పశ్చిమగోదావరి

ఇదేం పనితీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 3 : చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం నిర్లక్ష్యం వహించడం పట్ల రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి షాదీఖానా అంజుమన్ ఫంక్షను హాలులో శుక్రవారం సాయంత్రం చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై అధికారులతో ఆమె సమీక్షించారు. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో 16725 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు కేవలం 6596 మరుగుదొడ్లు మాత్రమే పూర్తయ్యాయని సమన్వయం లోపమా? పని నిర్లక్ష్యమా? ఎందువల్ల మరుగుదొడ్ల నిర్మాణం జాప్యం జరుగుతోందని మంత్రి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చింతలపూడి మండలంలో అత్యధిక శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాకపోవడంపై ఎంపిడివో రాజశేఖర్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీ పనితీరు, ఇలా అయితే గ్రామాలలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయి? ఇప్పటికైనా సమన్వయంతో పనిచేసి ప్రజలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి తీరాలని ఆదేశించారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి సంబంధించి 160 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు క్లియర్ చేసామని చింతలపూడి పరిధిలో 9.54 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులను చెల్లించామని ఇంకా కేవలం 1.36 కోట్ల రూపాయలుపెండింగ్ బిల్స్‌ను రాబోయే పది రోజుల్లో చెల్లిస్తామని మంత్రి చెప్పారు. 2017 మార్చి 31వ తే0దీ నాటికల్లా ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు వ్యక్తిగత మరుగుదొడ్లు అన్ని పూర్తి కావాలని ఈ విషయంలో గ్రామ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలని ఒక వేళ మీకు చేతకాకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి తీరతానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో 16725 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరైతే 14560 మరుగుదొడ్లు మాత్రమే ఆన్‌లైన్‌లో పొందుపర్చారని మిగిలిన 2200 మరుగుదొడ్లు ఎందుకు ఆన్‌లైన్ కాలేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు చేపట్టిన 8400 మరుగుదొడ్లను తక్షణమే పూర్తి చేయాలని వివిధ దశల్లో ఉన్న 1719 వ్యక్తిగత మరుగుదొడ్లు ఫిబ్రవరి నెలాఖరు నాటికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతీ మరుగుదొడ్డికి జియోటాగింగ్ విధానాన్ని అమలు చేస్తున్న దృష్ట్యా పారదర్శకంగా ఎక్కడెక్కడ మరుగుదొడ్లు నిర్మిస్తున్నారో సులభంగా తెలుస్తుందని మంత్రి చెప్పారు.
రూ.కోటితో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక
చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో రానున్న వేసవికాలంలో తాగునీటి ఎద్దడి అధికంగా ఉండే ప్రమాదమున్నదని అందుకు అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యగా కోటి రూపాయలతో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి సుజాత ఆర్‌డబ్ల్యు ఎస్ అధికారులను ఆదేశించారు. శివారు ప్రాంత గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయడానికి అవసరమైన ట్యాంకర్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఎక్కడైనా పెట్టుబడి కొరత వుంటే డి ఆర్‌డి ఏ ద్వారా అవసరమైన పెట్టుబడిని అందిస్తామని పల్లె ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలంటే ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్డి వుండి తీరాల్సిందేనని చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద నియోజకవర్గంలో మూడు గ్రామాల్లో చేపట్టిన 650 మరుగుదొడ్లును సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని ఇటీవల కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి మరుగుదొడ్ల నిర్మాణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని కావున జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుకబడి వున్న చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం త్వరలోనే అన్ని మరుగుదొడ్లు పూర్తి చేసి బహిరంగ మల విసర్జన లేని నియోజకవర్గంగా చింతలపూడిని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతీ ఒక్కరూ నేటి నుండి సైనికుల్లా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యు ఎస్ ఎస్ ఇ అమరేశ్వరరావు, డ్వామా పిడి ముళ్లపూడి వెంకటరమణ, డి ఆర్‌డి ఏ పిడి కె శ్రీనివాసులు, అటవీ శాఖాధికారులు నాగేశ్వరరావు, రామకృష్ణ, చింతలపూడి ఎంపిపి దాసరి రామక్క, జడ్పీటిసి తాళ్లూరి రాధారాణి, జంగారెడ్డిగూడెం జడ్పీటిసి, ఎంపిపి, అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తారెడ్డి, చినబాబు తదితరులు పాల్గొన్నారు.
సూర్య, చంద్రప్రభ వాహనాలపై విహరించిన శ్రీవారు
ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 3: సప్త అశ్వాలను అధిరోహించిన చినవెంకన్న ఉదయం వేళ సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఉభయ దేవేరులతో విహరించారు. ప్రముఖ క్షేత్రమైన ద్వారకాతిరుమలలో రథసప్తపి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం జరిగిన తిరువీధి సేవ భక్తులను అలరించింది. మాఘమాస సప్తపి తిథిన సూర్యభగవానుడు అవతరించిన రోజు కావడంతో ఈ రథసప్తమి వేడుకను క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుపుకొన్నారు. ఉదయం ఆలయంలో ఉభయ దేవేరులతో శ్రీవారి ఉత్సవ మూర్తులను సూర్యప్రభ వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత అర్చకులు పూజాదికాలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా సూర్యప్రభ వాహనం తిరువీధులకు పయనమైంది. అలాగే రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు, అమ్మవార్లకు జరిగిన తిరువీధి సేవ క్షేత్రంలో భక్తులకు నేత్రపర్వమైంది.

బిందు సేద్యానికి రూ.300 కోట్ల ప్రతిపాదనలు
రాష్ట్ర మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ఆఫీసర్ సూర్యప్రకాశరావు
ఏలూరు, ఫిబ్రవరి 3 : రాష్ట్రంలో బిందు సేద్యానికి 2017-18 ఆర్దిక సంవత్సరంలో 300 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని రాష్ట్ర మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ఆఫీసర్ ఎ సూర్యప్రకాశరావు చెప్పారు. స్థానిక అతిధి హోటల్‌లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రగతి తీరుపై అధికారులతో వివిధ కంపెనీల ఏజెన్సీలతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశరావు మాట్లాడుతూ రైతులకు బిందు సేద్యం ద్వారా అధికదిగుబడి సాధించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గత ఏడాది బిందు సేద్యానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో బిందు సేద్యానికి 300 కోట్ల రూపాయల నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని చెప్పారు. రాష్ట్రంలో బిందు సేద్యం అమలు వలన ఆయిల్‌ఫామ్, ఖోఖో, కొబ్బరిలతో పాటు అనేక ఉద్యానవన తోటల పెంపకంపై రైతాంగం ప్రత్యేక దృషఙ్ట కేంద్రీకరిస్తున్నారని ఆయన చెప్పారు. ఇతర పంటల పెంపకంలో కూలీల సమస్య ఇతర ఇబ్బందులండడంతో రైతాంగం బిందు సేద్యానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించడానికి పెద్ద ఎత్తున ఉద్యానవన పంటలకు బిందు సేద్యాన్ని అమలు చేస్తున్నామని తక్కువు నీటితో అధిక దిగుబడి సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుందని బిందు సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండవ స్థానం ఆక్రమించిందని ఇప్పటి వరకూ రాష్ట్రంలో 17 లక్షల ఎకరాల్లో బిందు సేద్యం అమలు జరుగుతోందని ఆయన చెప్పారు. జిల్లాలో 25 వేల హెక్టార్లలో బిందు సేద్యాన్ని అమలు చేయాలని కలెక్టర్ నిర్ధేశించిన లక్ష్యాన్ని వచ్చే మార్చిలోగా పూర్తి చేయాలని సూర్యప్రకాశరావు అధికారులను ఆదేశించారు. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకూ ఏడు వేల హెక్టార్లలో మాత్రమే బిందు సేద్యాన్ని అమలు చేసారని ఈ రెండు నెలల్లో యుద్ధప్రాతిపదికపై సర్వశక్తులు ఒడ్డి 17 వేల హెక్టార్లలో బిందు సేద్యాన్ని అమలు చేసి జిల్లా రైతులకు మేలు చేయాలని చెప్పారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ఓ ఎస్‌డిలు రవీంధ్రబాబు, బి రమేష్, పశ్చిమగోదావరి జిల్లా ఎపిఎంఐపి అధికారి రామ్మోహనరావు, సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదాపై మోసగిస్తున్న చంద్రబాబు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
నరసాపురం, ఫిబ్రవరి 3: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం స్థానిక తెలగా కల్యాణమండపంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ ప్రజలకిచ్చిన మాట తప్పారన్నారు. దీనిపై వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు మోసం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హాదా సాధించడంలో రాజకీయ పక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని, ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని రామకృష్ణ తప్పుపట్టారు. ఇప్పటికే ప్రజల వ్యతిరేకత చవిచూస్తున్న టిడిపి ప్రభుత్వానికి మరింత వ్యతిరేకత తప్పదని ఆయన అన్నారు. అలాగే సంపద, అధికారం, పరిశ్రమలు, వ్యాపారం తదితర అంశాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దక్కాల్సిన వాటాను న్యాయబద్దంగా ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

పన్నులు వసూలు చేయడం చేతకాకపోతే
మున్సిపాల్టీల్లో పంచాయతీల విలీనం
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, ఫిబ్రవరి 3 : జిల్లాలో పన్నులు వసూలు చేయడం చేతకాకపోతే పంచాయితీలను మున్సిపాల్టీల్లో విలీనం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం పంచాయితీ పన్నులు, పారిశుద్ధ్యం, బయోమెట్రిక్ హాజరు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016-17 పన్నులు ఇంత వరకు కేవలం 34 శాతం మాత్రమే వసూలు చేసారని ఇలా అయితే మార్చి 31వ తేదీ నాటికి నూరుశాతం పన్నులు ఎలా వసూలు చేయగలుగుతారని అధికారులను ప్రశ్నించారు. పంచాయితీలకు పన్నులు వసూలు చేయకపోతే రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరా వంటి సౌకర్యాలు ఎలా కల్పిస్తారని పన్నుల వసూళ్లలో ఇంత నిర్లక్ష్యం వహిస్తే పన్నులు వసూలుచేయడం మీకు చేతకాకపోతే పంచాయితీలను మున్సిపాల్టీల్లో విలీనం చేస్తానని చెప్పారు. ఇవో ఆర్‌డిలు, సెక్రటరీలతో సమావేశం ఏర్పాటుచేసి హెచ్చరించవలసిందిగా జిల్లా పంచాయితీ అధికారి సుధాకర్‌ను కలెక్టర్ ఆదేశించారు. గత సంవత్సరం పన్నుల వసూళ్లలో కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఏలూరు ఇవో ఆర్‌డిని అలాగే పోలవరం ఇవో ఆర్‌డిని ఏలూరు బదిలీ చేయవలసిందిగా డిపివోను కలెక్టర్ ఆదేశించారు. పన్నులు వసూళ్లు కాకపోవడంపై కారణాలను ఒక ఇవో ఆర్‌డి కలెక్టరుకు చెప్పడానికి ప్రయత్నించగా కలెక్టరు కల్పించుకుని అవన్నీ తనకు చెప్పవద్దని, తనకు కావాల్సింది అవుట్‌కం రావడమే ముఖ్యమన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంకు సంబంధించి వచ్చే వారానికి కనీసం 40 శాతం పన్నులు వసూలు చేయకుండా వచ్చే ఇవో ఆర్‌డిలను వ్రాతపూర్వకంగా సంజాయిషీ అడగాలని డిపివోను ఆదేశించారు. పంచాయితీల్లో ఎక్కడా చెత్తకుప్పలు కనిపించడానికి వీల్లేదని మురుగునీరు నిల్వ ఉండకుండా పల్లపు ప్రాంతాలను దగ్గరలోని చెరువుల నుండి మట్టిని తీసుకువచ్చి మెరక చేయాలన్నారు. అన్ని గ్రామ పంచాయితీలకు డంపింగ్ యార్డులకు గుర్తించిన స్థలాలకు అనుమతులు మంజూరు చేశామని వాటిని త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. పంచాయితీల్లో 200 కుటుంబాలకు ఒక చెత్త సేకరణ సిబ్బంది ప్రతీ వెయ్యి కుటుంబాలకు చెత్తను సేకరించేందుకు ఒక వాహనం ఏర్పాటు చేసుకుని డంపింగ్ యార్డులకు తరలించేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించే ప్రతీ పారిశుద్ధ్య సిబ్బంది నెలకు కనీసం పది వేల రూపాయలు ఆదాయం పొందేలా అధికారులు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలన్నారు. జిల్లాను పందులు, వీధి కుక్కలు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని వచ్చే మూడు నెలల్లో జిల్లాలో ఎక్కడా అవి లేకుండా నియంత్రించాలని చెప్పారు. జిల్లాలో సుమారు లక్ష వరకు పందులు, లక్షా 50 వేల వరకూ వీధి కుక్కలు వున్నాయని ఒక అంచనా కాగా వీటిని మూడు నెలల్లో జిల్లాలో లేకుండా నియంత్రించాలన్నారు. జిల్లాలోని ప్రతీ పంచాయితీని మినీ మీ-సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ చెప్పారు. జనన మరణ ధృవీకరణ పత్రాలు, బిల్డింగు అనుమతులు, మ్యారేజ్ సర్ట్ఫికెట్లు, విద్యార్దులకు అవసరమైన ధృవీకరణ పత్రాలు వంటి అన్ని పౌర సేవలు అందించాలని తద్వారా ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పడమే కాకుండా పంచాయితీలకు కూడా ఆదాయం సమకూరుతుందన్నారు. పంచాయితీలకు సంబంధించి వెబ్‌సైట్‌ను రూపొందించి పంచాయితీల వారీ సమాచారాన్ని పొందుపరచాలన్నారు. పంచాయితీలకు సంబంధించి ఫొటోలు, వీడియోలు, పన్నులు, నాన్ టాక్సెస్, ఇతర సమాచారం సేకరించాల్సిన బాధ్యత పంచాయితీ సెక్రటరీలదేనని ఆ సమాచారాన్ని కంప్యూటరు ఆపరేటరు ద్వారా నమోదు చేయించాలన్నారు. పంచాయితీల్లో భవన నిర్మాణ అనుమతులు కూడా ఆన్‌లైన్ ద్వారా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిపివో కె సుధాకర్, డి ఎల్‌పివోలు జి రాజ్యలక్ష్మి, అమ్మాజీ, శ్రీరాములు, సూర్యనారాయణ, ఇవో ఆర్‌డిలు తదితరులు పాల్గొన్నారు.

పారిజాతగిరిపై వైభవంగా చక్రస్నానం
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 3: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా శుక్రవారం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి ఆలయ తిరువీధుల్లో సూర్యప్రభ వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం ఈ తిరువీధి ఉత్సవం ఆలయ ప్రధానార్చకులు నల్లూరు రవికుమారాచార్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. సుదర్శనపెరుమాళ్‌ను మేళ తాళాలతో, గోవింద నామ స్మరణలతో ఊరేగింపుగా స్వామివారి పుష్కరిణి వరకు తీసుకువెళ్ళి చక్రస్నానం కార్యక్రమం నిర్వహించారు. సుదర్శన్ పెరుమాళ్‌తో కలసి భక్తులంతా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు రెడ్డి రంగప్రసాదరావు కుటుంబ సభ్యులు, వారి సంస్థలైన లక్ష్మీకాంతం టెక్ ఫైనాన్స్ తరపున 50 వేల రూపాయలు స్వామివారికి సమర్పించారు. కార్యక్రమ ఏర్పాట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు(శివ) పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ బిక్కిన సత్యనారాయణ, సభ్యులు గొట్టుముక్కల రాయపరాజు, అన్నాప్రగడ వీరరాఘవరావు, పొన్నాడ సత్యనారాయణ, బోడ వెంకటేశ్వరరావు, మారిశెట్టి బాలకృష్ణ, యిళ్ళ రామ్మోహనరావు, తోట రామకృష్ణ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచర్ల జగపతిరాజు, కాకాని శ్రీహరిరావు, రాజాన సత్యనారాయణ, కంది బాలకృష్ణారెడ్డి, దుగ్గిరాల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
జయపూర్ సుగర్స్ ఫ్యాక్టరీలో క్రషింగ్‌కు కెసిపి ఏర్పాట్లు
చాగల్లు, ఫిబ్రవరి 3: చాగల్లు జయపూర్ సుగర్స్ చెరకు క్రషింగ్ రైతులకు గత సంవత్సరం చెల్లించాల్సిన బకాయిలు రూ.19.4 కోట్లు చెల్లించని కారణంగా జిల్లా కలెక్టర్ ఆర్‌ఆర్ యాక్టుప్రకారం అధికారులు సీజ్ చేసిన విషయం విధితమే. అందువల్ల సుమారు 500 కార్మిక కుటుంబాలు గత 4 నెలలుగా వేతన బకాయిలు అందక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కర్మాగారాన్ని రాబోయే సీజన్ నుండి క్రషింగ్ జరపటానికి ఉయ్యూరు కెసిపి ఫ్యాక్టరీ యాజమాన్య భాగస్వామ్యంతో నడిపేందుకు కెసిపి ఎండి చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా కెసిపి సిఒఒ జి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అయిదుగురు సభ్యులు గల బృందం ఫ్యాక్టరీని పరిశీలించి క్రషింగ్‌కు అవసరమైన పనులను గురువారం నుండి ప్రారంభించారు. తహసీల్దార్ ఎం మెరికమ్మ ఆధ్వర్యంలో సీజ్ వేసిన తాళాలను తొలగించి సోమవారం వరకు రికార్డులు, కార్మికుల వేతన బకాయిలు, సిబ్బంది తదితర అంశాల పరిశీలనకు కోరగా అందుకు కలెక్టర్ అనుమతించినట్టు తెలిపారు. సమస్యలు, అవరోధాలను అధిగమించి త్వరితగతిన ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ జిఎం పున్నారావు, కెసిపి ఎజిఎం వరదరాజన్ తదితరులు పాల్గొన్నారు.

