పశ్చిమగోదావరి

మహిళల రక్షణకు ప్రత్యేక కాల్ సెంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 5 : రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రత్యేక మహిళా సహాయ కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. స్థానిక 45వ డివిజన్‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం 15 నిమిషాల్లో స్పందించేలా అభయం యాప్‌ను విస్తృతం చేస్తున్నామన్నారు. దీంతోపాటు మహిళా రక్షణకు మహిళా హెల్ప్‌లైన్ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి 181 టోల్‌ఫ్రీ నెంబర్లను తీసుకురావడం జరుగుతున్నదన్నారు. సమగ్ర శిశు అభివృద్ధి పధకం కింద రాష్ట్రంలో 26 లక్షల మంది పిల్లలకు, 8.56 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అదనంగా పౌష్టికాహారం అందిస్తున్నదన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో 91 కోట్ల రూపాయలతో 3.5 లక్షల మంది తల్లులకు పోషకాహారం అందిస్తున్నామన్నారు. ఎంత అభివృద్ధి సాధించినా ఆరోగ్యరక్షణకు ప్రాధాన్యతనివ్వవలసి వుందన్నారు. బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరమని తగిన వయస్సు వచ్చిన తర్వాతే వివాహాలు చేయాలన్నారు. తల్లి-బిడ్డ సంక్షేమానికే ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. చంద్రన్న బీమా కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలకు అవసరమైన రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, వంటగ్యాస్ కనెక్షన్లు అందిస్తూ ప్రతీ కుటుంబానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఏలూరు నగరంలో పందుల నివారణకు చేపట్టిన ప్రత్యేక చర్యలను మంత్రి సుజాత ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ నూర్జహాన్‌లను అభినందించారు. ఇదే విధానాన్ని జంగారెడ్డిగూడెంలో కూడా అమలు చేస్తామన్నారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి ప్రజాసేవ, చిత్తశుద్ధికి నిదర్శనమే ఏలూరు నగరం స్మార్ట్ సిటీగా ఎంపిక కావడమని చెప్పారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ ఏలూరు సమగ్ర నగరాభివృద్ధికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా స్మార్ట్ సిటీగా ఎంపికైన నగరాన్ని తీర్చిదిద్దేందుకు 33 కోట్ల రూపాయలు విడుదలయ్యాయన్నారు. ప్రజల న్యాయనిర్ణేతలుగా నగరంలో సుందరీకరణ, వాణిజ్య దుకాణాలు నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదన్నారు. 45వ డివిజన్‌లో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని అయితే కొన్ని సాంకేతిక కారణాల వలన కమ్యూనిటీ హాలు నిర్మాణం ప్రతిపాదనలు కౌన్సిల్ తీర్మానంచేసి ప్రభుత్వానికి పంపించినా తిరస్కరించారన్నారు. అందుచేత తన స్వంత నిధులతో ఏప్రిల్‌లో కమ్యూనిటీ హాలు నిర్మాణాలు చేపట్టి జూలైలో ప్రారంభానికి సన్నాహాలు చేస్తామన్నారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ 800 కోట్ల రూపాయలతో హేలాపురి నగరం స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్నదన్నారు. ఎమ్మెల్యే బుజ్జి సహకారంతో హేలాపురి రూపురేఖలను మార్చి అత్యంత సుందరమైన నగరంగా అభివృద్ధిపరుస్తామన్నారు. అనంతరం గర్భిణీలకు శీమంతం కార్యక్రమాలను మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులకు నగదు రూపంలో పెన్షన్లు, సంక్రాంతి కానుకలు, రేషన్‌కార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ కురెళ్ల రాంప్రసాద్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, నగర కమిషనర్ వై సాయి శ్రీకాంత్, డిప్యూటీ మేయర్ రామచంద్రకిషోర్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, స్థానిక కార్పొరేటర్ ఆర్నేపల్లి హిమగిరి, మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడు, కార్పొరేటర్లు మారం హనుమంతరావు, కోమర్తి వేణుగోపాల్, జిల్లా ఎస్‌సి, ఎస్‌టి మోనటరింగ్ కమిటీ సభ్యులు దాసరి ఆంజనేయులు తదితరులుపాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరించిన డిఐజి
ఏలూరు, జనవరి 5 : విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2017 క్యాలెండర్‌ను ఏలూరు రేంజ్ డిఐజి పివిఎస్ రామకృష్ణ ఆవిష్కరించారు. స్థానికంగా గురువారం సంఘ సమావేశం డివిఎస్‌కె భగవాన్‌రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు ట్రాఫిక్‌లో పనిచేస్తున్న హోంగార్డు కోటేశ్వరమ్మ మరణంతో అనాధలైన ఆమె పిల్లలకు ఎనిమిది వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. అలాగే ఇద్దరు వృద్ధులకు రూ.400 నెలసరి పింఛన్లు అందజేశారు. సమావేశంలో హెల్పేజ్ ఇండియా ప్రతినిధి పి శ్యామ్‌కుమార్ క్యాష్‌లెస్ లావాదేవీలు, భీమ్ యాప్‌ల గురించి సభ్యులకు వివరించారు. సమావేశంలో సంఘం నాయకులు ఎస్ దాశరధి, ఎంవి నాగేశ్వరరావు, సి ఆర్ నాయుడు, ధర్మరాజు, కె రాజగోపాలరావు, డివి రామకృష్ణ, పి రత్నయ్య, కె రంగారావు, ఎవి ఎస్ ప్రసాదరాజు, జి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
-రాజ్యసభ సభ్యురాలు తోట
నరసాపురం, జనవరి 5: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తున్నదని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని రుస్తుంబాద గ్రామంలో నిర్వహించిన జన్మభూమి మావూరు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ యడ్లపల్లి లక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో సీతారామలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. అయినప్పటికీ పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి పలు పథకాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. అలాగే సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న జన్మభూమి మావూరు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక సమస్యలు పరిష్కరించడంతోపాటు అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందించేందుకు వీలు కలుగుతుందని ఎంపి తోట సీతారామలక్ష్మి పేర్కొన్నారు. అనంతరం నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుతో కలసి లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాలం ప్రతాప్, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పొత్తూరి రామరాజు, ఎఎంసి ఛైర్మన్ రాయుడు శ్రీరాములు, తహసీల్దార్ జి సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫలితంలేని గ్రామ సభలెందుకు?!
వేలేరుపాడు మండలంలో సమస్యలు పరిష్కారం కావడంలేదని నిలదీసిన ప్రజలు
వేలేరుపాడు, జనవరి 5: సమస్యలు పరిష్కారం కానప్పుడు గ్రామ సభల పేరుతో తమ సమయాన్ని వృథా చేయడమెందుకని జన్మభూమి అధికారులను ప్రజలు నిలదీశారు. గురువారం మండలంలోని కాటుకూరుగొమ్ము, మేడేపల్లి గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌ల అధ్యక్షతన జన్మభూమి సభలు నిర్వహించారు. ఈ సభల్లో ప్రజలు మాట్లాడుతూ గతంలో రేషన్ కార్డులు మంజూరు చేశారు..అందులో యజమాని పేరు తప్పిస్తే మిగిలిన కుటుంబ సభ్యులెవరి పేర్లు లేవని, దాంతో రేషన్ పూర్తిస్థాయిలో అందుకోలేకపోతున్నామని వాపోయారు. తాము కార్డుల మంజూరు సమయంలో దరఖాస్తుతోపాటు కుటుంబ సభ్యులందరి గుర్తింపుకార్డులు జతచేసి ఇచ్చినా ఒకరి పేరుతోనే కార్డు మంజూరు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో పేర్లు నమోదుచేయకపోవడం సిబ్బంది లోపమని అధికారిగా మీకు తెలియదా అని తహసీల్దార్‌ను సూటిగా ప్రశ్నించారు. ఆ తర్వాత ఎన్నోసార్లు ఆధార్‌కార్డులు, ఫొటోలు ఇస్తూనే ఉన్నామని, నేటికీ కార్యరూపం దాల్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విధంగా పెన్షన్లు మంజూరు చేసిన వారికి వేలి ముద్రలు పడడంలేదని, కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారన్నారు. ఈ విధంగా వృద్ధులు, వికలాంగులు పడుతున్న అవస్థలు వర్ణానాతీతంగా ఉన్నాయన్నారు. ఇంత జరుగుతున్నా మండల ప్రధాన అధికారులు ఇవేమీ పట్టనట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. చంద్రన్న బీమా నేటికీ గ్రామాల్లో నమోదు చేయలేదని, ఉపాధి హామీ పనులు చేసిన వారికి డబ్బులు ఇవ్వడం లేదని, బాత్రూములు కట్టుకోమని, తీరా నిర్మించుకున్నాక బిల్లులు చేయకుండా సాకులు చెప్పడం శోచనీయమన్నారు. ఇవన్నీ సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని ప్రత్యేకాధికారి మల్లికార్జునరెడ్డి ప్రజలకు సర్థిచెప్పి, ప్రభుత్వం ద్వారా నూతనంగా మంజూరైన పెన్షన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసు, ఎంపిడిఒ రాజేంద్రప్రసాద్, ఎఒ రాజారావు తదితర అధికారులు పాల్గొన్నారు.

దేశ పునర్నిర్మాణంలో
సివిల్ ఇంజినీర్లు భాగస్వాములవ్వాలి

జాతీయస్థాయి విద్యార్థి సింపోజియమ్ సూపర్‌నోవా-2కె17 ప్రారంభసభలో ఎయు సివిల్ విభాగాధిపతి శ్రీనివాస్

భీమవరం, జనవరి 5: సామాజిక ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేస్తూ సమిష్టి కృషితో దేశ పునర్నిర్మాణంలో సివిల్ ఇంజినీర్లు భాగస్వాములు కావాలని ఆంధ్రా యూనివర్శిటీ సివిల్ హెడ్, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత జివి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్వంలో రెండురోజులపాటు జరగనున్న జాతీయస్థాయి విద్యార్ధి సింపోజియమ్ సూపర్‌నోవా-2కె17ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమెరికన్ సివిల్ ఇంజినీర్లు ఒక విజన్‌తో పనిచేస్తారని పేర్కొన్నారు. ప్రపంచంలో నీరు, సహజ వనరులు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని పరిశోధనలు జరపాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి పార్థసారధివర్మ మాట్లాడుతూ తమ కళాశాలలో 20కోట్ల రూపాయల వ్యయంతో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. కళాశాల డైరెక్టర్ సాగి విఠల్ రంగరాజు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వవిద్యార్థి, పలు సంస్థలకు వైస్‌ప్రెసిడెంట్‌గా పనిచేసిన డిజైన్ ఇంజనీరింగ్ శ్రీనివాస్‌శెట్టికి కళాశాల ఛైర్మన్ గోకరాజు మురళీగంగరాజు చేతులమీదుగా సత్కరించారు. అనంతరం సూపర్‌నోవా 2కె17 ప్రత్యేక సావనీర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ ఎం జగపతిరాజు, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ అడ్వయిజర్ ప్రొఫెసర్ పద్మనాభరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్య

భీమవరాన్ని అభివృద్ధి చేస్తా:మంత్రి సుజాత

భీమవరం, జనవరి 5: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను ప్రభుత్వం అందిస్తున్నదని స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ విద్యావిధానంతో మన తెలుగు రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు రానున్న రోజుల్లో మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. గురువారం భీమవరంలోని జరిగిన జన్మభూమి సభలో మంత్రి సుజాత పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు ముందుగా జన్మభూమి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత మాట్లాడుతూ గతంలో కంటే జన్మభూమిలో సమస్యలు తగ్గాయని స్పష్టంచేశారు. ప్రజా సమస్యలతోపాటు కుటుంబ సమస్యలు కూడా జన్మభూమికి వస్తున్నాయన్నారు. ప్రతీ సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ప్రతీ ఒక్కరికీ జవాబుదారీగా ఈ ప్రభుత్వం ఉందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో రూ.64 వేల కోట్లతో వివిధ సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారన్నారు. రాజధాని కూడా లేని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. రూ.6వేల కోట్లతో అందరికీ పింఛన్లు అందిస్తున్నామన్నారు. జిల్లాలో భీమవరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, ఇటువంటి పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ పట్టణంలో 82 ఎకరాల్లో 9500 ఇళ్లు కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్‌లో మంజూరు చేసిందని, అర్హులైన వారందరికీ ఇళ్లు అందిస్తామన్నారు. మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు మాట్లాడారు. ఈ సందర్భంగా గర్భిణులను మంత్రి ఆశీర్వదించారు. కొత్త రేషన్‌కార్డులు, సంక్రాంతి కానుకలను మంత్రి పీతల సుజాత చేతులమీదుగా ఎమ్మెల్యే, ఛైర్‌పర్సన్ పంపిణీ చేశారు. గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), మెంటే పార్ధసారధి, ఎఎంసి ఛైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు గనిరెడ్డి త్రినాథ్, తోట భోగయ్య, చెల్లబోయిన వెంకట సుబ్బారావు, ప్రత్యేకాధికారి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

