పశ్చిమగోదావరి

ఇంకెన్నాళ్లీ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 8 : పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడిన దగ్గర నుంచి మొదలైన జనం కష్టాలు నెలరోజులు గడచిపోయినా కొనసాగుతూనే వున్నాయి. ప్రతీ ఒక్కరిలోనూ ఒక్కటే ప్రశ్న వినిపిస్తోంది. ఇంకెన్నాళ్లీ కష్టాలన్న ఆవేదనే కనిపిస్తోంది. బ్యాంకులన్నీ క్యూల మధ్యే కిటకిటలాడిపోతున్నాయి. చిన్న నోట్ల కోసం బారులు తీరుతున్న ఉద్యోగులు, సామాన్య జనమే అన్ని చోట్ల దర్శనమిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే జీతం మొత్తంలో బ్యాంకులంగీకరించే మొత్తాన్ని పొందాలంటే ఒక రోజు ఉద్యోగానికి సెలవు పెట్టక తప్పని పరిస్థితులున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎప్పటికి సాధారణ జన జీవితం సాధ్యమవుతుందన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. మరోవైపు నల్లధనం అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంత వరకు నల్లధనం వెలుగుచూసిందో, ఎంతమంది నల్ల కబేరులను బయటకు తీసుకువచ్చిందో తెలియదు కానీ ఒకటొకటిగా ఐటి దాడుల్లో బయటపడుతున్న వ్యవహారాలను చూస్తే మాత్రం జనంలో ఆగ్రహం, అసంతృప్తి పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. ఐటి దాడులు జరిగాయన్న సమాచారం వెలుగుచూడగానే కోట్ల రూపాయల్లోనే నగదు దర్శనమిస్తుండటం, అది కూడా కోట్లలోనే కొత్తనోట్లు సీళ్లు కూడా విప్పని స్థితిలో బయటపడుతుండటం చూసి జనమంతా విస్తుపోతున్నారు. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు జీతం రాళ్ల కోసం పెన్షన్ సొమ్ముల కోసం రోజుల తరబడి క్యూలైన్లలో గడిపేస్తుంటే నల్లకుబేరులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా తమ వద్ద వున్న పాత నోట్లను కోట్లలోనే మార్చేసి కొత్త నోట్లను కూడా అదే స్థాయిలో దాచేసుకుంటున్నారన్న సమాచారం అందరిలోనూ ఆగ్రహానికి కారణమవుతోంది. కాగా గురువారం నాటి పరిస్థితులు పరిశీలిస్తే దాదాపుగా ప్రతీ బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తూనే వున్నాయి. మరోవైపు కొన్ని బ్యాంకుల్లో వారానికి 24 వేల రూపాయలు విత్‌డ్రా చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించినా ఆ మేరకు నగదు ఇచ్చేది లేదంటూ బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. చాలా మందికి అయిదు నుంచి ఆరు వేల రూపాయలు లోపు మాత్రమే నగదు ఇస్తూ మిగిలిన వాటికి వచ్చే వారం రావాలంటూ తిప్పి పంపేస్తున్నారు. ఎలాగోలా ఎటి ఎంలలో నగదు తీసుకుందామనుకున్నా అక్కడ కూడా రెండు వేలకు మించి రాకపోవడం, అది కూడా రెండు వేల రూపాయల నోటు చేతిలో పడుతుండటంతో జనం ఉసూరుమంటున్నారు. ఈ పరిస్థితులతో ఎక్కడ చూసినా చిన్న నోట్ల కోసం అంతకుమించి చెలామణీ అయ్యే నోట్ల కోసం జనం పడే కష్టాలు అన్నీ, ఇన్నీ కాకుండా మారిపోయాయి. మరోవైపు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించడం, దానికి తగ్గట్టు యంత్రాలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు మరింత ముమ్మరమయ్యాయి. వాస్తవానికి చెలామణి అయ్యే నోట్ల సంఖ్య మార్కెట్‌లో భారీగా