పశ్చిమగోదావరి

రాష్ట్ర ప్రగతిలో ఒఎన్జీసీ భాగస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 6: విభజనలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రగతిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నది కేవలం ఒఎన్జీసీ మాత్రమేనని కెజి బేసిన్ జనరల్ మేనేజర్ ఎవివిఎస్ కామరాజు (జియోలజీ,రాజమండ్రి) అన్నారు. భవిష్యత్తులో కూడా ఒఎన్జీసీ తెలుగు ప్రజల అభివృద్ధికి అండగా నిలుస్తుందన్నారు. భీమవరంలో ఒఎన్జీసీ కేజి-పిజి బేసిన్‌లో షేల్‌గ్యాస్, ఆయిల్ అనే్వషణను ఒఎన్జీసీ ప్రతిపాదించింది. వీరవాసరం మండలం అండలూరు గ్రామం, కాళ్ల మండలంలోని కోలనపల్లి గ్రామాల్లో బావుల తవ్వకానికి పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణకు సమావేశం మంగళవారం స్థానిక మున్సిపల్ ఎఎస్‌ఆర్ భవనంలో ఏర్పాటుచేసింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు జిఎం ఎవివిఎస్ కామరాజుతోపాటు అడిషనల్ జాయింట్ కలెక్టర్ హమిమ్ షరీఫ్, కాలుష్య నియంత్రణ మండలి ఇఇ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సమావేశానికి వివిధ రైతు సంఘాలు, సిపిఐ, సిపిఎం ప్రతినిధులు వచ్చారు. వీటిలో రెండు రాజకీయ పార్టీలు ఒఎన్జీసీ చేసే అనే్వషణను వ్యతిరేకించాయి. రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు వారి అభిప్రాయాలను చెప్పారు. భూమి కుంగిపోతుందన్న అంశంపై కూడా చర్చ జరిగింది. దీనిపై జిఎం కామరాజు స్పందించారు. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని, దీనిపై నివేదిక కూడా ఇవ్వమని కోరిందన్నారు. అయితే ఎవరైతే భూమి కుంగిపోతోందని ఫిర్యాదుచేశారో వారిని ఆధారాలు అడిగిందన్నారు. దీనిపై ఒఎన్జీసీ పూర్తిగా భూమిపైన సర్వే చేసిందని, అటువంటి సంఘటనలు కేజీ-పిజి బేసిన్‌లో ఎక్కడా చోటుచేసుకోలేదన్నారు. ఒకదశలో అటు ఒఎన్జీసీ, కాలుష్య నియంత్రణ మండలి, రైతులు, రాజకీయ పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్య ఉందని చెబుతున్నవారు దాని పరిష్కారం చెప్పకపోవడం శోచనీయమన్నారు. మొత్తం మీద జిఎం కామరాజు అందర్నీ సముదాయించి వారికి అవగాహన కల్పించారు. గత ఐదేళ్లలో ఒఎన్జీసీ కేజి బేసిన్‌లోని తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లోని గ్రామాభివృద్ధి, పాఠశాలలకు వౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రూ.42కోట్లు వ్యయం చేసిందని, ఏటా రాష్ట్రానికి పన్నుల రూపంలో సుమారు రూ.300 కోట్లు, కేంద్రానికి రూ.170 కోట్లు చెల్లిస్తుందని వివరించారు. వెలికి తీసిన ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు ప్రజలకు ఉపయోగించడం జరుగుతోందన్నారు. వాడివేడిగా సాగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ చివరకు ఒక కొలిక్కి వచ్చింది. కాగా ఒఎన్జీసీ షేల్ గ్యాస్, ఆయిల్‌ను వెలికి తీయాలని ప్రతిపాదించిన గ్రామాల నుంచి గ్రామస్థులు ఎవరూ రాకపోవడం విశేషం.

కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో
చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు సాయం
ఏలూరు, డిసెంబర్ 6 : జిల్లాలో కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో 180 చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకున్నామని జాయింట్ కలెక్టర్-2 ఎంహెచ్ షరీఫ్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం చిన్న తరహా పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ సమాజంలో వెనుకబడ్డ కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల గ్రూపులకు చెందిన నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకై పలు గ్రూపుల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ముగ్గురు నుండి అయిదుగురు కాపు సామాజిక వర్గ పారిశ్రామిక వేత్తలు కలిసి చిన్న పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే కాపు కార్పొరేషన్ నుండి పది లక్షల రూపాయలు సబ్సిడీ బ్యాంకు ద్వారా మరో పది లక్షల రూపాయలు రుణం అందిసాతరని, లబ్ధిదారుని వాటాగా అయిదు లక్షల రూపాయలు సమకూర్చుకోవాలన్నారు. జిల్లాలో 2016-17 ఆర్ధిక సంవత్సరానికి 180 మంది పారిశ్రామికవేత్తలకు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, 57 మంది దరఖాస్తు చేసుకున్నారని, 40 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారన్నారు. వీరంతా చిన్న తరహా పరిశ్రమల స్థాపనలో ప్రత్యేక శిక్షణ పొంది యూనిట్లను నెలకొల్పాలని, తద్వారా కొంత మంది యువతకు ఉపాధి సౌకర్యాలు కలుగుతాయన్నారు. గ్రూపుల్లో కొంతమంది ఆఫ్‌సెట్ ప్రింటింగ్, నెట్ సెంటర్లు, కార్ ట్రావెలర్స్, కార్ క్లీనింగ్ సర్వీసెస్, పీచు పరిశ్రమ ద్వారా తాడు తయారీ, హెయిర్ క్లీనింగ్ ప్రోసెస్, ఎక్స్‌పోర్ట్స్, బ్రిక్స్ తయారీ తదితర చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చారని చెప్పారు. తప్పనిసరిగా యూనిట్లు స్థాపించాలని జెసి-2 లబ్ధిదారులను కోరారు. ఈ ఇంటర్వ్యూ కమిటీలో సభ్యులుగా ఎల్ డి ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు హేమసుందర్, న్యాప్‌కామ్ ప్రతినిధి జగన్నాధ్ వి నండూరి, డిపి ఆర్‌వో కార్యాలయ ఎడి వి భాస్కర నరసింహం, బిసి కార్పొరేషన్ ఇడి పుష్పలత, మెంబరు సెక్రటరీ ఇంటర్వ్యూలను నిర్వహించారు.

జయలలిత మరణం మహిళా లోకానికి తీరని లోటు
-మంత్రి సుజాత నివాళి
ఏలూరు, డిసెంబర్ 6 : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం మహిళా లోకానికే తీరని లోటు అని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. స్థానిక శనివారపుపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమె జయలలిత మరణం పట్ల సంతాపం తెలిపారు. జయలలిత సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని ప్రపంచ మహిళలకే ఆదర్శంగా నిలిచారని పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసారన్నారు. రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఒక ప్రకటన విడుదల చేస్తూ జయలలిత 75 రోజులు మృత్యువుతోపోరాడి గుండెపోటుతో మరణించడం తమిళనాటే కాకుండా దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. ఇటువంటి విపత్కర స్థితిలో ప్రజలంతా సంయమనం పాటిస్తూ ఎటువంటి ఉద్రిక్తతలకు లోనుకాకుండా జయలలిత ఆశయ సాధన కోసం పాటుపడాలని కోరారు.

ద్వారకాతిరుమల ఇఒ త్రినాథరావుకు ఆర్‌జెసిగా పదోన్నతి
ద్వారకాతిరుమల, డిసెంబర్ 6: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం ఇవోగా పనిచేస్తున్న వేండ్ర త్రినాథరావుకు రీజినల్ జాయింట్ కమిషనర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనూరాధ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న ఆయన గత నాలుగేళ్ల నుంచి రీజనల్ జాయింట్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలపై ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే పదోన్నతి రావడంతో రీజనల్ జాయింట్ కమిషనర్ హోదాలో ఆయన ఇక్కడే విధులు నిర్వర్తించనున్నారు. ఆయనతోపాటు శ్రీకాళహస్తి దేవస్థానం ఇవోగా పనిచేస్తున్న భ్రమరాంబకు సైతం ఆర్జేసిగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

రబీకి ఎరువుల కొరత లేకుండా ప్రణాళిక
రైతులకు అందుబాటులో 2.12 లక్షల టన్నులు:వ్యవసాయ శాఖ జెడి సాయలక్ష్మీశ్వరి
ఏలూరు, డిసెంబర్ 6 : జిల్లాలో రబీ పంటకు 2.12 లక్షల టన్నుల ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని, జిల్లాలో ఎక్కడా కూడా ఎరువుల కొరత లేకుండా పటిష్టమైన ప్రణాళిక అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సాయి లక్ష్మీశ్వరి చెప్పారు. స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటరులో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు నగదు రహిత ఎరువులు, విత్తనాలు, పెరుగుమందులు విక్రయాలను మొబైల్ పాస్ విధానం ద్వారా ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయిలక్ష్మీశ్వరి మాట్లాడుతూ రబీ సీజన్ ప్రారంభమైందని జిల్లాలో 1100 డీలర్ల ఆధ్వర్యంలో ఎరువులు, పురుగుమందులు రైతులకు అందుబాటులో ఉంచామని ప్రస్తుతం చిల్లర నోట్ల సమస్య తలెత్తడంతో రైతులు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదని క్షణాల వ్యవధిలో బ్యాంకు ఎటి ఎం, రూపేకార్డు, ఇతర డెబిట్, క్రెడిట్ కార్డులను తీసుకువెలితే ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సులభంగా పొందే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 1.36 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని రాబోయే నెలరోజుల్లో ఇంకా ఎరువుల నిల్వలను సిద్ధం చేస్తామని చెప్పారు. జిల్లాలో డిసి ఎం ఎస్ ఆధ్వర్యంలో 17 ఎరువుల విక్రయ డిపోలలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను నగదు రహితంగా అందించే విధానానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామమన్నారు. 33 శాతం సబ్సిడీపై అపరాలను కూడా రైతులకు అందిస్తున్నామని జిల్లాలో 120 మెట్రిక్ టన్నుల అపరాలను కొవ్వూరు, చింతలపూడి, భీమడోలు, కె ఆర్ పురం డివిజన్ల పరిధిలో రైతులకు పంపిణీ చేసామని ఏలూరు డివిజన్ పరిధిలో 34 మెట్రిక్ టన్నుల అపరాలను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. కిలో పెసలు రూ. 91 కాగా రూ.30 సబ్సిడీ పోను రూ.61కి, రూ.150 మినుము విత్తనాలు రూ.50 సబ్సిడీ పోను రూ.100 కు రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. డిసిఎంఎస్ సీనియర్ బిజినెస్ మేనేజర్ ఎం వెంకటరమణ మాట్లాడుతూ జిల్లాలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో 17 డిపోల ద్వారా నేడు రైతులకు నగదు రహిత లావాదేవీల విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు అవగాహన కల్పించడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ బ్యాంకు కార్డులు ద్వారా సులభంగా ఎరువులు పొందగలుగుతున్నారన్నారు. ఏలూరునకు చెందిన రైతు పోతర్లంక పరమేశ్వరరావు మాట్లాడుతూ తనకు వెంకటాపురం పంచాయితీలో 2.60 ఎకరాల భూమి ఉన్నదని మినుము పంట వేయడానికి 36 కిలోల విత్తనాల కోసం నగదుతో వచ్చానని కానీ ఎటిఎం కార్డు ద్వారా తనకు కావాల్సిన విత్తనాలు నగదులేకుండానే సమకూర్చారన్నారు. తన ఖాతా నుండి ఎంత సొమ్ము తీసుకున్నారో సెల్ ఫోన్‌లో క్షణాలలో పూర్తి సమాచారం రావడం తనకు నగదు రహిత లావాదేవీలంటే ఇంత సులువుగా ఉంటుందా అనిపించిందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డిడి ప్రసాద్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు మేనేజరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వీరవాసరంలో వాహనాల తనిఖీ