పదేళ్ల సర్వీసున్న కార్మికులందరికీ పింఛను
ప్రావిడెంట్ ఫండ్ జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఆనందరావు
జంగారెడ్డిగూడెం, జనవరి 5: ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేస్తూ పదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ప్రతీ కార్మికునికి పింఛను లభిస్తుందని ప్రావిడెంట్ ఫండ్ జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఎల్ ఆనందరావు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న 122 మంది కార్మికులకు చెల్లించాల్సిన పిఎఫ్ బకాయిలు చెల్లించడం లేదన్న ఫిర్యాదుపై గురువారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికుల స్థితిగతులు, ప్రతినెలా వారి వేతనాల నుండి పిఎఫ్ పేరుతో రూ.1,500లు మినహాయింపు తదితర అంశాలను సిపిఎం డివిజన్ కార్యదర్శి బేతాళ శ్రీనివాస్, సిఐటియు డివిజన్ అధ్యక్షుడు చల్లారి మాణిక్యాలరావు మున్సిపల్ కార్మికులతో కలసి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారికి వివరించారు. దీనిపై వారికి ఆనందరావు సమగ్ర వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు మున్సిపాలిటీ ప్రతినెలా 12.80 లక్షల రూపాయల వేతనాలు చెల్లిస్తోందని, దీనిలో 12 శాతం కార్మికుని వేతనాల నుండి మినహాయించి పిఎఫ్ కడుతుందని, అంతేకాకుండా మ్యాచింగ్ గ్రాంటు క్రింద 12 శాతం మున్సిపాలిటీ చెల్లిస్తుందని వివరించారు. గతంలో బకాయి పడిన ఏడు నెలల పిఎఫ్ మున్సిపాలిటీ చెల్లించివేసినట్టు నిర్థారించారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే పిఎఫ్ చెల్లించాల్సి ఉందని, నవంబర్ నెల వరకు అప్‌డేట్‌గా మున్సిపాలిటీ పిఎఫ్ చెల్లించినట్టు చెప్పారు. దీనిపై ఎటువంటి అనుమానాలకు తావులేదన్నారు. పదేళ్లు సర్వీసు పూర్తయిన కార్మికులకు పింఛన్ లభిస్తుందని, ఒకవేళ పనిలో ఏదైనా జరగరానిది జరిగితే వారి కుటుంబానికి ఆరు లక్షల రూపాయల పరిహారం లభిస్తుందని తెలిపారు. అంతేగాకుండా భార్యకు జీవితకాలం పింఛను లభిస్తుందని, ఇద్దరు పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చేవరకు పింఛను లభిస్తుందని వివరించారు. ఈ పింఛన్ స్కీములో కార్మికులంతా చేరితే ప్రయోజనాలు పొందవచ్చన్నారు. ప్రతీ ఒక్కరూ జనన ధృవీకరణ పత్రాలు సమర్పించాలని సూచించారు.

మాణిక్యాలరావుకు మంత్రులు రావెల, సుజాత పరామర్శ

తాడేపల్లిగూడెం, జనవరి 5: మంత్రి మాణిక్యాలరావు మాతృమూర్తి రంగనాయకమ్మ మృతికి రాష్ట్ర మంత్రులు, గురువారం సంతాపం తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మాణిక్యాలరావును పరామర్శించారు. భీమవరం ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులు, మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, వైస్‌ఛైర్మన్ కిల్లాడి ప్రసాద్, మాజీ మంత్రి కోటగిరి కుమార్తె సునీత మంత్రిని పరామర్శించారు.

