గమనార్హం. వాస్తవానికి పింఛన్లలో అధిక భాగం వెయ్యి రూపాయలు పెన్షన్లు కావడం గమనార్హం. ప్రస్తుతం రెండు వేల రూపాయల నోటు తప్ప పెద్ద డినామినేషన్‌లో మరో నోటు లేకపోవడం కూడా తెలిసిందే. మరోవైపు 500 రూపాయల నోటు చలామణిలోకి ఇంకా పూర్తిగా రాని పరిస్థితుల్లో ఈ పెన్షన్‌దారులకు వెయ్యి రూపాయల నగదు ఎలా చెల్లిస్తున్నారన్నదే ఆసక్తికరంగా మారింది. స్థానికంగా వున్న పరిస్థితిని బట్టి కొన్ని ఏర్పాట్లు చేస్తున్నా మొత్తంగా లక్షల మందికి ఈ పింఛన్లు ఎప్పటికి అందుతాయన్నది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. దాదాపుగా ప్రతీ బ్యాంకు వద్ద వందల సంఖ్యలోనే పింఛనుదారులంతా క్యూలలో నిలబడి ఇచ్చే కొద్దిపాటి మొత్తాన్ని తీసుకుని వెళుతున్నారు. అయితే గంటలు తరబడి నిలబడటం వలన వారిలో చాలా మంది స్వల్ప అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ విధంగా పలు బ్యాంకుల్లో అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య గణనీయంగానే వుంది.
కాగా ఈ నగదు కష్టాలు అన్ని వర్గాలను కుదిపేస్తుంటే మరో పరిణామం కూడా ఈ కష్టాల జాబితాలోకి రేషన్‌కార్డుదారులను కూడా తీసుకువచ్చింది. కాగా ఇన్ని రోజులు గడుస్తున్నా అటు బ్యాంకుల వద్ద గానీ, ఇటు మార్కెట్‌లో గానీ చిన్న నోట్ల చలామణి జరగకపోవడం తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తోంది. బ్యాంకులకు వెళితే రెండు వేల రూపాయల నోటు ఇచ్చి బ్యాంకర్లు చేతులు దులుపుకుంటుంటే, రెండు వేల రూపాయలు చేతిలో వున్నా దానితో ఏదీ కొనుగోలు చేయలేక, ఎవరికీ ఇవ్వలేక కనీసం పెట్రోలు కూడా కొట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఏదేమైనా రోజులు గడుస్తున్న కొద్దీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం లక్ష్యాలను ఎంతమంది సమర్ధించినా రోజులు తరబడి ఎదురవుతున్న కష్టాలను చూసి మాత్రం అలా సమర్ధిస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటం విశేషం.