పశ్చిమగోదావరి

విషాహారంగా మారిన తాబేలు మాంసం కూర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, ఫిబ్రవరి 26: అటవీ ప్రాంతంలోని అందచందాల చెరువులో దొరికిన తాబేలు మాంసం తిని ఇద్దరు గిరిజనులు మృతి చెందిన సంఘటన జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెంలో జరిగింది. వండిన తాబేలు మాంసం కూర విషాహారంగా మారిపోవడంతో అది తిన్న పలువురు గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. సోయం సత్యనారాయణ(38) మృతి చెందిన వైనం పాఠకులకు చెలిసిందే. అతని భార్య సోయం దుర్గమ్మ(38) కూడా ఆదివారం తెల్లవారుజామున జంగారెడ్డిగూడెం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వీరి కుమారుడు సోయం మధు(18) తీవ్ర అస్వస్థతతో జంగారెడ్డిగూడెం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంకన్నగూడెంకు చెందిన ఆరు కుటుంబాల గిరిజనులు శుక్రవారం అంతర్వేదిగూడెం సమీపంలోని అందచందాల చెరువులో చేపలవేటకు వెళ్లారు. వీరికి చెరువులో పది తాబేళ్లు దొరికాయి. వీటిని ఇంటికి తీసుకు వచ్చి మాంసం వలిచి, శుభ్రం చేసి ఆరు వాటాలు వేసుకుని పంచుకున్నారు. కొంత మంది అదే రోజు కూర వండుకుని తినగా, సోయం సత్యనారాయణ కుటుంబం మాత్రం తాబేలు మాంసం ఉడకబెట్టి (ఆగిలివేసి) నిల్వ చేసుకున్నారు. శనివారం ఆ మాంసాన్ని కూర వండుకుని తిన్నారు. ఈ కూర తిన్న గిరిజనులకు శనివారం మధ్యాహ్నం నుండి వాంతులు, విరోచనాలు అవడంతో స్థానికంగా చికిత్స చేయించుకున్నారు. సోయం సత్యనారాయణ కుటుంబంతోపాటు వారి సమీప బంధువు అయిన సోయం మంగరాజు, అర్జున్ కూడా తిన్నారు. వీరికి కూడా వాంతులు, విరోచనాలు అయ్యాయి. వీరు వెంటనే జంగారెడ్డిగూడెం వచ్చి చికిత్స పొందారు. సోయం సత్యనారాయణ, అతని భార్య దుర్గమ్మ, కుమారుడు మధు ఆరోగ్య పరిస్థితి రాత్రికి విషమించడంతో 108 అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే సోయం సత్యనారాయణ మృతి చెందాడు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు దుర్గమ్మ, మధులను ఏలూరు జనరల్ ఆసుపత్రికి తీసుకు వెళ్ళాల్సిందిగా సలహా ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యులు వీరిని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం తెల్లవారు ఝామున సోయం దుర్గమ్మ మృతి చెందింది. వారి కుమారుడు మధు ఇదే ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. మృతుడు సత్యనారాయణకు ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె ఉమపాదేవి కామయ్యపాలెం పిహెచ్‌సిలో ఎఎన్‌ఎంగా పని చేస్తుంది. రెండో కుమార్తె మమత తణుకులో ఇంటర్ చదువుతోంది. రెండో కుమారుడు కూడా చదువుకుంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటనపై జీలుగుమిల్లి ఎస్సై పి.బాలసురేష్‌బాబు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులను, గ్రామస్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. వీరి మృతికి కారణమైన తాబేలు మాంసం కూర స్వాధీనం చేసుకున్నారు. కూరను పరీక్షల కోసం పంపనున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ సంఘటన గ్రామస్థులను కలచి వేసింది. పోస్టుమార్టం అనంతరం మృత దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించగా, ఆదివారం సాయంత్రం భార్యాభర్తలకు కలిపి అంత్యక్రియలు నిర్వహించారు.