పశ్చిమగోదావరి

రోడ్లపై ఆనందంగా వెళ్లగలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 20 : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సరైన చర్యలు తీసుకోకపోవడం వలనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని ఇప్పటికైనా కుంభకర్ణ నిద్ర విడనాడి జనం ఆనందంగా రోడ్లపై వెళ్లే పరిస్థితులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. రెండు నెలల క్రితం జరిగిన సమావేశంలో ప్రతీ జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానం చేసే గ్రామీణ, మండల, జిల్లాస్థాయి రోడ్ల వద్ద రుంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసు శాఖ ఎందుకు నిర్లక్ష్యం వహించిందని డిఎస్‌పి శ్రీనివాసరావును కలెక్టర్ ప్రశ్నించారు. జిల్లాలో గత రెండు నెలల కాలంలో అధికారికంగా 39 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించారంటే అనధికారికంగా కనీసం 70 మందికి పైగా మరణించి ఉంటారని ఇలా అయితే ప్రజల ప్రాణాలను ఎలా కాపాడుతామని కలెక్టర్ ప్రశ్నించారు. ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ శాఖలు జిల్లాలో ప్రతీ రోడ్డు క్రాసింగ్ వద్ద కచ్చితంగా రుంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, దీని వలన వాహనాల వేగం తగ్గించుకునే అవకాశాలుంటాయని దానితో ప్రమాదాలు కూడా నివారించుకోవచ్చునని చెప్పారు. జిల్లాలో గతేడాది కాలంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 4500 మంది పట్టుపడితే అందులో కేవలం 25 మందికి మాత్రమే శిక్ష పడడం చూస్తుంటే ప్రజల ప్రాణాలకు హాని కలిగించే వారిని నియంత్రించలేమని ఇప్పటికైనా తాగి వాహనాలు నడిపే వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని దానివలన రోడ్డు ప్రమాదాలను కొంత వరకైనా నివారించగలుగుతామన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల మధ్యన విధిగా పెద్ద ఎత్తున మొక్కలను పెంచాలని దీని వలన రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చునని లేకపోతే ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్‌కు సరిగ్గా కనపడక ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయని చెప్పారు. జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులపై 348 మద్యం షాపులున్నాయని, వాటిని పూర్తిస్థాయిలో తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పటిష్టవంతంగా అమలుచేసి వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ఒక్క దుకాణం కూడా లేకుండా చేయాలని గత రెండేళ్ల నుండి తాను ఈ విషయాన్ని చెబుతున్నప్పటికీ ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా మద్యం షాపులు తొలగింపబడడం ఆనందంగా వున్నదని చెప్పారు. జాతీయ, రాష్ట్ర రహదారుల వద్ద ఏ ఏ ప్రాంతంలో ప్రభుత్వాసుపత్రులున్నాయో వాటి వివరాలను, టెలిఫోన్ నెంబర్లను ప్రత్యేకంగా ఈ రోడ్లపై ఏర్పాటు చేయాలని దాని వలన ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే సకాలంలో వైద్యం అందించగలగడానికి వీలు కలుగుతుందని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనరు సత్యనారాయణమూర్తి, పంచాయితీరాజ్ శాఖ ఎస్ ఇ మాణిక్యం, ఆర్ అండ్ బి ఎస్ ఇ నిర్మల, ఆర్‌టిసి ఆర్ ఎం ధనంజయరావు, డిఎంహెచ్ ఓ డాక్టర్ కె కోటీశ్వరి, ఎక్సైజ్ డిసి వైవి భాస్కరరావు, డి ఎస్‌పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదులో టాప్

భీమవరం, డిసెంబర్ 20: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లా మూడవ స్థానం నుంచి ప్రథమ స్థానానికి చేరుకుంది. గత ఏడాది కేవలం 4 లక్షల సభ్యత్వాలతో సరిపెట్టిన జిల్లా ఈసారి 5 లక్షల 33 వేల 150ను లక్ష్యంగా పెట్టుకుని, అంతకు మించి 5 లక్షల 81 వేల 378 సభ్యత్వాలను సాధించింది. 107.3 శాతం సభ్యత్వ నమోదు సాధించడానికి కృషిచేసిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతామారమక్ష్మిని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గం 132.23 శాతం సభ్యత్వాల నమోదుతో రాష్టస్థ్రాయలోనే రికార్డు సృష్టించింది. గత ఏడాది కూడా పాలకొల్లు నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచింది. అక్కడ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రెండోసారి ఈరికార్డును సొంతంచేసుకున్నారు. జిల్లా స్థాయిలో ఉండి నియోజకవర్గం 106.65 శాతంతో రెండవ స్థానంలో నిలిచింది. దెందులూరు నియోజకవర్గం 103.99 శాతంతో తృతీయ స్థానంలో నిలిచింది.
నూరుశాతం దాటిన నియోజకవర్గాలు
సభ్యత్వ నమోదు విషయానికి వస్తే ఉంగుటూరు, తణుకు, ఏలూరు, గోపాలపురం, పోలవరం, కొవ్వూరు, నియోజకవర్గాలు నూరుశాతం మించి సభ్యత్వ నమోదు చేసుకున్నాయి. ఇక ఆచంట 100.81 శాతం నమోదు చేసుకుంది. మంత్రి పీతల సుజాత నియోజకవర్గం చింతలపూడిలో 89.56 శాతం, నిడదవోలు 95.07, భీమవరం 88.15, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 57.52 శాతం మాత్రమే సభ్యత్వ నమోదు జరిగింది. తాడేపల్లిగూడెంలో బిజెపికి చెందిన మంత్రి మాణిక్యాలరావు హవా సాగుతోంది. ఇక్కడ బిజెపిని మంత్రి మాణిక్యాలరావు బలోపేతం చేస్తున్నారు. మంత్రి పీతల సుజాతకు, పార్టీ క్యాడర్‌కు మధ్య విభేదాల కారణంగా సభ్యత్వ నమోదు మందగించిందని పార్టీలోని కొందరు ఆంచనా వేస్తున్నారు. మొత్తం మీద సభ్యత్వ నమోదులో చిత్తూరు జిల్లా సరసన పశ్చిమ గోదావరి జిల్లా నిలిచింది.