పశ్చిమగోదావరి

ఉత్తమ వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 11: సామాన్య ప్రజల కోసం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు ఆధునీకరించి అత్యుత్తమ వైద్యసేవలందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మంత్రి కార్యాలయంలో వైద్యసహాయం నిమిత్తం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలందరికీ అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో 1100 వ్యాధులకు ఉచితంగా వైద్యసేవలు అందించడం జరుగుతోందన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలంతా ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ బీజేపీ నేత యెగ్గిన నాగబాబు, బీజేపీ నాయకులు కంచుమర్తి నాగేశ్వరరావు, కర్రి ప్రభాకర బాలాజీ, అయినం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక కేంద్రంగా తీర ప్రాంతం
నరసాపురం, డిసెంబర్ 11: తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా దీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. ఆదివారం స్థానిక వలంధర రేవులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రివర్ వ్యూ రెస్టారెంటు పనులకు ఎంపి తోట, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మున్సిపల్ చైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాలసాయి భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఎంపి సీతారామలక్ష్మి మాట్లాడుతూ తీరం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి సాధిస్తే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, మున్సిపల్ వైస్ చైర్మన్ పొన్నాల నాగబాబు, కౌన్సిలర్ పెదసింగు మణి, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎస్ పట్ట్భారామయ్య, మున్సిపల్ కమిషనర్ పి రమేష్, తహసీల్దారు జి సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఒకటే టెన్షన్

ఏలూరు, డిసెంబర్ 11 : అందరిలోనూ ఇప్పుడు ఒకటే టెన్షన్ కనిపిస్తోంది. ప్రధానంగా రైతుల్లో ఈ ఆందోళన స్పష్టంగా వ్యక్తమవుతోంది. వార్ధా తుపాను దూసుకువస్తుందన్న సమాచారం జిల్లాలో కూడా కొంత ఆందోళనను రేకెత్తించింది. అయితే ఇంకా తీరం చేరని ఈ తుపాను దిశ మార్చుకుంటూ బలహీన పడవచ్చు లేదా తీరం దాటే ప్రాంతం మారవచ్చునన్న అంచనాలు వున్నప్పటికీ మొత్తంగా చూస్తే మాత్రం ఎంతోకొంత ప్రభావం జిల్లాపై కూడా తప్పకపోవచ్చునన్న ఆందోళన మాత్రం లేకపోలేదు. ఆదివారం రాత్రి సమయానికి పరిస్థితి చూసుకుంటే ఈ తుఫాను దిశ మార్చుకుని చెన్నై వద్ద తీరం దాటే అవకాశముందని చెబుతున్నారు. అంతకుముందు మచిలీపట్నం, నెల్లూరు మధ్యలో ఈ తుపాను తీరం దాటే అవకాశం వుందన్న అంచనాలు వెలువడ్డాయి. అదే జరిగితే కోస్తాపై ఆ ప్రభావం గట్టిగానే కనిపించేది. అయితే ఆ పరిస్థితిలో మార్పు వచ్చినట్లు రాత్రి సమయానికి అంచనాలు వెలువడినా ఇలా దిశ మారుతూ ఎటు నుంచి ఎటు వస్తుందోనన్న ఆందోళన మాత్రం రైతులను వీడటం లేదు. ఏది ఏమైనా తుపాను ప్రభావం కారణంగా వర్షాలు కురిస్తే మాత్రం కళ్లాల్లో ధాన్యం ఉంచుకున్న రైతాంగానికి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయముంది. వాస్తవానికి ఇప్పటికే ఖరీఫ్ కోతలు పూరె్తై దిగుబడులు కూడా మిల్లర్ల వద్దకు చేరిపోయిన పరిస్థితి.
