పశ్చిమగోదావరి

అయిదు రోజులైనా తీరని పింఛను కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 5: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న నగదు కొరతతో పింఛనుదారుల తలరాతలు మారడంలేదు. ఐదు రోజులైనా పింఛన్ల కోసం బ్యాంకుల చుట్టూ కాళ్లు అరిగేలా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తిరుగుతూనే ఉన్నారు. బ్యాంకుల్లో ఊపిరాడని పరిస్థితి నెలకొంటే, నేటికీ ఎటిఎంలు తెరుచుకోలేదు. నగదు కోసం ఖాతాదారులతో పాటు పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అనేక అగచాట్లు పడుతున్నారు. ముఖ్యంగా బ్యాంకు సిబ్బంది ఛీత్కారానికి గురవుతున్నారు. సోమవారం కూడా పట్టణంలోని బ్యాంకులు వృద్ధులతో కిటకిటలాడాయి. వారి ఖాతాలకే పింఛన్ల సొమ్ము జమచేశామని అధికారులు చెప్పడంతో అసహాయులైన ఈ జీవులంతా బ్యాంకులకు చేరుకుని, పింఛను పడిందా? అని అడుగుతుంటే కొందరు సిబ్బంది ఛీత్కరించుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలో పింఛను సొమ్ము పడిందోలేదో నన్న ఆందోళన ఒకవైపు, పడితే ఏవిధంగా తీసుకోవాలోనన్న ఆందోళన మరొక వైపు వారిని వేధిస్తోంది. ఇంతమంది జనం ఒక్కసారిగా వస్తుంటే సిబ్బంది సైతం చేష్టలుడిగి చూస్తుండి పోతున్నారు. లబ్ధిదారులు గతంలో తీసుకున్న ఖాతాలకు ఎటిఎం కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవలసి రావడం మరో సమస్య అయి కూర్చొంది. చదవురాని వృద్ధులు రోజంతా తిండీ తిప్పలు లేకుండా బ్యాంకుల వద్ద పడిగాపులు పడ్డారు. ఎటిఎం కార్డులున్నా ఫలితం కనిపించడంలేదని కొంతమంది వాపోతున్నారు. స్థానిక ఎస్‌బిఐ ప్రధాన శాఖ, ఆంధ్రాబ్యాంక్ శాఖ ఖాతాదారులతో కిక్కిరిసిపోతున్నాయ. ఈ బ్యాంకుల్లో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. అలాగే ఎస్‌బిఐ, ఆంధ్రాబ్యాంక్ తప్ప మిగిలిన ఎటిఎంలు నేటికీ తెరచుకోలేదు. ఉన్న ఎటిఎంలు కూడా కొద్దిసేపు మాత్రమే పనిచేస్తున్నాయి. పింఛన్లు పడని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బారులు తీరారు. ఆన్‌లైన్ సమస్యలతో ఖాతాదారులు మరింత సతమతమవుతున్నారు. ఆన్‌లైన్‌లో నెట్ వర్క్, బ్యాంక్ సర్వర్లు సరిగా పనిచేయక పోవడంతో ఖాతాదారుల అవసరాలు తీరక పోగా, తమ బ్యాంక్ ఖాతాలలో నగదు తగ్గిపోతుండటంతో తలలు పట్టుకుంటున్నారు. ఇలా ఇబ్బందికి గురైనవారు బ్యాంక్‌లకు వస్తుంటే ఆన్‌లైన్ వ్యవహారానికి తాము బాధ్యులము కామని సిబ్బంది చెబుతున్నారు. బ్యాంక్ ఖాతాదారులందరికీ ఉచితంగా ఇంటర్నెట్, నెట్ బ్యాలన్స్‌లు ఇచ్చి, బ్యాంక్ సర్వర్ల సామర్థ్యం పది రెట్లు పెంచి, అప్పుడు బ్యాంక్ కార్యకలాపాలు, ఆన్‌లైన్, స్వైపింగ్ వంటి సాంకేతక పరిజ్ఞానం ప్రవేశ పెడితే ఇన్ని సమస్యలు తలెత్తేవికావని విద్యావంతులు వ్యాఖ్యానిస్తున్నారు. నోట్ల రద్దు, బ్యాంకుల్లో విత్‌డ్రాలు, ఎటిఎంలు, ఆన్‌లైన్ సేవలపై కనీస అవగాహన లేకుండా పాలకులు తీసుకున్న ఇటువంటి అనాలోచిత నిర్ణయాలవల్ల ప్రజలు, ముఖ్యంగా సామాన్యులు రోడ్డున పడవలసి వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు.