పశ్చిమగోదావరి

సామాజిక అంశాలే ఇతివృత్తంగా చిత్రాల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 13: సామాజిక అంశాలే ఇతివృత్తంగా చేసుకుని చిత్రాలు నిర్మిస్తున్నట్టు యుగాండా దేశానికి చెందిన సినీ నటుడు, దర్శకుడు నీరజ్ విశ్వకర్మ అన్నారు. వెనుకబాటుతనం, ఎయిడ్స్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ఇప్పటికే డిసెప్షన్, టాక్సీ 24 వంటి చిత్రాలకు అవార్డులు లభించాయన్నారు. భారత్‌తో పాటు యుగాండా దేశానికి చెందిన ప్రభుత్వం అవార్డులతో సత్కరించిందన్నారు. మంగళవారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నీరజ్ మాట్లాడారు. టైం అనే చిత్ర నిర్మాణ పనులు ఇటీవల పూర్తిచేసుకున్నామన్నారు. భారత సాంస్కృతిక శాఖ, యుగాండా ఆరోగ్య శాఖ మంత్రి జెపి నందా ఆధ్వర్యంలో అక్కడి ప్రభుత్వం తనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. టైం చిత్రానికి జార్జ్ ఎన్‌ఇఎస్ సనాంబ దర్శకుడిగా పనిచేశారన్నారు. ద గెటో ఫిల్మ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తామంతా పనిచేస్తున్నామన్నారు. యుగాండాలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య చాలా ఎక్కువన్నారు. వీరిలో 133 మందిని తాను దత్తత తీసుకుని సేవలు అందిస్తున్నట్లు నీరజ్ విశ్వకర్మ తెలిపారు. కేవలం వివాహ బంధం లేకుండానే అక్కడివారు 14 ఏళ్ల వయస్సులోనే తొందరపడతారని, అటువంటి వారు పిల్లలకు కూడా జన్మనిస్తారన్నారు. వారు పెంచలేక వదిలేస్తారని, వారు తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురవ్వడం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. అందుకోసమే ఎయిడ్స్ బాధిత కుటుంబాలకు చెందినవారిని దత్తత తీసుకున్నట్టు నీరజ్ వివరించారు. తాను నిర్మించిన ద డమీ టీంకు అమెరికా సిలికాన్ వాలీ సంస్థ అవార్డు అందించిందని గుర్తుచేశారు. అనంతరం బిజెపికి చెందిన జడ్‌ఆర్‌యుసిసి సభ్యుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర యువమోర్చ నాయకులు గోకవరపు శ్రీనివాస్ తదితరులు సామాజిక అంశాలపై చిత్రాలు నిర్మించి అటు యుగాండా, ఇటు భారత్‌లోని ప్రజలను చైతన్యవంతం చేస్తున్నందుకు ఆయనను సత్కరించారు.