తగ్గిపోవడంతో ఇప్పటికే దాదాపు నగదు రహిత పరిస్థితి వచ్చేసిందని, ఇలాంటి సందర్భంలో పులిమీద పుట్రలా యంత్రాలు కూడా ప్రవేశపెడితే వాటితో ఎలా వేగాలో అంటూ జనం అయోమయానికి గురవుతున్నారు. దీనికి తోడు ఇప్పటికిప్పుడు ఎటి ఎం కార్డు, రూపే కార్డో చేజిక్కించుకుని ఈ కష్టాల నుంచి కొంతలో కొంత బయటపడదామని ఖాతాదారులు ప్రయత్నం చేసినా అవకాశాలు కూడా దూరమవుతున్నట్లే కనిపిస్తోంది. దాదాపుగా అన్ని బ్యాంకుల్లోనూ సిబ్బంది మొత్తం డిపాజిట్లు వేసే వారితోనూ, పింఛన్లు తీసుకునే వారితోనూ నిండిపోగా ఈ ఎటి ఎం, రూపే కార్డులు కావాలంటే ఇప్పట్లో సాధ్యం కాదని, కనీసం నెల రోజులు వేచి వుండాల్సిందేనన్న సమాధానం చాలా బ్యాంకుల్లో వినిపిస్తోంది. దీనితో అటు నగదు చేతికి అందక, ఇటు కార్డులు వచ్చే అవకాశం లేక చాలా మంది మరింత గందరగోళానికి గురవుతున్నారు.
మరో పరిణామంలో వాణిజ్య పన్నుల శాఖ, ఆంధ్రాబ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వాణిజ్య పన్నుల అధికారి కార్యాలయంలో ఇ-పోస్ మేళా జరిగింది. నగదు రహిత లావాదేవీల వైపు మొగ్గుచూపే డీలర్లతో అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా 26 మంది డీలర్లు సదస్సులో పాల్గొనగా 11 మంది ఇ-పోస్ యంత్రాలు కావాలని దరఖాస్తులు ఇచ్చారు. వారికి వారం రోజుల్లో ఈ యంత్రాలను అందజేస్తామని చెప్పారు. మొత్తం మీద ఒక వైపు నోట్ల కష్టాలు కొనసాగుతూనే వుంటే మరోవైపు నగదు రహితమంటూ యంత్రాంగం తమ వంతు ఏర్పాట్లతో ముందుకు వెళుతోంది.

తుపానుతో అప్రమత్తంగా ఉండాలి
అధికారులకు సబ్-కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశం
నరసాపురం, డిసెంబర్ 8: వార్ధా తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆదేశించారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో తుపాను ముప్పుపై తీసుకోవల్సిన జాగ్రత్తలపై డివిజన్‌లోని తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో సబ్-కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి నేపథ్యంలో సూపర్ తుపాను సంభవించే అవకాశం ఉందని వాతారణ శాఖ హెచ్చరించిందన్నారు. తుపాను పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రైతులు పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించాలన్నారు. కోత కొయ్యని చేలలో వెంటనే కోతలు చేపట్టాలన్నారు. ఇందుకు అధికారులు గ్రామాల్లో పర్యటించి తుపాను ముప్పుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. పడవలు, వలలు, పనిముట్లను మత్స్యకారులు భద్రపరుచుకోవాలన్నారు. గ్రామాల్లో టాంటాం వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, భవనాలు, తుపాను భవనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. బియ్యం, కిరోసిన్, గ్యాస్, జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి వై.సాయిలక్ష్మి ఈశ్వరి, తహసీల్దార్లు దాసి రాజు, శ్రీపాద హరనాధ్, జి.సూర్యనారాయణరెడ్డి, కె.శ్రీరమణి, వై.దుర్గాకిషోర్, సబ్ కలెక్టర్ ఎఒ టి.రాధిక, ఎడిఇలు పి.మురళీకృష్ణ, సత్యనారాయణ, ఎం.జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.