పశ్చిమగోదావరి

బయోటెక్నాలజీపై మరిన్ని పరిశోధనలు జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 15: మానవాళి మనుగడ.. పర్యావరణ పరిరక్షణకు బయోటెక్నాలజీపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంతర్జాతీయ నిపుణుడు, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ శంకర్‌లాల్ గార్గ్ అన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు కొనసాగే ఎమర్జింగ్ మల్టీ డిసిప్లైన్ రీసెర్చ్ అండ్ కంప్యుటేషనల్ ఇంటిలిజెన్స్‌పై అంతర్జాతీయ సదస్సు గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. కళాశాల పిజి కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఐ.హేమలత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గార్గ్ మాట్లాడుతూ అమెరికా దేశంలో బయోటెక్నాలజీని ఉపయోగించి పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 30 శాతం వరకు తగ్గించారన్నారు. పరిశోధనలు చేసే ప్రతి ఒక్కరూ తన మేధస్సులో కేవలం 7 శాతం మాత్రమే ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఐన్‌స్టీన్ కేవలం 15 శాతం మాత్రమే ఉపయోగించారని పరిశోధనల్లో వెల్లడైందన్నారు. వ్యవసాయ రంగంలో బయోటెక్నాలజీని ఉపయోగించడం వల్ల అత్యంత సామర్ధ్యం, ఉత్పత్తి పెరుగుతోందన్నారు. ప్రపంచంలో బయోటెక్నాలజీ పరిశోధనలకు ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. 1919లో హంగేరిలో ఒక ఇంజనీర్ బయోటెక్నాలజీపై తొలి ప్రయోగం చేసి పరిశోధనలకు బీజం వేశారని, 1928లో అలెగ్జాండర్ ఫ్లెమిన్ కనిపెట్టారన్నారు. ఇప్పటికి నూరు వసంతాలు దాటిన తరువాత అన్నింటా బయోటెక్నాలజీని అన్వయిస్తున్నారని వివరించారు. పర్యావరణ శుద్ధికి, పర్యావరణ పరిరక్షణకు బయోటెక్నాలజీ మొక్కలు, పరిశ్రమలతో పాటు అన్ని చోట్లా నాటాలని సూచించారు. రసాయనాల వాడకం తగ్గించాలని హితవు పలికారు. పరిశోధకులు ఆత్మవిశ్వాసం, పట్టుదలతో సమాజం కోసం పరిశోధనలు జరపాలన్నారు. కంప్యూటర్ కన్నా మానవ మేధస్సు గొప్పదని అభివర్ణించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.పార్థసారధివర్మ మాట్లాడుతూ పరిశోధనల ప్రాధాన్యత పెంచి తమ పరిశోధనలు అంతర్జాతీయ వేదికపై వెల్లడిస్తే వాటికి మరిన్ని సూచనలు, సలహాలు నిపుణుల నుంచి అందుతాయన్నారు. సదస్సులో కళాశాల ఛైర్మన్ గోకరాజు మురళీరంగరాజు, డైరెక్టర్ ఎస్‌వి రంగరాజు ప్రొసీడింగ్స్‌ను విడుదల చేశారు. గార్గ్‌ని సత్కరించారు. సిఇఒ ఎస్‌ఆర్‌కె నిశాంతవర్మ, డాక్టర్ పిఎ రామకృష్ణంరాజు, వైఎస్ ప్రిన్సిపల్ రాజు, బి.మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాల్టీల్లో చెప్పకుండా సెలవు పెట్టే ఉద్యోగులను
సస్పెండ్ చేయండి:కలెక్టర్
ఏలూరు, డిసెంబర్ 15: చెప్పకుండా సెలవు పెట్టే ఉద్యోగులను సస్పెండ్ చేయాలని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలోని మున్సిపాల్టీల్లో ఉద్యోగుల హాజరు తీరు చాలా అధ్వాన్నంగా వుందని ఆయన పేర్కొన్నారు. నిడదవోలు మున్సిపాల్టీలో 28 మంది, భీమవరంలో 100, ఏలూరు కార్పొరేషన్‌లో 100, తణుకులో 50, పాలకొల్లు, నర్సాపురంలో 30 మంది చొప్పున ఉద్యోగులు రోజూ హాజరుకాకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. బయోమెట్రిక్ యంత్రాలు సరిగ్గా పనిచేయడంలేదని కమిషనర్లు చెప్పగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక సంఘాల్లో గత రెండు నెలల నుంచి కేవలం 5373 ఫైళ్లను మాత్రమే ఆన్‌లైన్‌లో పొందుపరిచారని, దీనికి కారణాలేమిటంటూ ఆయన ప్రశ్నించారు. ఆస్తి పన్ను వసూళ్లలో ఏలూరు కార్పొరేషన్, తాడేపల్లిగూడెం, నిడదవోలు మున్సిపాల్టీలు వెనుకబడటాన్ని కలెక్టర్ తప్పుపడుతూ పూర్తిస్థాయిలో పన్నులు వసూలుచేయాలని ఆదేశించారు. సమావేశంలో డిపివో సుధాకర్, ఏలూరు కమిషనర్ వై సాయి శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్లు నాగ నరసింహారావు, వెంకటేశ్వరరావు, సాయి రామ్, బాలాజీ, శ్రీనివాస్, నాగేంద్రకుమార్, కృష్ణమోహన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి డయల్ యువర్ కలెక్టరు