అయితే దిగుబడులు చేతికి అందే సమయానికి కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడంతో వచ్చిన ధాన్యం మిల్లర్లకు తోలినా చాలా చోట్ల పాత నోట్లే రైతాంగానికి అప్పగిస్తుండటంతో కొన్ని చోట్ల రైతులు ధాన్యాన్ని కళ్లాల్లోనే ఉంచారు. అయితే గత రెండు రోజులుగా తుపాను వస్తుందన్న సమాచారం అందుకుని వారంతా హడావిడిగా ఉన్న ధాన్యాన్ని సురక్షితమైన ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి మరికొంత వ్యయం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు వచ్చిన దిగుబడి విక్రయించి ఆ సొమ్ముతో చేసిన అప్పులు తీరుద్దామనుకుంటే నోట్ల రద్దుతో ఇబ్బందులు వచ్చాయన్న ఆవేదన వ్యక్తమవుతూనే వుంది మరోవైపు ఉన్న పరిస్థితి చక్కబడిన తరువాత ధాన్యం విక్రయిద్దామని అనుకుంటే అనూహ్యంగా తుపాను హెచ్చరికలు వచ్చిపడ్డాయని, దీనితో మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
ఆ అంశాన్ని అలా ఉంచితే మెట్ట ప్రాంతంలో అధికంగా సాగులో వున్న మొక్కజొన్నకు మాత్రం ఇప్పుడు ఏ కొద్దిపాటి వర్షాలు పడినా ఇబ్బందులు తప్పకపోవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా చోట్ల ఈ పంట దాదాపు చివరి దశకు చేరుకోవడంతో ఈ సమయంలో ఒక మోస్తరు స్థాయి దాటి వర్షాలు పడితే పంట ఇబ్బందుల్లో పడి నాణ్యత దారుణంగా పడిపోయే ప్రమాదముందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం మీద సోమవారం నాటికి కొంతమేరకు తుపానుకు సంబంధించి సమాచారంలో పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశమున్నప్పటికీ ఆ ప్రభావం జిల్లాపై ఉంటే రైతాంగానికి నష్టం తప్పదన్న అంచనా మాత్రం లేకపోలేదు. మరోవైపు తుఫాన్ కారణంగా వచ్చే ఇబ్బందులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావానికి గురయ్యే అవకాశమున్న ప్రాంతాల్లో అధికారులందరినీ అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అలాగే కంట్రోల్ రూమ్‌లు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కాగా శని, ఆదివారాల్లో చలి తీవ్రత మరికొంత అధికం కావడంతోపాటు ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎండ పూర్తిగా అంతర్ధానమై వాతావరణం పూర్తిగా చల్లబడిపోవడం తుఫాన్ కారణంగానేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విధంగా వాతావరణంలో పూర్తి మార్పు రావడంతో రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు ఎలా మారతాయోనన్న ఆందోళన మాత్రం అందరిలోనూ వుంది.
తాడిపూడి కాలువ రైతుల కడగండ్లు
గోపాలపురం, డిసెంబర్ 11: తాడిపూడి కాలువ అధికారుల తీరు పట్ల మండల రైతాంగం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాలువ నీరు విడుదలచేసే ముందు కాలువకు మరమ్మతులు చేయాల్సివుంది. భీమోలు గ్రామం వద్ద ప్రధాన కాలువకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. ఎగువ ప్రాంతం నుంచి వచ్చేనీరు దిగువ ప్రాంతానికి వెళ్లే అవకాశం లేక పలుచోట్ల కాలువ గట్లు కోతకు గురై గండ్లు పడ్డాయి. అవి పూడ్చకుండానే అధికారులు నీరు విడుదల చేశారు. గత మూడేళ్ల నుంచి ఈ ప్రదేశంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని, కాలువ గట్టు వెంబడి వెళ్లడానికి మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చుట్టుపక్కల రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే తరహాలో తాడిపూడి లిఫ్ట్-2కు సంబంధించి కోమటికుంట, వాదాలకుంట గ్రామాల మధ్య సైతం కాలువ కుడిగట్టుకు గండి పడింది. దీనితో నీరు పొలాల్లోకి వెళుతున్నాయి. అధికారులు స్పందించి కాలువకు గండ్లు పూడ్చే కార్యక్రమం చేపట్టాలని కోరుతున్నారు.
