పశ్చిమగోదావరి

ఏం మారలేదు ఇలా అయితే చేయలేం: రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లాలో మళ్లీ బరి సిద్ధమైంది... అటు రెవిన్యూ ఉద్యోగులు, ఇటు యధాప్రకారం కలెక్టరు... ఇంతకుముందు కూడా ఇదే స్ధాయిలో ఈరెండువర్గాలు హోరాహోరీగా ఎదురుపడిన తరుణంలో అమాత్యులు జోక్యం చేసుకుని పరిస్ధితిని చక్కదిద్దారు. అయితే ఈపరిస్ధితి ఏమి మారలేదంటూ రెవిన్యూ ఉద్యోగులు సోమవారం నుంచి వర్క్‌టురూల్ ఆందోళనకు దిగనున్నారు... ఇది జరుగుతున్న సమాచారం తెలుసుకున్న కలెక్టరు వెనువెంటనే సాయంత్రానికి విలేఖరులతో మాట్లాడుతూ తన అభిప్రాయాలను, మనోగతాన్ని వివరించారు... ఆందోళనకు అడ్డుపడే మనస్తత్వం కాదని, అయితే విధులు నిర్వహించిన సమయంలోనే చెప్పిన పనులన్నీ పూర్తిచేస్తే తనకు అభ్యంతరం లేదని, తాను నిబంధనలు అతిక్రమించి వ్యవహరించటం లేదని తేల్చిచెప్పేశారు. మొత్తంమీద కొత్త సంవత్సరం రెండోనెలలోనే మరోసారి ఈరెండువర్గాల మధ్య అంతరం మరోసారి వెలుగుచూడటమే కాకుండా ఆందోళన బాటకు సిద్ధం కావటం విశేషం. అయితే సోమవారం నుంచి ఈపరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాలి....
ఆంధ్రభూమి బ్యూరో

ఏలూరు, ఫిబ్రవరి 11: జిల్లాలో పరిస్దితులు కొంచెం కూడా మారలేదని, జిల్లా కలెక్టరు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు మరింత దారుణంగా ఉందని, ఇలాగే ఉంటే ఆత్మగౌరవం ఉన్నవారు ఏవరూ పనిచేయలేరని, తమపరిస్ధితి కూడా అదేనని జిల్లా రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు లాం విద్యాసాగర్ పేర్కొన్నారు. స్ధానిక రెవిన్యూ భవన్‌లో శనివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కలెక్టరు వైఖరికి నిరసనగా సోమవారం నుంచి వర్క్ టు రూల్ ఆందోళనను చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. వారంలోగా పరిస్దితుల్లో మార్పు రాకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేసి ఎంతదాకైనా వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, అయితే కలెక్టరు వైఖరి కక్షసాధిస్తున్నట్లుగా ఉందని, ఆయన చర్యలవల్లే తాము ఆందోళన చేయాల్సిన పరిస్దితి వచ్చిందన్నారు. ఒక తహసిల్దార్‌ను వీడియోకాన్ఫరెన్స్‌లో అనరాని మాటలు అని అందరిలోనూ పరువు తీశారని, ఆతర్వాత ఆ విషయమై పట్టించుకోలేదని చెప్పారు. ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయని, ఎప్పుడు పడితే అప్పుడు వీడియోకాన్ఫరెన్స్‌లు, టెలికాన్ఫరెన్స్‌లు, అంతకుమించి డయల్ యువర్ కలెక్టరు, ఇవేకాకుండా ఏకధాటిగా జరిగే సమావేశాలతోనే సమయం అంతా గడిచిపోతోందని, ఇక పని ఎప్పుడు చేస్తామని ఆయన ప్రశ్నించారు. వీటి అన్నింటిలోనూ పాల్గొని తర్వాత చెప్పిన పని గడువులోగా చేయాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఈవిషయంలోనూ కలెక్టరు తనదైన శైలిలో వ్యవహరించి ఒక తహసిల్దార్‌ను తీవ్ర మనోవేధనకు, వత్తిడికి గురిచేశారని పేర్కొన్నారు. ఒక వీడియోకాన్ఫరెన్స్‌లో ఒక మండల తహసిల్దార్‌ను ఉద్దేశించి ఫలానా పని ఎందుకు చేయలేదు, ఎప్పుడులోగా చేస్తావని ప్రశ్నించటం, ఆయన రెండురోజుల్లో పూర్తిచేస్తానని చెప్పడంతో ఊరుకోకుండా అలా చేయకపోతే నీకు ఏ శిక్ష వేయాలో కూడా నువ్వే చెప్పి వీడియోకాన్ఫరెన్స్ నుంచి బయటకు వెళ్లమనడంతో ఆయన తీవ్ర వత్తిడికి లోనయ్యారన్నారు. చివరకు ఆ తహసిల్దార్ తనను సస్పెండ్ చేయమని చెప్పడంతో దానికి కలెక్టరు హర్షం వ్యక్తం చేసి ఇకనుంచి చెప్పిన పని చేయని ఎవరికైనా ఇదే శిక్ష అంటూ ప్రకటించారని ఆయన తెలిపారు. వాస్తవానికి 2014లోనే కలెక్టరు వ్యవహారశైలిని నిరసిస్తూ అప్పట్లో ఉద్యమం చేపట్టామని, అయితే రాష్ట్ర మంత్రి పీతల సుజాత ఇరువర్గాలతోనూ చర్చించి సమస్యను పరిష్కరించారని చెప్పారు. అప్పటినుంచి తామంతా ఓపిగ్గానే వేచి ఉన్నామని, అయితే ఎక్కడా కలెక్టరు వ్యవహారశైలిలో మార్పు లేదన్నారు. 2015 మొదటినుంచే కలెక్టరు దాడి మొదలైందని, తమపై కక్షసాధిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈయన కాలంలో చేసిన సస్పెన్షన్లు, ఉద్యోగుల రివర్షన్‌లు, టెర్మినేషన్లు అనేకం ఉన్నాయని, ఈవిధంగా ఎన్నో కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ ఈయన ఆదేశాలపై సిసిఎల్‌ఎకు వెళ్లి మరో ఆదేశం తెచ్చుకున్నా దానిని అమలుచేయటం లేదన్నారు. అక్కడనుంచి వచ్చే ఆదేశాలు అన్నీ మిగిలిన 12జిల్లాలకేనని, అవి ఇక్కడ వర్తించవని చెప్పేస్తున్నారన్నారు. మీకోసంలో వస్తున్న సమస్యలు నిర్ధిష్ట సమయంలోగా పరిష్కారం కాకపోతే తహసిల్దార్లు అంతా ఏ జిల్లాలో లేనివిధంగా ఇక్కడ జరిమానాలు కడుతున్నారని చెప్పారు. అలాగే క్యాష్‌లెస్ లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, రూపే కార్డులు ఇలా అన్నింటికి తహసిల్దారే బాధ్యత వహించాల్సిన పరిస్దితి వచ్చేసిందన్నారు. రోజు ఉదయం 7.30గంటలకు డయల్ యువర్ కలెక్టరుతో మొదలయ్యే భేటీలు అలా నిరంతరం సాగుతుంటాయని, చివరకు వీడియోకాన్ఫరెన్స్‌లు తమను తిట్టడానికేనన్నట్లుగా మారాయన్నారు. చివరకు డిపిసి నుంచి 14మంది తహసిల్దార్లు పోస్టింగ్ కోసం జిల్లాకు వస్తే ఒక అధికారిని తిప్పించుకుని తిరిగి సిసిఎల్‌ఎకు అప్పగించేశారన్నారు. మరో అధికారిని మండలం నుంచి బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచేశారన్నారు. ఇలా ఏకపక్షంగా చేస్తున్న వ్యవహారాలు అనేకం ఉన్నాయని, మిగిలిన జిల్లాల్లో తహసిల్దార్ల అద్దె వాహనాలకు 35వేల రూపాయలు చెల్లిస్తుంటే ఇక్కడ మాత్రం పదివేల రూపాయలే చెల్లిస్తారని, మిగిలిన సొమ్ము ప్రోటోకాల్‌కు వినియోగిస్తామని చెపుతున్నారన్నారు. దానినిమిత్తం వేరే నిధులు వచ్చినా, పల్స్‌సర్వే నిమిత్తం నిధులు వచ్చినా అవి ఏమవుతున్నాయో తెలియటం లేదన్నారు. చివరకు బయోమెట్రిక్ నుంచి తమకు మినహాయింపు తెచ్చుకున్నా అవి జిల్లాలో అమలుకావటం లేదన్నారు. ఇదివరకు అధికారులు జిల్లాలో పోస్టింగ్ అంటే లక్షల రూపాయలు ఇచ్చి పొందేవారని, అయితే ఇప్పుడు ఈ కలెక్టరు వచ్చాక అలా ఎవరూ రావటం లేదని, జిల్లాలో పోస్టింగ్ అంటే భయపడే పరిస్దితి వచ్చేసిందన్నారు. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో కోడిపందాలు జరిగితే 144 సెక్షన్ అంతకుముందే విధించి దాన్ని అమలుచేయలేకపోగా చివరకు ఆ అంశంపై తహసిల్దార్లకు మెమోలు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆత్మగౌరవం కుంటుపడిందని పేర్కొంటూ ఆందోళన బాటకు సిద్ధమైనట్లు చెప్పారు. తనను నేరుగా లక్ష్యం చేసుకుని కలెక్టరు గత రెండేళ్లుగా తనను హింసిస్తూనే ఉన్నారని, అయినా ఇంకా చాలలేదా అంటూ ప్రశ్నించారు. తనకేమైనా ఫర్వాలేదని, అయితే ఇలాంటి వ్యవహారాలు మాత్రం అసోసియేషన్ పరంగా సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల పరిస్ధితి కూడా ఇలాగే ఉందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కాగా కొంతమంది తొత్తులు అసోసియేషన్ వ్యవహారాలను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని సాగర్ హెచ్చరించారు. సోమవారం నుంచి వర్క్ టు రూల్ అమలుచేసి, వారంలోగా పరిస్దితి మారకుంటే మరింత ఉధృతం చేసి రాష్టవ్య్రాప్తంగా అమలుచేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఎంత దూరమైనా ఈవిషయంలో వెళతామని, అంతగా అవసరమైతే కూలీనాలి చేసుకుని బ్రతుకుతామని విద్యాసాగర్ స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కంచర్లపల్లి రమేష్‌కుమార్, కోశాధికారి ఆకుమర్తి ప్రసాద్, రాష్ట్ర సంఘం కార్యదర్శి డిఎ నరసింహరాజు, తహసిల్దార్లు కుమార్, డివి సుబ్బారావు, రాజశేఖర్, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.
పనిచేయమన్నానంతే...
ఈవిషయంలో మారను: కలెక్టరు స్పష్టీకరణ
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, ఫిబ్రవరి 11: యూనియన్ ఎన్నికల ముందు కావాలనే కొంతమంది ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఇలా ఆరోపణలు చేయటం, తర్వాత వచ్చి క్షమాపణలు అడగటం వాళ్లకి అలవాటేనని రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతను ఉద్దేశించి జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ వ్యాఖ్యానించారు. జిల్లాలో ఎవరిపైనా తనకు వ్యక్తిగత కోపాలుగాని, కక్షలుగాని లేవని, ప్రజలుకట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్నందున సకాలంలో పనులు చేయాలని మాత్రమే చెపుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈవిషయంలో తాను మారాల్సిన పనిలేదని ఆయన అభిప్రాయపడ్డారు. వందసార్లు చెప్పినా పనిచేయకపోతే చూస్తూ ఊరుకోవాలా, పనిచేయమంటే తిట్టినట్లుగా భావిస్తే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. స్ధానిక కలెక్టరేట్‌లో శనివారం రాత్రి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆసంఘ నేత విద్యాసాగర్ చేసిన ఆరోపణలను, మరికొన్ని ఘటనలను పేర్కొంటూ పూర్తిస్ధాయి వివరణ మాదిరిగా తన మనోగతాన్ని కలెక్టరు వివరించారు. కలెక్టరేట్‌లో డ్రైవర్‌గా పనిచేసి 12సంవత్సరాలు కువైట్‌లో ఉద్యోగం చేసుకున్న వ్యక్తిని తనవద్దకు తీసుకువచ్చి అతనికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన కోరాడని, ప్రభుత్వపరంగా రిటైర్డ్‌మెంట్ ప్రయోజనాలను చేకూర్చాలని అడిగాడని, అయితే ఆ పైరవీని తాను అంగీకరించలేదని చెప్పారు. దాంతో ఇటువంటి దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని కలెక్టరు పేర్కొన్నారు. ఇలాంటివాటికి స్పందించాల్సిన అవసరం లేదని, అయితే ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్న ఉద్దేశ్యంతో విషయాలను బహిర్గతం చేస్తున్నానని చెప్పారు. తహసిల్దార్ చవ్వాకుల ప్రసాద్ విషయంలో చేసిన ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. భీమవరంలో నివాసం ఉంటూ మొగల్తూరులో పనిచేసే ప్రసాద్‌ను ఏలూరుకు బదిలీ చేశామని, ఇక్కడ కూడా భీమవరం నుంచే ఉద్యోగం చేస్తానంటే ఎలా అని ప్రశ్నించారు. చివరకు ఆయన తీరులో మార్పు రాలేదని, అనారోగ్యంగా ఉందని చెప్పడంతో భీమవరానికి బదిలీ చేశామన్నారు. అయినప్పటికీ పనిలో మార్పు లేనప్పుడు కూడా మందలించకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. సిబ్బంది సమక్షంలో అధికారులను తిడుతున్నారన్న అంశంపై కలెక్టరు మాట్లాడుతూ జిల్లాస్ధాయి అధికారులను సమావేశానికి రమ్మంటున్నానని, అయితే వారికి సబ్జెక్టుపై అవగాహన లేక దిగువస్ధాయివారిని సహయంగా తెచ్చుకుంటున్నారని, అది తన తప్పు కాదని చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరిని తిట్టలేదని, పనితీరు మెరుగుపర్చుకోవాలని మాత్రమే చెప్పానన్నారు. ఏప్రిల్ నుంచి రెండునెలలపాటు ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించనని, ఆ రెండునెలలు అందరూ స్వేచ్చగా విధులు నిర్వహించుకోవచ్చునని, ఆతర్వాత వివిధశాఖల పనితీరును సమీక్షిస్తానని, అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో అందరూ చూడవచ్చునన్నారు. గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యేవారి విషయంలో తాను అభ్యంతరం పెట్టలేదని, అలా వెళ్లేవారు మరొకరికి బాధ్యతలు అప్పగించి వెళ్లాలని ఆర్డీవోలను ఆదేశించానన్నారు. తహసిల్దార్లకు వాహనాల వినియోగానికి నెలకు 35వేల రూపాయలు చెల్లించాలని ఆదేశం ఉన్నా జిల్లాకు 2.50కోట్ల రూపాయలు అవసరమైనా కేవలం 99లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయని, ఆ మొత్తానే్న అందరికి సర్దుబాటు చేశామని చెప్పారు. తాను, జెసి కారుకు అయ్యే ఖర్చులు కూడా ఇతర శాఖల నుంచి వినియోగిస్తున్నామే తప్ప ఈ మొత్తంలో ఒక్క పైసా వినియోగించలేదన్నారు. హైకోర్టు ఆదేశాలతో కోడిపందాల నిరోధానికి అటు పోలీసులకు, ఇటు తహసిల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, 144వ సెక్షన్ అమలుచేయాలని పేర్కొన్నామని, కానీ కోడిపందాలు జరిగినట్లు వచ్చిన కధనాల ఆధారంగా అయా తహసిల్దార్లు, పోలీసులకు నోటీసులు జారీ చేసి వారి వివరణను హైకోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఒక తహసిల్దార్‌ను ఉన్నచోట నుంచి బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వలేదనటం సరికాదని, ఆమెకు ఉద్యోగబాధ్యతలు ఇచ్చామన్నారు. మీసేవ కార్యక్రమంలో ప్రజాసమస్యలను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేయాలని చెప్పామని, అలాకాకపోతే 20 రూపాయలు జరిమానా కట్టమని, అదికూడా కష్టమైతే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు పడే బాధలు కూడా తెలియాలి కదా అని పేర్కొన్నారు. లక్షలు ఖర్చు చేసి కోట్లు సంపాదించాలనే లక్ష్యంతో వచ్చే అధికారులు తనకు అవసరం లేదని, నీతి,నిజాయితీగా సమర్ధమైన సేవలు అందించే అధికారులే కావాలని, అలాంటివారినే తాను గౌరవిస్తానని కలెక్టరు స్పష్టం చేశారు. కేవలం పొలిటికల్ ఏజెండాతోనే కొంతమంది తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఒక వ్యక్తి అందితే జుట్టు, లేకపోతే కాళ్లు అన్నట్లు వ్యవహరిస్తున్నారని, వారి ఆటలు సాగవని స్పష్టం చేశారు.
కన్నులపండువగా శ్రీచందనోత్సవం
ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 11: సుందరగిరిపై కొలువైన ఉగ్ర నారసింహుడు చందన లేపనంతో సేదతీరారు. శ్రీలక్ష్మీనారసింహుని కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీ చందనోత్సవాన్ని ఐఎస్ జగన్నాథపురంలోని ఆలయంలో శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆ తరువాత మూలవిరాట్‌కు చందనాన్ని పూసి వేదమంత్రోచ్ఛరణలతో పండితులు చందనోత్సవాన్ని జరిపారు. ఉగ్రరూపంలో ఉన్న నారసింహుడ్ని శాంతింపజేసే క్రమంలో జరిగిన ఈ ఉత్సవాన్ని వీక్షించిన భక్తులు పరవశించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
విద్యాలయాల అభివృద్ధికి కృషి
మంత్రి మాణిక్యాలరావు
కొవ్వూరు, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న విద్యాలయాల అభివృద్ధికి కృషిచేస్తామని దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. శనివారం సాయంత్రం కొవ్వూరు ఆంధ్రగీర్వాన విద్యాపీఠం 105వ వార్షికోత్సవ కార్యక్రమం కళాశాల ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ విద్యాలయాల అభివృద్ధి నిమిత్తం ఐఎఎస్ అధికారితో ఒక కమిటీని నియమించామన్నారు. ఆంధ్రా గీర్వాన విద్యాపీఠంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు అదే విద్యాపీఠంలో అధ్యాపకులుగా పనిచేయడం అభినందనీయమన్నారు. దేవాదాయశాఖ భూములు కబ్జా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాపీఠానికి పూర్వ వైభవం వచ్చే విధంగా కృషిచేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సూచనాధికారి, తెలుగు భాషాభివృద్ధి సంఘ సభ్యులు పరకాల ప్రభాకరరావు మాట్లాడుతూ తెలుగు భాషా సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కమిటీని వేయడం జరిగిందన్నారు. ప్రాశ్య పాఠశాలలు, ఓరియంటల్ స్కూల్స్, కళాశాలల స్థితిగతులు గురించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. తల్లిదండ్రులు తెలుగుభాష ఔన్నత్యాన్ని చాటిచెప్పి తెలుగు భాష నేర్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. తెలుగును పరిరక్షించేలా కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో తెలుగు భాషను వినియోగించుకోవాలన్నారు. అనంతరం నరసింహ దర్శనం అనే కావ్యాన్ని మంత్రి పైడికొండల తదితరులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్, డాక్టర్ డి ప్రభాకరశర్మ, టిఎన్‌వి రమణమూర్తి, చక్రధరరావు, చామర్తి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఆక్వారంగాన్ని రక్షించుకుందాం
ప్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్ అంతర్జాతీయ సదస్సులో వక్తలు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 11: అంతర్జాతీయంగా భారతదేశ ఆక్వా ఉత్పత్తులకు మరింత డిమాండ్ పెరిగింది.. కానీ ఈ ఉత్పత్తుల్లో రొయ్య, చేప వంటి రకాలను వైరస్ పట్టిపీడిస్తోంది. భారత్‌లోనే కాదు అంతర్జాతీయ ఆక్వా రంగానికి ఇది పెద్ద సమస్యగా పరిణమించింది. ఈ రంగానికి రక్షించుకుందాం అని ప్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్ అంతర్జాతీయ ఆక్వా సదస్సు పలువురు పిలుపునిచ్చారు. శనివారం ప్రారంభమైన ఈ సదస్సు ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహిస్తారు. వివిధ దేశాలకు చెందిన శాస్తవ్రేత్తలు, నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద గ్రూప్ ఛైర్మన్ యుకె విశ్వనాథ రాజు మాట్లాడుతూ ఆక్వా ఉత్పత్తులను పెంచుకోవాలని అన్నారు. దేశం మొత్తం మీద 60 శాతం ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేస్తున్నారని, రూ.20వేల కోట్ల రొయ్యల ఎగుమతులు చేస్తున్మాని ఆయన అన్నారు. 2వేల టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని అందుకోసమే ప్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్ అంతర్జాతీయ సదస్సును భీమవరంలో ఏర్పాటుచేశామన్నారు. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు మాట్లాడుతూ ఆక్వా రైతాంగం మంచి ఫలితాలను తీసుకువస్తోందన్నారు. అయినా ఒడిదుడుకులు తప్పడం లేదన్నారు. వాటిని ఎదుర్కోవాలని, ఒక పంట చేతికి వస్తుంటే మూడు పంటలు పోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రైతాంగానికి త్రీఫేజ్ విద్యుత్, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారని ఆయన అన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు మాట్లాడుతూ ఆక్వా రైతాంగం శాస్ర్తియ పద్ధతులను ఉపయోగించుకోలేకపోతోందన్నారు. కోల్డ్ స్టోరేజ్, మార్కెట్ ధరలేక రైతులు నష్టాలను చవిచూస్తున్నారని ఆయన అన్నారు. విదేశాల్లో కూడా రాణించలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీమారకద్రవ్యం ఎక్కువగా వస్తున్న నేపధ్యంలో రైతాంగానికి శాస్ర్తియ పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలన్నారు. ఆక్వాసాగును కాలుష్యం బారి నుంచి రక్షించుకోవాలన్నారు. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ సలీం మాట్లాడుతూ రొయ్యలు వైరస్ బారిన పడుతున్నాయన్నారు. వీటిపై పరిశోధనలు జరుగుతున్నాయని, రొయ్యల పితామహులు ఈ సదస్సుకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆక్వా సాగులో చాలా సమస్యలు ఉన్నాయని, వీటి పరిష్కారానికి ప్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్ మంచి వేదిక అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 35వేల మంది ఆక్వా రైతులను గుర్తించామన్నారు. వారి సెల్‌ఫోన్ నెంబర్లను సేకరించామని, వీరందరికీ శాస్ర్తియ, సాంకేతిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామని ఆయన అన్నారు. సాగులో మెళకువలు నేర్పిస్తామని, ఆక్వా సాగువల్ల కాలుష్యం వస్తోందని డ్రెయిన్లు, క్రీకులను బాగుచేయిస్తామన్నారు. కోస్తాతీరంలో కొన్ని ఆక్వా జోన్‌లుగా చేస్తామని ఆయన తెలిపారు

కొమ్ముగూడెం - కోరుమామిడి వంతెనకు శంకుస్థాపన

ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 11 : అపరిష్కృతంగా ఉన్న కొమ్ముగూడెం -కోరుమామిడి గ్రామాల మధ్య ఎర్ర కాలువపై నిర్మించనున్న బ్రిడ్జికి శనివారం దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14.98 కిలో మీటర్ల మధ్య రహదారిని కలుపుతూ రూ.2.50కోట్లతో నిర్మాణ పనులు చేపట్టామన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో వంతెన నిర్మాణాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేయాలన్నారు. ఈ కాలువను త్వరలో చెక్ డ్యామ్‌గా మార్చాలని ఆలోచనలో ఉన్నామన్నారు. ఈ కాలువ ద్వారా నీటి నిల్వలు పెరిగి చుట్టు పక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాల స్థాయి పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత చెక్ డ్యామ్ తయారు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారుల సలహా మేరకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. గత కొద్దికాలంగా ఇరు గ్రామాల రైతులు ఎర్ర కాలువ దాటేందుకు పలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సిఎం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్ముగూడెం సర్పంచ్ ఎస్ వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ డిఇ పి వెంకటేశ్వర్లు, ఎస్‌ఇ కె శ్రీనివాస్, ఇఇ ఆర్ సంతోష్‌కుమార్, తహసీల్దార్ పి నాగమణి, బిజెపి నాయకులు యెగ్గిన నాగబాబు, కంచుమర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పారిజాతగిరిలో శ్రీనివాసునికి విశేష పూజలు
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 11: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో వేకువజామున ఆలయ ప్రధానార్చకులు నల్లూరు రవికుమారాచార్యులు ఆధ్యర్యంలో స్వామివారికి సుప్రభాతసేవ, అర్చన, తోమాల సేవలు, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. అనంతరం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కొయ్యలగూడెంనకు చెందిన సాయి శ్రీనివాస జ్యూయలర్స్, జమ్ము శ్రీలత ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నపసాద వితరణ చేయించారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం ఇఒ పెనె్మత్స విశ్వనాధరాజు(శివ), ఛైర్మన్ బిక్కిన సత్యనారాయణ పర్యవేక్షించారు. ధర్మకర్తల మండలి సభ్యులు పొన్నాడ సత్యనారాయణ, గొట్టుముక్కల రాయపరాజు, అన్నాప్రగడ వీరరాఘవరావు, యిళ్ళ రామ్మోహనరావు, తోట రామకృష్ణ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
డ్రెడ్జింగ్ పనులు అడ్డుకున్న రైతులు
మొగల్తూరు, ఫిబ్రవరి 11:మొగల్తూరు మండలం శేరేపాలెం గ్రామ శివారున గల గొంతేరు డ్రెయిన్‌లో డ్రెయినేజీ శాఖ అధికారులు పర్యవేక్షణలో రూ.13కోట్లతో 12.5 కిలోమీటర్లు పొడవునా జరుగుతున్న డ్రెడ్జింగ్ పనులను ఆయకట్టు రైతులు తణుకుల సోమేశ్వరరావు, దాసరి నరసింహారావు, దూసనపూడి కోటేశ్వరరావులు శనివారం అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మొగల్తూరు మండలం శేరేపాలెం గ్రామ శివారున గల గొంతేరు డ్రెయిన్‌లో రెండు డ్రెడ్జర్ల సహాయంతో చేపడుతున్న పనుల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈపనులు ఒకచోట ఒకొరకంగా కొలతలు తీసుకొని గుట్ల వెంబడి అనేక వ్యత్యాసాలతో పనులు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. గట్లు వెంబడి గల రైతులకు తగిన సమాచారం ఇవ్వకుండా గట్టుపక్కన గల షెడ్డు తొలగించామని, దాని వలన షెడ్డులో సూమారు రెండు లక్షల విలువ గల మేత బస్తాలతోపాటు, ఆయిల్ డబ్బాలు ఉన్నాయన్నారు. తగిన సమాచారం ఇవ్వకుండా పొక్లెయినర్ సహాయంతో కూల్చీవేశారని రైతులు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయా రైతులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి గొంతేరు డ్రెయిన్ ఆయకట్టు శేరేపాలెం రైతులకు న్యాయంచేయాలని వారు మొర పెట్టుకుంటున్నారు.
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌తో అనేక అద్భుతాలు
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 11 : ప్రపంచ వ్యాప్తంగా ఇంధన రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కారాలకోసం జరుగుతున్న పరిశోధనల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు అనేక అద్భుతాలు సాధిస్తున్నారని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ మాజీ డైరెక్టర్ బివి.రాఘవయ్య అన్నారు. స్థానిక వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ విద్యార్థులు వారికి నచ్చిన అంశాలపై దృష్టిని పెట్టి పరిశోధనలు జరిపితే దేశానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. కొంత సమయాన్ని పరిశోధనలకు వెచ్చించి చదువు పూర్తయ్యేలోగా ఏదో ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంధన పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. తక్కువ విద్యుత్‌తో ఎక్కువగా పనిచేసే పరికరాల రూపకల్పనకు దోహదపడే పరిశోధనలను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గఅధ్యక్ష, కార్యదర్శులు గ్రంధి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు, చక్కా శ్రీమన్నారాయణమూర్తి, డాక్టర్ బి.బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
లింకురోడ్డు పనులు పరిశీలించిన అధికారులు
యలమంచిలి, ఫిబ్రవరి 11: కొంతేరులో రూ.42లక్షలతో నిర్మించనున్న సరంధరపుంత లింకురోడ్డును రైతులు, పంచాయతీరాజ్ అధికారులు శనివారం పరిశీలించారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈరోడ్డును పటిష్టంగా నిర్మించాలని ఈ సందర్భంగా అధికారులను రైతులు కోరారు. ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పిఆర్ ఎఇ రామస్వామి, అడవిపాలెం సర్పంచ్ సుకుమార్, నిమ్మకాయల రామకృష్ణ, కటికిరెడ్డి నరసింహారావు, పులపర్తి వెంకటరత్నం, ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వరసిద్ది వినాయకస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం
వీరవాసరం, ఫిబ్రవరి 11: పంజావేమవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ వరసిద్ది వినాయకస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ నిర్వాహకులు పంజా నాగేశ్వరరావు, పంజా మాణిక్యాలరావు దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దంపతులు స్వామివారికి నూతన వస్రాలను బహూకరించారు. గతేడాది ఆలయాన్ని నూతనంగా పంజా నాగేశ్వరరావు కుటుంబీకులు నిర్మించారు. పూజల అనంతరం మహిళలకు పసుపు, కుంకుమలు పంపిణీ చేశారు.
శ్రీ మద్ది ఆంజనేయునికి పంచామృతాభిషేకం
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 11: స్వయంభూః శ్రీ మద్ది ఆంజనేయస్వామివారికి శనివారం ఉదయం పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో జరిగిన పంచామృతాభిషేకం స్వామివారికి అశ్వారావుపేటకు చెందిన జక్కం శ్రీనివాస్, వారి కుమార్తులు అనంతలక్ష్మి, సత్యవాణి, సిహెచ్ పోతేపల్లికి చెందిన జవ్వాదుల మహేష్, నాగలక్ష్మి దంపతులు, యానాంకు చెందిన భాస్కర్ ప్రకాశ్ నిర్వహించారు. శనివారం ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారికి 108 ప్రదక్షిణలు, నాగవల్లీదళములతో అష్టోత్తర పూజలు చేయించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వాహనపూజలు, అన్నప్రాసనలు జరిగాయి. ఆలయానికి వచ్చిన భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేశారు. శనివారం ఒక్క రోజు ఆలయానికి 2,20,016 రూపాయల ఆదాయం లభించినట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు(శివ) తెలిపారు. కళారాధనలో భాగంగా రావులపాలెంనకు చెందిన వై తిరుపతయ్య బృందం శ్రీకృష్ణ రాయభారం అనే అంశంపై బుర్రకథ చెప్పారు. కాగా, దెందులూరు మండలం లక్ష్మీపురంకు చెందిన ఘంటా పవన్‌కుమార్ 50,558 రూపాయలు, ఘంటా శ్రీరామ్ 50,558 రూపాయలు నిత్యాన్నదాన పథకానికి శాశ్వత విరాళంగా దేవస్థానం ఛైర్మన్ ఇందుకూరి రంగరాజుకు అందజేశారు. జంగారెడ్డిగూడెంనకు చెందిన వందనపు రాధాకృష్ణమూర్తి, పుణ్యవతి దంపతులు అన్నదాన పథకానికి 20,116 రూపాయలు, బుట్టాయగూడెంనకు చెందిన గొట్టుముక్కల వెంకటరామరాజు, వారి మనుమడు గొట్టుముక్కల గణేష్ సంజయ్‌వర్మరాజుపేరున పది వేల రూపాయలు విరాళం సీనియర్ అసిస్టెంట్ జి నరసింహనాయుడుకు అందజేసారు.

పెండింగ్ కేసులు లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవాలి
ఏలూరు, ఫిబ్రవరి 11: ఎన్నో ఏళ్ల నుండి పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని కుటుంబన్యాయస్ధానం జిల్లా న్యాయమూర్తి సి రమాదేవి చెప్పారు. స్ధానిక జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతి 100 కేసుల్లో 90శాతం కేసులు ఇరుపక్షాల అంగీకారంతో రాజీద్వారా పరిష్కరించుకునే వీలుందన్నారు. చట్టాలకు అనుగుణంగా రాజీచేసుకోవడానికి ఆస్కారం ఉన్న కేసులన్నింటిని లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకోవటం మంచిదన్నారు. ఎస్సీ,ఎస్టీ కేసుల న్యాయస్ధానం జిల్లా న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ లోక్‌అదాలత్ వల్ల సత్వరన్యాయం లభిస్తుందన్నారు. జిల్లా న్యాయసేవాధికారసంస్ధ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ నరసింహమూర్తి మాట్లాడుతూ ఉభయపక్షాల అంగీకారంతో లోక్‌అదాలత్ జారీచేసే అవార్డు సివిల్ న్యాయస్ధానం డిక్రీతో సమానమన్నారు.
కార్యక్రమంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎల్ శ్రీ్ధర్, మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి పివివి కోటేశ్వరరావు, జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్(ఎక్సైజ్) పి తిరుమలరావు, మొబైల్ కోర్టు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ షేక్ అబ్దుల్‌షరీఫ్, రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ డి ఉమాదేవి, ఏలూరు డిఎస్పీ జి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.