తెల్లకార్డు అనర్హులకు గులాబీ కార్డు
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, ఫిబ్రవరి 3: జిల్లాలో తెల్లరేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారునికి అర్హత లేదని గుర్తించిన వెంటనే గులాబీకార్డు మంజూరు చేయాలని తహసిల్దార్లను కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ నుండి తహసిల్దార్లు, ఎంపిడిఓలతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్షించారు. జిల్లాలో తెలుపురంగు రేషన్‌కార్డు పొంది స్వచ్చంధంగా తనకు తెల్లరేషన్ కార్డు రద్దు చేసి గులాబికార్డు మంజూరు చేయాలని లబ్దిదారుడు కోరినట్లయితే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆదాయం తక్కువ ఉండి నిజంగా నిరుపేదలుగా గుర్తించినవారికి మాత్రమే తెలుపురంగు కార్డు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో ప్రతిదానికి ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేయడం జరుగుతుందని, ఎదైనా అవకతవకలు జరిగినట్లయితే వెంటనే గుర్తించి సంబందాధికారిపైనగాని, లబ్దిదారునిపైనగాని చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. జిల్లాలో 23వేల రేషన్ కార్డులు అర్హత ఉండగా 17వేల మందికి మాత్రమే దరఖాస్తులకు ఎంపిక చేశారని, మిగిలిన 6వేల దరఖాస్తులను వెంటనే లబ్దిదారుల అర్హతను పరిశీలించి మంజూరుకు చర్యలు తీసుకోవాలని తహసిల్దార్లను ఆదేశించారు. జిల్లాలో చేపల చెర్వుల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, అర్హతగలవారికి వెంటనే పరిశీలించి మంజూరు చేయాలన్నారు. మార్చి 31వ తేదీనాటికి జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణపనులు త్వరితగతిన పూర్తిస్దాయిలో జరగాలని, మరుగుదొడ్డి కట్టని లబ్దిదారునికి రేషన్‌కార్డు రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, డిపిఓ సుధాకర్, జడ్పీ సిఇఓ సత్యనారాయణ, నిక్‌నెట్ అధికారి శర్మ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరినీ ఆదుకుంటాం
జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా నారుూ బ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ కోటేశ్వరరావు
ఏలూరు, ఫిబ్రవరి 3 : జిల్లాలో నారుూ బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన మూడు కోట్ల 30 లక్షల రూపాయల నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేసి అర్హులైన ప్రతీ ఒక్కరినీ ఆదుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా నారుూ బ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ పి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం నారుూ బ్రాహ్మణుల అభ్యున్నతికోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను పూర్తిస్థాయిలో అమలు చేసి అర్హులైన నారుూ బ్రాహ్మణులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. జిల్లాలో ఇంత వరకు 36 సొసైటీలు ఏర్పడ్డాయని అందులో 26 సొసైటీలు మాత్రమే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జరిగాయని మిగిలిన 12 సొసైటీలు ఆన్‌లైన్ రిజిష్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అన్ని మండలాల్లోనూ మండలానికి కనీసం ఒకటి రెండు సొసైటీలు రిజిస్ట్రేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని బిసి కార్పొరేషన్ ఇడి పుష్పలతను ఆయన ఆదేశించారు. జిల్లాలోని నిడదవోలు, అత్తిలి, పెనుమంట్ర, వేలేరుపాడు, కుకునూరు, గణపవరం మండలాల్లో ఒక్క సొసైటీ కూడా రిజిస్ట్రేషన్ కాలేదని ఆ మండలాల్లో త్వరితగతిన సొసైటీలు రిజిస్ట్రేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర నారుూ బ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ గుంటపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలు, సమాజంలో చేతివృత్తులపై వారు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి అనేక పధకాలు ప్రవేశపెట్టిందని ముఖ్యంగా నారుూ బ్రాహ్మణ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి వారిని ఆదుకోవడం జరుగుతోందన్నారు. నారుూ బ్రాహ్మణుల అభివృద్ధి కోసం జిల్లాస్థాయిలో సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సొసైటీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిన 15 రోజుల్లోపల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. సొసైటీని సబ్సిడీ ఇచ్చే ప్రాజెక్టుగా చూడవద్దని రిజిస్ట్రేషన్ అయిన నాటి నుండి 500 రూపాయలు గానీ, వెయ్యి రూపాయలు గానీ పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి ఛైర్మన్ పాలి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పేద ప్రజల అభివృద్ధికి ముఖ్యమంత్రి అనేక అభివృద్ధి సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రతీ ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పధకాలు పేదలకు చేరడంలో జిల్లా అధికారులు ఎంతో కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాను మొదటిస్థానంలో నిలిపారన్నారు. సమావేశంలో జెసి-2 షరీఫ్, బిసి కార్పొరేన్ ఇడి పుష్పలత, బిసి సంక్షేమాధికారి ప్రసాద్, లేపాక్షి సంస్థ ఛైర్మన్ నవీన్, పశ్చిమగోదావరి జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, ఉపాధ్యక్షులు నరం ముత్యాలరావు, నారుూ బ్రాహ్మణ ఫెడరేషన్ బోర్డు మెంబర్లు, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తికి గాయాలు
ఏలూరు, ఫిబ్రవరి 3 : ఒక వ్యక్తి కొబ్బరిచెట్టు ఎక్కి ఆకులు నరుకుతుండగా కత్తి విద్యుత్ వైరుకు తగిలి షాక్ తగలడంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ద్వారకాతిరుమల మండలం పి కన్నాపురం రజక కాలనీకి చెందిన సోమవరపు శ్రీనివాసరావు శుక్రవారం తన ఇంటి ఆవరణలోని కొబ్బరిచెట్టు ఎక్కి కత్తితో ఆకులను నడుకుతున్నాడు. ఆదమరపుగా కత్తి విద్యుత్ వైరుకు తగిలింది. దీనితో షాక్ తగిలి అతనికి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
స్వచ్ఛ జిల్లాగా పశ్చిమ గోదావరి
జడ్పీఛైర్మన్ ముళ్లపూడి

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 3: స్వచ్ఛ జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లాను తీర్చిదిద్దుతామని జడ్పీఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పేర్కొన్నారు. శుక్రవారం జడ్పీఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఒడీఎఫ్ జిల్లాగా ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ ఏడాదిలో మరో 40 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తే నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. 2017 మార్చి 31 నాటికి లక్ష్యాన్ని పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఏప్రిల్ 20న సిఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్బంగా పశ్చిమ గోదావరిజిల్లాను ఒడిఎఫ్ జిల్లాగా ప్రకటించేందుకు కృషిచేస్తున్నామన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు లేని కుటుంబాలకు, ఇళ్లస్థలాలు లేనివారికి కూడా మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మహిళల ఆత్మగౌరవం, ఆరోగ్య సమస్యలే లక్ష్యంగా ప్రతి పేదలకు బాత్‌రూమ్, టాయిలెట్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
అభివృద్ధిపై విమర్శలు అర్ధరహితం
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలు అర్ధరహితమని జడ్పీఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పేర్కొన్నారు. తాడిపూడి, కొంగువారిగూడెం, చింతపూడి ఎత్తిపోతల పథకం, కొవ్వాడ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు సాధించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అర్హులైనవారందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు అందించామన్నారు. 2017లో 1000 కిలోమీటర్లు సిసి రోడ్లు లక్ష్యంకాగా ఇప్పటికే 300 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ జిల్లాలో 100 గ్రామాల్లో రూ. 13 కోట్లతో ఏర్పాటు చేశామన్నారు. విమర్శలు చేసేవారు ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో ఎంపిపి గన్నమని దొరబాబు, వైస్ ఎంపిపి కొండపల్లి రాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు చింతా సుధాకర్, ఏ ఎంసీ ఛైర్మన్ పాతూరి రాంప్రసాద్‌చౌదరి, ఆలపాటి వెంకటేశ్వరరావు, పరిమి చందు, కోరశిఖ మునేశ్వరరావు, శెనగన శ్రీనివాస గౌడ్, ఎండిఒ వై దోశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.