కారు, కంటైనర్ ఢీ
నల్లజర్ల, డిసెంబర్ 11: నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద ఆదివారం కంటైనర్ లారీ కారును ఢీకొన్న ప్రమాదంలో భర్త మృతిచెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయ. అనంతపల్లి ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం చేబ్రోలుకు చెందిన పుట్టా శ్రీనివాసరావు (54) దుబాయిలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఆయన బావమరిది కుమార్తె తేజస్వి వివాహం కొయ్యలగూడెం మండల మాజీ ఎంపిపి మట్టా సత్తిపండు కుమారుడు వరుణ్‌తో జరిగింది. మేనకోడలు వివాహానికి భార్య ప్రియతో దుబాయి నుండి వచ్చిన శ్రీనివాసరావు కొయ్యలగూడెంలో ఆదివారం సాయంత్రం జరిగే రిసెప్షన్‌కు గుంటూరు నుండి భార్య, మరో బంధువుతో కలిసి కారులో బయలుదేరారు. కారు పుల్లలపాడు దాటేసరికి ముందువెడుతున్న లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న కంటెయినర్ లారీ కారును ఢీకొంది. కారు ముందుభాగం ధ్వంసం కాగా డ్రైవింగ్ చేస్తున్న శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయ. ఆమెను 108 వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. జడ్పీఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాపూ సేవలను ఆదర్శంగా తీసుకోవాలి
నరసాపురం, డిసెంబర్ 11: కళారంగానికి బాపు అందించిన సేవలను యువత ఆదర్శంగా తీసుకోవాలని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. ఆదివారం స్థానిక లలితాఘాట్ వద్ద బాపు జయంతి ఉత్సవాలను ఆమె ప్రారంభించారు. ముందుగా ఎంపి సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే మాధవనాయుడు తదితరులు బాపు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎంపి సీతారామలక్ష్మి నరసాపురం పట్టణంలో పుట్టి పెరిగిన బాపు కళారంగానికి చేసిన సేవలను కొనియాడారు. యువత బాపు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఎంపి తోట సీతారామలక్ష్మి పేర్కొన్నారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ బాపుతో నరసాపురం పట్టణానికి మరిచిపోలేని అనుబంధం ఉందన్నారు. చిత్రకారుడిగా ఆయన గీసిన చిత్రాలు నిత్యం అందరి మదిలో కదలాడుతూనే ఉంటాయన్నారు. బాపు ప్రజ్ఞా పాటవాలను గుర్తించిన ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను అయిదు రోజులు వైభవంగా నిర్వహిస్తోందన్నారు.
అనంతరం డిజిటల్ ఇండియా అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖన పోటీలను ఎంపి తోట సీతారామలక్ష్మి ప్రారంభించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాలసాయి, వైస్ చైర్మన్ పి నాగబాబు, ఎంపిపి వాతాడి కనకరాజు, జడ్పీటిసి బాలం ప్రతాప్, సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ పొత్తూరి రామరాజు, ఎఎంసి చైర్మన్ రాయుడు శ్రీరాములు, అర్బన్ బ్యాంకు చైర్మన్ ఎ వెంకటనరసయ్య, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బండారు పటేల్‌రాజా నాయుడు, సహస్రావధాని కడిమెళ్ళ వరప్రసాద్, చక్రవధానుల రెడ్డప్ప ధవేజీ, ఎం హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘మీ కోసం’ లేదు
ఏలూరు, డిసెంబర్ 11 : సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఏలూరులోని జిల్లా కలెక్టరేట్‌లో, మండల కేంద్రాల్లో నిర్వహించే మీ-కోసం కార్యక్రమం ఉండదని జిల్లా రెవిన్యూ అధికారి కె హైమావతి తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, జిల్లా కేంద్రానికి , ఆయా మండల కేంద్రాలకు రావద్దని డిఆర్‌ఒ విజ్ఞప్తి చేశారు.
హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ప్రభాకర్
ఏలూరు, డిసెంబర్ 11 : ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఏలూరుకు చెందిన దాయం ప్రభాకర్‌ను నియమిస్తూ ఆలిండియా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎంయు దువ్వ (ఎండబ్ల్యుడి డబ్ల్యుఏ) ఆదేశాలు జారీచేశారు. ప్రభాకర్ ఎక్స్ సర్వీస్‌మెన్‌గా 32 ఏళ్లు పశ్చిమగోదావరి జిల్లా డిఆర్‌డిఏలో పనిచేసి మంచిపేరు తెచ్చుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నందున తనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా నియమించినందుకు దువ్వకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్‌గా ప్రభాకర్ నియామకం పట్ల రాష్ట్ర ఎస్‌సి ఉద్యోగుల సంక్షేమ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి రమేష్‌బాబు, జిల్లా ఎస్‌సి, ఎస్‌టి మోనటరింగ్ కమిటీ సభ్యులు దాసరి ఆంజనేయులు, దళిత సంఘాల నాయకులు మెండెం ఆనంద్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రమాదపుటంచున పెళ్లి ప్రయాణాలు!
ద్వారకాతిరుమల, డిసెంబర్ 11: చినవెంకన్న క్షేత్రంలో జరుగుతున్న పెళ్లిళ్లను పురస్కరించుకుని పలు బృందాలు ప్రమాదపుటంచుల్లో ప్రయాణాలు సాగిస్తున్నాయి. కళ్లెదుట ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. తప్పనిసరి పరిస్థితులో లేక నిర్లక్ష్యమో తెలియడం లేదు కాని చిన్న చిన్న వాహనాల్లో ఎక్కువ మంది సభ్యులు ప్రయాణిస్తూ ప్రమాదాల బారినపడుతున్నారు. చిన్న చిన్న వాహనాల్లో వందలాది మంది కిక్కిరిసి మరీ ప్రయాణాలు సాగిస్తున్నారు. కొందరైతే వాహనాల అంచులపై సైతం కూర్చుని ప్రయాణిస్తున్నారు. వీరిని చూసి రోడ్డుపై వెళ్లే వారు భయపడుతున్నారే కాని వీరు మాత్రం తమ దారి తమదన్నట్టుగా ఉంటున్నారు. పొరపాటున తలుపు ఊడినా లేదా దానిపై కూర్చున్న వారు జారిపడినా ఎంత ప్రమాదమో ఆలోచించడం లేదు. ఇటువంటి ప్రమాదకర ప్రయాణాలను అధికారులు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తీర గ్రామాల్లో అధికారులు అప్రమత్తం
-ప్రజల తరలింపునకు ఏర్పాట్లు
మొగల్తూరు, డిసెంబర్ 11: వర్దా తుపాను కారణంగా ఏర్పడిన వాతావరణ పరిస్థితులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తీర గ్రామాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో మండలంలో సముద్రానికి సమీపంలో ఉన్న పేరుపాలెం, కెపి పాలెం, పాతపాడులో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. తహసీల్దారు శ్రీపాద హరినాథ్ ఆధ్వర్యంలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు. తీర గ్రామాల్లో మబ్బులతో కూడిన వాతావరణంతో పాటు చలిగాలులు వీయడంతో ప్రజలు వణికిపోతున్నారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
పాత్రికేయులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

భీమవరం, డిసెంబర్ 11: పాత్రికేయులు లేని సమాజాన్ని ఊహించలేమని, అనేక సవాళ్ల మధ్య బాధ్యతలు నిర్వహిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని రాష్ట్ర గనులు, స్ర్తిశిశు వంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఎపియుడబ్ల్యుజె 35వ జిల్లా మహాసభలు ఆదివారం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా అధ్యక్షుడు జి రఘురామ్ అధ్యక్షతన జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సుజాత మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెడుతున్న జర్నలిస్టులకు ఎంత చేసినా తక్కువేనన్నారు. వారిని అన్ని విధాల ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారన్నారు. నర్సాపురం ఎంపి గోకరాజు గంగరాజు మాట్లాడుతూ సమాజానికి దిశానిర్దేశం కల్పించేది జర్నలిస్టులేనన్నారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ సైనికులు దేశానికి ఎలా సేవలందిస్తున్నారో సమాజానికి జర్నలిస్టులు అలా సేవలందిస్తున్నారన్నారు. జీవితాలను పణంగా పెట్టి వృత్త్ధిర్మాన్ని పాటిస్తున్న జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ సమాజానికి మేలు జరిగే వార్తలపై జర్నలిస్టులు దృష్టి సారించాలన్నారు. నియోజకవర్గ పరిధిలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు తనవంతు కృషి చేస్తానన్నారు. భీమవరం మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ అన్ని వేళలా ప్రజాపక్షంలో ఉంటూ రాజకీయ నాయకులకే దిశానిర్దేశం చేస్తున్నవారు జర్నలిస్టులని, వారి సేవలకు వెలకట్టలేమని ప్రశంసించారు. ఐజెయు జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ ఎపియుడబ్ల్యుజె, ఐజెయులో పశ్చిమగోదావరి జిల్లా క్రియాశీలక పాత్రను పోషిస్తోందని ప్రశంసించారు.
రాష్ట్రంలో 15 వేల జర్నలిస్టు కుటుంబాలున్నాయని, వారిని ఆదుకోవాలని, 20 కోట్ల రూపాయలతో జర్నలిస్టు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర మాజీ ఆధ్యక్షుడు దూసనపూడి సోమసుందర్ మాట్లాడుతూ ఎపియుడబ్ల్యుజె స్ఫూర్తితో అనేక రాష్ట్రాలు పనిచేస్తున్నాయని, రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం పోరాడింది మన సంఘమేనని అన్నారు. లక్ష్యం లేని, అజెండా లేని సంఘాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సీనియర్ పాత్రికేయుడు యర్రంశెట్టి గిరిజాపతి స్వాగతం పలుకగా ఎపియుడబ్ల్యుజె జిల్లా కార్యదర్శి వానపల్లి సుబ్బారావు నివేదిక సమర్పించారు. డివి రామాంజనేయులు వందన సమర్పణచేశారు. ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ గోకరాజు మురళీరంగరాజు, డైరెక్టర్ ఎస్‌వి రంగరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారధివర్మ తదితరులు పాల్గొన్నారు.