పశ్చిమగోదావరి

అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, మార్చి 26: ఇసుకపై చెలరేగిన దుమారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు ద్వారాలు బార్లా తెరవడంతో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. ఇసుక మాఫియాకు అడ్డుకట్టవేసే అధికారులు కానరావడం లేదు. కాలువల్లో ప్రతి ఇసుక రేణువూ గోకేసి పర్యావరణానికి పాతరేస్తున్నారు. ప్రభుత్వం పేదలను ఉద్దేశించి రవాణాకు వెసులుబాటు కల్పిస్తే, దళారులు ఆధికారులతో కుమ్మక్కయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగించి వేస్తున్నారు. ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించిన నాటి నుండి పేదలకు మాత్రం అందడం లేదు. ప్రభుత్వ పథకాల్లో గృహాలు నిర్మించుకునేవారు నేరుగా కాలువల నుండి ఇసుక తవ్వుకుని తీసుకువెళ్ళవుచ్చు. కాలువలపై దళారుల కన్ను పడటంతో ఇసుక పేదలకు దక్కకుండా పోతోంది. పేదలు ఎవరైనా ఇసుక తీసుకు వెళుతుంటే దళారుల ప్రతినిధులు అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అధికారులు వారిని అడ్డగించి ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నారు. ఇసుక వ్యాపారం చేసే దళారులపై మాత్రం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పట్టణంలో నిర్మాణాలు అధికంగా జరుగుతుండటంతో పెద్ద మొత్తంలో ఇసుక అవసరం అవుతోంది. పట్టణానికి తూర్పున ఉన్న బయనేరు, పడమరనున్న జల్లేరు వాగుల్లో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగించేస్తున్నారు. పట్టణంలో ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లు సుమారు వందకు పైగా ఉంటాయి. ప్రతి ట్రాక్టర్ కనీసం రోజుకు ఐదు నుండి పది ట్రిప్పులుతోలినా రోజుకు 500 నుండి వెయ్య ట్రిప్పుల వరకు ఇసుక తరలిపోతంది. ట్రక్ ధర వెయ్య రూపాయల నుండి 1500 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రోజుకు ఖర్చులు, మామూళ్ళు పోను కనీసం ఐదు వేల రూపాయల సంపాదన వస్తోంది. జల్లేరు వాగులో ఇసుక నిల్వలు అడుగంటి పోయాయి. దీనితో జల్లేరు వంతెన సమీపంలో ఇసుక తవ్వేసారు. వంతెన పిల్లర్స్ చుట్టూ ఉన్న ఇసుక కూడా తవ్వివేయడంతో వంతెన స్థంభాలు పెబ్బతిన్నాయి. బయనేరు వంతెన పరిస్థితి కూడా ఇంతే. బయనేరు వాగులో కూడా ఇసుక అడుగంటి పోయింది. ఎర్రకాల్వలో కూడా ఇసుక తవ్వి తరలిస్తున్నారు. ఎర్రకాల్వలో ఇసుక పునాదుల్లో పోసుకోవడానికి ఉపయోగపడుతుండటంతో తక్కువ ధరకు సరఫరా చేస్తున్నామంటూ దళారులు ఎర్రకాల్వలో తవ్వకాలు సాగిస్తున్నారు. జల్లేరులో పట్టపగలు యథేచ్ఛగా ఒకేసారి పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకలోడు చేసుకుని వెళ్ళిపోతున్నాయి. పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొంత మంది పనిగట్టుకుని ఇసుక వ్యాపారం సాగిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారని, ఈ వ్యవహారం అధిష్టానానికి తెలిసినా తెలిసీ తెలియనట్టు వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉచిత ఇసుక విధానం దళారులు, మాఫియా, కొంత మంది అధికార పార్టీ కార్యకర్తల జేబులు నింపుతున్నాయనే విమర్శలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి. కాగా, ఇటీవల జల్లేరు వాగులో ట్రాక్టర్లు దిగకుండా రెవెన్యూ అధికారులు ఒక కందకం తవ్వారు. అయినప్పటికీ మాఫియా ఇసుక ట్రాక్టర్లను దించివేసి ఇసుక రవాణా చేస్తున్నట్టు వేగవరం గ్రామస్థులు చెబుతున్నారు.

అయిదు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు
రాష్ట్రప్రభుత్వ విప్ చింతమనేని

ఏలూరు, మార్చి 26: పట్టిసీమ ద్వారా మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి పెదపాడు, పెదవేగి మండలాల పరిధిలో అయిదు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో ఆదివారం కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్‌ను ప్రభాకర్ కలుసుకుని మెట్టప్రాంత అభివృద్ధిపై చర్చలు జరిపారు. కృష్ణాడెల్టాను ఆదుకోవడానికి పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని ఏడాదికాలంలో పూర్తిచేసి ప్రపంచరికార్డును సృష్టించామని, పోలవరం ఎడమకాల్వ ద్వారా పట్టిసీమ నీటిని పెదవేగి మండలంలో నాలుగు లిఫ్టుల ద్వారా, పెదపాడు మండలంలో ఒక లిఫ్ట్ ద్వారా ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించాలని కోరిన వెంటనే కలెక్టరు సుముఖత వ్యక్తం చేశారన్నారు. దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గపరిధిలో రైతాంగం బోరుబావులపై ఆధారపడి సేద్యం చేస్తున్నారని, ఒక్క ఎకరం పంట కూడా నష్టపోకుండా విద్యుత్‌ను రైతాంగానికి సక్రమంగా అందిస్తున్నామని, అయితే భూగర్భజలాలను అధికంగా వినియోగించుకుని భావితరాలకు నీరులేకుండా చేయకూడదనే ఉద్దేశ్యంతో పోలవరం కుడికాల్వపై న్యాయంపల్లి, పెదవేగి, గార్లమడుగు, జగన్నాధపురం గ్రామాల మధ్య నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటుచేసి కూచింపూడి, రాయన్నపాలెం, రాట్నాలకుంట, కవ్వగుంట తదితర పది గ్రామాల పరిధిలో రైతులకు సేద్యపునీరు, ప్రజలకు తాగునీరు సమృద్ధిగా అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని చెప్పారు. కృష్ణాకాల్వ ద్వారా నీరు రాక పెదపాడు మండలంలో కూడా సేద్యపునీటి సమస్య తీవ్రంగా ఉందని, తాగునీటి సమస్య కూడా శాశ్వతంగా పరిష్కరించడానికి పట్టిసీమ కాల్వపై ఒక లిఫ్ట్ ఏర్పాటుచేసి రైతాంగానికి, ప్రజలకు నీరు అందించడానికి కలెక్టరు ఇప్పటికే తగు చర్యలు తీసుకున్నారని ప్రభాకర్ చెప్పారు. వచ్చే ఖరీఫ్ పంట నాటికి లిఫ్ట్‌లను సిద్ధం చేసి రైతులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ గోదావరి ద్వారా వృధాగా సముద్రంలోకి పోతున్న జలాలను పట్టిసీమ వద్ద పంపింగ్ చేసి పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణాడెల్టా ఆయకట్టు రైతులకు మేలు జరిగేందుకు గత సీజన్‌లో నీరు అందించామని చెప్పారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో పెదవేగి ఎంపిపి దేవరపల్లి బక్కయ్య, సొసైటీ అధ్యక్షులు ఉండవల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
మొండి బకాయిల ఆస్తులు జప్తు

భీమవరం, మార్చి 26: భీమవరం పురపాలక సంఘం కమిషనర్ సిహెచ్ నాగనర్సింహరావు మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించారు. చాలాకాలంగా ఆస్తిపన్నులు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వారి భరతం పట్టారు. కోర్టు వివాదాలంటూ మరి కొందరు ఆస్తిపన్నులను ఎగవేస్తున్నారు. ఇటువంటి వారిపై ప్రత్యేక జాబితా రూపొందించి వారికి ముందస్తుగా నోటీసులు అందించారు. అయినా స్పందించకపోవడంతో ఆస్తులను జప్తు చేసుకుంటున్నట్లు ఆదివారం బ్యానర్లు ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఆస్తిపన్నులు చెల్లించని వారి కుళాయిల బిరడాలను తొలగించారు.
తీర ప్రాంతాలో స్వైన్‌ఫ్లూ కలకలం
నరసాపురం, మార్చి 26: తీరంలో స్వైన్ ఫ్లూ కలకం సృష్టించింది. నరసాపురం మండలం వేముదలదీవి గ్రామానికి చెందిన 25 ఏళ్ళ యువకుడు బాలాజీకి స్వైన్ ఫ్లూ సోకిందని వైద్యులు నిర్ధారించడంతో తీర ప్రాంత గ్రామాలు ఉల్లిక్కిపడ్డాయి. తీరంలో స్వైన్ ఫ్లూ కేసు నమోదుతో వైద్య శాఖ అప్రమత్తమైంది. గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సంఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వేములదీవి గ్రామానికి చెందిన కె బాలాజీ 15 రోజుల క్రితం అతని సోదరుడి వైద్య పరీక్షల కోసం హైదరాబాద్, విశాఖపట్నం వెళ్ళివచ్చాడు. ఐదు రోజులుగా జ్వరం, ఆయాసంతో బాదపడుతున్న బాలాజీ పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అయితే జ్వర తీవ్రత అదుపులోకి రాకపోవడంతో వైద్యుడు బాలాజీకి రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షలో బాలాజీకి స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. దీంతో అతనికి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. నరసాపురం పట్టణంలో వైద్యం అందించిన వైద్యుడు, నర్సులతో పాటు బాలాజీని పరామర్శించేందుకు వచ్చిన బంధువులకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. కాగ తీరంలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదుతో అప్రమత్తమైన వైద్య అధికారులు వేములదీవి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి స్వైన్‌ఫ్లూ విస్తరించకుండా మందులు పంపిణీ చేశారు.
అభ్యర్ధుల కోసం
హెల్ప్‌డెస్క్
ఏలూరు, మార్చి 26: ఏలూరు పోలీసు రేంజ్ పరిధిలో వివిధ పోస్టుల నియామక ప్రక్రియ దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్ధుల సహాయార్ధం హెల్ప్‌డెస్క్ నెంబర్లను రేంజ్ డిఐజి రామకృష్ణ విడుదల చేశారు. ఎస్‌సిటి ఎస్సై సివిల్(స్ర్తి,పురుష), ఆర్‌ఎస్సై(ఎఆర్, ఎపిఎస్‌పి, సిపిఎల్), అసిస్టెంటు మ్యాట్రన్ ఫర్ ఉమెన్ నియామక ప్రక్రియ కోసం ఏలూరులో శారీరక, దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్ధులకు హైదరాబాద్ ఎస్‌ఎల్‌పిఆర్‌బి విడుదల చేసిన ప్రాధమిక ఎంపిక జాబితాకు సంబంధించి సందేహాలు ఉంటే హెల్ప్‌డెస్క్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. అలాంటి అభ్యర్ధులు ఏలూరు డిఐజి కార్యాలయం ఉన్న హెల్ప్ డెస్క్ నెంబర్లు ...08812231350, 08812251350, 9293797161, 9492920274 నెంబర్లను సంప్రదించవచ్చునని తెలిపారు.

మరుగుదొడ్డి నిర్మించుకోలేదని విద్యుత్ నిలిపివేత
నరసాపురం, మార్చి 26: మండలంలోని తూర్పుతాళ్ళు పంచాయితీలో మరుగుదొడ్లు నిర్మించుకోవడంలో అలసత్వం వహించిన 14 కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామైలైన తూర్పుతాళ్ళు, పెదమైనవాని లంకలో ప్రతి ఇంటా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకు గాను ప్రభుత్వ ఆర్థిక సహాయం కూడా మంజూరు చేసారు. మరుగుదొడ్లు నిర్మాణానికి అధికారులు ఈ నెల 31 గడువుగా నిర్ణయించారు. దీనిలో భాగంగా ఇవోపిఆర్డీ, పంచాయితీ అధికారులు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. అయితే మరుగుదొడ్లు నిర్మించుకోవడంలో 14 కుటుంబాలు అలసత్వం వహించాయని గుర్తించిన అధికారులు ఆయ కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేసారు. ఇప్పటికైనా మరుగుదొడ్లు నిర్మాణానికి ఆయా కుటుంబాలు ముందుకు రాకపోతే విద్యుత్ సరఫరాతో పాటు ప్రభుత్వ సంక్షేమ పధకాలను కూడా నిలుపుదల చేస్తామని పంచాయితీ అధికారులు హెచ్చరించారు.
పేరుపాలెం బీచ్‌లో యువకుడు మృతి
మొగల్తూరు, మార్చి 26: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం ఉదయం సముద్రం స్నానం చేస్తూ ఒక యువకుడు మృతి చెందాడు. మొగల్తూరు పోలీసులు కథనం ప్రకారం పేరుపాలెం బీచ్‌కు ఆదివారం ఉదయం కాళ్ల మండలం కోపల్లె, పెద అమిరం, జక్కరం గ్రామాల నుండి 13మంది యువకులు కలిసి ఆటోలో వచ్చి స్నానం చేస్తుండగా వీరిలో పొత్తూరి సురేష్‌రాజు (17) అనే యువకుడు సముద్రంలో మునిగిపోయి కొద్దిసేపటికి విగతజీవిగా కొట్టుకు వచ్చాడన్నారు. సురేష్ రాజు జక్కరం గ్రామానికి చెందిన వాడని, అతను భీమవరంలో హట్‌లెన్ బేకరీలో పార్టు టైం ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు తండ్రి శ్రీనివాస్‌రాజు కూలిపని చేసుకుంటూ ఉంటాడని తెలిపారు. విఆర్వో కె వినోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుజేసి సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాసుప్రతికి తరలించామని మొగల్తూరు ఎఎస్సై కడలి శ్రీమన్నారాయణ తెలిపారు.
2018 నాటికి సొంత ఇంటి కల సాకారం
ఏలూరు, మార్చి 26: ఏలూరు నగరంలో అర్హతగల ప్రతి పేదకుటుంబానికి 2018 నాటికల్లా సొంత ఇంటికలను సాకారం చేస్తామని ఎమ్మెల్యే బడేటి బుజ్జి చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో ఆదివారం కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్‌ను కలిసి గృహనిర్మాణంపై ఆయన చర్చించారు. నగరంలో సొంత ఇళ్లు లేక ఇబ్బంది పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, కనీసం 25వేల గృహాలు పేదలకు నిర్మించడానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి భూసేకరణ సమస్యగా మారిందని, అయినప్పటికీ పేదల సంక్షేమం కోసం భూమిని సేకరించి బహుళ అంతస్తుల కాలనీలు నిర్మించి 2018 నాటికి పేదలందరికి పక్కాగృహాలు నిర్మిస్తామని, దీనికి జిల్లా యంత్రాంగం సహకరించాలని ఆయన కోరారు. ఏలూరు నగరంలో 60 ఎకరాల భూమిని పేదల ఇళ్ల నిర్మాణం కోసం సిద్ధం చేశామని, ఇందులో వివిధ కేటగిరిలతో జిఫ్లస్ భవనాలు నిర్మించి పేదలకు అందిస్తామని బడేటి బుజ్జి చెప్పారు. కలెక్టరు భాస్కర్ మాట్లాడుతూ అర్బన్ టౌన్‌షిప్ డవలప్‌మెంట్ సంస్ధతో చర్చలు జరిపామని, పేదలకు తక్కువస్ధలంలో ఎక్కువ ఇళ్లు ఎలా నిర్మించడానికి అవకాశం ఉంటుందో నమూనా మ్యాప్‌లు సిద్ధం చేయాలని ఆదేశించామన్నారు. వారంరోజుల్లో మ్యాప్‌లు రాగానే వాటిని పరిశీలించి తుదిరూపం ఇస్తామని, ఈవేసవి సీజన్‌లోనే ఏలూరుతోపాటు అయిదు పట్టణాలలో ఇళ్ల నిర్మాణపనులు చేపట్టనున్నట్లు చెప్పారు. సమావేశంలో డిఆర్వో కట్టా హైమావతి తదితరులు పాల్గొన్నారు.
నిరాటంకంగా స్వచ్చ్భారత్

తాడేపల్లిగూడెం, మార్చి 26: స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి నేటివరకూ నియోజకవర్గంలో నిరాటంకంగా కొనసాగుతోందని బిజెపి జిల్లా కార్యదర్శి కంచుమర్తి నాగేశ్వరరావు, పట్టణాధ్యక్షులు కర్రి ప్రభాకర బాలాజీ పేర్కొన్నారు. మంత్రి మాణిక్యాలరావు స్ఫూర్తితో 2015 ఆగస్టు నుంచి స్వచ్ఛ్భారత్ జరుగుతోందన్నారు. స్థానిక 4వ వార్డు మామిడితోటలో ఆదివారం జరిగిన స్వచ్ఛ్భారత్‌లో స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొని వీధులు, రోడ్లు ఊడ్చి, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం చేయి, చేయి కలిపి పనిచేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో కుటుంబం, ప్రాంతం, వార్డు, ఊరు బాగుపడి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పైబోయిన వైదేహి, మహిళా మోర్ఛ నాయకులు రూపాదేవి, మల్లిపూడి షర్మిల, బిజెపి నాయకులు అచ్యుత దుర్గాప్రసాద్, సాధనాల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
ఉగాది పురస్కారాలు వీరికే...
ఏలూరు, మార్చి 26: ఈసారి జరగనున్న హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినవారికి జిల్లా సాంస్కృతిక మండలి పురస్కారాలను ప్రకటించింది. అయా రంగాల్లో వీరు చేసిన సేవలకు గుర్తింపుగా పురస్కార గ్రహీతలకు పూలమాల, శాలువా, మెమొంటోలతోపాటు 10,116 రూపాయల నగదు పురస్కారంతో సత్కరించనున్నారు. పురస్కారాలు అందుకునే వారి వివరాలు ఇలా ఉన్నాయి.... కె శారద(తాడేపల్లిగూడెం, హరికధ), శ్రీనివాస ఉడయార్(తాడేపల్లిగూడెం, శిల్పం), తమ్మా సత్యనారాయణ(తిరుపతిపురం, అత్తిలి, చిత్రలేఖనం), యడవల్లి వెంకట్రాజు(దూబచర్ల, జానపదకళలు), దంతులూరి సత్యనారాయణరాజు(్భమవరం, మిమిక్రీ), అగ్రహారం జయలక్ష్మి(ఏలూరు, సంగీతం), బికెఎస్‌ఆర్ అయ్యంగార్(ఏలూరు, సామాజికసేవ), ఎ నాగమణిబుద్దదేవ్(ఏలూరు, నృత్యం), పొన్నాడ ప్రకాశం(తాడేపల్లిగూడెం, వాయిద్యం, తబల), చామన కోటేశ్వరరావు(గణపవరం, హార్మోనిస్ట్), సివిఆర్ మాణికేశ్వరి(ఏలూరు, రచయిత్రి), లింగం సత్యనారాయణ(నవుడూరు, సాహిత్యం, కవి), కానూరి వెంకట రామనారాయణరావు(తణుకు, రచయిత), ఎన్‌కె నాగేశ్వరరావు(పెనుగొండ, ఆచంట, కవి, రచయిత), ఎంవిఆర్‌ఎస్‌ఎన్ మూర్తి(పెనుగొండ, రచయిత), వంగా నరసింహారావు(పాలకొల్లు, సాంఘిక నాటకం), కమవరపు నరసింహమూర్తి(తోలేరు, సాంఘికనాటకం), చుక్కన సత్యనారాయణరాజు(్భమవరం, సాంఘికనాటకం), పారెపు ప్రభావతి(పెనుమంట్ర, సాంఘికనాటకం), దొడ్డా సూర్యారావునాయుడు(పాలకొల్లు, పౌరాణిక నాటకం), మహంతి రమణ(తణుకు, పౌరాణిక నాటకం), మల్లాది సత్యనారాయణమూర్తి(నిడదవోలు, పౌరాణిక నాటకం), కలిదిండి కృష్ణంరాజు(ఆకివీడు మండలం సిద్దాపురం, పౌరాణిక నాటకం), పి పొన్నుస్వామి(ఏలూరు, పౌరాణిక నాటకం), కెఎఎం లాల్‌నెహ్రు(నల్లజర్ల, పౌరాణిక నాటకం) ఎంపికయ్యారు. అలాగే గౌరవ పురస్కారాలకు శతావధాని కోట వెంకటలక్ష్మినరసింహం (తణుకు, శతావధానం), అవధాని సూర్యవరపు శివరామకృష్ణ అవధాని(ద్వారకాతిరుమల, వేదగణాపాటి), మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకరశర్మ(కొవ్వూరు, సంస్కృత పండితులు), కడిమెళ్ల శ్రీవిరంచి (నరసాపురం, సంస్కృత పండితులు), కెఎన్ ప్రణీత్‌కుమార్, సిహెచ్ కోమలీదేవి(నంది అవార్డు గ్రహీతలు), ఏలూరులోని సెయింట్ థెరిస్సా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ (సామాజిక నాటకంలో బంగారు నందిగ్రహీత)లు ఎంపికయ్యారు.
30 నుండి లక్ష గోపిడకల యజ్ఞం
జంగారెడ్డిగూడెం, మార్చి 26: ఈ నెల 30వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు స్థానిక విద్యావికాస్ కిడ్స్ క్యాంపస్ నందు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆరవ లక్ష గోపిడకల యజ్ఞం నిర్వహిస్తున్నట్టు భారతీయ కిసాన్‌సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కవులూరి పతిరాజు తెలిపారు. భారతీయ కిసాన్ సంఘ్, హైందవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం తులసిమాత, గోమాతలకు లక్ష ప్రదక్షిణలు చేయాలని సంకల్పించినట్టు తెలిపారు. దీనిలో భాగంగా ఆరవ లక్ష గోపిడకల యజ్ఞం నిర్వహిస్తున్నట్టు వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోరుకునే వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. యజ్ఞంలో భాగంగా ప్రతి రోజు గోమాత మహత్మ్యం గురించి ప్రవచనాలు ఉంటాయన్నారు. ఆదివారం కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో హైందవి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అశోక్, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కవులూరి పతిరాజు, నేతలు యర్రావుల బాబూరావు, తిప్పాభొట్ల రామకృష్ణ, కూచిభొట్ల వెంకటరామ సత్యనారాయణ, కొండేపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కోడిపందాలపై పోలీసుల దాడి
జంగారెడ్డిగూడెం, మార్చి 26: స్థానిక ఎస్సీ పేట సమీపంలో ఆదివారం కోడిపందాలు ఆడుతుండగా ఎస్సై ఎం కేశవరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసారు. ఈ దాడిలో కోడిపందాలు ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద 3,200 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.