సోమవారం నుంచి శనివారం వరకు-ఉదయం 7.30 నుంచి 8.30 వరకు-్ఫన్ నెంబర్ 98662 63344
ఏలూరు, డిసెంబర్ 15: జిల్లాలో ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించడానికి ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమాన్ని శుక్రవారం నుండి ప్రారంభిస్తున్నట్లు కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 7.30గంటల నుంచి 8.30గంటల వరకు జిల్లాలో ప్రజలు అయాశాఖల్లో ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా చెప్పవచ్చునన్నారు. ప్రతి సోమవారం గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత అంశంపై, మంగళవారం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల అమలులో జరుగుతున్న లోపాలు, రుణాల మంజూరులో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు వివరించవచ్చు. బుధవారం వ్యవసాయం, పండ్లతోటలు, పశుసంవర్ధక, పట్టుపురుగులు, చేపలపెంపకం, మార్కెటింగ్ శాఖలలో ప్రజాసమస్యలు తెలపవచ్చు. గురువారం విద్య, సంక్షేమ వసతిగృహాలలో నెలకొన్న సమస్యలు, శుక్రవారం డ్వామా, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖల పరిధిలో ఉపాధి హామీ, మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాలపై, శనివారం వైద్య,ఆరోగ్యశాఖ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టరు దృష్టికి తీసుకురావచ్చు. ప్రజాసమస్యలు తెలిపేందుకు 98662 63344కు ఫోన్ చేయాలని కలెక్టరు తెలిపారు.

కిచెన్ షెడ్ల నిర్మాణం సకాలంలో పూర్తిచేయాలి
ఏలూరు, డిసెంబర్ 15 : జిల్లాలో రూ.19.40 కోట్లతో 983 కిచెన్ షెడ్ల నిర్మాణాన్ని చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జిల్లాలోని పాఠశాలల్లో వౌలిక సౌకర్యాలు, బయోమెట్రిక్, విద్య, తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. విద్యార్ధులకు ఆటలతోపాటు సాంస్కృతిక అంశాలైన పాటలు, డాన్సు, సంగీతం వంటి వాటిలో శిక్షణ ఇవ్వాలన్నారు. ఆరోగ్యం, విద్య, లైఫ్ స్కిల్స్ వంటి వాటిని రెగ్యులర్ సిలబస్‌తోపాటు పాఠ్యాంశాలుగా చేర్చి పిల్లలకు బోధించాలన్నారు. త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి 255 సెంటర్లలో పూర్తిస్థాయిలో ఫర్నీచర్ ఉండేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సెంటర్లలో సిసి కెమేరాలను ఏర్పాటు చేయాలని డి ఇవోను ఆదేవించారు. సమావేశంలో డి ఇవో డి మధుసూధనరావు, సర్వశిక్ష అభియాన్ పివో డాక్టర్ బ్రహ్మానందరెడ్డి, డిప్యూటీ డి ఇవోలు ఉదయకుమార్, ఎం సూర్యనారాయణమూర్తి, తిరుమలదాసు, జె స్వామిరాజు, కె రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఆ ఆసుపత్రిపై విచారణ జరపండి
తణుకు కార్పొరేట్ ఆసుపత్రిలో తరచూ మరణాలు సంభవిస్తుండటంతో కలెక్టర్ ఆదేశం
