పశ్చిమగోదావరి

నేతాజీ పోరాట పటిమ యువతకు స్ఫూర్తిదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, జనవరి 23: స్వాతంత్య్రోద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపించిన పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. స్థానిక హౌసింగు బోర్డు కాలనీలో సోమవారం తాతా శ్రీనివాసరావు నివాసం వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సభ నిర్వహించారు. సభకు బిజెపి పట్టణాధ్యక్షుడు కర్రి ప్రభాకర బాలాజీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు అనుగుణంగా దేశం ముందుకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో ఆడిటర్ సుంకవల్లి రామకృష్ణ, న్యాయవాది శ్యాంప్రసాద్ ముఖర్జి, మున్సిపల్ కమిషనర్ నిమ్మగడ్డ బాలాజీ, రిటైర్డు ప్రిన్సిపాల్ భారతం శ్రీమన్నారాయణ, కౌన్సిలర్ కోట రాంబాబు, సిహెచ్‌ఎఆర్‌కె వర్మ, వట్టి రఘురామ్, పోతుల అన్నవరం పాల్గొన్నారు.
ముద్రగడ పాదయాత్రతో అప్రమత్తం
-నేటి నుంచి 144 సెక్షన్ విధింపు

ఏలూరు, జనవరి 23 : తాజాగా మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంటోంది. కొద్దికాలంగా కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపి ముద్రగడ పద్మనాభం చేపట్టదలచిన పాదయాత్ర అంశం రాష్టస్థ్రాయిలోనే కీలకమైన అంశంగా మారిపోయింది. కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ గత కొంతకాలంగా ఉద్యమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఆయన పలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు. ఆ విధంగానే పాదయాత్ర నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఈ నెల 25 నుంచి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి అంతర్వేది వరకు ముద్రగడ పాదయాత్రను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో కీలకమైన శక్తిగా వున్న కాపు సంఘాలు కూడా ప్రస్తుతం క్రియాశీలకంగా మారాయి. ముద్రగడ పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు సాగిపోతున్నాయి. ఇదిలా ఉంటే మరో పరిణామంలో ముద్రగడ పాదయాత్ర నేపధ్యంలో జిల్లా యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఈ నెల 24 నుంచి 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు జిల్లా అంతటా 144 సిఆర్‌పిసి సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కాటంనేని భాస్కర్ సోమవారం తెలిపారు. ముద్రగడ పాదయాత్ర చేయనున్న సందర్భంగా జిల్లాలో సాధారణ ప్రజాజీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఉత్తర్వులు జారీచేసినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం ఆయా తేదీల్లో ఒకేచోట అయిదుగురు లేదా అంతకుమించి గుమికూడి ఉండటం, సభలు, సమావేశాల్లో ఉద్రేకపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలను నిషేధిస్తున్నామని, సభలు, సమావేశాలు నిర్వహించాలనుకుంటే సంబంధిత అధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలని తెలిపారు. ఈ ఉత్తర్వులకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా, ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించినా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఉద్రేకపరిచే ప్రసంగాలను ప్రచారం చేయవద్దని, సంబంధిత అంశాలను ఛానళ్లు తమ ప్రసారాల నుంచి తొలగించాలని తెలిపారు. జిల్లాలో అన్ని నెట్‌వర్కుల మొబైల్ అంతర్జాల సేవలపై, సామూహిక సందేశాలపై నిషేధం విధిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఉత్తర్వుల అమలులో జిల్లా ప్రజలు పోలీసు యంత్రాంగంతో సహకరించాలని, అనుమతులు లేకుండా ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించడం గానీ, గుంపులుగా సంచరించడం గానీ చేయరాదని తెలిపారు. తనిఖీల సమయంలో పోలీసులతో సహకరించాలని, లేనిపక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్‌పి భాస్కర్‌భూషణ్ తెలిపారు.

