పశ్చిమగోదావరి

విమర్శలు మానుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 4 : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎంతో ముందుచూపుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారని, ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు మానుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఏలూరు ఎంపి మాగంటి బాబు హితవు పలికారు. స్థానిక ఆర్ ఆర్ పేటలోని ఎంపి క్యాంపు కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. తొలుత లిబియాలో ఉగ్రవాదుల కిడ్నాప్‌నకు గురై ఇటీవల విడుదలై ఏలూరు చేరుకున్న డాక్టర్ కొసనం రామ్మూర్తి కుటుంబం ఎంపి మాగంటి బాబును కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవలే రామ్మూర్తి కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లామని, వారి కుటుంబ పరిస్థితి తెలుసుకుని ముఖ్యమంత్రి చలించిపోయారన్నారు. రామ్మూర్తి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఆయనకు అయ్యే వైద్య ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, పది లక్షల రూపాయల ఆర్ధిక సహాయం చేస్తామని, వారి ఇద్దరు పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, ఏలూరులో ఇల్లు కట్టుకునేందుకు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు.
కాగా రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధికి ఎప్పటికప్పుడు అడ్డం పడుతున్నాయని, ప్రతీ పని పైనా విమర్శలు గుప్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విధానం వారికి తగదని హితవు పలికారు. రాష్ట్రంలో 35 ప్రభుత్వ పధకాలు అమలవుతున్నాయని చెప్పారు. జిల్లాలో ముఖ్య సమస్యగా వున్న కొల్లేరును కూడా పరిష్కరిస్తామని చెప్పారు. దీనితో పాటు పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. అయితే కొన్ని సందర్భాల్లో నిధుల కొరత వుండటం వలన అభివృద్ధిలో ఆలస్యం జరుగుతోందని, అయినప్పటికీ ఏ ప్రభుత్వ పధకాన్ని ఆపే ప్రసక్తి లేదని చెప్పారు. కొంతమంది ప్రతిపక్ష నేతలు బిజెపితో పొత్తు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువగానే కేంద్రం నిధులు కేటాయిస్తోందని, ఇలాంటి సందర్భంలో వారి డిమాండ్‌కు అర్ధం లేదని ప్రతిపక్ష నేతలు వారి తీరును మార్చుకోవాలని కోరారు. ఈ నెల 6వ తేదీ నుంచి నూతన అసెంబ్లీ భవనంలో సమావేశాలు జరుగుతాయని, ప్రతిపక్ష సభ్యులు ఈ సమావేశాలు పవిత్రంగా జరిగేందుకు సహకరించాలన్నారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం డాక్టర్ కొసనం రామ్మూర్తి మాట్లాడుతూ ఉగ్రవాదుల చెర నుంచి తనను విడిపించి స్వగ్రామానికి తీసుకురావడంలో ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. ప్రధానంగా ఎంపి మాగంటి బాబు, ఎమ్మెల్యే బడేటి కోట రామారావులకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ కుటుంబ పరిస్థితిని వివరించామని, ఆయన తమ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రికి కూడా తాము రుణపడి వుంటామని చెప్పారు. కార్యక్రమంలో రామ్మూర్తి భార్య అన్నపూర్ణ భవాని, కుమారుడు పవన్ మణికంఠ కుమార్, కుమార్తె నిరీష పాల్గొన్నారు.
8న ‘దివ్యదర్శనం’ ప్రారంభం
మంత్రి మాణిక్యాలరావు
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, మార్చి 4: దివ్యదర్శనం పథకం కింద ఉచిత పుణ్యక్షేత్రాల సందర్శన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 8 బుధవారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభమవుతుందని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. శనివారం మంత్రి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, గిరిజన, పేద వర్గాల ప్రజలకు ఉచితంగా పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ఈ పథకం జనవరి 2న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రత్యేక దివ్యదర్శనం బస్సుల్లో తీర్థయాత్రకు తీసుకువెళతారని, నాలుగురోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. స్థానిక బలుసులమ్మ ఆలయం నుండి ఈ యాత్రను ప్రారంభిస్తామన్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయం, జొన్నవాడ కామాక్షీ ఆలయం, శ్రీ కాళహస్తి, తిరుమల వెంకటేశ్వర స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అహోబిళం, శ్రీశైలం భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వార్ల ఆలయం, త్రిపురాంతకం, త్రిపురాంతకేశ్వర అమ్మవారి ఆలయాలకు తీసుకువెళతారన్నారు. రవాణా, భోజన వసతి, దర్శన, ప్రసాదాలు ఉచితంగా కల్పిస్తారన్నారు.
బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానానికి ప్రత్యేక శిబిరాలు
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, మార్చి 4: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు అందించేందుకు వీలుగా ప్రజల ఖాతాలకు బ్యాంకర్లు ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు వచ్చే సోమవారం నుంచి ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ భాస్కర్ బ్యాంకర్లను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం జరిగిన డిసిసి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే సోమవారం నుంచి శనివారం వరకు జిల్లాలో వున్న వివిధ బ్యాంకులు స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించి ఖాతాదారుల ఆధార్ సీడింగ్ చేయాలని చెప్పారు. వివిధ బ్యాంకులకు సంబంధించిన కో ఆర్డినేటర్లు బ్యాంకర్ల సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెసి-2 షరీఫ్, డ్వామా పిడి ఎం వెంకటరమణ, డి ఆర్‌డి ఏ పిడి కె శ్రీనివాస్‌లు, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఝాన్సీరాణి, బిసి కార్పొరేషన్ ఇడి పుష్పలత, మైనార్టీస్ కార్పొరేషన్ ఇడి శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.
పట్టుదారంతో నేసిన జాతీయ జెండా ఆవిష్కరణ
ఆచంట, మార్చి 4: దేశ సమైక్యత, దేశ సమగ్రత లక్ష్యంగా పట్టుదారంతో అశోక చక్రంతో కూడిన అతుకుల్లేని జాతీయ పతాకాన్ని శనివారం ఆచంటలోని భవ్యభారతి విద్యానికేతన్‌లో ఆవిష్కరించారు. ఆచంట వేమవరానికి చెందిన రుద్రాక్షల సత్యనారాయణ అనే చేనేత కార్మికుడు అత్యంత క్లిష్టమైన ఈ జెండాను ఏడాదిపాటు నేశారు. ఈ జెండాను దేశ రాజధాని పార్లమెంట్‌లోను, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోను, తెలంగాణా రాజధాని హైదరాబాద్‌లోను ఎగురవేయించాలన్న భారీ ప్రణాళికతో ఈ జెండాను సత్యనారాయణ చేనేత మగ్గంపై నేశారు. ఈ సందర్భంగా ఆయన నేసిన జెండాను శనివారం స్థానిక భవ్యభారతి విద్యానికేతన్ ఆధ్వర్యంలో హిందూ, క్రిస్టియన్, ముస్లిం పెద్దలు జి మాధవశర్మ, జి తిమోతీరాజు, షేక్ సయ్యద్‌బాజీ, స్కూల్ చిన్నారులు ఆవిష్కరించారు. ముందుగా అందరూ కలిసి సామూహికంగా ప్రార్థనలు చేసి దేశ సమగ్రత, ఐక్యత, శాంతి కోసం ప్రార్థనలు చేశారు. మారుమూల గ్రామంలో రూపొందిన జెండా దేశ, రాష్ట్ర రాజధానుల్లో ఎగరాలని వారంతా ఆకాంక్షించారు. అనంతరం చేనేత కార్మికుడు రుద్రాక్షల సత్యనారాయణ, అయన సతీమణి రుద్రాక్షల అమరావతిలను భవ్యభారతి విద్యా సంస్థ తరపున కరస్పాండెంట్ కొలిశెట్టి వీరవెంకట తాతారావు, లక్ష్మీపార్వతిలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశానికి గర్వకారణంగా నిలిచిన ఈ జెండాను తయారుచేసిన రుద్రాక్షల సత్యనారాయణను అభినందించారు. సత్యనారాయణను ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం చేనేతరంగం పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కార్మికులు ఆకలికేకలు పెడుతున్న సందర్భంలో ఈ జెండా ద్వారా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి రాగలవన్న ఆశాభావాన్ని సత్యనారాయణ వ్యక్తం చేశారు. నమూనాగా రూపొందించిన ఈ జెండాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే అహర్నిశలు శ్రమించి వాటిని నేస్తానని సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో తమ్మా ప్రభాకరరావు, మాముడూరి సుబ్రహ్మణ్యాచార్యులు, పెద్దింటి సీతారామాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
పాలకొల్లుకు మోడల్ పోలీసు స్టేషన్
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
పాలకొల్లు, మార్చి 4: పాలకొల్లులో స్థలం చూపితే తక్షణం మోడల్ పోలీసు స్టేషన్ నిర్మాణానికి నిధులు ఇస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాలయ చినరాజప్ప తెలిపారు. పాలకొల్లు నుండి విజయవాడ వెళ్లటానికి నర్సాపురం నాగర్‌సోల్ రైలు ఎక్కడానికి శనివారం ఉదయం పాలకొల్లు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన విలేకర్లతో కొంత సమయం మాట్లాడారు. మున్సిపల్ ఛైర్మన్ వల్లభు నారాయాణమూర్తి స్థలం ఇస్తామని..కాస్త పల్లంగా ఉందని చెప్పటంతో వెంటనే దానిని చదునుచేసి అప్పగించండి..అధికార్లను పంపిస్తానని చెప్పారు. స్థలం పరిశీస్తానని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలో 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయని, ఆరు చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, మిగిలిన చోట్ల కూడా విజయం సాధిస్తారనే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 80 శాతం ప్రజలు తమ విధానాలు అంగీకరించేలా పరిపాలన సాగిస్తున్నారని వెల్లడించారు. ఒక సీటు బిజెపికి కూడా కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో బలంలేని చోట వైసిపి అభ్యర్థులను నిలపలేదన్నారు. రాష్ట్భ్రావృద్ధికి జగన్మోహన్‌రెడ్డి చేసిన సూచనలను స్వీకరిస్తామని, ఎక్కడైనా అవకతవకలు జరిగాయని చెబితే వాటిపై దర్యాప్తు చేయిస్తామని, అయితే అభివృద్ధిని అడ్టుకుంటే మాత్రం సహించేది లేదని చెప్పారు. ఒక సీనియర్ ఐఎఎస్ అధికారిపై తిరిగబడి ‘తాను ముఖ్యమంత్రిని అయ్యాక’..అంటూ మాట్లాడటం తప్పని, ప్రభుత్వంపై విమర్శలు చేయటం కాకుండా ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు చెప్పటం మంచిదని ఆయన జగన్మోహన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కువ కాలం 144 సెక్షన్లో ఉంచి పాలన చేయటం ఏమిటని ఆయన ప్రశ్నించగా, ప్రస్తుతం 144 సెక్షను అమలు లేదని, ప్రభుత్వ ఆస్తులకు గానీ, ప్రజలకు గానీ ఇబ్బంది కలిగే పనుల కోసం పిలుపునిస్తే తాము రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడటానికి మాత్రమే తాము కొన్ని చర్యలు తప్పని సరై నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎవరిపైనా తమ ప్రభుత్వానికి వ్యతిరేకత లేదన్నారు. అభివృద్ధి నిరోధకులను ప్రజలే నిరోధిస్తారని హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలవల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు. రైల్వే స్టేషన్లో ఈయన వెంట ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ అంగర రామమోహన్, మున్సిపల్ ఛైర్మన్ వల్లభు నారాయణమూర్తి, ఎంపిపి బి సుజాత, జడ్పీటీసీ బోనం నాని తదితరులు ఉన్నారు.
ఏలూరు సిఎస్‌డిటిపై ఫిర్యాదు
విచారణకు ఆదేశించిన కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, మార్చి 4: ఏలూరు మండలం సి ఎస్‌డిటి ఎల్‌వి సాగర్‌పై చౌక డిపో డీలర్లు శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్‌కు ఫిర్యాదుచేశారు. ఆయన బెదిరింపులకు పాల్పడుతున్నారని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపులు భరించలేకుండా వున్నామని, తమను రక్షించాలని కోరారు. మహిళలని కూడా చూడకుండా దుర్భాషలాడుతున్నారని, తమను భయభ్రాంతులకు గురిచేసి ఒక్కో డిపో నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొన్ని సార్లు డిపోలకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారని, ఈ బెదిరింపులు తాము తాళలేకుండా వున్నామని డిపో డీలర్లు ఈపిచర్ల గంగ, గుమాస్తా రాధిక, డీలర్లు ఎస్ సత్యవతి, ఆర్ విమలాదేవి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు, శ్రీరేఖ తదితరులు ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ చౌకడిపోల్లో గతంలో అనేక అక్రమాలు జరిగేవని, ఇ-పోస్ విధానం అమలులోకి రావడం వల్ల డీలర్లు ఎవరికీ భయపడాల్సిన పని లేదని, ఎవరైనా బెదిరిస్తే తమ దృష్టికి తీసుకురావాలని, అండగా వుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావుతో మాట్లాడుతూ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, విచారణాధికారిగా ఏలూరు ఆర్‌డివోను నియమించి తక్షణం నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
పరిష్కారానికి నోచుకోని సమస్యలు
* దేవాదాయ శాఖ ఇఒల పోరుబాట* 23న దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా
జంగారెడ్డిగూడెం, మార్చి 4: దేవాదాయ శాఖలో దశాబ్దకాలంగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలపై దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న కార్యనిర్వహణాధికారుల సంఘం నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఈ నెల 23న విజయవాడ గొల్లపూడిలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట 13 జిల్లాల్లోని ఇఒలు ప్రజాస్వామ్య పద్ధతిలో వౌన ప్రదర్శన, ధర్నా నిర్వహించనున్నట్టు కార్యనిర్వహణాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెనె్మత్స విశ్వనాథరాజు (శివ) తెలిపారు. శనివారం నాన్ గెజిటెడ్ కార్యనిర్వహణాధికారుల సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పట్టణంలో నిర్వహించారు. సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు శివ విలేఖరులతో మాట్లాడుతూ డిపిసి ఏర్పాటు, వివిధ గ్రేడ్‌లలోగల ఇఒలకు పదోన్నతులు కల్పించకపోవడం, ఆదాయాన్ని బట్టి ఆలయాల హోదాను పెంచకపోవడం వంటి సమస్యలపై పోరుబాట పడుతున్నట్టు తెలిపారు. చాలా ఆలయాలను, జిల్లా కార్యాలయాలను ఇన్‌ఛార్జిలతో నడిపిస్తున్నారని, దీనివల్ల ఆలయ పాలన, అభివృద్ధి కుంటుపడుతోందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో సిబ్బందికి కాలానుగుణంగా ఇవ్వాల్సిన ప్రయోజనాలు కల్పించకపోవడం వంటి సమస్యలు ఆయన వెల్లడించారు. దేవాలయ పాలనతోపాటు మీ ఇంటికి - మీ భూమి, కల్యాణమస్తు, మనగుడి, దివ్యదర్శనం వంటి కార్యక్రమాల్లో తమ సేవలు వినియోగించుకుంటున్నారని, అయినా తమకు రావలసిన న్యాయబద్ధమైన పదోన్నతుల్లో ఎన్నిసార్లు విన్నవించినా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అర్హులైన వారిని అవమానించడమేనని, అందుకే వౌనప్రదర్శనకు దిగుతున్నామని పేర్కొన్నారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ నరసింహబాబు, ఉపాధ్యక్షుడు బి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శులు వివి పళ్లంరాజు, టి రామచంద్ర, దుర్గాప్రసాద్, పి పళ్ళంరాజు, పిబి ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పి నారాయణమూర్తి, తారకేశ్వరరావు, వివిధ జిల్లా శాఖల అధ్యక్ష, కార్యదర్శులు, వినోద్, దొరమాబు తదితరులు పాల్గొన్నారు.
వారం రోజుల్లో లబ్ధిదారులకు చంద్రన్న బీమా అందేలా చర్యలు: కలెక్టర్
ఏలూరు, మార్చి 4: జిల్లాలో చంద్రన్న బీమా పథకంలో పెండింగ్‌లో వున్న క్లెయిమ్‌లు వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపి వారం రోజుల్లో ఆ కుటుంబాలకు అందేటట్లు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం డిఆర్‌డిఎ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారం రోజుల లోపలే క్లెయిమ్‌లు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అన్న సంజీవని షాపుల ద్వారా ఎక్కువ మంది పేదలకు లబ్ధి చేకూర్చే విధంగా మందుల విక్రయాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్ లిటసరీని ప్రోత్సహిస్తూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డి ఆర్‌డి ఏ పిడి కె శ్రీనివాసులు, మెప్మా పిడి శ్రీనివాస్, వయోజన విద్యా శాఖ డిడి రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
వడగాడ్పు మరణాలు సంభవించకుండా చర్యలు
ఏలూరు, మార్చి 4: రానున్న వేసవిలో జిల్లాలో వడదెబ్బ కారణంగా మరణాలుసంభవించకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు ప్రతీ ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకొని, వడదెబ్బ నుండి రక్షణపొందాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె కోటేశ్వరి విజ్ఞప్తి చేశారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో శనివారం వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై విలేఖరుల సమావేశంలో కోటేశ్వరి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడదెబ్బ కారణంగా జిల్లాలో గత ఏడాది అయిదుగురు మృతిచెందారని, ప్రస్తుత సంవత్సరం జిల్లాలో వడదెబ్బ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వడదెబ్బ తగలడానికి కారణాలు తెలుసుకుని చిన్నపాటి జాగ్రత్త చర్యలతో వడదెబ్బ నుండి ప్రాణాలు రక్షించుకోవచ్చన్నారు. ఈ విషయంపై కరపత్రాలు, మీడియా ద్వారా, గ్రామీణ ప్రాంతాలలో అంగన్‌వాడీ, ఆశా, ఎఎన్‌ఎం ద్వారా ప్రజలలో విస్తృతమైన అవగాహన తీసుకువస్తున్నామన్నారు. వడదెబ్బ తగిలినప్పుడు విపరీతమైన తలనొప్పి, తల తిరగడం, తీవ్రంగా జ్వరం కలిగి ఉండడం, పాక్షికంగా అపస్మారక స్థితికి చేరుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. వడదెబ్బ లక్షణాలు కనపడిన వెంటనే ఆ వ్యక్తిని నీడ ప్రదేశానికి తీసుకుని వచ్చి చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరాన్ని తుడవాలని, చల్లని గాలి తగిలేలా ఉంచి, ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు కలిగిన గ్లూకోజ్ లేదా ఓ ఆర్ ఎస్ ద్రావణాన్ని తాగించాలన్నారు. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు త్రాగించకుండా వెంటనే దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి తక్షణమే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వడదెబ్బ రోగులకు సకాలంలో వైద్య సహాయం అందించేందుకు జిల్లాలోని అన్ని ఆరోగ్యకేంద్రాల సిబ్బందికి తగిన శిక్షణ అందించడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. అంతేకాక జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటుచేసేందుకు స్వచ్ఛంద సంస్థలను కోరుతున్నామన్నారు. సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మోహన్‌కృష్ణ, డెమో డాక్టర్ మోహనరావు, డిప్యూటీ డెమో డాక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు, ఆర్‌బి ఎస్‌కె కో ఆర్డినేటర్ డాక్టర్ సురేష్, పరిపాలనాధికారి డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
‘పోలవరం’ భూసేకరణకు రూ.1200 కోట్లు
ఏలూరు, మార్చి 4: పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు రూ.1200 కోట్లు నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని, త్వరలోనే భూములు ఇచ్చిన రైతులందరికీ సొమ్ములు చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం సేద్యపునీటి ప్రాజెక్టుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు రూ.482 కోట్లు చెల్లించాల్సి వుందని, నిధులు మంజూరు కాగానే పెండింగ్ బిల్లులన్నీ చెల్లించడం జరుగుతుందన్నారు. సేద్యపునీటి ప్రాజెక్టులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని, వారం వారం సమీక్ష నిర్వహించి చెబుతున్నా కొంతమంది అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. శేషావతారం ఛానల్ భూసేకరణ పూర్తి చేసి ఏడాదిన్నర అయినా పని ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.