రెండు లక్షల మందికి వృత్తిశిక్షణ
వచ్చే జనవరిలో కార్యక్రమం:జిల్లాస్థాయి యువజనోత్సవాల ప్రారంభ సభలో మంత్రి సుజాత
ఏలూరు, డిసెంబర్ 13 : జిల్లాలో యువతకు ఉపాధి సౌకర్యాలు కల్పించడానికి వచ్చే జనవరిలో రెండు లక్షల మంది యువతకు 136 వృత్తుల్లో వృత్తి శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖమంత్రి పీతల సుజాత చెప్పారు. జిల్లాస్థాయి యువజనోత్సవాలు సందర్భంగా మంగళవారం స్థానిక సెయింట్ థెరిస్సా డిగ్రీ మహిళా కళాశాలలో యువజన సర్వీసుల శాఖ ఏర్పాటు చేసిన సాంస్కృతిక పోటీల కార్యక్రమంలో మంత్రి పీతల సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత తమ కాళ్లపై తామునిలబడేందుకు వృత్తి శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నారు. యువత తనకు నచ్చిన వృత్తిలో శిక్షణ తీసుకుని తాను జీవితంలో స్థిరపడటమే కాకుండా తనతోపాటు మరికొంత మందికి ఉపాధి చూపించే అవకాశం దొరుకుతుందని చెప్పారు. ఈ యువజనోత్సవాలతో యువత వారిలోని ప్రతిభాపాటవాలను బహిర్గతం చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. జిల్లాకు చెందిన 50 మంది యువతకు ఆర్మీలో ఉద్యోగావకాశాలు లభించడం హర్షణీయయమన్నారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి జిల్లాకు చెందిన పది మంది యువత ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ మరుగున పడిపోతున్న కళలను పైకి తీసుకువచ్చేందుకు యువజన కార్యక్రమాలు ఒక నిదర్శనం అన్నారు. యువత చదువుతోపాటు కళల పట్ల మక్కువ పెంచుకుని వాటిల్లో రాణించాలని కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ యువతకోసం జిల్లాలో యువజన భవన్ నిర్మించనున్నామని చెప్పారు. ఈ యువజనోత్సవాలలో జిల్లాస్థాయి నుండి రాష్టస్థ్రాయికి, రాష్టస్థ్రాయి నుండి జాతీయ స్థాయికి ఎంపికైన అభ్యర్ధులకు ప్రయాణ, భోజన, వసతి సదుపాయాయలన్నీ ఉచితంగా అందిస్తారని చెప్పారు. యువజనోత్సవ కార్యక్రమంలో యువతకు వక్తృత్వం, జానపద నృత్యం, ఏకాంకిక నాటిక వంటి అంశాలలో పోటీలు నిర్వహించారు.
సినీ దర్శకుడు మహేంద్ర చక్రవర్తి ఆధ్వర్యంలో విద్యార్ధులు నిర్వహించిన సంభవామి అనే ఏకాంకిక నాటిక కార్యక్రమానికి హాజరైన సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. సమాజంలో అవినీతి నిర్మూలనపై నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి పీతల సుజాత మీడియా ప్రతినిధులను కోరారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని ఈ ఏకాంకిక నాటిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఆయన సమక్షంలో ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని మంత్రి చెప్పారు. ఏకాంకిక నాటికలో పాల్గొన్న విద్యార్దినీలను మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రత్యేకంగా అభినందించారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, కలెక్టర్ భాస్కర్ యువజనోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సెట్‌వెల్ సిఇవో శ్రీనివాసులు, కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ మెర్సీ, కల్చరల్ కో ఆర్డినేటర్ బ్రహ్మేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

అయ్యా.. రూ.20 వేలైనా ఇవ్వండి
-కుమార్తె పెళ్లి కోసం శుభలేఖతో ఓ తండ్రి ఆవేదన
-ఖాతాలో రూ.90 వేలున్నా డబ్బు ఇబ్బంది
-ముంచుకొస్తున్న ముహూర్తం
-అయనా కనికరించని బ్యాంకు అధికారులు-
యలమంచిలి, డిసెంబర్ 13: బ్యాంకు ఖాతాలో సుమారు లక్ష రూపాయలున్నాయ... మరో వారంలో కుమార్తె వివాహం... కనీసం పెళ్లి ఖర్చుల కోసమైనా రూ.20వేలు ఇప్పించాలంటూ ఓ తండ్రి బ్యాంకుల చుట్టూ, అధికార్ల చుట్టూ తిరుగుతున్నాడు... ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం వారానికి ఇచ్చే రూ.24 వేలు కంటే తక్కువ విత్‌డ్రా చేసుకోవడానికి కూడా అవకాశం లేక వారంలో పెళ్లి జరగాల్సి ఉండటంతో ఏంచేయాలో తెలీక ఆ తండ్రి ఆవేదనతో అల్లాడిపోతున్నాడు... వివరాల్లోకి వెళితే... యలమంచిలి మండలం అడవిపాలెం గాంధీనగర్‌కు చెందిన ఉండ్రాజవరపు ప్రకాశరావు కుమార్తె వివాహానికి ఈ నెల 20న ముహూర్తం పెట్టుకున్నారు. పాలకొల్లు ఎస్‌బిఐలో కుమారుడి ఖాతాలో రూ.95 వేలు ఉంది. దీనితో బ్యాంకుకు వెళ్లి శుభలేఖను చూపించారు. వారానికి గరిష్ఠంగా ఇచ్చే రూ.24 వేలు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే సొమ్ము లేదన్నారు. కనీసం రూ.20 వేలైనా ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. అయినా ఫలితం లేకపోయింది. ఇక చేసేదిలేక యలమంచిలి తహసీల్దారు స్వామి నాయుడు వద్ద బాధితుడు తన గోడును వినిపించాడు. తన కుమారుడి ఖాతాలో ఉన్న సొమ్మునైనా ఇప్పించాలని కోరాడు. దీనిపై స్పందించిన తహసీల్దారు ఎస్‌బిఐ అధికారులతో మాట్లాడారు. వివాహ ముహూర్తం సమీస్తోందని, రెండు మూడు రోజుల్లోనైనా ప్రకాశరావుకు సొమ్ము అందజేయాలని తహసీల్దారు స్వామినాయుడు సూచించారు. అయినా అధికారులు సరైన హామీ ఇవ్వకపోవంతో బాధితుడు ప్రకాశరావు ఏమిచేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

ఎస్‌బిఐలో టోకెన్ విధానం
భీమవరంలో ఖాతాదార్ల రద్దీని తట్టుకోవడానికి కొత్తమార్గం

భీమవరం, డిసెంబర్ 13: అత్యధిక శాతం మంది ఖాతాదారులు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త విధానానికి తెరతీసింది. నగదు విత్ డ్రా చేసుకునే ఖాతాదారుల కోసం టోకెన్ విధానం అమలుచేసింది. దీంతో నిర్ణీత సమయంలోనే ఖాతాదారులు వచ్చి నగదును పొందుతున్నారు. ఇప్పటికే సాయంత్రం 4 గంటల వరకు విత్ డ్రా నగదును ఇవ్వాల్సిన ఎస్‌బిఐ 3 గంటలతో విత్‌డ్రాలను నిలిపివేస్తోందన్న విమర్శలు ఖాతాదారులు చేస్తున్నారు. ఉదయానే్న బ్యాంకు వద్ద వచ్చిన వారికి ఆన్‌లైన్ ద్వారా నమోదుచేసుకుని టోకెన్‌ను ఇస్తారు. టోకెన్‌లో ఏ కౌంటర్ వద్దకు వెళ్ళి నగదును విత్ డ్రా లేదా, జమచేయాలో రాసి ఉంటుంది. ఆ ఖాతాదారుడు ఆ కౌంటర్ వద్దకు వెళ్లగానే ఉద్యోగి వారికి సేవలందిస్తున్నారు. ఒక్క రోజులో సుమారు 600 మంది ఖాతాదారులకు బ్యాంకు ఉద్యోగులు సేవలందిస్తారు.
ఎటిఎంల ముందు బారులు
దేశవ్యాప్తంగా ఎన్ని రకాల బ్యాంకులు ఉన్నాయో.. వాటి శాఖలన్నీ భీమవరంలో ఉన్నాయి. పట్టణంలో ఉన్న సుమారు 2 లక్షల మందికి ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ సంస్థలకు చెందిన బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. నిత్యం ఎక్కువ నగదును ఇక్కడ ప్రజలు విత్ డ్రా చేసుకుంటారు. దీంతో బ్యాంకులతో పాటు ఎటిఎంల ముందు ఖాతాదారులు బారులు తీరారు. మూడు రోజుల పాటు సెలవులు రావడంతో మంగళవారం ఎక్కువ మంది ఖాతాదారులు వస్తారని బ్యాంకు అధికారుల అంచనా. వారి అంచనాలకు తగ్గట్టుగానే వారికోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. భీమవరం పట్టణంలోని దాదాపు చాలా బ్యాంకుల ముందు ఖాతాదారుల కోసం టెంట్లు వేశారు. వారికోసం బ్యాంకులతో పాటు ఎటిఎంలలో నగదు విత్ డ్రాకు అవకాశం కల్పించారు. బ్యాంకుల ముందు, ఎటిఎంల ముందు ఖాతాదారులు గంటల తరబడి క్యూలలో నిలబడి నగదును విత్ డ్రా చేసుకున్నారు.
క్రిస్మస్ పండగ కోసం
పెరిగిన విత్ డ్రాలు
మరో పది రోజుల్లో క్రిస్మస్ పండుగ రానుంది. అప్పటికి నగదు అవసరం ఎక్కువగా ఉంటుంది. ముందస్తుగానే చాలామంది పండుగకు విత్ డ్రాలు చేసుకోవడం కనిపించింది. ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం నగదును విత్ డ్రా చేసుకున్నారు. కాగా ఈ మధ్య కాలంలో నగదును డిపాజిట్ చేసుకుంటున్న వారు కనిపించకపోవడం విశేషం.

చిరు వ్యాపారులకు
సబ్సిడీపై స్వైపింగ్ యంత్రాలు
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, డిసెంబర్ 13 : జిల్లాలో నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి చిరువ్యాపారులకు సబ్సిడీపై స్వైపింగ్ యంత్రాలను సమకూరుస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో నగదు రహిత లావాదేవీల అమలు తీరుపై ఆయన సమీక్షించారు. జిల్లాలో బస్సుల్లో, ఆటోల్లో, పచారీ షాపుల్లో పలు చిన్న తరహా వ్యాపారాలు చేసుకునే చిరువ్యాపారులకు 1000 రూపాయలు సబ్సిడీపై స్వైపింగ్ మిషన్లను అందిస్తామని చెప్పారు. యాండ్రాయిడ్ ఫోన్ లేని చిరువ్యాపారులకు 2500 రూపాయలకే ఫోన్‌తోపాటు 2500 రూపాయల విలువైన స్వైపింగ్ మిషన్‌ను వెయ్యి రూపాయలు సబ్సిడీపై అందిస్తామని, 1500 రూపాయలు కూడా మూడు వాయిదాలలో చిరువ్యాపారి చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో 18 వేల వ్యాపార సంస్థలు ఉన్నాయని వాటిలో 8400 మంది వ్యాపారులు స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేయడానికి అవగాహన కల్పించారని ఇందులో 3500 మంది వ్యాపారస్థులు స్వైపింగ్ యంత్రాలు పెట్టడానికి అంగీకరించిన దృష్ట్యా అటువంటి వ్యాపారులకు వెయ్యి రూపాయలు సబ్సిడీపై స్వైపింగ్ యంత్రాలను సమకూర్చాలని కలెక్టర్ వాణిజ్య పన్నుల శాఖా డిప్యూటీ కమిషనరును ఆదేశించారు. జిల్లాలో ఉన్న 615 బస్సుల్లో కూడా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని దీని వలన ప్రజలు చిల్లర సమస్య లేకుండా బస్సుల్లో ప్రయాణించగలరని చెప్పారు. జిల్లాలో 495 మద్యం షాపుల్లో కూడా స్వైపింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని అదే విధంగా ఆటోల్లో కూడా ఈ యంత్రాలు ఏర్పాటు వలన చాలా వరకు చిల్లర సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. విద్యా సంస్థలన్నీ ఖచ్చితంగా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని విద్యార్ధుల ఫీజులన్నీ ఈ మిషన్ ద్వారానే నిర్వహించడం వలన చిల్లర నోట్ల సమస్య పరిష్కారం అవుతుందని ఈ విషయంలో విద్యాశాఖాధికారులు అన్నీ విద్యాసంస్థల్లో పిల్లల ఫీజులను స్వైపింగ్ యంత్రాలద్వారా విధిగా వసూలు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో నగదు రహిత కార్యకలాపాలను మరింత విస్తరించడానికి ప్రజల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యంగా పెట్రోలు బంకుల్లో, వంటగ్యాస్ డీలర్ల వద్ద కూడా స్వైపింగ్ యంత్రాలు ఖచ్చితంగా ఉండి తీరాలని డి ఎస్‌వో శివశంకర్‌రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలు విస్తృతస్థాయిలో అమలు జరిగే వరకూ ప్రతీ రోజూ సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం కొనసాగుతుందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో చిల్లర నోట్ల కొరతను అధిగమించడానికి కేంద్రం నుండి పశ్చిమగోదావరి జిల్లాకు 121 కోట్ల రూపాయల కరెన్సీ వచ్చిందని, ఇందులో రెండు వేల రూపాయలు, 500 రూపాయలు, వంద రూపాయలు, 50, 20 రూపాయల నోట్లు కూడా ఉన్నాయని వాటిని రేపటిలోగా అన్ని బ్యాంకులకు పంపిస్తామని ఈ డబ్బుతో కొంత వరకూ చిల్లర నోట్ల సమస్య తీరవచ్చునని ఇంకా ఎక్కువ మొత్తంలో 500 రూపాయల కరెన్సీని ఎటి ఎంలలో పొందుపరిచేలా చర్యలు తీసుకుంటామని ఈ నోట్లుచలామణిలోకి వస్తే కొంత వరకూ ప్రజల ఇబ్బందులు తొలగుతాయని, ముఖ్యంగా నగదు రహిత లావాదేవీలు పెద్ద ఎత్తున అమలు చేస్తే జిల్లా డిజిటల్ కరెన్సీ వైపు అడుగులు వేయగలదని చెప్పారు. సమావేశంలో జెసి పి కోటేశ్వరరావు, ఎల్‌డి ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వైబి భాస్కరరావు, ఆర్‌టిసి ఆర్‌ఎం ధనంజయరావు, ట్రాన్స్‌కో ఎస్ ఇ సత్యనారాయణరెడ్డి, రవాణా శాఖ డిప్యూటీ కమిషనరు సత్యనారాయణమూర్తి, పశుసంవర్ధక శాఖ జెడి శివాజీ, మార్కెటింగ్ శాఖ ఎడి ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసమస్యలు పరిష్కరించేలా చైతన్యపర్చాలి
కొత్త అడిషినల్ ఎస్పీకి కలెక్టర్ భాస్కర్ సూచన
ఏలూరు, డిసెంబర్ 13 : జిల్లాలో పోలీసు స్టేషన్ల పరిధిలోకి వచ్చే ప్రజా సమస్యలను పరిష్కరించేలా పోలీసు అధికారులను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లా అదనపు ఎస్‌పి రత్నప్రభకు సూచించారు. మంగళవారం తనను మర్యాదపూర్వకంగా కలుసుకున్న నూతన అడిషినల్ ఎస్పీ రత్నప్రభతో కలెక్టర్ కొద్దిసేపు మీ-కోసంలో వచ్చే ఫిర్యాదులపై చర్చించారు. ప్రతీ సోమవారం మీ-కోసం కార్యక్రమంలో పోలీసులకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వస్తున్నాయని, పోలీసు స్టేషన్లలో ప్రజలకు న్యాయం జరగకపోబట్టే మీ-కోసం కార్యక్రమంలో కలెక్టరును ఆశ్రయిస్తున్నారని అలా కాకుండా ప్రతీ పోలీసు స్టేషన్‌లో ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఎస్‌ఐలను, ఇతర సిబ్బందిని చైతన్యపరచాలని సూచించారు. ప్రజలు సహజంగా ప్రభుత్వ కార్యాలయాల వరకూ రారని, పోలీసు స్టేషన్లలో ఆశించిన న్యాయం జరగడం లేదనే భావన ప్రజల్లో కలుగుతుందని, అలా కాకుండా పోలీసులకు సంబంధించిన సమస్యలను పోలీసు స్టేషన్లలోనే పరిష్కరించే విధంగా పోలీసు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. కొత్తగా బాధ్యతలుచేపట్టిన దృష్ట్యా మరింత సమర్ధవంతంగా పనిచేసి రాబోయే రోజుల్లో పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసే వారికి కచ్చితంగా ప్రజలకు ఎఫ్‌ఐఆర్ ఇచ్చేలా చూడాలని, మీ-కోసంలో పోలీసులకు సంబంధించిన ఫిర్యాదులు రాకుండా చూడాలని అప్పుడే ప్రజలకు చేరువగా ఉన్నట్టు భావిస్తామన్నారు.
అడిషినల్ ఎస్పీ రత్నప్రభ మాట్లాడుతూ ఈ విషయంపై తాను ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని, ఫిర్యాదుదారునికి ఎఫ్‌ఐఆర్ కాపీ అందించి ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేలా కృషిచేస్తానన్నారు. మీ-కోసం కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై కూడా ప్రత్యేకంగా శ్రద్ద వహించి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటానని రత్నప్రభ చెప్పారు.

అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కళాశాలలు
ఐఐటి ఫౌండేషన్ కోర్సుల రాష్ట్ర డైరెక్టర్ రవీంద్ర
నరసాపురం, డిసెంబర్ 13: వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఐఐటి ఫౌండేషన్ కోర్సుల రాష్ట్ర డైరెక్టర్ రావుల రవీంద్ర అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పురపాలక సంఘాల పరిధిలో పాఠశాలలో ఐఐటి ఫౌండేషన్ కోర్సు అమలుపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో రావుల రవీంద్ర మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లో 6 నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఐఐటి కెరియర్, ఐఐటి అడ్వాన్స్‌డ్ ఫౌండేషన్ కోర్సుపై శిక్షణ ఇస్తారన్నారు. ఈ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ కళాశాలలో ప్రవేశం కల్పిస్తారన్నారు. అలాగే 2017 విద్యాసంవత్సరం నుంచి ప్రతి మున్సిపల్ పాఠశాలల్లో ఐఐటి ఒలింపియాడ్ స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. మూడు జిల్లాలకు ఒక సివిల్ సర్వీస్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఐఐటి ఫౌండేషన్ కోర్సులో శిక్షణ ఇస్తారని రావుల రవీంద్ర తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పి.రమేష్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అడిషినల్ ఎస్పీ రత్నప్రభను కలుసుకున్న
విశ్రాంత పోలీసు అధికారుల సంఘం సభ్యులు
ఏలూరు, డిసెంబర్ 13: జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రత్నప్రభను జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంఘం సభ్యులు మంగళవారం కలుసుకుని పుష్పగుచ్ఛం ఇచ్చి, అభినందనలు తెలిపారు. సంఘం అధ్యక్షుడు డివిఎస్‌కె భగవాన్‌రాజు, కార్యదర్శి ఎస్ దాశరధి, ఉపాధ్యక్షులు కె రాజగోపాలరావు, కోశాధికారి కె రామకృష్ణ, రిటైర్డ్ అడిషినల్ ఎస్పీ పి.రత్నయ్య తదితరులు అడిషినల్ ఎస్పీని కలిసినవారిలో ఉన్నారు. విశ్రాంత పోలీసు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని అడిషినల్ ఎస్పీ రత్నప్రభ హామీయచ్చారు. ఈసందర్భంగా కమ్యూనిటీ పోలీసింగ్‌పై వారితో చర్చించారు.

ఇప్పటివరకు తెరుచుకోని పోస్టల్ ఎటిఎం!
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, డిసెంబర్ 13: పెద్ద కరెన్సీ రద్దుచేసిన నాటి నుంచి ఇప్పటివరకు భీమవరం లోని పోస్టల్ ఎటిఎం తెరుచుకోలేదు. భీమవరంలో బ్యాంకులకు మాదిరిగా తపాలా శాఖ అధికారులు ఖాతాదారులకు మరిన్ని సేవలు అందివ్వాలన్న ఉద్దేశంతో ఎటిఎంను ఏర్పాటుచేశారు. ఖాతాదారులకు ఎటిఎం కార్డులిచ్చారు. కానీ నగదు రద్దు నాటి నుంచి ఇప్పటివరకు ఎటిఎం తెరుచుకోకపోవడం విశేషం. ఎనీటైం మూత అని ఖాతాదార్లు వ్యాఖ్యానిస్తున్నారు.

నిబంధనల మేరకే పొగాకు సాగు చేపట్టాలి
గోపాలపురం వేలం కేంద్రం నిర్వహణాధికారి శేషతల్పసాయి
గోపాలపురం, డిసెంబర్ 13: వర్జీనియా పొగాకు రైతులు బోర్డు నిబంధనల మేరకు పొగాకు సాగు చేపట్టాలని గోపాలపురం వేలం కేంద్రం నిర్వహణాధికారి టి శేషతల్పసాయి అన్నారు. మంగళవారం స్థానిక పొగాకు వేలం కేంద్రం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తమ పరిధిలో 1944మంది రైతులకు చెందిన 2,362 పొగాకు బ్యారన్లు రిజిస్ట్రేషన్ అయినట్టు తెలిపారు. 22 బ్యారెన్లు వివిధ రకాల కారణాల వల్ల రిజిస్ట్రేషన్ నిలిచిపోయిందన్నారు. ఈ ఏడాది 3,306 హెక్టార్లలో పొగాకు పంట పండించేందుకు అనుమతులు లభించాయని, 7.01 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 3,329 హెక్టార్లలో రైతులు నాట్లు వేసినట్టు చెప్పారు. లోతట్టు, వరి పంట వేసిన భూముల్లో పొగాకు నాట్లువేస్తే చట్టరీత్యా చర్య తీసుకుంటామన్నారు. ఆ భూముల్లో పొగాకు నాణ్యత లోపిస్తుందన్నారు. ప్రస్తుతం రైతులకు 2,326 టన్నుల ఎరువులను పొగాకు పంటకు రైతులకు సకాలంలో పంపిణీ చేసినట్టు తెలిపారు. రైతులు నాణ్యమైన పొగాకును పండించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. ఈయన వెంట వేలం కేంద్రం ప్రతినిధి హనుమంతరావు ఉన్నారు.

చేపల చెరువు తవ్వకాన్ని అడ్డుకున్న గ్రామస్థులు
ఉండి, డిసెంబర్ 13: మండలంలోని పాములపర్రు గ్రామంలో మంగళవారం చేపల చెరువు తవ్వకాన్ని సిపిఎం నాయకత్వంలో ఆ గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అడ్డుకున్నారు. గతంలోనే కొందరు రైతులు చేపల చెరువుల తవ్వకానికి మత్స్యశాఖ నుండి అనుమతి పొందారు. సిపిఎం నాయకులు, పాములపర్రు గ్రామానికి చెందిన కొందరు ప్రజలు దీనివలన రక్షిత మంచినీటి చెరువు కలుషితం అవుతుందని, చెరువు తవ్వకానికి ఎట్టి పరిస్థితిల్లోను అంగీకరించేది లేదని సిపిఎం మండల కార్యదర్శి ధనికొండ శ్రీనివాస్ నాయకత్వంలో సిపిఎం నాయకులు దానిని ప్రతిఘటించారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఉండి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నుండి ఎస్సైలతో పాటు పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. దీంతో ఎస్సై ఎం.రవివర్మ ఇరువర్గాలతో మాట్లాడి తాత్కాలికంగా అక్కడ పనులు నిలుపుదల చేశారు. దీనిపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. కాగా గతంలో కూడా అక్కడ చేపల చెరువుల తవ్వకానికి సిపిఎం ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించి నిలుపుదల చేయించారు. రెవిన్యూ అధికారులు దీనిపై వివరణ ఇస్తూ గత ఏడాది రైతులకు చేపల చెరువు తవ్వకానికి అనుమతి వచ్చిందన్నారు. నిబంధనల మేరకు తవ్వుతున్నారో లేదో ఆర్‌ఐ మణి అక్కడకు వెళ్ళి పరిశీలించారని వివరించారు. అయితే తవ్వకంలో నిబంధనలు సక్రమంగానే ఉన్నాయని చెబుతున్నారు.

నేటి నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు
ట్రాన్స్‌కో ఎస్‌ఇ సత్యనారాయణరెడ్డి
ఏలూరు, డిసెంబర్ 13 : జిల్లాలో నేటి నుంచి 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఇ సిహెచ్ సత్యనారాయణరెడ్డి చెప్పారు. స్థానిక జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమ వివరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్‌కు ఆయన వివరించారు. జిల్లాలో 10,48,223 గృహ విద్యుత్తు సర్వీసులున్నాయని ఒక్కొక్క ఇంటికీ రెండు ఎల్ ఇడి బల్బులను ఉచితంగా గత ఏడాది పంపిణీ చేయడం వలన జిల్లాలో ప్రతీ నెలా 6.3 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేయగలిగామని వివరించారు. వ్యవసాయ పంపుసెట్లకు క్రొత్తగా ఎలక్ట్రిక్ స్మార్ట్ కంట్రోల్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసి రైతులు సెల్ ఫోన్ ద్వారా ఇంటి నుండే పొలంలోని వ్యవసాయ మోటారును ఆన్‌చేసే నూతన రిమోట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ద్వారకాతిరుమల మండలంలో అమలు చేయనున్నామని ఆయన చెప్పారు. ద్వారకాతిరుమల మండలంలోని 500 వ్యవసాయ పంపుసెట్లను ఎలక్ట్రికల్ స్మార్ట్ కంట్రోలు ప్యానెల్ పరిధిలోనికి తీసుకువస్తామని దీని వలన రైతుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పంపుసెట్‌ను సెల్‌ఫోన్ రిమోటు ద్వారా ఆన్, ఆఫ్ చేసుకోవచ్చునని ఈ విధానం విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఈ విధానం వలన అర్ధరాత్రి పూట రైతులు ఇకపై పొలాలకు వెళ్లి మోటార్లు ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఉండబోదన్నారు. జిల్లాలో ఇంటింటా రూఫ్ టాప్ సోలార్ విద్యుత్తు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని ఈ విధానాన్ని ప్రతీ ఇంటా అమలు చేస్తే ఆ ఇంటి అవసరాలకు విద్యుత్తు వినియోగం చేసుకోగా మిగిలిన విద్యుత్తును తమ సంస్థ కొనుగోలు చేసి ఆ సొమ్మును ఇంటి యజమాని బ్యాంకు ఖాతాకు జమచేసే నూతన విధానాన్ని కూడా అమలుచేస్తామని దీనివలన కూడా విద్యుత్తు పొదుపు ఆలోచన ప్రజల్లో పెరుగుతుందని చెప్పారు. జిల్లాలో సోలార్ పంపుసెట్లను ప్రోత్సహించడానికి 4.29 లక్షల రూపాయల ఖరీదుగల పంపుసెట్‌ను రైతుకు కేవలం రూ.55 వేలకు అందించే విధానాన్ని కూడా అమలు చేస్తామని చెప్పారు. ప్రతీ ఒక్కరూ విద్యుత్తు పొదుపునకు సహకరించాలని వారం రోజులపాటు ఇంధన పొదుపు వారోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్ కోరారు.