ఉమర్ ఆలీషా రచనలే స్ర్తి సాధికారతకు మూలం

భీమవరం, జనవరి 23: ఆనాడు ఉమర్ అలీషా రచించిన రచనలే ఈ నాటి స్ర్తిల సాధికారతకు మూలం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అందుకే ప్రస్తుత సమాజంలో స్ర్తి అన్ని రంగాల్లో రాణిస్తోందన్నారు. సోమవారం స్థానిక త్యాగరాజ భవనంలో డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి రజతోత్సవ వేడుకలను డాక్టర్ ఉమర్ ఆలీషా 72వ వర్ధంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం (పిఠాపురం) నేతృత్వంలో భీమవరం ఉమర్ ఆలీషా సాహితీ సమితి నిర్వహించింది. నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా జ్యోతి ప్రజ్వలన చేసి రజతోత్సవ వేడుకలను ప్రారంభించారు. సభకు ఆయనే అధ్యక్షత వహించారు. ముందుగా విశిష్ట అతిధులు, విశిష్ట సేవాభినందన సత్కార స్వీకర్తల నడుమ డాక్టర్ ఉమర్ ఆలీషా కావ్య కిరణావళి రజతోత్సవ సంచికను ఆవిష్కరించారు. ప్రముఖ సినీ నటులు, రచయిత, దర్శకులు, ఆధ్యాత్మికవేత్త తనికెళ్ల భరణికి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి ఉమర్ ఆలీషా చేతుల మీదుగా హుస్సేన్ షా కవి పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్భంగా ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ స్ర్తిలు చదువుకోరాదని, స్ర్తిలపై ఆంక్షలు ఎక్కువగా ఉన్న రోజుల్లో వారికి ఇవ్వాల్సిన గౌరవం గురించి, అదే స్ర్తి విద్య గురించి పాటుపడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఉమర్ ఆలీషా అని ఆయనను కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన ఉమర్ ఆలీషా మాట్లాడుతూ ఉమర్ ఆలీషా సాహితీ సమితి గత 24 ఏళ్లుగా సాహితీ సేవలో పునీతమవుతూ ఎందరో సాహితవేత్తలకు హుస్సేన్ షా పురస్కారాలను అందిస్తూ మరెందరికో మార్గదర్శనం చేస్తున్న తీరును అభినందించారు. తెలుగుజాతి గర్వపడే అత్యద్భుత సాహిత్య, విశిష్ట వ్యక్తి కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా పేరున పురస్కారం అందుకోవడం తన పూర్వజన్మ పుణ్యఫలమని తనికెళ్ల భరణి అన్నారు. న్యాయమూర్తి ఆకుల శేషసాయి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కమిషనర్ సిహెచ్.నాగనర్సింహరావు, డాక్టర్ దోర్బల ప్రభాకరశర్మ, మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్, వరలక్ష్మి, సాహితీ సమితీ ఉపాధ్యక్షుడు త్సవటపల్లి మురళీకృష్ణ, కార్యదర్శి దాయన సురేష్ చంద్రాజీ పాల్గొనగా మహా సహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహరావు అష్టావధానం జరిగింది. కోశాధికారి పి నరసింహరావు వందన సమర్పణ చేశారు.
నిబంధనల ప్రకారం నడుచుకోవాలి

ఏలూరు, జనవరి 23 : ఎలక్షన్, సెలక్షన్ కార్యక్రమాలలో స్వంత అభిప్రాయాలకు తావు లేదని కచ్చితంగా నిబంధనలు ప్రకారం అధికారులు నడచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా స్థాయి అధికారుల సంప్రదింపుల కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఎన్నికల నియమనిబంధనలు ఎలా పాటిస్తామో అదే విధంగా ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా నిబంధనలను అమలుచేసి తీరాల్సిందేనని ఈ విషయాలలో సొంత పెత్తనాలకు తావులేదని నిబంధనల మేరకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందే తప్ప అధికారులు ఇష్టానుసారం వ్యవహరించడానికి వీలులేదన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయాలలో కూడా అధికారులు నిబంధనలు ప్రకారం నడుచుకోవాలే తప్ప స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టంచేశారు. వికలాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ విషయంలో ఎటువంటి సిఫార్సులకు తావులేదని నిబంధనల మేరకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందే తప్ప అధికారులు ఇష్టానుసారం వ్యవహరించడానికి వీలు లేదన్నారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే వారే హక్కులు గురించి మాట్లాడాలని బాధ్యతలు విస్మరించి హక్కుల సాధన కోసం ఉద్యమిస్తానంటే తాను ఒప్పుకోనని జిల్లాలో ప్రతీ ఉద్యోగి మొదలు అధికారి వరకూ బాధ్యతలను గుర్తించి వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. జిల్లాలో పనిచేసే ప్రతీ ఒక్కరూ తమ వ్యక్తిగత అవసరాల విషయంలో సెలవు పెట్టే అవకాశం వుందని, అయితే కేవలం సెలవు చీటీ పంపించి సెలవుపై వెళ్లిపోతే కుదరదని కచ్చితంగా సంబంధిత అధికారుల నుండి వ్రాతపూర్వక ఆమోదం పొంది తీరాల్సిందేనని జిల్లా స్థాయి అధికారులు జిల్లా దాటి వెళ్లే ముందు ఖచ్చితంగా కలెక్టరు అనుమతి పొందాలని అలా పొందకుండా ఎవరైనా సెలవు పెట్టి వెళితే ఆ సెలవును గైర్హాజరుగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులంతా జవాబుదారీ తనంగా ఉండాలనే ఉద్దేశ్యంతో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టామని దీని వలన ఆయా శాఖల అధికారులు సమర్ధవంతంగా సిబ్బందితో పనిచేయించుకోగలుగుతారని కానీ బయోమెట్రిక్ హాజరు నేడు ఒక తంతుగా మారిందని, దీనిపై ఆయా శాఖాధికారులు దృష్టి కేంద్రీకరించకపోతే విధానం గాడితప్పే ప్రమాదమున్నదని హెచ్చరించారు. నూతన సాంకేతిక విధానాన్ని ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో అమలు చేసి ఉద్యోగుల హాజరును గుర్తించడం జరుగుతుందని అయితే ఇప్పటికే పలు శాఖల్లో 80 శాతానికి మించి బయోమోట్రిక్ హాజరు ఉండడం లేదని ఈ హాజరు కూడా చాలా మంది ఇతర కార్యాలయాలలో వేస్తున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని అటువంటి ఉద్యోగులు తమ హాజరును పనిచేసే చోటే వేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కొన్ని శాఖల్లో కొంతమంది ఉద్యోగులు ఉదయమే వచ్చి బయోమెట్రిక్ వేసి వెళ్లిపోతున్నారని, మరలా సాయంత్రం వచ్చి హాజరు వేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అటువంటి ఉద్యోగులు తమ విధానాన్ని మార్చుకోకపోతే ఇబ్బందులు పడతారని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలను తాను ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని, ఆ సమయంలో సంబంధిత ఉద్యోగులు కార్యాలయంలో లేకపోతే చర్యలు మాత్రం తీవ్రంగా వుంటాయని ఎవరైనా ఏదైనా పనిమీద వెళితే కచ్చితంగా మూమెంట్ రిజిష్టరులో వివరంగా పొందుపరచాలని అలా కాకుండా కార్యాలయం విడిచి వెళితే మాత్రం శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగి ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ఖచ్చితంగా కార్యాలయంలో ఉండాలని భోజనానికి వెళితే మధ్యలో అరగంట సమయం తీసుకోవచ్చునని ఆ తర్వాత ఉద్యోగులు ఇష్టమైతే కార్యాలయంలో పనిచేయవచ్చునని లేకపోతే స్వేచ్ఛగా ఇంటికి వెళ్లవచ్చునని చెప్పారు. ప్రతీ శాఖా ఉన్నతాధికారి క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు, కార్యాలయానికి వచ్చే సమయం, వెళ్లే సమయం ఖచ్చితంగా ఆఫీసులో అందుబాటులో ఉంటున్నారా? లేదా? అని స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలని, ప్రతీ అంశాన్ని జిల్లా కలెక్టరు పర్యవేక్షించాలంటే సాధ్యంకాదని ఈ విషయంలో జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షణతో పటిష్టవంతంగా పాలన నిర్వహించాలని సూచించారు. జిల్లాలో రిపబ్లిక్‌డే సందర్భంగా ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు అందించే ప్రశంసాపత్రాలు ఎంతో గౌరవప్రధమైనవని ఈ ప్రశంసాపత్రాలకు నేర, అవినీతి, సస్పెన్షన్‌లకు గురైన వారి పేర్లను సిఫార్సు చేయవద్దని కలెక్టర్ అధికారులకు సూచించారు. మెరిట్ సర్ట్ఫికెట్లను ఇవ్వడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, డి ఆర్‌వో, డి ఆర్‌డి ఏ పిడి, జడ్పీ సి ఇవోలతో కూడిన కమిటీకి ఆయా శాఖల అధికారులు మెరిట్ సర్ట్ఫికెట్లకు ఉద్యోగుల, అధికారుల పేర్లు సిఫార్సు చేయాలని ఈ మేరకు కమిటీ పరిశీలించి నివేదిక సమర్పిస్తుందని దానికనుగుణంగా రిపబ్లిక్‌డే రోజున ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందిస్తామని చెప్పారు. కొన్ని ప్రభుత్వ శాఖలు మాత్రమే ప్రగతిని సూచించే శకటాలను ఏర్పాటు చేస్తున్నాయని ఆ శాఖలతోపాటు ఇరిగేషన్, కార్మిక శాఖ, మత్స్యశాఖ, మైక్రో ఇరిగేషన్, రవాణా శాఖ, ఎక్సైజ్, ఐసిడి ఎస్, పౌర సరఫరాల శాఖ అభివృద్ధిపై శకటాలు ఏర్పాటు చేయాలని అంతేకాకుండా పల్స్ సర్వేపై కూడా ప్రత్యేక శకటాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో జెసి పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డి ఆర్‌వో కె హైమావతి, జడ్పీ సి ఇవో సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ పిడి శ్రీనివాస్, డిపివో కె సుధాకర్, ట్రాన్స్‌కో ఎస్ ఇ సత్యనారాయణరెడ్డి, డిసిహెచ్ ఎస్ డాక్టర్ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ చర్యలు
-అధికార్లకు కలెక్టరు భాస్కర్ ఆదేశం
-పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
ఏలూరు, జనవరి 23 : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగనున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో మార్చి 1వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని పరీక్షా కేంద్రాలలో ఎక్కడా కూడా కాపీలకు తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ పరీక్షల కన్వీనర్ ఎస్ ఏ ఖాదర్‌ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 104 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలు జరుగనున్నాయని ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద 144వ సెక్షన్ విధిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ పరీక్షలకు 35 వేల మంది విద్యార్దినీ విద్యార్ధులు హాజరవుతారని ఎక్కడా కూడా మాస్‌కాపియింగ్ జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో తొలిసారి సిసి కెమేరాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వ్యాప్తంగా 250కి పైగా పరీక్షా కేంద్రాల్లో పటిష్టమైన నిఘా ఉంచాలనే ఉద్దేశ్యంతో ప్రతీ పరీక్షా హాలులో సిసి కెమేరా పనిచేస్తుందని చెప్పారు. జిల్లా పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 13వ స్థానంలో ఉన్నా తనకు అభ్యంతరం లేదని, కానీ స్వశక్తిపై పరీక్ష రాసే సత్తా విద్యార్ధినీ విద్యార్ధుల్లో ఉండాలన్నదే తన అభిమతమని ఈ విషయంలో రాజీలేదని మాస్ కాపియింగ్ వంటి అక్రమ పద్దతులకు స్వస్తి పలకాలని డి ఇవో మధుసూధనరావును కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జెసి పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, ఇంటర్ విద్యా రీజనల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్ ఖాదర్, డి ఇవో మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
వివేకానందుని వల్లే భారతీయులకు గౌరవం
ఉంగుటూరు, జనవరి 23: వివేకానందుని ప్రసంగం తర్వాతే భారతీయుల పట్ల ఉన్న చులకన భావం పోయి గౌరవించుకునే స్థాయికి చేరుకున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం రామచంద్రపురం గ్రామంలో యువకులు ఏర్పాటుచేసిన వివేకానందుని విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ హిందువు అనేది మతం కాదని, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, జీవన విధానాలను తెలియజేసేది మాత్రమేనన్నారు. సీతారామయ్య మొదటి అధ్యక్షుడు కాకుండా సుభాష్ చంద్రబోసు అయి ఉంటే దేశం ఎంతో బాగుండేదని, పాకిస్థాన్ విడిపోయి ఉండేది కాదని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ వివేకానందుని సూచనలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. యువతలో పిరికితనం పోగొట్టుకుంటే ప్రపంచంలో రాణించవచ్చునన్నారు. బిజెపి మహిళామోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి మాట్లాడుతూ మహిళలకు ఉన్న గౌరవాన్ని ఆనాడు వివేకానందుడు ఇచ్చిన గుర్తింపును వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా ప్రచారక్ కొండారెడ్డి, పిఎసిఎస్ అధ్యక్షుడు ఎన్‌వివి సత్యనారాయణ, సర్పంచ్ కె రవి, సొసైటీ డైరెక్టర్ ఎ సత్తిబాబు, బిజెపి మండల శాఖ ఉపాధ్యక్షుడు రమేష్, టిడిపి మండల అధ్యక్షుడు కె రవిశంకర్, టిడిపి నేతలు ఎస్ రామకృష్ణ, ఐ గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.
బిందుసేద్యం అధ్యయనానికి గోవా అధికారుల బృందం
ద్వారకాతిరుమల, జనవరి 23: గోవా రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారుల బృందం బిందు సేద్యం అధ్యయనం నిమిత్తం సోమవారం మండలంలోని బుట్టాయగూడెం, తిమ్మాపురం గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. గోవాలోని నాబార్డు వ్యవసాయం, నీరు, ఫైనాన్స్ తదితర శాఖలకు చెందిన 13 మంది అధికారులు బిందు సేద్యం ద్వారా ఇక్కడ జరుగుతున్న సాగు విధానాన్ని పరిశీలించారు. డ్రిప్ పనితీరు, ఏ కంపెనీ పనిముట్లు పనిచేస్తాయి, ఎంత పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం వస్తుందన్న అంశాలపై అవగాహన ఉన్న రైతుల వద్దకు వెళ్లి పలు సూచనలు, సలహాలు పొందారు. ఈ సందర్భంగా తిమ్మాపురంలో ఆరు ఎకరాల్లో బొప్పాయిని డ్రిప్ ద్వారా సాగు చేస్తున్న రైతు తూంపాటి పద్మ వరప్రసాద్, అలాగే బుట్టాయగూడెంలో పుచ్చ, తర్బూజా సాగు చేస్తున్న రైతు రామచంద్రరావు పొలాలకు వెళ్లిన అధికారుల బృందం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రిప్ ద్వారా ఎరువులను పొలాలకు ఎలా అందించాలో వారు స్వయంగా చూసి తెలుసుకున్నారు. అనంతరం తమ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించి, నాబార్డు ద్వారా రుణాన్ని పొంది గోవాలో బిందు సేద్యాన్ని అమలు చేయిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రీజినల్ అధికారి కల్యాణ సుందరం, పశ్చిమ, కృష్ణా జిల్లాల నాబార్డు డిడిఎంలు బివిఎస్ రామప్రభు, విజయ తిరుమల, గోవా నాబార్డు అధికారి గోపాల్‌కుమార్, ఎపిడి బాలాజీకుమార్, మండల హెచ్‌ఒ నరేంద్రకుమార్ పాల్గొన్నారు.
