పశ్చిమగోదావరి

రోడ్డు ప్రమాదంలో భార్య, భర్తలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెంటపాడు, జనవరి 2: పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలోని ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ ఎదురుగా సోమవారం కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో భార్యభర్తలు మృతిచెందారు. డ్రైవర్ సహా కారులో ప్రయాణిస్తున్న మరో మహిళ గాయపడ్డారు. పెంటపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామానికి చెందిన అడపా రామారావు (68), భార్య వరలక్ష్మి, ఆమె చెల్లెలు సుజాత భీమడోలు మండలం పూళ్ళ గ్రామం కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారును అతివేగంగా నడపడంతో స్థానిక ఫుడ్ ఫ్యాట్స్ ఫ్యాక్టరీ వద్ద అదుపుతప్పి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో రామారావు అక్కడికక్కడే మృతి చెందగా భార్య వరలక్ష్మి మార్గం మధ్యలో మృతిచెందింది. డ్రైవర్, సుజాత స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాడేపల్లిగూడెం ఏరియా అసుపత్రికి తరలించారు. పెంటపాడు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం కేసు దర్యాప్తుచేస్తున్నారు.

మెంటేకు కన్నీటి వీడ్కోలు

భీమవరం, జనవరి 2: గండిపేట మేధావి రాజకీయ దురంధరుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మెంటే పద్మనాభం పార్థివ దేహానికి సోమవారం అభిమానులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. వందలాది మంది ప్రజలు కన్నీటితో పద్మనాభంకు నివాళులర్పించారు. పద్మనాభం భౌతికకాయాన్ని ఇంటి నుండి భారీ జనసమూహంతో శ్మశాన వాటికకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి అంత్యక్రియలు నిర్వహించారు. జోహార్ సోషలిస్టు నాయకుడు అంటూ నినాదాలతో ఉరేగింపు సాగింది. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎంపి, పోలవరం సాధన సమితి నాయకులు యర్రా నారాయణస్వామి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, భీమవరం మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి చినబాబు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాజీ మంత్రులు కొత్తపల్లి సుబ్బారాయుడు, చేగొండి హరిరామజోగయ్య ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. పద్మనాభం ఒక వ్యక్తి కాదు.. ఒక సంస్థ అని, భీమవరం ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శిగా అందించిన సేవలు అజరామరమని వారి, ఆశయాలను మనం నెరవేర్చాలని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు. డిసిసిబి మాజీ చైర్మన్లు వట్టి వెంకటరంగ పార్థసారధి, కరాటం రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు, టిడిపి రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారధి, వైసిపి నాయకులు కొయ్యే మోసేనురాజు, కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులు, ఎద్దు ఏసుపాదం, మెంటే గోపి, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, పారిశ్రామికవేత్త యిర్రింకి సూర్యారావు, సంఘ సేవకులు చెరుకువాడ సోదరులు వెంకట్రామయ్య, రంగసాయి, గన్నాబత్తుల శ్రీనివాస్, ఎస్‌విఆర్ దాస్, ఉండవల్లి రేమేష్ నాయుడు, చెలంకూరి వెంకట సత్యనారాయణ (సివి), చినిమిల్లి వెంకట్రాయుడు, మావుళ్లమ్మ దేవస్థానం కమిటీ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు, వబిలిశెట్టి కనకరాజు, వబిలిశెట్టి పట్ట్భారామయ్య, ఛాంబర్ అధ్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణగుప్త, కార్యదర్శి కాగిత వెంకటరమణ, జివిఐటి ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గ్రంధి వెంకట్రావు, గ్రంధి సురేష్‌లు మెంటే పద్మానాభం సేవలను కొనియాడుతూ నివాళి అర్పించారు. భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ విద్యాసంస్థలు, విఎస్‌కె డిగ్రీ కళాశాల, పట్ట్భా, గొల్లు వెంకన్న జూనియర్ కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించి సంతాపాలు తెలిపారు. భీమవరం 1వ టౌన్ హిందూ శ్మశాన వాటికలో పద్మనాభం అంత్యక్రియలు నిర్వహించారు. ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు గంటాసుందర కుమార్ పద్మనాభం భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు.
కొత్తగా 48 వేల కార్డులు, 30 వేల పింఛన్లు