ఏలూరు, డిసెంబర్ 15: తణుకు లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో తరచూ సంభవిస్తున్న మాతా శిశు మరణాలపై జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ఆరాతీశారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం వైద్యఆరోగ్యశాఖ పనితీరుపై ఆయన అధికారులతో సమీక్షించారు. తణుకు ఆసుపత్రిలో ప్రతివారం శిశువులు, గర్భిణులు ఎందుకు చనిపోతున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డిఎంహెచ్‌ఓ డాక్టరు కె కోటీశ్వరిని ఆయన ఆదేశించారు. ప్రతివారం సమీక్షలో కచ్చితంగా ఆ ఆసుపత్రిలో ఇద్దరికి తగ్గకుండా చనిపోతున్నట్లు డెత్ రిపోర్టులో పొందుపరుస్తున్నారని, అసలు ఆ ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్యసేవలు అందటం లేదా, అక్కడ అనుభవం ఉన్న డాక్టర్లు ఉన్నారా, లేరా, ఎందువల్ల ఆ ఆసుపత్రిలోనే మరణాలు సంభవిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. గత వారంలో జిల్లాలో ఏడుగురు పిల్లలు చనిపోయారని, ఇందుకు బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో బిపి, షుగర్ వ్యాధుల బారినపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న కారణంగా ఈవ్యాధులపై సరైన అవగాహన కల్పించడమే కాకుండా ప్రత్యేక వైద్యపరీక్షలుచేసి రోగులకు నాణ్యమైన మందులను అందించేలా ఏలూరు ప్రభుత్వాసుపత్రితోపాటు జిల్లాలోని ఏడు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో జనవరి 1వ తేదీ నుండి ప్రత్యేక బిపి, షుగర్ క్లినిక్‌లను ఉచితంగా నిర్వహించాలని డిసిహెచ్‌ఎస్‌ను ఆయన ఆదేశించారు. 104 సిబ్బంది పనితీరు బాగోలేదని, అయిదు నెలలకు సంబంధించి బిల్లులను చెల్లించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేశామని, అయితే బిల్లులు వస్తున్నాయన్న సమాచారం ఉందని, ఈవ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అదనపు డిఎంహెచ్‌ఓను ఆదేశించారు. సమావేశంలో డిసిహెచ్‌ఎస్ డాక్టరు శంకరరావు, డాక్టరు ఎఎస్ రామ్, డాక్టరు సురేష్‌బాబు, డాక్టరు వెంకట్రావు, డాక్టరు రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ డైరెక్షన్‌లో మోదీ పాలన
ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి
విక్రమ్ సింగ్

భీమవరం, డిసెంబర్ 15: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) డైరక్షన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నడుస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్రమ్‌సింగ్ విమర్శించారు. భీమవరంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రదర్శన చేశారు. అనంతరం స్థానిక కేశవరావు హైస్కూలు ఆవరణలో సభను నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము అధ్యక్షతన ఈ సభ జరిగింది. ప్రభుత్వ విద్యను నాశనం చేస్తూ డిజిటల్ ఇండియాను సాధించడం ఎలా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా, షైనింగ్ ఇండియా, క్యాష్‌లెస్ ఇండియా, మేకిన్ ఇండియా అంటూ ఆర్భాటాలు చేస్తున్నారన్నారు. విద్యాపరంగా అభివృద్ధి చెందకుండా ఇవేమీ సాధ్యం కాదన్నారు. దేశంలోని ప్రజలు ఏం చదవాలి, ఏం తినాలి, ఎటువంటి బట్టలు కట్టుకోవాలి, ఏ భాష మాట్లాడాలి అనే విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్ పై నుంచి శాసిస్తోందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జాతీయ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జైలులో ఖైదీలకు వసతి గృహాల్లో ఉంటున్న వారి కన్న ఎక్కువ కేటాయించడం దారుణమన్నారు. విద్యార్థులకు రాజకీయాలు వద్దంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెబుతున్నారని, వారు విద్యార్థి సంఘాల్లో పనిచెయ్యలేదా అని ప్రశ్నించారు. విపి సాహు, నూర్ మహ్మద్, చిన్నారి, పి.తులసీ, బి.సాంబశివ, వి.మహేష్, పంపన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

తప్పని నగదు తిప్పలు