పనివేళల్లో జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలి
ఏలూరు, జనవరి 23 : జిల్లా అధికారులు మధ్యాహ్నం ఒక అరగంట మాత్రమే భోజన సమయానికి కేటాయించి మిగిలిన కార్యాలయ పని గంటల్లో కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమంలో ప్రజల నుండి ఫోన్ ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించవలసిందిగా సంబంధితాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఫోన్ ద్వారా వారి సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చినప్పుడు సంబంధిత అధికారులకు పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేస్తున్నానని నేరుగా అధికారిని కలుసుకోవాలని ఫిర్యాదుదారునికి చెబుతూ అధికారిని కూడా అందుబాటులో ఉండవలసిందిగా ఆదేశించినప్పటికీ కొంతమంది అధికారులు అందుబాటులో ఉండడం లేదన్నారు. 12 గంటలకు వెళ్లినా భోజనానికి వెళ్లారని, 4 గంటలకు వెళ్లినా భోజనానికి వెళ్లారని చెబుతున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని ఫిర్యాదుదారులు కలెక్టరుకు చెప్పినందువలన తమ సమస్యలను కచ్చితంగా పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ఎంతో దూరం నుండి వ్యయప్రయాసలకోర్చి కార్యాలయానికి వెళితే అధికారులు అందుబాటులో లేకపోవడం వారిని ఎంతో నిరాశకు గురిచేస్తున్నదని కలెక్టర్ చెప్పినా సమస్య తీరలేదనే మనోవ్యధకు గురవుతారన్నారు. జిల్లా అధికారులు మధ్యాహ్నం 1.30 గంటల నుండి రెండు గంటల వరకూ ఒక అరగంట మాత్రమే భోజన విరామ సమయం తీసుకుని కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలకు చర్యలు
ఏలూరు, జనవరి 23 : జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటుపై త్వరితగతిన చర్యలుతీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఐసిడిఎస్ సిడిపివోలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎపిఐపి నిధులు వినియోగించుకుని జిల్లాలో సిడిపివో కార్యాలయ భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిడిపివోలకు చెప్పారు. ప్రతీ శుక్రవారం సమావేశం ఏర్పాటుచేసుకుని శిశు సంరక్షణకై గర్భిణులు తీసుకోవాల్సిన పోషకాహార వివరాలను తెలియజేయాలని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, విద్యుత్తు సౌకర్యం, మంచినీటి సౌకర్యం, తదితర వసతులు సక్రమంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలు ఆటల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
జీతాల కోసం ఇథనాల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల ఆందోళన
తాళ్లపూడి, జనవరి 23: తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలోని బయో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద ఆ కంపెనీ ఉద్యోగులు జీతాల కోసం మరోసారి ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం జీతాల కోసం వెళ్లిన ఉద్యోగులకు ఫ్యాక్టరీ హెచ్‌ఆర్ నుండి వ్యతిరేకత ఎదురైంది. సుమారు ఏడాది క్రితం ఫ్యాక్టరీ మూసివేసిన సంగతి తెలిసిందే. సుమారు 16 నెలలు కార్మికులకు జీతాలు ఇవ్వాల్సి ఉండగా ఇటీవల ఎండితో జరిగిన చర్చల కారణంగా రెండు నెలల క్రితం రెండు నెలల జీతాన్ని ఫ్యాక్టరీలో స్క్రాప్ విక్రయించి చెల్లించారు. తిరిగి జనవరిలో జీతాలు ఇస్తారనే హామీతో కార్మికులు సోమవారం ఫ్యాక్టరీకి వెళ్లారు. జీతాలు ఇవ్వలేమన్న ఫ్యాక్టరీ యజమాని సమాచారంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్‌ఆర్‌ను హెచ్చరిస్తూ అక్కడ ఉన్న రెండు సైకిళ్లు, రెండు మోటారుసైకిళ్లను పెట్రోలు పోసి తగలబెట్టి నిరసన తెలిపారు. ఐఎఫ్‌టియు అనుబంధ కార్మికులు ఫిబ్రవరి అయిదులోగా రెండు నెలల జీతాలు ఇవ్వాలని, మార్చి నుండి ఫ్యాక్టరీ తెరవాలని లేకుంటే లే ఆఫ్ ప్రకటించి లేబర్ యాక్టు ప్రకారం సగం జీతాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ విషయం తెలిసిన తాళ్లపూడి పోలీసులు ఇరువర్గాలతో చర్చలు జరిపారు. ఈ నెల 26న మరోసారి ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడాలని హెచ్‌ఆర్‌కు సూచించారు.