ఏలూరు, జనవరి 2 : ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిర్వహిస్తున్న జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తుండగా జిల్లాలో 48 వేల కొత్త రేషన్‌కార్డులు అందిస్తున్నామని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖామంత్రి పీతల సుజాత చెప్పారు. చింతలపూడి గ్రామంలో సోమవారం 4వ విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పీతల సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం 16 వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమాన్ని ఎక్కడా విస్మరించకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు దక్కుతుందన్నారు. ఎన్‌టిఆర్ భరోసా పెన్షన్లు పధకం కింద రాష్ట్రంలో 43 లక్షల 59 వేల మందికి ప్రతీ ఏటా ఆరు వేల కోట్ల రూపాయల మేర పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఇదే పశ్చిమగోదావరి జిల్లాలో 3 లక్షల 50 వేల మందికి పెన్షన్లు అందిస్తుండగా కొత్తగా మరో 30 వేల మందికి కొత్త పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి ప్రతీ ఇంట్లోనూ పూర్తిస్థాయిలో వంట గ్యాస్ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. పేదల జీవితానికి భరోసా ఇచ్చేందుకు చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. అవినీతి లేని పారదర్శక పాలన ప్రజలకు అందించే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వెళుతున్నదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 4వ విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని 5 ప్రధాన అంశాలతో నిర్వహిస్తున్నామన్నారు. గత 3వ విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో వచ్చిన ప్రజా విజ్ఞప్తులను చాలా వరకు పరిష్కరించామని మిగిలిన విజ్ఞప్తులు కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఏ గ్రామం నుండి అర్జీలు వచ్చినా వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం యాప్‌ను రూపొందించిందన్నారు. చింతలపూడిలో గత రెండున్నరేళ్లలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరిచామన్నారు. ఒక్క చింతలపూడి గ్రామంలోనే 12 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్ స్టేషన్లు, 11 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రోడ్లు అభివృద్ధి పరిచామన్నారు. మరో 14 కోట్ల రూపాయలతో మరిన్ని రోడ్లు అభివృద్ధి పరుస్తున్నామన్నారు. పంచాయితీ రాజ్ శాఖ ద్వారా 15 కోట్ల రూపాయలతో పలు రోడ్డులను అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 28 లక్షల రూపాయలు అందజేసామన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసామన్నారు. చింతలపూడి మండలంలో 2 కోట్ల 50 లక్షల రూపాయలతో 1711 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని ఇంకా ఎవరైనా నిర్మించుకోకపోతే వారికి తక్షణమే మంజూరు చేస్తామన్నారు. ఎన్‌టి ఆర్ గృహ నిర్మాణ పధకం కింద 396 ఇళ్ల నిర్మాణానికి 5 కోట్ల 90 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. చింతలపూడిలో ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించడంతోపాటు గతంలో ఇళ్ల స్థలాలను తీసుకుని అందుబాటులో లేని లబ్ధిదారుల స్థలాలను కూడా గుర్తించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్‌ను మంత్రి ఆదేశించారు. ఏలూరు ఆర్‌డివో ఎన్ తేజ్‌భరత్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలు ఎంతో అనువైన విధానం అన్నారు. ప్రతీ ఒక్కరికీ జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించి రూపే కార్డులు అందిస్తామని వాటి ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చునన్నారు. డి ఆర్‌డి ఏ పిడి, మండల ప్రత్యేకాధికారి కె శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రన్న బీమా పధకంలో ప్రతీ ఒక్కరూ నమోదై వాటి సంక్షేమ ఫలాలను పొందాలన్నారు. జిల్లాలో ప్రతీ నెలా ఇచ్చే సామాజిక పెన్షన్లు కోసం గాబరా పడవద్దని గతంలో ఇచ్చిన మాదిరిగానే ఈ నెల నుండి లబ్దిదారులకు నేరుగా అందించడం జరుగుతుందన్నారు. తొలుత మా తెలుగుతల్లికి మల్లెపూదండ ప్రార్ధనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మభూమి - మా ఊరు సందేశాన్ని చదివి సభకు వినిపించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు జన్మభూమి ప్రతిజ్ఞను నిర్వహించారు. పలువురు లబ్ధిదారులకు ఆమ్ ఆద్మీ యోజన, జనశ్రీ యోజన స్కాలర్‌షిప్‌లను, చంద్రన్న బీమా క్లెయిమ్‌లను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటిసి తాళ్లూరి రాధారాణి, ఎంపిపి దాసరి రామక్క, మండల తహశీల్దార్ మైఖేల్ రాజు, ఎంపిడివో రాజశేఖర్, పలువురు ఎంపిటిసిలు, సొసైటీ అధ్యక్షులు, చింతలపూడి సర్పంచ్ మారిశెట్టి జగన్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసులు ఎందుకు...!
-రామసింగవరం జన్మభూమిలో ప్రజల ఆగ్రహం
ద్వారకాతిరుమల, జనవరి 2: పోలీసు బందోబస్తు నడుమ జన్మభూమి కార్యక్రమాలేమిటంటూ రామసింగవరం గ్రామస్థులు ప్రజాప్రతినిధులను నిలదీశారు. మండలంలోని ఐఎస్ రాఘవాపురం, రామసింగవరం పంచాయతీల్లో సోమవారం నాల్గవ విడత జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థులకు అడుగడుగునా పోలీసులు అడ్డుతగలడంతో వారు ఒకింత ప్రజాప్రతినిధులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పుకుందామని వస్తే ఇదేమిటంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి వడ్లపూడి ప్రసాద్, జడ్పీటీసీ మొగతడకల లక్ష్మీరమణిలు ప్రజలకు నచ్చజెప్పేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. తమ కాలనీల్లోని రహదారులు, డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, మరి అభివృద్ధి చేశామంటారేమిటంటూ గ్రామస్థులు విరుచుకుపడ్డారు. అనంతరం గ్రామస్థుల నుండి పలు సమస్యలపై అర్జీలు అందుకుని, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

తెగ తాగేస్తున్నారు

భీమవరం, జనవరి 2: కావాలనో.. వేలం వెర్రో తెలియదుకాని జిల్లాలోని డెల్టా ప్రాంతంలో మందుబాబులు తెగ తాగేస్తున్నారు. వారి తాగుడుకి అడ్డూ అదుపులేకుండా పోయింది. రోజూ తాగేవారి సంఖ్యతో పాటు యువత ఎక్కువగా మద్యానికి అలవాటు అవుతున్నట్టు కనిపిస్తోంది. అబ్కారీ శాఖ లెక్కలే ఎంతమంది మందుబాబులుగా మారుతున్నారో చెప్పేస్తున్నాయి. ఇక పండుగలు, ప్రత్యేక పార్టీలు చూస్తే ప్రత్యేకంగా మందు తాగడానికే పెట్టారనిపిస్తోంది.
భారీగా పెరుగుతున్న మద్యం విక్రయాలు
భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం పరిధిలో ఆరు సర్కిళ్లు ఉన్నాయి. ఈ సర్కిళ్ల పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు 251 ఉన్నాయి. భీమవరం, తణుకు, పెనుగొండ, ఆకివీడు, పాలకొల్లు, నరసాపురం పరిధిలో ఈ దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు సాగుతాయి. ఈ సర్కిళ్ల పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పరిశీలిస్తే కేవలం 251 దుకాణాల ద్వారా విక్రయించిన రూ.436.26 కోట్ల మద్యాన్ని మందుబాబులు తాగేశారు. గత ఏడాది ఇదే 9 నెలల కాలానికి రూ.390.44 కోట్లు మద్యాన్ని మందుబాబులు తాగారు. దీనిని బట్టి ఎంత ఎక్కువ మద్యం తాగేశారో ఇట్టే అర్ధమవుతుంది. అంతేకాదు 2016 డిసెంబర్ మాసంలో ఏకంగా రూ.55.83 కోట్ల విలువైన మద్యం తాగేశారు. 2015లో ఇదే మాసంలో రూ.52.23 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయ.
రెండు రోజులు రూ.25 కోట్లు
2017 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సమయంలో మందుబాబులతో మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. డిసెంబర్ 31 శనివారం రావడం, నూతన సంవత్సరం ఆదివారం కావడంతో చాలామంది ఉద్యోగులకు సెలవులు వచ్చాయి. మందుబాబులు రెండు రోజులు వారి ప్రతాపం చూపారు. చాలా కుటుంబాలకు ఆదివారం కలిసివచ్చింది. ఈ రెండు రోజులు కలిపి జిల్లాలో సుమారు రూ.25 కోట్లకు పైగానే ఖర్చుచేసినట్లు అంచనా వేస్తున్నారు. చాలా హోటళ్లలో నగదు రహిత సేవలను వినియోగించుకోవడం విశేషం.
వచ్చే ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయం
వీరవాసరం, జనవరి 2: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని, ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ధీమా వ్యక్తంచేశారు. సోమవారం నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వీరవాసరంలో మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. భీమవరం నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ కోటిపల్లి బాబు అధ్యక్షతన జరిగిన సభలో నాని మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాత్రింబవళ్లు ఉద్యోగులను పనిచేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి పేరుతో ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం అర్హులకు పథకాలు అందించడం లేదన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో అనర్హులకు పింఛన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో వైసిపి కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. చిన్న సమస్యలున్నా కలిసికట్టుగా పోరాడి రానున్న రోజుల్లో వైసిపి బలోపేతానికి కృషిచేయాలన్నారు. గత మండల పరిషత్ ఎన్నికల్లో జిల్లాలో ఎక్కడా లేని విధంగా వీరవాసరం మండల జడ్పీటీసీ, 16 ఎంపిటిసిలు వైసిపి దక్కించుకునేందుకు కృషిచేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ టిడిపి అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పింఛన్ల పంపిణీలో అర్హులను పక్కన పెట్టి టిడిపి కార్యకర్తల సిఫార్సుల మేరకు అనర్హులకు ఇస్తున్న విషయాలను బహిర్గతం చేయాలన్నారు. మండలంలో కొందరు అధికారులు టిడిపి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ వంకా రవీంద్ర, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ ముదునూరి ప్రసాదరాజు, పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుణ్ణం నాగబాబు, ఉండి నియోజకవర్గ కన్వీనర్ పాతపాటి సర్రాజు, ఆచంట నియోజకవర్గ కన్వీనర్, వీరవాసరం ఎంపిపి కవురు శ్రీనివాసరావు, వీరవాసరం జడ్పీటీసీ సభ్యుడు మానుకొండ ప్రదీప్, కనకరాజు సూరి తదితరులు పాల్గొన్నారు.