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 15: నగదు కోసం పేదలు, సామాన్యులకు బ్యాంకుల వద్ద తిప్పలు తప్పడం లేదు. పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వాపోతున్నారు. ఖాతాదార్ల తిప్పలు చెప్పనలవి కాకుండా ఉంది. నగదు వస్తున్న ఎటిఎంల వద్ద బారులు తీరుతూనే ఉన్నారు. కేంద్రం వెయ్యి, 500 నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి ఒక నెలా వారం రోజులు గడిచినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో సహనం నసిస్తోంది. గోరుచుట్టుపై రోకటి పోటులా సహనం నశిస్తున్నవారిని బ్యాంక్ యాజమాన్యాలు మరింత రెచ్చగొడుతున్నాయి. స్థానిక ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచి గేట్లు గురువారం మూసివేశారు. బ్యాంక్‌కు వచ్చే జన ప్రవాహాన్ని తట్టుకోలేక, బ్రాంచి లోపల ఖాళీ లేక గేట్లు మూయాల్సి వచ్చిందని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. బ్యాంకు అధికారులు తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాల వల్ల ప్రజల్లో సహనం నశిస్తోందని, ప్రభుత్వం ధ్వంద్వ వైఖరి అవలంబిస్తున్నా ప్రజలు ఇంకా సంయమనం పాటిస్తున్నారని, సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను బ్యాంక్‌లు తుంగలోకి తొక్కుతుంటే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేని చేతగాని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉండటం ప్రజల పాలిట శాపమని పలువురు వాపోతున్నారు. స్థానిక ఎస్‌బిఐ ప్రధాన శాఖకు గురువారం 500 కొత్త నోట్లు వచ్చాయి. ఎటిఎంలో కూడా కొత్త 500 నోట్లు పెట్టారు. ఎటిఎం వద్ద బారులు తీరిన ఖాతాదార్లకు మాత్రం నిరాశే మిగిలింది. రెండువేలు డ్రా చేసుకుంటే 2 వేల నోటే వచ్చింది. వెయ్యి, 1500 డ్రా చేసుకుంటే 500 నోట్లు వచ్చాయి. ఈ నోట్లు కూడా కొద్దిసేపు మాత్రమే లభించాయి. బ్యాంక్ ప్రధాన శాఖ ఇరుకు ప్రదేశంలో ఉండటం, ఆపై బ్యాంక్ ఆవరణ సరిపోకపోవడంతో ఖాతాదారులకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. చాలామంది సొమ్మసిల్లి పడిపోయారు. తాగడానికి నీళ్ళు లేవు, నిలబడటానికి చోటు లేదన్నట్టు తయారైంది. పట్టణంలోని ఎస్‌బిఐ శాఖలు తక్షణమే భారీ కల్యాణ మండపాలు, లేక ఆడిటోరియంలలోకి మార్చివేయాలని ఖాతాదారులు కోరుతున్నారు. బ్యాంక్‌ల్లో కంప్యూటర్లు, కౌంటర్లు, సిబ్బందిని పెంచాలని కోరుతున్నారు. ఆన్‌లైన్ సేవలు పొందేందుకు బ్యాంక్‌ల సర్వర్లు కనీసం వంద రెట్లు పెంచాలని కోరుతున్నారు. ఆన్‌లైన్ సేవలు చేసుకోవాలని ప్రచారం చేస్తున్న పాలకులకు నెట్‌వర్క్, సర్వర్ల సామర్థ్యాలపై అవగాహన లేకపోవడం ప్రజల దురదృష్టంగా భావిస్తున్నారు. తాము ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంపై ఓటు వేయలేదా? మాకు ఆన్‌లైన్ గురించి ఎందుకు తెలియదు? చదువుకోక పోయినా మాకు ఇన్ని తెలిసినప్పుడు చదువుకున్న పాలకులకు వీటిపై కనీస పరిజ్ఞానం లేక పోవడం బాధాకరమని పేదలు, వృద్ధులు వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా, స్థానిక ఆంధ్రాబ్యాంక్ ప్రధాన శాఖలో 500 నోట్లు రాక పోయినప్పటికీ గురువారం నాలుగు వేలు విత్‌డ్రాలు ఇచ్చారు. ఎటిఎం కొద్దిసేపు పని చేసింది. రైతులకు, మెడికల్ బిల్లులు చూపిన వారికి 24 వేలు డ్రా చేసుకునే అవకాశం కల్పించామని బ్రాంచ్ చీఫ్ మేనేజర్ కె.త్రినాథరావు తెలిపారు. పింఛనుదార్లకు ఎటిఎం కార్డులు అందజేస్తున్నట్టు చెప్పారు. పట్టణంలో ఉన్న మిగిలిన 19 బ్యాంక్ శాఖల్లోను పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. నగదు లేనందున తాము చేయగలిగింది ఏమీ లేదని ఖాతాదార్లకు ఖరాఖండీగా చెప్పేస్తున్నారు.