విద్యార్థి, మహిళా సంఘాల రాస్తారోకో
నరసాపురం, జనవరి 23: దంగేటి గౌతమి హత్యకు కారకులైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్యర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా డివిజన్ కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడుతూ గౌతమి హంతకులపై నిర్భయ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓ వ్యాపారవేత్త గౌతమిని రహస్య వివాహం చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. భార్యగా సమాజానికి పరిచయం చేయాలని గౌతమి ఒత్తిడి చేయడంతోనే ఈ హత్యచేశారని పూర్ణ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వి.మహేష్, శ్రీసూర్య, వైఎన్ కళాశాల, గౌతమి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
అది రోడ్డు ప్రమాదం కాదు హత్య
నరసాపురం, జనవరి 23: పాలకొల్లు మండలం దిగమర్రు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దంగేటి గౌతమి కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ నెల 18న మృతురాలు గౌతమి, ఆమె సోదరి పావని పాలకొల్లు నుంచి స్కూటీపై వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో గౌతమి మృతిచెందిన విషయం విదితమే. ఈ ప్రమాదంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఇంటికి వచ్చిన గౌతమి సోదరి పావని సోమవారం పలు వివరాలు వెల్లడించింది. నరసాపురం మండలం దర్భరేవు గ్రామ ప్రముఖునితో తన సోదరికి గత ఏడాది రహస్యంగా వివాహమైందని వెల్లడించింది. గౌతమి పెళ్లి ఫొటోలను ఈసందర్భంగా చూపించింది. సదరు ప్రముఖునికి అంతకు ముందే మరో యువతితో వివాహమైంది. పిల్లలు కూడా ఉన్నారు. తన సోదరిని రెండో వివాహం చేసుకొన్నాడని, నాలుగు రోజుల్లో దర్భరేవు తీసుకెళ్తానని అతడు చెప్పాడని పావని చెప్పింది. ఈ వివాహం కారణంగా తన సోదరికి, వివాహం చేసుకున్న ప్రముఖుని భార్యకు గొడవలు జరిగాయని పావని తెలిపింది. తన సోదరిపై కక్ష కట్టిన మొదటి భార్య, ఆమె డ్రైవర్ పథకం ప్రకారం తన అక్క గౌతమిని హత్య చేశారని పావని ఆరోపించింది. ఇటు రహదారి ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచినా పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేదు. అలాగే ప్రమాదానికి గురైన కారు డ్రైవరును కూడా ఇప్పటివరకు అదుపులోకి తీసుకోలేదు. దీంతో సోమవారం విద్యార్థి సంఘాలు మృతురాలు గౌతమికి మద్దతుగా పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, గౌతమి కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మరోవైపు కాపు సంఘం నాయకులు గౌతమికి మద్దతుగా స్థానిక తెలగా కల్యాణ మండపంలో సమావేశమయ్యారు. గౌతమికి మద్దతుగా పోరాటం చేయాలని నిర్ణయించారు.