పశ్చిమగోదావరి

మావుళ్ళమ్మ ఉత్సవాలకు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంభర్ 9: నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, మావుళ్ళమ్మ ఉత్సవ కమిటీ, దేవస్థానం సంముక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 13 నుంచి జరిగే మావుళ్ళమ్మ అమ్మవారి 53వ వార్షిక మహోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద పందిరి రాట ముహూర్తం నిర్వహించారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు రామాయణం గోవిందరావుతో ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం పూజా కార్యక్రమాలు చేయించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరంవలె 36 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 17న అఖండ అన్నసమారాధన నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మావుళ్ళమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మానే పేరయ్య, కాగిత వీరమహంకాళిరావు, కొప్పుల సత్యనారాయణ(సత్తిబాబు), రామాయణం సత్యనారాయణ, అడ్డాల రంగారావు, తుటారపు ఏండుకొండలు, కొప్పుల రంగారావు, అప్పన రామకృష్ణ, మెంటే బాబి, మావుళ్ళమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కార్మూరి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రతిజ్ఞ అంటే పరారే

ఏలూరు, డిసెంబర్ 9 : అవినీతి వ్యతిరేక దినోత్సవాన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండేవారే ముందుకు రావాలని స్వయంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ పిలుపునకు విచిత్రమైన స్పందన లభించింది. స్థానిక కలెక్టరేట్‌లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవ నిర్వహణ సందర్భంగా దాదాపుగా విడ్డూరం చోటు చేసుకుంది. ప్రతిజ్ఞ చేసేవారిలో 80 శాతం మంది అవినీతికి పాల్పడుతూనే వున్నారని, అలాంటప్పుడు ప్రతిజ్ఞకు విలువ ఏమి వుంటుందని, కనీసం నెలరోజులైనా అవినీతికి పాల్పడబోనని ధైర్యంగా చెప్పే వారు ఈ ప్రతిజ్ఞలో పాల్గొంటే మంచిదని కలెక్టర్ సూచించారు. దీనికి స్పందన మాత్రం కొంత వెరైటీగానే వచ్చింది. సమాచార శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన ఆధారంగా చూస్తే ఆ సమావేశ మందిరం నుంచి ఎంపిడివోలు, ఇవోపిఆర్‌డిల్లో సగం మంది అక్కడ నుంచి బయటకు వెళ్లిపోవడం విడ్డూరంగా వుంది. వీరంతా ఎందుకు వెళ్లిపోయారన్న విషయంలో స్పష్టత లేకపోయినా ఈ పరిణామం చోటుచేసుకున్న వెంటనే వారు అక్కడ నుంచి నిష్క్రమించడం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారినట్లు కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ ప్రతీ ఏటా ప్రభుత్వాదేశాల ప్రకారం అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞను అందరూ చేస్తున్నారని, అయితే తన వరకు తాను అవినీతికి ఆస్కారం లేని విధంగా వ్యవహరించానని, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటానని స్పష్టంచేశారు. అయితే ఈ ప్రతిజ్ఞ చేసేవారిలో 80 శాతం అవినీతికి పాల్పడుతూనే ఉన్నారని, అలాంటప్పుడు ఈ ప్రతిజ్ఞకు విలువేముంటుందని కలెక్టర్ ప్రశ్నించారు. కనీసం ఒక నెల రోజులు అవినీతికి పాల్పడబోమని ధైర్యంగా చెప్పేవారు ఈ ప్రతిజ్ఞలో పాల్గొంటే సమాజంలో కొన్నాళ్లైనా అవినీతి నిర్మూలన సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతిజ్ఞ చేయించే ముందు సమావేశంలో వున్న అధికారులనుద్దేశించి మాటకు కట్టుబడి ప్రతిజ్ఞలో పాల్గొనాలని కోరారు. అదే సమయంలో సమావేశ మందిరంలో వున్న ఎంపిడివోలు, ఇవోపిఆర్‌డిల్లో సగం మంది లేచి బయటకు వెళ్లిపోవడం విశేషం. ఈ పరిణామం సమావేశ మందిరంలోని అధికారులను విస్తుపోయేలాచేసింది. సమావేశంలో జెసి పి కోటేశ్వరరావు, డిఆర్‌ఒ కట్టా హైమావతి, డిపివో సుధాకర్, ఆర్‌డబ్ల్యు ఎస్ ఎస్‌ఇ అమరేశ్వరరావు, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాసులు, డ్వామా పిడి వెంకటరమణ, డివిజనల్ పంచాయితీ అధికారులు పలువురు ఎంపిడివోలు, ఇవోపిఆర్‌డిలు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
మళ్లీ ఉద్యమబాట

భీమవరం, డిసెంబర్ 9: కాపునాడు ఉద్యమబాట పట్టనుంది. ఇక నుంచి దశల వారీగా ఉద్యమాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఒకే తరహాలో ఉద్యమాలు చేయనున్నారు. కాపు సోదరులంతా ఒకే వేదిక పైకి రావడంతో కాపునాడు ఆధ్వర్యంలో ఈ ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కాపులను బీసీల్లో చేరుస్తానని 2014 ఎన్నికల మ్యాన్‌ఫెస్టోల్లో చేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని ఉద్యమానికి కాపుఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం సిద్ధమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుండి అంతర్వేది వరకు సత్యాగ్రహ పాదయాత్ర పేరుతో ఉద్యమాన్ని ఆయన ప్రారంభించాల్సి వుంది. అయితే ఈ పాదయాత్ర జరగనీయకుండా ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. అలాగే ముద్రగడను గృహనిర్బంధం చేసిన సంగతి విదితమే. ఆ సమయంలోనే ఎప్పుడు పోలీసులు తనను విడుదల చేస్తారో అప్పటి నుంచే ఉద్యమానికి దిగుతానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 18న అన్ని జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోని కాపుసోదరులు స్వచ్ఛందంగా కూడలిలోకి వచ్చి మూతికి నల్లగుడ్డలు కట్టుకుని, కంచాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తారు. రెండో దశలో ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపిలను కలిసి వినతిపత్రాలు ఇస్తారు. ఇక జనవరి 9న అన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తులతో ప్రదర్శన చేస్తారు. ఈ మూడు ఆందోళనలు పూర్తి చేసిన తర్వాత రావులపాలెం నుండి అమలాపురం మీదుగా అంతర్వేది వరకు ముద్రగడ సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభిస్తారు. గతంలో ముద్రగడ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ సారి అటువంటి సంఘటనలు పునరావృతంకాకుండా ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ముద్రగడ పాదయాత్రకు అన్ని జిల్లాల నుంచి భారీగా కాపుసోదరులు తరలివెళ్ళేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
శని, ఆదివారాల్లో ప్రత్యేక కౌంటర్లు పెట్టాలి
ఏలూరు, డిసెంబర్ 9 : జిల్లాకు బ్యాంకులు ద్వారా ప్రజలకు నగదు అందించడానికి 1100 కోట్ల రూపాయల కరెన్సీని విమానం ద్వారా తీసుకురానున్నామని ఈ నెల 10వ తేదీ నుండి 11వ తేదీ వరకూ సెలవు దినాల్లో కూడా బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి ముఖ్యంగా రైతులకు 24 వేల రూపాయలు చొప్పున నగదు అందుబాటులోనికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకు అధికారులతో కరెన్సీ నోట్ల కొరత తీరుపై, డిజిటల్ కరెన్సీ విధానం అమలుపై ఆయన సమీక్షించారు. జిల్లాలో బ్యాంకుల వద్ద రైతులు డబ్బు కోసం పడిగాపులు పడి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వంతో చర్చించి 1100 కోట్ల రూపాయలు జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపు చేయించామని ఈ డబ్బు విమానం ద్వారా గన్నవరం చేరుకుంటుందని అక్కడి నుండి పోలీసు రక్షణతో ప్రత్యేక కంటైనర్లు ద్వారా బ్యాంకులకు చేరుస్తామని సెలవు రోజుల్లో బ్యాంకులు మూసివేయకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అన్నదాతకు 24 వేల రూపాయలు చొప్పున సొమ్ము చెల్లించాలని సూచించారు. ఆ డబ్బుతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేసుకోగలుగుతారని చెప్పారు. రిజర్వు బ్యాంకు నిబంధనలు మేరకు ప్రతీ బ్యాంకులో ఖాతాదారునికి వారానికి 24 వేల రూపాయలు సొమ్ము ఇచ్చి తీరాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో ఎల్ డి ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, వివిధ బ్యాంకు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌బిఐ ఖాతాదారుల రాస్తారోకో
ఉంగుటూరు, డిసెంబర్ 9: తమకు నగదు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఎస్‌బిఐ ఖాతాదారులు శుక్రవారం జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. వాహనాలను నిలిపివేయడంతో సుమారు 20 నిముషాలు జాతీయ రహదారికి ఇరువైపులా బారులుతీరి వాహనాలు నిలిచిపోయాయి. పెద్దవాళ్లకు ఎంత కావాలంటే అంత ఇస్తున్న బ్యాంకు అధికార్లు చిన్న, సన్నకారు, కౌలురైతులకు ఇవ్వడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై చావా సురేష్ ఎటువంటి గొడవలు జరగకుండా పర్యవేక్షించారు.
తుపాను హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం
భీమడోలు, డిసెంబర్ 9 : తుపాన్ హెచ్చరిక నేపధ్యంలో మండలంలోని అధికారులు అప్రమత్తమయ్యారు. మల్లవరం, చెట్టున్నపాడు, ఆగడాలలంక, కోరుకొల్లు గ్రామాల్లో గల తుఫాన్ రక్షిత భవనాలను పునరావాసానికి అనువుగా సిద్ధం చేస్తున్నారు. రేషన్ డీలర్ల వద్ద సరుకుల నిల్వలు పరిశీలించారు. తహశీల్దార్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారుల సమన్వయంతో గ్రామాల వారీగా గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. ఇక వ్యవసాయ శాఖ పరంగా మండలంలోని 65 హెక్టార్ల విస్తీర్ణంలో కుప్పలు పొలాల్లో వున్నట్లు గుర్తించారు. తుఫాన్ రానున్న నేపధ్యంలో మాసూళ్లు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. ధాన్యం, ఇతర కుప్పలను అవసరం మేరకు స్థానికంగా గల గోదాములు, ఐకెపి కొనుగోలు కేంద్రాల వద్ద భద్రపర్చుకొనేందుకు ఆర్‌డివో సహకరిస్తామని హామీ ఇచ్చారని వ్యవసాయాధికారులు రైతులకు భరోసా ఇస్తున్నారు.

జనరంజక పథకాలను జావగారుస్తారా
ఏలూరు, డిసెంబర్ 9 : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్భ్రావృద్ధి కోసం 2003లో పాదయాత్ర నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని 2004లో అధికారంలోకి వచ్చాక వాటిని, ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేశారని వైసిపి జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు. వైసిపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద రాజీవ్ ఆరోగ్యశ్రీ పధకంపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ వైఎస్ ప్రవేశపెట్టిన ప్రతీ పధకం కూడా ప్రజాభిమానాన్ని పొందాయని, ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా ఉన్నాయని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పధకాన్ని ప్రవేశపెట్టి అనేక మంది పేదలకు లక్షలాది రూపాయలు ఖర్చయ్యే గుండె శస్తచ్రికిత్సలను కూడా ఉచితంగా చేయించారన్నారు. 2003 వరకు వున్న టిడిపి ప్రభుత్వం హయాంలో పెన్షన్, రేషన్ కార్డు కావాలంటే ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారని, ఒకరు మృతిచెందితే గానీ మరొకరికి పెన్షన్ ఇచ్చేవారు కాదని, అటువంటి విధానాలకు మహానేత రాజశేఖర్‌రెడ్డి స్వస్థి చెప్పి దరఖాస్తు చేసుకున్న ప్రతీ వ్యక్తికి కూడా పెన్షన్, రేషన్ కార్డులు అందజేశారన్నారు. ఎన్నో జనరంజకమైన కార్యక్రమాలు నిర్వహించి రూపొందించిన పధకాలను టిడిపి ప్రభుత్వం వాటి పేర్లను మార్చింది కానీ లక్ష్యాలను మాత్రం సాధించడం లేదని విమర్శించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఎన్‌టి ఆర్ వైద్య సేవ అని, పల్లెవెలుగు బస్సులకు తెలుగు వెలుగు అని, పెన్సన్లకు ఎన్‌టి ఆర్ భరోసా అని పేర్లు మార్చుకుంటూ వెళ్లింది కానీ అసలు ప్రజలకు జరిగిన ప్రయోజనం అంటూ ఏమీ లేదని అన్నారు. ఎన్నికల్లో బిజెపి, టిడిపి ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చి వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు. రాష్ట్రానికి అతిముఖ్యమైన ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీ తిరుపతి సభలో ప్రకటించడం, తదుపరి ప్రచారాల్లో చంద్రబాబు ప్రత్యేక హోదా తెస్తామనడం జరిగాయి కానీ అవి అమలుకాలేదని, ప్రత్యేక ప్యాకేజీతోటే సరిపెట్టుకున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో వున్న నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతీ ఒక్కరి బ్యాంకు ఖాతాకు 15 లక్షల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పి ఇప్పటికి ఏమి చేశారంటూ ప్రశ్నించారు.
ధరలను కూడా నియంత్రించలేకపోయారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతీ రంగంలో కూడా బిజెపి, టిడిపి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, ప్రజలకు అన్నీ తెలుసునని, ఎప్పుడు ఏ విధంగా బుద్ది చెప్పాలో అలాగే చెబుతారని స్పష్టం చేశారు. రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనే ధ్యేయంగా వైఎస్ జగన్ వ్యవహరిస్తారని, ఆయన ఆశయాల మేరకు పరిపాలన కొనసాగిస్తారని అన్నారు. వైసిపి నాయకులు తెల్లం బాలరాజు, సర్రాజు, ఘంటా మురళీ రామకృష్ణ, కొఠారు రామచంద్రరావు, తానేటి వనిత, బోడా కిరణ్‌కుమార్, గుడిదేశి శ్రీనివాసరావు, బొద్దాని శ్రీనివాస్, మున్నుల జాన్‌గురునాధ్, తలారి వెంకట్రావు, వేగి లక్ష్మీ ప్రసాద్‌లతోపాటు 15 నియోజకవర్గాల నుంచి వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సమస్యలు పరిష్కరించాలనే ఉద్యమం
ఆచంట, డిసెంబర్ 9: కాపుల సమస్యలు పరిష్కరించాలని మాత్రమే కోరుతున్నామని, తాము ఏపార్టీకి వ్యతిరేకం కాదు ఏపార్టీకి అనుకూలం కాదని జిల్లా కాపునాడు అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు అన్నారు. శుక్రవారం పెనుమంచిలిలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో టిడిపి కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీయచ్చిందని, దానిని అమలుచేయాలని కోరుతున్నాము తప్ప తాము టిడిపికి వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. గతంలో కన్నా ఎంతో కొంత ముందుకు వచ్చి కాపులకు ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి రుణాలు ఇవ్వడం, మంజునాధ్ కమిషన్ వేయడం అభినందనీయమన్నారు. అయితే గతంలో ఇదేవిధంగా పుట్టుస్వామి లాంటి కమీషన్లు వేసి బుట్టదాఖలు చేశారని, మంజునాధ్ కమీషన్ కూడా ఆవిధంగా కాకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వానికి జ్ఞాపకం చేసేందుకు మాత్రమే ఉద్యమాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం హామీని నిలబెట్టుకొని, కాపుల మద్దత్తు పొందాలని వెంకట్రాయుడు కోరారు. కాపుకార్పొరేషన్ డైరెక్టర్ యర్రా నవీన్ మాట్లాడుతూ కాపులను బిసిల్లో చేర్చాలని మంజునాధ్ కమీషన్‌ను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. జిల్లాలో చాలా మండలాలలో కాపుకార్పొరేషన్ రుణాలు సక్రమంగా అందడం లేదని జిల్లా కాపుసంఘం అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు తమ దృష్టికి తీసుకువచ్చారని, పార్టీలకు అతీతంగా అర్హులైన పేదకాపులకు రుణాలు ఇచ్చేందుకు కృషిచేస్తామన్నారు. సమావేశంలో జిల్లా కాపుసంఘ నాయకులు వంగా నరసింహారావు, గణేశుల నాగేశ్వరరావు, తోలేటి రాంబాబు, మానేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జగన్ ఆరోపణలు విడ్డూరం
ఏలూరు, డిసెంబర్ 9 : కాంగ్రెస్ ప్రభుత్వంలో పతనమైన ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరిచి ప్రతీ కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తోందని టిడిపి జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాలి ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌టి ఆర్ వైద్యసేవా పధకం అమలుపై ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ చేస్తున్న ఆరోపణలు విడ్డూరంగా వున్నాయన్నారు. వై ఎస్ ఆర్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని వ్యాపారంగా మార్చి కార్పొరేట్ ఆసుపత్రులకు కొమ్ముకాసి ప్రభుత్వాసుపత్రులను నిర్వీర్యం చేశాయన్నారు. ప్రజలు ఎదుర్కొనే ముఖ్యమైన జబ్బులకు ఎటువంటి సహాయాన్ని చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. గతంలో 938 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తింపు వుంటే ప్రస్తుతం ప్రజలకు అవసరమైన 106 వ్యాధులను అదనంగా కలిపి ఇప్పుడు 1044 వ్యాధులకు ఎన్‌టి ఆర్ వైద్య సేవా పధకం అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వాసుపత్రుల్లో అయిదు శాతం మాత్రమే ఆపరేషన్లు జరిగేవని, ప్రస్తుతం 30 శాతం జరుగుతున్నాయన్నారు. పేదల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తూ అనేక పధకాలను అమలు చేస్తుంటే ఓర్వలేక జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

అలహాబాద్ హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 9: ముస్లిం మహిళల విడాకులకు సంబంధించి మూడుసార్లు తలాక్ రాజ్యాంగ విరుద్ధమని, ఇది చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి పేర్కొన్నారు. శుక్రవారం దేవాదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో మహిళా లోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోందన్నారు. కొందరు తమ స్వార్థప్రయోజనాల కోసం ఇటువంటి అమానవీయ కార్యక్రమాలు అమలు చేస్తూ సామాన్య ముస్లిం మహిళలను రోడ్డున పడేసేలా వ్యవహరించడం దారుణమన్నారు. తలాక్ చట్టవిరుద్ధమని, దీనిని అమలు చేయాల్సిన అవసరంలేదని అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు ముస్లిం మహిళల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. పౌరులందరికీ ఒకే విధంగా హక్కులుండాలనేది బిజెపి విధానమన్నారు. పాకిస్తాన్, సౌదీ అరేబియా, కువైట్, గల్ఫ్ వంటి ముస్లిం దేశాల్లో సైతం తలాక్ చట్టం అమల్లో లేదన్నారు. భారతదేశంలో ముస్లిం లా బోర్డు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలను సమర్థిస్తుందన్నారు. ప్రతి మహిళ తమ హక్కులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నదే బిజెపి లక్ష్యమన్నారు. బిజెపి జిల్లా కార్యదర్శి కంచుమర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ ముస్లిం మహిళల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి పనిచేస్తున్నారన్నారు. సమావేశంలో మహిళా మోర్చా నాయకులు కోట పుష్పకుమారి, ధనలక్ష్మిరెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
అవినీతి రహిత సమాజానికి కృషిచేయాలి

భీమవరం, డిసెంబర్ 9: ఆవినీతి వ్యతిరేక అవగాహన దినోత్సవ ర్యాలీ సదస్సు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు భీమవరం రెవిన్యూ శాఖ, ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్ సలహా సంఘ సభ్యులు చెరుకువాడ రంగసాయి సంయుక్త ఆధ్వర్యంలో తాలూకాఫీసు కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భీమవరం తహసీల్దారు సిహెచ్‌ఎల్ ప్రసాద్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులతో ఆవినీతి నిర్మూలనా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అనంతరం భీమవరం పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్ స్కూల్ హెచ్‌ఎం హెరాల్ కుమార్, డాక్టర్ సివి రామన్ స్కూల్ డైరెక్టర్ బర్సా రాజు, రమణం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.