పశ్చిమగోదావరి

ఎన్నికల బరి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 15 : సుధీర్ఘ విరామం తరువాత మళ్లీ ఎన్నికల బరి సిద్ధమైంది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ నెల 21 నుంచి నామినేషన్ల దాఖలు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల 28 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఇచ్చారు. మార్చి 1న నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారు. మార్చి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక మార్చి 17న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. కాగా మార్చి 20న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిర్వహించి 24 నాటికి ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తారు. కాగా జిల్లాకు సంబంధించి ఈ వ్యవహారాన్ని పరిశీలించుకుంటే ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా వున్న మేకా శేషుబాబు, అంగర రామ్మోహన్‌లు ప్రస్తుతం పదవీ విరమణ చేయనున్నారు. స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన వీరిద్దరి స్థానంలో మరో ఇద్దరు వస్తారా? లేక ఒకరైనా కొనసాగుతారా? అన్నది వేచి చూడాలి. అయితే మేకా శేషుబాబు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికై ప్రస్తుతం వై ఎస్ ఆర్ సిపిలో కొనసాగుతున్నారు. ఇక అంగర రామ్మోహన్ టిడిపి ఎమ్మెల్సీగా గెలుపొంది కొనసాగుతున్నారు. అయితే అప్పటి ఎన్నికలకు, ఇప్పటి ఎన్నికలకు మధ్య మారిన పరిస్థితులు రెండు స్థానాలను దాదాపుగా టిడిపి గెలుచుకునే గణాంకాలనే తెరపైకి తీసుకువచ్చింది. మొత్తం మీద ఈసారి రెండు స్థానాలను టిడిపి అభ్యర్ధులే కైవశం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జిల్లా మొత్తం టిడిపి వైపు పూర్తిగా మొగ్గుచూపిన నేపధ్యంలో మరో ఎమ్మెల్సీ సీటును జిల్లాకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరనున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్తానాలు రెండింటినీ కైవశం చేసుకునే అవకాశం వున్నందున దానికి అదనంగా జిల్లాలో మొత్తం ఎమ్మెల్యే స్థానాలను టిడిపి, బిజెపి కూటమికి కట్టబెట్టినందున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూడా కేటాయించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారం ఎంత వరకు ముందుకు నడిచిందన్నది చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. మూడవ స్థానం సంగతి అలా ఉంచితే ప్రస్తుతం వున్న రెండు స్థానాల కోసం అధికార పార్టీలోనే అధిక పోటీ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు నాటికే ఈ స్థానాల కోసం అనేక మంది నాయకులు దరఖాస్తులు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో ప్రముఖ నేతలు కూడా ఉండటం విశేషం. కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ విషయంలో అంబికా కృష్ణ, బడేటి కోట రామారావుల మధ్య అధిష్టానం ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తామన్న హామీ ఇచ్చి బడేటి కోట రామారావుకు ఎమ్మెల్యే అభ్యర్ధిత్వాన్ని కట్టబెట్టారు. దానికి అనుగుణంగానే బడేటి కోట రామారావు గెలుపు విషయంలో అంబికాకృష్ణ కూడా తన వంతు కృషి చేశారు. మొత్తం మీద ఏలూరు ఎమ్మెల్యేగా బడేటి కోట రామారావు ఘన విజయం సాధించిన దగ్గర నుంచి అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించే విషయంపై ఎప్పటికప్పుడు ఉత్కంఠ కొనసాగుతూనే వచ్చింది. తాజా పరిస్థితుల్లో ఆ హామీ నెరవేరుతుందా? లేక రాజకీయ సమీకరణాల్లో మరో పరిస్థితి ఉత్పన్నమవుతుందా అన్నది వేచి చూడాలి. కాగా డెల్టా ప్రాంతానికి చెందిన మెంటే పార్ధసారధి పేరు కూడా ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వం జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి కట్టుబడి వుండి సుదీర్ఘకాలం పార్టీకి ఎన్నో సేవలు అందించిన పార్ధసారధి ఇంతకుముందు జిల్లా పార్టీ అధ్యక్షునిగా కూడా చాలా కాలం పనిచేశారు. ఈ నేపధ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ గౌరవం అందిస్తే సముచితంగా వుంటుందన్న వాదన తెరపైకి వచ్చింది. అంతేకాకుండా సామాజిక వర్గాల సమీకరణలోనూ పార్ధసారధి అభ్యర్ధిత్వం ఉపయుక్తంగా వుంటుందన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. కాగా తాజాగా పదవీ విరమణ చేస్తున్న అంగర రామ్మోహన్ మరోసారి ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలోనూ సామాజిక వర్గ సమీకరణలు బలంగా పనిచేయవచ్చుననే చెబుతున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీకి కొంత మేరకు ప్రయోజనం కలగవచ్చునన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. వీరే కాకుండా మరికొంతమంది ప్రముఖులు కూడా ఈ రేసులో వున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఏం జరిగినా అధిష్టానం జిల్లాల మధ్య సమన్వయాన్ని, సామాజిక వర్గాల సమీకరణలను రానున్న కాలం రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా మొత్తంగా చూస్తే జిల్లాలో ఉన్న రెండు స్థానాలను ఎవరికి కేటాయిస్తారు, మూడవ స్థానం వచ్చే అవకాశం ఏ మేరకు వుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.