క్రీడాసక్తిని పెంపొందించే పోటీలు
చింతలపూడి జోన్ బాలికల క్రీడా పోటీల ప్రారంభ సభలో రాష్ట్ర యోగా, క్రీడల సమన్వయ అభివృద్ధి అధికారి రవీంద్ర
లింగపాలెం, డిసెంబర్ 15: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో క్రీడాసక్తిని పెంపొందించేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర యోగా, క్రీడల సమన్వయ అభివృద్ధి అధికారి రవీంద్ర అన్నారు. గురువారం మండలంలోని సింగగూడెం జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో చింతలపూడి జోన్ బాలికల క్రీడా పోటీలను రవీంద్ర ప్రారంభించారు. తొలుత ఎంపిపి ద్వారంపూడి మల్లికార్జునరావు, జడ్పీటీసీ గుత్తా సాయి సత్యవరప్రసాద్ (పెద్దబాబు)లు క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఇప్పటి వరకూ 77 చోట్ల క్రీడా పోటీలను నిర్వహించామన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో 3వేల పిఇటి పోస్టులు భర్తీచేయనున్నట్టు ఆయన తెలిపారు. పాఠశాలల్లోని ప్రతి క్రీడా మైదానాలను రూ.5లక్షలతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. విద్యార్థినీ విద్యార్థుల్లో విద్యతోపాటు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో నిష్ణాతులయ్యేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఇటువంటి క్రీడా పోటీల వల్ల కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. జడ్పీటీసీ పెద్దబాబు, ఎంపిపి మోరంపూడి మల్లికార్జునరావులు మాట్లాడుతూ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు దాతల సహకారంతో మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంధన్నారు. ఇందుకు తాము పూర్తి సహకారం అందజేస్తామన్నారు. అనంతరం వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ తదితర పోటీలను నిర్వహించారు. డివిజన్ పరిధిలోని 30 పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కేతిన శ్రీహరి, దేవా మరియమ్మ, తహసీల్దార్ సోమశేఖర్, ఎన్జీవో బేతపూడి వెంకటేశ్వరరావు, పాఠశాల హెచ్‌ఎం లక్ష్మణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మద్యం సేవించి
పాఠశాలకు వస్తే
ఉపాధ్యాయులను డిస్మిస్‌చేయండి
బడిగంటలు కార్యక్రమంలో డిఇఒకు కలెక్టర్ భాస్కర్ ఆదేశం
ఏలూరు, డిసెంబర్ 15 : మద్యం సేవించి పాఠశాలలకు వచ్చే టీచర్లను డిస్మిస్ చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం బడి గంటలు కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి పలువురు ఫోన్ ద్వారా పాఠశాలల్లో సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కారానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెదవేగి మండలం బాపిరాజుగూడెం గ్రామానికి చెందిన మురళి ఫోన్ ద్వారా కలెక్టర్‌తో మాట్లాడుతూ మూడు నెలల క్రితం రామచంద్రపురం ఎలిమెంటరీ పాఠశాలలో సిహెచ్ రాజేశ్వరరావు అనే టీచర్ తాగి పాఠశాలకు రావడంతో సస్పెండ్ చేశారని ఆ స్థానంలో మరొక టీచర్‌ను నియమించాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ స్కూలుకు టీచర్ తాగివస్తాడా? అటువంటి టీచర్లను సర్వీసు నుండి ఇంకా డిస్మిస్ ఎందుకు చేయలేదని పవిత్రమైన పాఠశాలకు టీచరే తాగివస్తే ఎలా? సమాజంలో టీచర్లపై ఏమి గౌరవం ఉంటుందని కలెక్టర్ ప్రశ్నించారు. తప్పు చేస్తే ఉద్యోగం నుండి కొంతమందిని తొలగిస్తేనే