అడిగినవన్నీ ఇస్తా... ఆ గుర్తింపు తెస్తారా!
బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా మారాలని పోచవరం ప్రజలను కోరిన కలెక్టర్ భాస్కర్
తాళ్లపూడి, జనవరి 5: గ్రామాభివృద్ధికి అడిగినవన్నీ ఇస్తా.. అలాగే తాను కోరుకుంటున్నట్టు బహిరంగ మలవిసర్జన లేని గ్రామంగా గుర్తింపు తేగలరా అంటూ జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రజలను ప్రశ్నించారు. జన్మభూమి-మావూరు కార్యక్రమంలో భాగంగా గురువారం పోచవరం గ్రామంలో జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సర్పంచ్ కొండేపాటి రమేష్ అధ్యక్షతన జరిగిన జన్మభూమి సభలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థుల కోరిక మేరకు రహదారి మంజూరు, పొలాలకు వెళ్లే గ్రావెల్‌రోడ్డు, పాఠశాలకు బోరు, శ్మశాన భూమి అన్నింటినీ తాను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఏ ఒక్కరూ గ్రామంలో బహిరంగ మలవిస్జరన చేయమని తనకు మాట ఇవ్వాలని కోరారు. జిల్లాలో కొన్ని గ్రామాల్లో మాత్రమే ఈ పరిస్థితి ఉందని, మార్చిలోగా ప్రతిఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకుంటే దేశంలోనే జిల్లాకు గుర్తింపు రాగలదన్నారు. లంచాలను ప్రోత్సహించినా, తీసుకున్నా నేరమేనన్నారు. జన్మభూమి కమిటీలు అర్హులైన వారికే సంక్షేమ పథకాలు అందేలా ఎంపిక చేయాలని, లేకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్ మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య బీమా మాదిరిగానే ధనవంతులకు కూడా నెలకు వంద రూపాయలు చెల్లిస్తే ఆరోగ్య రక్ష పథకాన్ని అందిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో 226 మందికి సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందించామన్నారు. మరో ముఖ్యఅతిథి జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేస్తున్న సిఎం చంద్రబాబును, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కొత్త రేషన్ కార్డులు, సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. గర్భిణులకు సీమంతాలు, పిల్లలకు అన్నప్రాశన నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి కెఅనంతలక్ష్మి, జడ్పీటీసీ మంగాభవాని, ఎంపిటిసి శీలబోయిన కృష్ణ, చెలపాటి ప్రకాష్, నాయకులు చిట్టిబాబు, పి శ్రీను, ఎంపిడిఒ జ్యోతిర్మయి, తహసీల్దార్ పి శ్రీనివాస్, పాల్గొన్నారు.
చినవెంకన్నను దర్శించుకున్న ఆంధ్రాబ్యాంకు సిజిఎం
ద్వారకాతిరుమల, జనవరి 5: ప్రసిద్ధి క్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం ఆంధ్రా బ్యాంకు రాష్ట్ర సర్కిల్ జిఎం కిలంబి రంగనాథ్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి, వేదాశీస్సులు అందజేశారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ టి సత్యనారాయణ స్వామివారి చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట ఏలూరు జోనల్ మేనేజర్ కె భాస్కరరావు, ఎజిఎం ఎం గురుమూర్తి, స్థానిక బిఎం ఎన్ శేషగిరిరావు తదితరులున్నారు.

కొనసాగిన ఆర్‌బిఐ తనిఖీలు
తణుకు, జనవరి 5: నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులకు ఆర్‌బిఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన స్థానిక ఎస్‌బిఐ శాఖలో ఆర్‌బిఐ అధికార్ల తనిఖీలు గురువారం కూడా కొనసాగాయ. అధికారులపై కేసులు నమోదుచేసిన సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. బ్యాంకుల నుంచి నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశం రోజుకు పదివేలుకు పరిమితం చేస్తూ ఆర్‌బిఐ నిబంధన విధించింది. అయితే తణుకు ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కెవి కృష్ణారావు అధిక మొత్తంలో పలు వాణిజ్య సంస్థలకు నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ మేరకు తొమ్మిది సంస్థలు ఈ బ్యాంకు నుంచి ఒకేరోజు రూ.2.5 కోట్లు విత్‌డ్రా చేశాయి. కృష్ణారావుతోపాటు బాలాజీ, నవీన్, రామచంద్రరాజు, ఇజాయ్రిల్ అనే అధికార్లపై కేసు పెట్టారు. అలాగే ఆయా సంస్థల ప్రతినిధులపై కూడా కేసులు నమోదుచేశారు.
ట్యాంకరు లారీ ఢీకొని ఆలయం ధ్వంసం
-ఆరుగురికి స్వల్ప గాయాలు
కొవ్వూరు, జనవరి 5: కొవ్వూరు మండలం కుమారదేవం గండి పోశమ్మ ఆలయాన్ని ఖాళీ లారీ ట్యాంకర్ అదుపుతప్పి ఢీకొట్టడంతో ఆలయం చుట్టూ నిర్మించిన గోపురం కూలిపోయింది. అమ్మవారి విగ్రహం మాత్రం చెక్కుచెదరలేదు. ఈ ఘటనకు సంబంధించి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గురువారం సాయంత్రం తాళ్లపూడి నుండి కొవ్వూరు వైపు వస్తున్న ఖాళీ ట్యాంకర్ లారీ కుమారదేవం గ్రామంలో గోదావరి గట్టు పక్కన ఉన్న అమ్మవారి ఆలయాన్ని ఢీకొందన్నారు. ఈ ప్రమాదంలో ఆలయ గోపురం కూలిపోగా, ఆరుగురికి స్వల్ప గాయాలైనట్టు తెలిపారు. లారీ గోదావరి గట్టుకిందకు వెళ్లిపోయిందన్నారు. ఈ సంఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే కెఎస్ జవహర్, ఆలయ కమిటీ ఛైర్మన్ జి ప్రసాద్ సందర్శించారు. రూరల్ ఎస్సై సోమసుందరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.