ప్రేమజంట మృతదేహాలు లభ్యం

భీమవరం, జనవరి 2: యనమదుర్రు డ్రెయన్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారని భావించిన ప్రేమ జంట మృతదేహాలు యనమదుర్రు డ్రెయిన్‌లో సోమవారం లభ్యమయ్యాయి. శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో రెండు రోజుల తర్వాత స్థానిక పెద్ద వంతెన రైల్వేగేటు వద్ద కనుమురెడ్డి మహేష్ (పండు) (25) మృతదేహం ఉదయం లభ్యం కాగా, మధ్యాహ్నం రెండవ పోలీసు స్టేషన్ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద పుట్ట శక్తిస్వరూప (19) మృతదేహాన్ని గుర్తించారు. వీటిని గజ ఈతగాళ్లతో గట్లపైకి తీసుకువచ్చారు. భీమవరం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కనుమురెడ్డి మహేష్ అలియాస్ పండు మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి వ్యాను మీద ఊరేగింపుగా జోహార్ పండు అంటూ నినాదాలు చేసుకుంటూ అంత్యక్రియలకు తీసుకువెళ్ళారు. మధ్యాహ్న సమయంలో మరికొద్ది గంటల్లో న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమవుతున్న సమయంలో పుట్ట శక్తిస్వరూప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సాయంత్రం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి నుంచి హిందూ శ్మశానవాటిక వరకు వ్యాను మీద ఊరేగింపుగా తీసుకువెళ్ళారు.
చదువు తర్వాత పెళ్లికి అంగీకరించినా...
భీమవరం టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఈ నెల 31వ తేదీ నుంచి పుట్ట శక్తి స్వరూప కనిపించడంలేదని ఆమె తండ్రి పుట్ట రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బివి రాజు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం బిఎస్సీ చదువుతున్న స్వరూప కళాశాల నుంచి ఇంటికి కూడా రాలేదని, తన కుమార్తె అదృశ్యమైందని తండ్రి ఫిర్యాదుచేశారు. 2017 జనవరి 1వ తేదీ నుంచి తన కుమారుడు మహేష్ అలియాస్ పండు అదృశ్యమయ్యాడని తండ్రి కనుమురెడ్డి శివన్నారాయణ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా స్వరూప, మహేష్‌లు ఇద్దరికి వివాహం చేసేందుకు ఇరువురు పెద్దలు అంగీకరించారని, కానీ చదువు పూర్తిచేసుకున్న తర్వాతే వివాహం చేస్తామని చెప్పామని, కానీ వారిరువురి మధ్య ఏం జరిగిందో తెలియదని ఫిర్యాదుచేశారు. సోమవారం ఇద్దరి మృతదేహాలు యనమదుర్రు డ్రెయిన్‌లో తేలడంతో అనుమానాస్పద మృతిగా ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

తాడేపల్లిగూడెం, జనవరి 2: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం మున్సిపాల్టీలో 1, 2, 3, 4, 5 వార్డుల్లో జన్మభూమి-మా ఊరు సభలు నిర్వహించారు. ఈ సభలకు వార్డు కౌన్సిలర్లు సింగం సుబ్బారావు, కొల్లి రమావతి, అడపా జమున, పట్నాల రాంపండు, గురుజు సూరిబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 100 గజాల లోపు ఇంటి స్థలాలకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు, తెల్ల రేషన్‌కార్డులు అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌ఛైర్మన్ కిల్లాడి ప్రసాద్, మాజీ వైస్‌ఛైర్మన్ గొర్రెల శ్రీ్ధర్, కమిషనర్ నిమ్మగడ్డ బాలాజీ, అసిస్టెంట్ కమిషనర్ బిహెచ్.సంగీతరావు, టిపిఒ కెవి నాగశాస్త్రులు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
రూరల్ మండలంలో...
రూరల్ మండలం నందమూరు, ఆరుళ్ల, కొత్తూరు, నవాబుపాలెం గ్రామాల్లో సోమవారం జన్మభూమి-మా ఊరు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దారు పి.నాగమణ, ఎంపిడిఒ వై.దోశిరెడ్డి, ఎఒపిఆర్డీ కె.వెంకట్రావు, ఎంఇఒ పివి పాపారావులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు హాజరయ్యారు. ఎంపిపి గన్నమని దొరబాబు, మాజీ ఎంపిపి పరిమి రవికుమార్, సర్పంచ్‌లు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
‘బాబు’ బంగారం
యలమంచిలి, జనవరి 2: చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. యలమంచిలి మండలం మట్లపాలెంలో సోమవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగేవారని, జన్మభూమి ద్వారా అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారన్నారు. అనంతరం ఎస్సీ, ఎస్టీలకు ఎల్‌ఇడి బల్బులు, రేషనుకార్డులు, చంద్రన్న కానుకలు అందచేశారు. నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని, పలు సిసి రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, జడ్పీటీసీ బోనం నాని, ఎంపిపి బొప్పన సుజాత, ఎఎంసి వైస్ చైర్మన్ చిట్టూరి ఆంజనేయులు, సర్పంచ్ కొండేటి వెంకటలక్ష్మి, ఎఎంసి డైరెక్టరు పీతల శీను, ఆత్మ చైర్మన్ ఆరిమిల్లి చిన్ని, బొప్పన చిన్న, తహసీల్దారు వి స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలో కెఎస్ పాలెం, నార్నిమెరక, బూరుగుపల్లి గ్రామాల్లో గ్రామసభలు జరిగాయి.
తెలికిచర్లలో ఫ్లెక్సీ వివాదం
నల్లజర్ల, జనవరి 2: నల్లజర్ల మండలం తెలికిచర్లలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి కారణమైంది. సర్పంచ్ అనిల్‌కుమార్ జన్మభూమి కార్యక్రమానికి హాజరయ్యే నాయకులకు స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే దానిని గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి దహనం చేశారు. నేరుగా సర్పంచ్ బొమ్మను టార్గెట్ చేసుకుని దహనం చేయడంతో సర్పంచ్ వర్గీయుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోమవారం ఉదయం ఫ్లెక్సీని చూసిన వెంటనే ఆందోళనకు దిగారు. తమ నాయకుడి పరువు తీయాలనే అక్కసుతో కావాలనే ఈ చర్యకు పాల్పడ్డారని, ఫ్లెక్సీని దహనం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.
కాగా ఈ విషయం తెలుసుకున్న అనంతపల్లి ఎస్సై వి.వెంకటేశ్వరరావు గ్రామానికి వెళ్లి ఆందోళనకారులతో మాట్లాడారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ఒక తప్పయితే ఆందోళన చేయడం మరో తప్పని, భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పోలీసులు, గిరిజనుల మధ్య ఘర్షణ
వేలేరుపాడు, జనవరి 2: వేలేరుపాడు మండలం మల్లారం గ్రామంలో సోమవారం సాయంత్రం పోలీసులు, గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సాయంత్రం సమయంలో కోడిపందాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు వేలేరుపాడు ఎస్సై బిఎంవి రాజా సిబ్బందితో మల్లారం వెళ్లారు. అక్కడ కోడిపుంజులు తీసుకుని పారిపోతున్న వ్యక్తులను వెంబడించడంతో వారు పుంజులను వదిలేసి పరారయ్యారు. దాంతో పోలీసులు వాటిని తీసుకుని వెడుతుండగా గిరిజనులు పందాలు వేస్తే తీసుకెళ్లాలి తప్ప, తమ గృహాల వద్ద ఉన్న పుంజులను పట్టుకెళ్లడమేమిటని నిలదీయడంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సంఘటనలో ఇద్దరు గిరిజనులకు స్వల్ప గాయాలయ్యాయి. తాము గిరిజనులను వెంబడించడంతో వారు పడిపోవడంతో గాయలయ్యాయి తప్ప తామేమి చేయలేదని పేర్కొన్నారు. తాము పోలీసులమని తెలియకపోవడంతో గిరిజనులు తమ ఆటోలను అడ్డగించారని పేర్కొన్నారు.