వ్యవస్థ బాగుపడుతుందని, ఇతరులు సక్రమంగా పనిచేస్తారని తక్షణమే రాజేశ్వరరావు విషయంలో సమగ్ర విచారణ జరిపి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసి తనకు నివేదిక సమర్పించాలని డిఇవోను కలెక్టర్ ఆదేశించారు. విచారణ పేరుతో సంవత్సరాలు గడిపితే కుదరదని ప్రబుత్వ ఉద్యోగి తాగి విధులకువస్తే తక్షణమే ఆసుపత్రికి పంపించి మెడికల్ సర్ట్ఫికేట్ తీసుకుని నోటీసు ఇచ్చి డిస్మిస్ చేస్తే విధి నిర్వహణలో మరొకరు తాగి రాకుండా ఉంటారని స్పష్టం చేశారు. ఉండి మండలం వేండ్ర గ్రామంలో సైన్స్ టీచర్ నిర్మలకుమారి మతబోధనలు చేస్తూ చందాలు వసూలు చేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు రాగా తక్షణమే ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తున్నామని, సాయంత్రం లోగా సర్వశిక్ష అభియాన్ పివో బ్రహ్మానందరెడ్డి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గోపాలపురం మండలం హుకుంపేట గ్రామంలో టీచర్ అందుబాటులో ఉండడం లేదని, ఇష్టానుసారం పాఠశాలకు వస్తున్నారని, కొన్ని రోజులు పాఠశాలకే రావడం లేదని, జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటూ హుకుంపేటకు రావడం జరుగుతున్నదని ఒక వ్యక్తి ఫోన్‌లో కలెక్టర్ దృష్టికి తీసుకురాగా దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రేపటి నుండి హుకుంపేటలో టీచర్ కాపురం ఉంటున్నట్లు గ్రామస్తులు సర్టిఫై చేస్తేనే ప్రతినెలా ఆ టీచర్‌కు జీతం ఇస్తామని తక్షణమే టీచర్ హుకుంపేటకు మకాంమార్చేలా స్పష్టమైన ఆదేశాలివ్వాలని డిఇవోను ఆదేశించారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు నుంచి బాబ్జి మాట్లాడుతూ పాఠశాలలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా వుంటున్నాయని గత వారం తమ దృష్టికి తీసుకువచ్చానని కాని అధికారులు ఎవరూ రాలేదని, ఆ సమస్య పరిష్కారం కాకుండా అలాగే వుందని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఏ కార్యక్రమం చేపట్టినా అది సక్రమంగా అమలు చేయరా? వచ్చిన సమస్యలు పరిష్కారం కాకపోతే ఇలా ఉదయమే బడి గంటలు కార్యక్రమం పెట్టడం ఎందుకని అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. సంబంధిత డి ఇని సస్పెండ్ చేయాలని డిఇవోను ఆదేశించారు. బడిగంటలు కార్యక్రమంలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. బడి గంటల కార్యక్రమం వల్ల పాఠశాలల్లో సౌకర్యాలు ఏ విధంగా ఉంటున్నాయో స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. పాఠశాలల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డి ఇవో డి మధుసూధనరావు, సర్వశిక్ష అభియాన్ పివో బ్రహ్మానందరెడ్డి, ఉప విద్యాశాఖాధికారులు ఉదయభాస్కర్, తిరుమలదాసు, మద్దూరి సూర్యనారాయణమూర్తి, స్వామి రాజు, జి విలియమ్స్, కె రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఐసిడిఎస్ పిడిగా విద్యావతి బాధ్యతలు స్వీకారం
ఏలూరు, డిసెంబర్ 15 : జిల్లా స్ర్తి శిశు సంక్షేమ శాఖ పిడిగా ఎస్ విద్యావతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఐసిడి ఎస్ కార్యాలయంలో ఇన్‌ఛార్జి పిడి విజయకుమారి నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. అదే విధంగా ఇన్‌ఛార్జి ఆర్‌జెడిగా కూడా విద్యావతి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేశారు.