పశ్చిమగోదావరి

ఆరని జ్వాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 12 : జిల్లాలో ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉండిపోయిన రెవిన్యూ ఉద్యోగుల అసంతృప్తి సోమవారం నుంచి ఆందోళన బాట పట్టనుంది. ఇప్పటికే రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎల్ విద్యాసాగర్ సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా రెవిన్యూ ఉద్యోగులు వర్క్ టు రూల్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించడం తెలిసిందే. దానికి అనుగుణంగా సోమవారం నుంచి వారం పాటు ఈ ఆందోళనను చేపట్టేందుకు జిల్లాలోని రెవిన్యూ ఉద్యోగులు సమాయత్తమయ్యారు. ఇదిలా ఉండగా మరో పరిణామంలో రాష్ట్ర రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు ఎల్ విద్యాసాగర్‌లు ఆదివారం విజయవాడలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి కె ఇ కృష్ణమూర్తిని కలుసుకున్నారు. ఆయనకు జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. కలెక్టర్ వ్యవహార శైలిని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము పనిచేయలేకపోతున్నామంటూ వివరించారు. దీనిపై మంత్రి స్పందించి తొందరపడవద్దని, అన్ని సమస్యలు సర్దుకుంటాయని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా రెవిన్యూ ఉద్యోగుల ఆందోళన ప్రారంభం కానున్న నేపధ్యంలో జిల్లా ఉన్నతాధికారులు అధికారులను, ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ విద్యాసాగర్ ఆరోపిస్తున్నారు. సోమవారం ఉదయం జరిగే డయల్ యువర్ కలెక్టర్ తదితర కార్యక్రమాలకు ముందుగానే హాజరుకావాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని, ఇది సరైన విధానం కాదని పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ‘ ఆంధ్రభూమి’ ప్రతినిధితో జిల్లా రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ విద్యాసాగర్ ఫోన్‌లో మాట్లాడుతూ కలెక్టర్ తీరుకు నిరసనగానే తాము ఈ ఆందోళన చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. రెవిన్యూ మంత్రిని కలిసి పరిస్థితిని వివరించామని, అయినప్పటికీ ముందుగా ప్రకటించిన విధంగా ఆందోళన కార్యక్రమాల్లో వెనక్కి తగ్గేది లేదని వివరించారు. ఉన్నతాధికారుల బెదిరింపులకు తలొగ్గేవారు ఎవరూ లేని పేర్కొన్నారు. కాగా కలెక్టరేట్‌లో డ్రైవర్‌గా ఉంటూ దుబాయ్ వెళ్లి పోయి తిరిగి వచ్చిన వ్యక్తికి మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని తాను పైరవీ చేసినట్లు ఆరోపిస్తున్నారని, అయితే ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని, ఎవరు ఆ పైరవీ చేస్తున్నారో తెలియదని స్పష్టం చేశారు. ఎవరైనా పనిచేసిపెట్టే వారి వద్దకు వెళ్లి చేయమని అడుగుతారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వద్దకు వెళ్లి ఈ పనిచేసిపెట్టమని ఎవరు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. అలాగే ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం పరిపాటేనని కలెక్టర్ చెప్పడం సరికాదన్నారు. ఎన్నికలు ఎన్‌జివో అసోసియేషన్‌కు అని, దానిలో తాను పోటీ కూడా చేయడం లేదని ఆయన వివరించారు. అంతేకాకుండా జిల్లాలో లక్షలు పోసి పోస్టులు తెచ్చుకుంటారని, అలాంటిది తాను వచ్చాక ఆ పరిస్థితి లేకుండా పోయిందని ఆ ఉన్నతాధికారే స్వయంగా ఏలూరు ఆర్డీవో బదిలీ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చెప్పుకొచ్చారన్నారు. దానే్న తాను మళ్లీ చెప్పాను తప్ప తాను సొంతంగా చెప్పలేదన్నారు. ఆ సమావేశంలో ఆ ఉన్నతాధికారి తనను తట్టుకుని ఆర్డీవో రెండున్నరేళ్లు ఎలా పనిచేశారోనన్నది చూడటానికే తాను వచ్చానని, వాస్తవానికి తాను ఇలాంటి సమావేశాలకు ఏనాడూ వెళ్లలేదని చెప్పారన్నారు. ఇలా అంశాల వారీగా కలెక్టర్ చెప్పిన విషయాలన్నీ వాస్తవదూరాలని పేర్కొన్నారు. ఏది ఏమైనా వర్క్ టు రూల్ ఆందోళన విషయంలో వెనక్కి తగ్గేది లేదని, అప్పటికీ పరిస్థితి మారకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కూడా సిద్ధమేనని పేర్కొన్నారు.

పేరుపాలెం నార్త్‌లో భారీ మత్స్యరాజం
మొగల్తూరు, ఫిబ్రవరి 12: మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ గ్రామంలో తిరుమాని సూర్యనారాయణకు చెందిన చెరువులో ఆదివారం భారీ పండుగప్ప చేప లభ్యమైంది. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద సైజులో పండు కప్పజాతి చేప రావటం ఇదే ప్రథమం. దీని బరువు సుమారు ఎనిమిది కిలోలుంటుందని, సుమారు మూడు వేల రూపాయల ధర పలుకుతుందని రైతు సూర్యనారాయణ తెలిపారు. దీనిని తిలకించేందుకు పలువురు భారీగా తరలివచ్చారు.

సేంద్రీయ సాగుతోనే లాభాలు
అంతర్జాతీయ ఆక్వా సదస్సులో శాస్తవ్రేత్తలు పిలుపు

భీమవరం, ఫిబ్రవరి 12: ఆక్వా కల్చర్ దారి తప్పింది. నిరక్షరాస్యులైన ఆక్వా రైతులు తెలిసీ తెలియక యాంటిబయోటిక్స్ కొనే్నళ్లుగా వినియోగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వీటి వినియోగం మరింతగా పెరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆక్వా కల్చర్‌పై నిత్యం పరిశోధనలు చేస్తున్న ఆయా దేశాల శాస్తవ్రేత్తలు సేంద్రీయ సాగు చేయాలని, ఈ సాగు ద్వారా ఉత్పత్తి అయిన చేప, రొయ్యలకు అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉందని, ఆ దిశగా సాగును ప్రారంభించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఆక్వా సదస్సు రెండు రోజు ఆదివారం సందడిగా సాగింది. చైనా దేశంలో 15 హెక్టార్ల సైజులో చేప, రొయ్యల చెరువులు ఏర్పాటు చేసినట్టు శాస్తవ్రేత్త డాక్టర్ విజయ్‌గుప్తా చెప్పారు. కాని భారత్‌లో ఆ విధమైన సాగు ఎక్కడా చేయడం లేదని, అక్కడ వ్యాధులు కూడ ఉండవని, కాని మన దేశంలో చిన్నసైజు చెరువులు ఎక్కువగా ఉండటం వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయన్నారు. ఆక్వా సాగులో బయోఫెక్లిక్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని మలేషియా దేశానికి చెందిన శాస్తవ్రేత్త నయన్‌తా సూచించారు. ఈ విధానం ద్వారా సాగులో లాభాలను ఆర్జించవచ్చునన్నారు. వనామి రొయ్యల విషయంలో ఒకసారి లాభాలు వచ్చినా అనేక సార్లు నష్టాలను చవి చూస్తున్నారన్నారు. ప్రపంచంలో కెల్లా అమెరికాలోని మార్కెటింగ్ విధానం చాలా బాగుందని శాస్తవ్రేత్త లూయిస్ ఫెర్నాండో అరన్‌గురన్ చెప్పారు. ముఖ్యంగా ఆక్వా రంగంపై అమెరికా కొద్దికాలంగా ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సమయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు. అన్ని దేశాల నుంచి రొయ్యలు తమ దేశానికి వస్తాయని, ఇక్కడ మార్కెటింగ్ వ్యవస్థ చాలా మెరుగ్గా ఉండటం వల్ల అందరికీ రొయ్యలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆక్వా సాగులో నర్సరీస్థాయి నుండి జాగ్రత్తలు పాటించాలని ధాయ్‌లాండ్‌కు చెందిన బూన్‌స్రిమ్ వితాచు మనరన్‌కుల్ అన్నారు. ఇందుకు ఎస్‌పిఆర్ అనే విధానం అమలు చేయాలన్నారు. బయోసెక్యూరిటీ పద్ధతిలో నర్సరీని ఏర్పాటుచేసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలని రైతాంగానికి సూచించారు. నాణ్యతలేని రొయ్యలను ఆదిలోనే తొలగిస్తే సాగుకు వైరస్ ఫీవర్ ఉండదన్నారు. ఆక్వా సాగులో వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవాలని ధాయ్‌లాండ్‌కు చెందిన వీరాసన్ ప్రేమోతమొరన్‌కుల్ పేర్కొన్నారు. దీనికి సేంద్రీయ పద్ధతులే శరణ్యమన్నారు. ఈ విధానం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యకు మంచి డిమాండ్ ఉంటుందన్నారు. యాంటి బయోటిక్స్ ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల రానున్న పదేళ్ళలో చేప, రొయ్య కనిపించదని హెచ్చరించారు. ఆక్వా సాగులో ముఖ్యమైన రొయ్యల సాగులో వ్యాధి నిరోధన శక్తి పెంచాలని భారతదేశానికి చెందిన ఆక్వా రంగ నిపుణులు నిజయ్‌ఆనంద్ పేర్కొన్నారు. సాగును చాలా సున్నితంగా చేయాలన్నారు. వైరస్ ఈ మధ్య కాలంలో ఈ సాగును భయపెడుతోందని, అందువల్ల శాస్తవ్రేత్తలు, రైతులు, పర్యావరణ వేత్తలు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.
గుండుకొలను- కొవ్వూరు జాతీయ రహదారి భూ సేకరణ లో
రైతులకు రూ.4లక్షలు నష్టపరిహారం
ఎంపి మురళీమోహన్
దేవరపల్లి, ఫిబ్రవరి 12: గుండుకొలను- కొవ్వూరు జాతీయ రహదారి నిర్మాణానికి కావలసిన భూ సేకరణకు రైతులకు రూ.4లక్షలు నష్టపరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ పేర్కొన్నారు. దేవరపల్లిలో ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ఎటువంటి ఆందోళనలకు తావులేకుండా తాము చేస్తున్న కృషి వల్ల ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ధర కంటే నాలుగు రెట్లు అధికంగా ఇచ్చేలా ఒప్పించినట్టు తెలిపారు. సిఎం చంద్రబాబు గత రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెందిందనే విషయం ప్రతి శాఖలో జరిగిన అభివృద్ధి, గణాంక వివరాలు స్పష్టం తెలియజేస్తున్నాయన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పటిష్టమైన ప్రణాళికలను రూపొందిస్తున్నామని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటామన్నారు. కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైను బడ్జెట్టు ప్రవేశపెట్టిన తొలి రోజు ప్రస్తావించకపోయినా రైల్వే మంత్రిత్వ శాఖ ప్రచురించిన బుక్‌లెట్‌లో ప్రస్తావన ఉందన్నారు. రైల్వే లైను నిర్మాణ పనులు ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే ప్రారంభిస్తామన్నారు. రైల్వే నిర్మాణం కారణంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందుతాయన్నారు. చింతలపూడి ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు, విలీన మండలాల్లో మైకా గనులు ఉన్నాయని, అందువల్ల కేంద్ర ప్రభుత్వంపై తాము రైల్వే లైన్ల నిర్మాణానికి మరింత వత్తిడి తీసుకువస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనైనా 2019 నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. సిఎం చంద్రబాబుపై ఉన్న నమ్మకం, పరిపాలనాదక్షణ, కార్యదీక్షను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను సిఎం చంద్రబాబుకు అప్పగించిందన్నారు. గోపాలపురం మండలంలో వ్యవసాయ రంగాభివృద్ధికి పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని, వాటి వివరాలు అతి త్వరలోనే తెలియజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళన అర్ధరహితమన్నారు. విశాఖ రైల్వే జోన్ రానున్న లోక్ సభ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక వరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. మార్చి 9నుండి ఏప్రిల్ 9వ తేదీ వరకూ జరిగే లోక్‌సభ సమావేశాల్లో రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలను లోక్ సభ దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తొలుత ఆయన గోపాలపురం జడ్పీటీసీ ఈలి మోహినీ పద్మజారాణి మాతృమూర్తి దోనెల్లి రామలక్ష్మి మృతికి ఎంపి మురళీమోహన్ సంతాపం వ్యక్తం చేశారు. జడ్పీటీసీ మోహినీరాణిని, ఆమె సోదరుడు దోనెల్లి మధుబాబులను పరామర్శించారు. సమావేశంలో గోపాలపురం ఎఎంసి ఛైర్మన్ ముళ్లపూడి వెంకట్రావు, ఎంపిపి శ్రీకాకోళపు వెంకట నర్సింహారావు, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పిన్నమనేని శ్రీమన్నారాయణమూర్తి, టిడిపి నేతలు ముళ్లపూడి దొరాజీ చౌదరి, ఈలి శరత్, కొర్లపాటి రాము, డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
తనిఖీ అధికారులు కేసు రాసారని ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య
మృతదేహంతో కార్మికుల ధర్నా
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 12: తనిఖీ అధికారులు కేసు రాసారనే మనస్తాపంతో స్థానిక ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ బొప్పన వెంకట సాయికృష్ణ(45) (నెం.ఇ700777) ఆదివారం తెల్లవారుఝామున పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక రామచంద్రపురంలో నివాసముంటున్న సాయికృష్ణ తెల్లవారుఝామున పురుగుమందు తాగి ఆపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కండక్టర్ మృరణవార్త తెలుసుకున్న ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎస్ ధనుంజయరావు, డిప్యూటీ ఛీఫ్ ట్రాఫిక్ మేనేజర్ మురళీకృష్ణ, డిపో మేనేజర్ నాగభూషణం ఆసుపత్రికి చేరుకున్నారు. పంచనామా, పోస్టుమార్టం అనంతరం ఎంఫ్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో సాయికృష్ణ మృతదేహంతో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. విజయవాడ ఎక్స్‌ప్రెస్ బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సాయికృష్ణ శుక్రవారం రాత్రి విజయవాడ నుండి జంగారెడ్డిగూడెం వస్తుండగా, ఏలూరు దాటిన తరువాత 7వ మైలు రిక్వస్ట్ స్టాప్ సమీపంలో అంబులెన్స్ ఆపి అంబులెన్స్‌లో ఉన్న ఇద్దరు రోగులను దగ్గరలోని వేగివాడలో దించాల్సిందిగా అంబులెన్స్ సిబ్బంది కోరారు. ఈ మేరకు ఇద్దరిని ఎక్కించుకున్న తరువాత టిక్కెట్ జారీ చేసే టిమ్స్ మిషన్ మొరాయించింది. కండక్టర్ సాయికృష్ణ టిక్కెట్ ఇచ్చే ప్రయత్నంలో ఉండగా అనకాపల్లి నుండి వచ్చిన ఆర్టీసీ స్వాడ్(తనిఖీ) అధికారులు బస్సును ముండూరు చెరువు సమీపంలో ఆపి తనిఖీ చేసారు. ఇద్దరికీ టిక్కెట్ ఇవ్వలేదని తనిఖీ అధికారులు కండక్టర్ చెప్పేది వినకుండా దురుసుగా ప్రవర్తించి, కేసు రాసారు. బస్సులోని ప్రయాణీకులు, వెనుకనే వచ్చిన అంబులెన్స్ సిబ్బంది జరిగింది చెప్పినప్పటికీ వినకుండా కేసు రాయడంతో సాయికృష్ణ మనస్థాపానికి గురయ్యాడని ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రీజనల్ సహాయ కార్యదర్శి బివిఎస్‌ఎస్ రంగనాయకులు చెప్పారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులకు చెప్పి, తన విధినిర్వహణలో ఎప్పుడూ కేసు లేదని, నిజాయితీగా పని చేసే తనపై అన్యాయంగా కేసు రాసారని, తాను సస్పెండ్ అయితే పరువు పోతుందని భార్య, పిల్లలతో చెప్పడంతో వారు వారించారు. శనివారం మదనపడుతూనే ఉండి పోయాడని, శనివారం రాత్రి అందరూ నిద్రించిన తరువాత తెల్లవారుఝామున పురుగుమందు సేవించాడని తెలిపారు. ఆర్టీసీ తనిఖీ అధికారులు దురుసుగా ప్రవర్తించడం వల్లే అవమాన భారంతో మనస్థాపానికి గురైన కండక్టర్ తనువు చాలించాడని అన్నారు. మృతుని కుమారుడు బొప్పన లోక్‌నాధ్ ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై ఎం కేశవరావు ఆత్మహత్య కేసు నమోదు చేసారు. ఏరియా ఆసుపత్రిలో సాయికృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి ఆర్‌ఎం ధనుంజయరావు, డిప్యూటీ సిటిఎం మురళీకృష్ణ, డిఎం నాగభూషణం, ఎన్‌ఎంయు డిపో కార్యదర్శి కెఎం రావు, ఎంప్లారుూస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం పాండురంగారావు, ఎస్‌డబ్ల్యుఎఫ్ తదితర యూనియన్ల నేతలు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో శవ పంచనామా, పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని కైలాస రథంలో ఆర్టీసీ డిపోకు తీసుకు వచ్చారు. డిపో ఎదుట మృతదేహాన్ని ఉంచి ఆర్టీసీ కార్మికులు నినాదాలు చేసారు. ఈ సందర్భంగా ఎంప్లారుూస్ నేతలు రంగనాయకులు, పాండురంగారావు మాట్లాడుతూ సాయికృష్ణ కుటుంబానికి ఆర్టీసీ యాజమాన్యం 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేసారు. అతని మృతికి కారకులైన తనిఖీ అధికారులను అరెస్టు చేయాలని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. డిపోలో పని చేయని టిమ్స్ సత్వరమే బాగు చేయాలని, కొత్త టిమ్స్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఇపికె పేరుతో కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలని నినాదాలు చేసారు. ధర్నా చేస్తున్న కార్మికులతో డిపో మేనేజర్ నాగభూషణం చర్చలు జరిపి, మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని, డిమాండ్లు ఉన్నతాధికార్ల దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. ధర్నాలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, ఎఐటియుసి నాయకుడు బూరుగుపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామచంద్రపురం నుండి సాయికృష్ణ మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకు వెళ్ళి కొవ్వూరు రోడ్డులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
గోపూజతో సుబిక్షం
*దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల
ఉంగుటూరు, ఫిబ్రవరి 12: :గోవును ఎక్కడ పూజిస్తారో ఆ ప్రాంతం సుబిక్షంగా ఉంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం ఉంగుటూరు శివారు గోవ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన సదస్సు జరిగింది. తెలంగాణా,కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్న ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ విషంతో కూడిన ఆహారం తీసుకుంటూ ప్రజలు అనేక రుగ్మతలతో జీవిస్తున్నారని, ప్రజలు ఆరోగ్యంగా జీవించాలంటే రైతులు సేంద్రీయ విధానంలో పంటలు పండించినపుడే సాధ్యవుతుందన్నారు. ప్రపంచమంతా రైతుల వైపు చూస్తోందని, భావి తరాలకు ఆరోగ్యవంతమైన ఆహరం అందించే శక్తివంతులుగా రైతులు తయారు కావాలని కోరారు. సమావేశానికి భారతీయ కిసాన్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పరిమి రాఘవులు అధ్యక్షత వహించారు. పర్వతరావు మాట్లాడుతూ దివసీమలో ఉప్పెన వచ్చిన సమయంలో ఆర్‌యస్‌యస్ కార్యకర్తలు అందించిన సేవలు స్వయంగా చూసిన తాను చలించిపోయాయన్నారు. అందుకే తన ఆస్తి ఆ సంస్థకు ఇచ్చానని వెల్లడించారు. అఖిలభారత కిసాన్ సంఘం కార్యకారిణి జలగం కుమారస్వామి మాట్లాడుతూ రైతులు సేంద్రీయ వ్యవసాయం సాగించినపుడే ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుందన్నారు. గోవ్యవసాయక్షేత్రం నిర్వాహకుడు రామకృష్ణంరాజు మాట్లాడుతూ ఒకగోవు వలన అయిదు ఎకరాలు పండించవచ్చునని, ఎటువంటి మందులు వెదచల్లనవసరం లేదని వివరించారు. విజ్ఞాన భారతి పాఠశాలల జిల్లా చైర్మన్ సుంకవల్లి రామకృష్ణ, గోశాల సభ్యుడు వడ్లపూడి మూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడాలి
రసాపురం ఎంపి గోకరాజు
పెనుగొండ, ఫిబ్రవరి 12: రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసే ఎవరికైనా సరే తన సహాయ సహకారాలు ఉంటాయని నరసాపురం ఎంపి గోకరాజు గంగరాజు అన్నారు. ఆదివారం పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఊహించకుండా రాజకీయాల్లోకి వచ్చానని, అభివృద్ధి ఎవరు చేసినా తన సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అనంతరం 63లక్షల వ్యయంతో నిర్మించిన శ్రీ ధాన్యలక్ష్మి సహకార భవన సముదాయాన్ని ఎంపి గంగరాజు ప్రారంభించారు. సొసైటీ అధ్యక్షుడు కలగా ప్రసాద్ రాజకీయాలకు అతీతంగా సొసైటీ భవనం నిర్మించారని, కేవలం ధాన్యం కొనుగోలు ద్వారా వచ్చిన లాభంతో ఈ భవనం నిర్మించడం అభినందనీయమని ఎంపి గంగరాజు అన్నారు. రైతులు సొసైటీని ఉపయోగించుకుని అభివృద్ధి కోసం కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిద్ధాంతం పరిసర గ్రామాల్లోని ఆరు గ్రామాల్లో 450 మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరించానని ఆయన అన్నారు. అనంతరం సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న జూనియర్ కళాశాల భవనానికి ఎంపి శంకుస్థాపన చేశారు. జూనియర్ కళాశాల నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈసందర్భంగా గంగరాజు హామీ ఇచ్చారు. సొసైటీ అధ్యక్షుడు కలగా ప్రసాద్ మాట్లాడుతూ సహకార సంఘం ఆధ్వర్యంలో ఎటువంటి సహాయం పొందకుండా కేవలం ధాన్యం కొనుగోలు ద్వారా వచ్చిన 67లక్షల వ్యయంతో ఈ సొసైటీని నిర్మించామని, కింద రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు గొడౌన్, పైన కో-ఆపరేటివ్ బ్యాంకు, దానితోపాటు సూపర్‌మార్కెట్, మూడో అంతస్తులో వివాహాలు చేసుకునేందుకు ఒక కమ్యూనిటీహాలు నిర్మించామని తెలిపారు. కార్యక్రమంలో చింతపల్లి జేమ్స్, చక్రపాణి, సురేంద్ర, ఎంపిటిసి బోస్, ఎన్‌ఎన్ రాజు, సొసైటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళలు తమ హక్కులపై చైతన్య కలిగి ఉండాలి

మున్సిపల్ ఛైర్‌పర్సన్ శివలక్ష్మి
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 12: మహిళలు తమకున్న హక్కులపై చైతన్యం కలిగి ఉండాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి అన్నారు. విజయవాడలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలలో ఆదివారం ఆమె పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి పీతల సుజాతలను కలిసి మహిళా సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలకు రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వడం ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థతకు నిదర్శనమన్నారు. సమాజంలో సగ భాగం ఉన్న మహిళలకు రాజకీయ, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక అంశాల్లో అనుకున్నంత ప్రాధాన్యత లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మహిళలు స్వయం సమృద్ధిచెందే దిశగా ముందడుగు వేయాలన్నారు. టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు మహిళలకు సమాజంలో సముచిత స్థానం కల్పించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితేసేందుకు అన్ని రంగాల్లోను స్థానం కల్పిస్తున్నారని చెప్పారు.

ఎన్‌జివో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రమేష్
ఏలూరు, ఫిబ్రవరి 12 : ఎన్‌జివో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా జిల్లాకు చెందిన కె రమేష్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రమేష్‌కుమార్ జిల్లా రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఎన్‌జివో సంఘాలకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అలాగే జె ఎసి కన్వీనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. రమేష్‌కు రాష్ట్ర ఎన్‌జివో సంఘ ఉపాధ్యక్ష పదవి లభించడం పట్ల వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఎన్‌జివో సంఘ నాయకులు ఆర్ ఎస్ హరనాధ్, చోడగిరి శ్రీనివాసరావు, నెరుసు రామారావు, సతీష్‌కుమార్‌లో అభినందించిన వారిలో వున్నారు.