వీరవాసరం, డిసెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసిన నేపథ్యంలో కరెన్సీ తరలింపు, మార్పిడిపై పోలీసులు దృష్టిసారించారు. మంగళవారం వీరవాసరం ఎస్సై ఎన్.శ్రీనివాసరావు వాహనాలను తనిఖీ చేశారు. బస్టాండ్ సెంటర్‌లో ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీచేశారు. వాహనదారులు ఎక్కడ నుంచి వస్తున్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేస్తున్నామని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

గిరిజన హక్కులు కాపాడటానికి కృషి
పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు
యలమంచిలి, డిసెంబర్ 6: గిరిజనుల హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మార్కెట్టు యార్డు ఆవరణలో గిరిజనుల రాష్టస్థ్రాయి సమావేశం బిసి నేత చింతపల్లి గురుప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నిమ్మల హాజరై ప్రసంగించారు. గిరిజనుల సమస్యలను సిఎం చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు పాలకొల్లు పట్టణ వీధుల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నిమ్మల తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సమావేశంలో పలువురు గిరిజన నేతలు మాట్లాడుతూ గిరిజనులకు 6శాతం రిజర్వేషన్లు ఉన్నా కనీసం మూడు శాతం కూడా అమలు జరగడం లేదని, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వంటి పదవులు గిరిజనుల్లో కొన్ని వర్గాల వారికి రావడం లేదని వాపోయారు. కార్యక్రమంలో పాలకొల్లు మున్సిపల్ ఛైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్ ఛైర్‌పర్సన్ రోజారమణి పాల్గొన్నారు.

డివిజినల్ సహకార అధికారి ప్రసాద్‌కు బంగారు పతకం
ఏలూరు, డిసెంబర్ 6 : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో 2013-14 సంవత్సరానికి గాను అత్యధిక సభ్యత్వాలను చేర్చినందుకు ఏలూరు డివిజనల్ సహకార అధికారి ఎడివి ప్రసాద్ బంగారు పతకాన్ని పొందారు. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర ఛైర్మన్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ చేతులమీదుగా ప్రసాద్ గోల్డ్‌మెడల్‌ను అందుకున్నారు. ప్రసాద్ తూర్పుగోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్లి సహకార అధికారిగా పనిచేసిన సమయంలో అత్యధికంగా సభ్యులను చేర్పించి గోల్డ్‌మెడల్ సాధించారు.
ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి లూథర్, సహకార శాఖ అధికారులు, సిబ్బంది ప్రసాద్‌ను అభినందించారు.

రేషన్ షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 6: విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, సివిల్ సప్లయిస్ అధికారులు పట్టణంలో 29, 32 రేషన్ డిపోలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో షాపు నెం.32లో 45 కిలోలు బియ్యం, ఆరు కిలోలు పంచదార, 330 లీటర్లు కిరోసిన్ అధికంగా ఉన్నట్టుగా గుర్తించారు. షాపు నెం.32లో ఉన్న బియ్యం 1605 కిలోలు, పంచదార 46 కిలోలు, కిరోసిన్ 448 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.11,938గా పేర్కొన్నారు. షాపు నెం.29లో బియ్యం 2264 కిలోలు, పంచదార 73 కిలోలు, కిరోసిన్ 208 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7601గా పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ తహసిల్దార్ వి.శైలజ, విజిలెన్స్ ఎస్‌ఐ కె.సీతారామ్, సివిల్ సప్లయిస్ డిటి అల్లాడి రమణ, వి ఆర్వో ఎ.పోలయ్య పాల్గొన్నారు.

నెమలి వాహనంపై ఊరేగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
ద్వారకాతిరుమల, డిసెంబర్ 6: శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలి వాహనంపై మంగళవారం రాత్రి క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. శ్రీవారి క్షేత్ర ఉపాలయమైన ఈ ఆలయంలో జరుగుతున్న కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని జరిగిన ఈ తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా హంస వాహనాన్ని ఏర్పాటుచేసి అందులో విశేషంగా అలంకరించిన నెమలి వాహనంపై శ్రీవల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని కల్యాణమూర్తులను ప్రతిష్ఠించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిధ్యాలు, సుబ్రహ్మణ్య నామస్మరణల నడుమ స్వామివారి ఊరేగింపు వైభవోపేతంగా జరిగింది.
ఆర్టీసీ సిసిఎస్ అభ్యర్థిగా ఇయు నామినేషన్
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 6: ఆర్టీసీ డిపోలో ఈ నెల 16న జరగనున్న ఆర్టీసీ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సిసిఎస్) ఎన్నికల్లో ఎస్‌డబ్ల్యుఎఫ్ బలపరిచిన ఎంప్లారుూస్ యూనియన్ అభ్యర్థిగా మారిశెట్టి పాండురంగారావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి, డిపో మేనేజర్ నాగభూషణంకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఇయు డిపో కార్యదర్శి కెవి రావు మాట్లాడుతూ పాండురంగారావును గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు బూరుగుపల్లి సూరిబాబు, మన్నవ కృష్ణ చైతన్య, యూనియన్ నాయకులు బివిఎస్‌ఎస్ రంగనాయకులు, కె.ప్రసాద్, డి.రూబెన్, ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నయ్య, దుర్గారావు, బాబూరావు, ఎస్‌డబ్ల్యుఎఫ్ కార్యదర్శి బి.మహేష్, ప్రచార కార్యదర్శి సిహెచ్‌ఎస్ నారాయణ, ఎస్‌డబ్ల్యుఎఫ్ నేతలు నారాయణ, విజయశ్రీ, సుభాషిణి, రాణి, దేవి, సుధాకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలుగునాట విషాదం నింపిన జయలలిత మరణం:బడేటి
ఏలూరు, డిసెంబర్ 6 : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తెలుగునాట తీవ్ర విషాదాన్ని నింపిందని, రెండున్నర దశాబ్ధాల పాటు తెలుగు సినిమాల్లో నటించి మంచి నటిగా కూడా పేరుపొందిన జయలలిత రాజకీయాల్లో తిరుగులేని విప్లవ వనితగా పేరు తెచ్చుకున్నారని ఎమ్మెల్యే బడేటి బుజ్జి అన్నారు. స్థానిక పాతబస్టాండ్ వద్ద మంగళవారం జయలలిత మరణం పట్ల సంతాప సూచకంగా రెండు నిమిషాలు వౌనం పాటించి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పేదల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన జయలలిత జీవితం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా జయలలితకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
అందరివాడు అంబేద్కర్
మంత్రి సుజాత నివాళి
వీరవాసరం, డిసెంబర్ 6: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని, అన్ని సామాజిక వర్గాల వారు సమానంగా ఉండాలన్న ఉద్దేశంతో రిజర్వేషన్లు స్థాపించి, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషిచేశారని రాష్ట్ర మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. మంగళవారం వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో వధువు సంఘం యూత్ ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి సుజాత ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ చింతపల్లి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాది యాతల జ్ఞాన సుందరరాజు ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి సభలో మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. బీంరాం చిన్నతనంలో అనుభవించిన కష్టాలు, కులవివక్షను చూసి చలించి బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం రిజర్వేషన్ ఏర్పాటుచేశారన్నారు. భారత రాజ్యాంగాన్ని రాసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన రూపొందిన రిజర్వేషన్ల వల్లే తాను మంత్రిని అయ్యానని పేర్కొన్నారు. ఆంధ్ర రాజధాని అమరావతిలో 15 ఎకరాల్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి, ఒక గ్రంథాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటుచేస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోనే అభివృద్ధి జరిగేలా చర్యలు తీసకుందన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి సుజాతను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు మానుకొండ ప్రదీప్, ఎంపిపి కౌరు శ్రీనివాసరావు, పోలిశెట్టి దాసు, వీరవల్లి చంద్రశేఖర్, చిక్కాల రాజు, ఎంపిటిసి సభ్యురాలు పొమ్మన నాగలక్ష్మి, టిడిపి నాయకులు పీతల వరప్రసాద్, పోతురాజు సుబ్బారావు, వధువు సంఘం యూత్, ఆకుల బాలరాజు, భోగిరెడ్డి గోవిందరావు, గొడ్డుపల్లి మార్తెమ్మ, జక్కంశెట్టి రాజాప్రసాద్, గెడ్డం బాస్కరరావు, అడిదెల చిరంజీవిరావు, సంది జయరాజు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో త్వరలో ఎస్సీ స్టడీ సర్కిల్
జడ్పీ మాజీ ఛైర్మన్ జయరాజు
ఏలూరు, డిసెంబర్ 6 : స్థానిక అమీనాపేటలో దళఙతుల పేద దళిత విద్యార్ధుల సౌకర్యార్ధం 4.5 కోట్ల రూపాయల వ్యయంతో ఎస్‌సి స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, త్వరలోనే కార్యరూపం దాల్చనున్నట్లు జడ్పీ మాజీ ఛైర్మన్ కె జయరాజు చెప్పారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పాత బస్టాండ్ వద్ద మంగళవారం అంబేద్కర్ నిలువెత్తు కాంస్య విగ్రహానికి జయరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చదువువల్లే దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలరని అంబేద్కర్ చెప్పారని ఆయన ఆశయ సాధన కోసం ఏలూరులో స్టడీ సర్కిల్ కార్యరూపం దాల్చనున్నట్లు చెప్పారు. తాను జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా వున్న కాలంలో ఏలూరులో ఎస్‌సి స్టడీసర్కిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి జడ్పీ నుండి 22 లక్షల రూపాయలు ఖర్చు చేసి స్టడీ సర్కిల్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టానని ఎంతో మంది పేద దళితుల కోసం పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్స్‌ను సమకూర్చానని ఆ రోజుల్లో 60 మంది దళితులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి అధికారులుగా ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మెరుగు సత్యనారాయణ, మెండెం ఆనంద్, పులవర్తి కొండబాబు, పాము శామ్యూల్, పల్లెం ప్రసాద్, చింతా మహాలక్ష్ముడు, ఎలిపే నరేష్, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.
మీకోసం ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి
అధికార్లకు సబ్-కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆదేశం
నరసాపురం, డిసెంబర్ 5: మీకోసం కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన 20 ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకంతో దూర ప్రాంతాలనుంచి ప్రజలు తరలివస్తున్నారన్నారు. దీనికి అనుగుణంగా అధికారులు సమస్యలను సత్వరం పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఇఒ మద్దూరి సూర్యనారాయణమూర్తి, ఎడి మురళీకృష్ణ, డిఎల్‌పిఒ శ్రీరాములు, ఇరిగేషన్ డిఇఇ శ్రీమన్నారాయణ, పంచాయితీరాజ్ ఇఇ ఎస్ రఘుబాబు, మున్సిపల్ కమిషనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కొవ్వూరు ఆర్‌డివో బదిలీ
డ్వామా పిడిగా విద్యావతి
ఏలూరు, డిసెంబర్ 6 : కొవ్వూరు ఆర్‌డివో శ్రీనివాసరావు బదిలీ అయ్యారు. ఆయన్ను చిత్తూరు జిల్లా డి ఆర్‌డి ఏ పిడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదే విధంగా డ్వామా పిడిగా నెల్లూరు డ్వామా పిడి విద్యావతిని జిల్లా డ్వామా పిడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం డ్వామా పిడిగా వున్న వెంకటరమణను మాతృశాఖకు బదిలీ చేశారు. ఆయన జిల్లా డిసి ఎం ఎస్ బిజినెస్ మేనేజర్‌గా కొనసాగనున్నారు. కొవ్వూరు ఆర్‌డివోగా ఇంకా ఎవరినీ నియమించలేదు.