పశ్చిమగోదావరి

రూ.16వేల కోట్లతో జిల్లా రుణప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 27: జిల్లాలో రానున్న ఆర్ధికసంవత్సరానికి 16559కోట్ల రూపాయల వార్షిక రుణప్రణాళికను అమలుచేయనున్నట్లు కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ తెలిపారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో జిల్లా రుణప్రణాళికను ఆయన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు కూడా బ్యాంకు సేవలు అందించాలని, ప్రతి పల్లెలో బ్యాంకు ప్రతినిధి బ్యాంకు కార్యకలాపాలు సాగించడానికి అనువుగా అవసరమైన షాపును కూడా కేటాయిస్తానని చెప్పారు. జిల్లాలో ప్రతి పల్లెకు బ్యాంకు సౌకర్యం కల్పించాలన్నదే ప్రధాన లక్ష్యమని, ఈవిషయంలో బ్యాంకర్లు చొరవ చూపితే అవసరమైన వౌలిక వసతులను ఉచితంగా కల్పిస్తానని చెప్పారు. జిల్లాలో ప్రాధాన్యతారంగాలకు 14560 కోట్ల రూపాయలను కేటాయించామని, గత ఆర్దిక సంవత్సరంతో పోలిస్తే ఇది 14శాతం అధికమని చెప్పారు. ప్రాధాన్యతేతర రంగాలకు రూ. 2000 కోట్లను కేటాయించామని, వ్యవసాయరంగానికి 6526కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. గత ఏడాది కన్నా ఈసారి 504 కోట్లు అధికంగా అందించనున్నట్లు తెలిపారు. గృహనిర్మాణానికి అధికప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం పేదల కోసం నిర్మించే గృహాలకు 1255.61కోట్ల రూపాయలను కేటాయించాలని రుణప్రణాళికలో బ్యాంకర్లు పొందుపర్చారని తెలిపారు. జిల్లాలో 6.20లక్షల మంది డ్వాక్రా మహిళలు స్వశక్తిపై ప్రగతి సాధించడానికి 62వేల గ్రూపులను ఏర్పాటుచేసుకున్నారని, వారికి రుణప్రణాళికలో 1282కోట్ల రూపాయలు రుణాలు అందించి వారికి చేయూత ఇస్తామని తెలిపారు. జిల్లాలో 2022నాటికి హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమం కింద గృహనిర్మాణానికి అవసరమైన ఆర్దిక చేయూతను బ్యాంకర్లు కల్పిస్తారని, దీనిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో బ్యాంకు సేవలు అందించేందుకు ఒక షాపును కేటాయిస్తామని, అక్కడకు బ్యాంకు ప్రతినిధి వచ్చి ప్రజలకు అవసరమైన నగదును సమకూర్చాలని, లేదా ఎటిఎం కౌంటర్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. జిల్లాలో ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టామని, పల్లెల్లో బ్యాటరీతో నడిచే ఆటోను సబ్సిడీపై లబ్దిదారులకు అందించాలని నిర్ణయించామన్నారు. ఈమేరకు జిల్లాలో 500 ఆటోలకు 5కోట్ల రూపాయల రుణాన్ని బ్యాంకర్లు అందించాలని, అయిదుకోట్ల రూపాయలను వివిధ కార్పోరేషన్‌ల ద్వారా సబ్సిడీగా ఇస్తామని చెప్పారు. జిల్లాలో ప్రవేశపెడుతున్న ఫైబర్‌గ్రిడ్ ఎంఎస్‌ఓలు, ఎల్‌సిఓలకు వ్యాపార అవసరాల నిమిత్తం జిల్లాలో 1400 మందికి వంద కోట్ల రూపాయల రుణసౌకర్యాన్ని కల్పించాలని చెప్పారు. దీనికి బ్యాంకర్లు ఆమోదించి 105కోట్ల రూపాయల రుణాలను అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అలాగే జిల్లాలో నగదు సమస్య తీవ్రమవుతోందని, ఆర్‌బిఐ స్పందించి ఎక్కువ నగదును జిల్లాకు కేటాయించేలా చూడాలని కోరారు. సమావేశంలో ఆర్‌బిఐ ఎజిఎం హరిశంకర్, నాబార్డు ఎజిఎం బివిఎస్ రామప్రభు, ఆంధ్రాబ్యాంకు డిజిఎం కె భాస్కరరావు, డిఆర్‌డిఎ పిడి కె శ్రీనివాసులు, ఎల్‌డిఎం ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎస్‌బిహెచ్ ఎజిఎం తులసీదాస్, ఎస్‌బిఐ ఎజిఎం అప్పారావు, సిండికేట్ బ్యాంకు సీనియర్ బ్యాంక్ మేనేజరు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 2 నుంచి పల్స్‌పోలియో
డిఎం అండ్ హెచ్‌ఒ కోటేశ్వరి
ఏలూరు, మార్చి 27: జిల్లాలో పోలియోవ్యాధిని సమూలంగా నిర్మూలించడానికి ఏప్రిల్ 2వ తేదీ నుండి 4వ తేదీవరకు మూడురోజులపాటు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు డిఎంహెచ్‌ఓ డాక్టరు కె కోటేశ్వరి తెలిపారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం పల్స్‌పోలియో కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులకు ఆమె వివరించారు. జిల్లాలో అయిదుసంవత్సరాలలోపు చిన్నారులు నాలుగులక్షల మంది వరకు ఉన్నారని, వారందరికి పోలియోచుక్కలు పటిష్టవంతంగా అందించేందుకు తగు చర్యలు తీసుకున్నామన్నారు. ఏప్రిల్ 2వ తేదీన జిల్లా అంతటా 3233 పోలియోచుక్కల కేంద్రాలను ఏర్పాటుచేశామని, ఇందుకోసం 13వేల 215మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో డిఆర్వో కట్టా హైమావతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టరు మోహనకృష్ణ, డెమో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నగదురహితంపై డీలర్ల ధ్వజం
కాపాడాలంటూ జెసికి వినతి

ఏలూరు, మార్చి 27: జిల్లాలో రేషన్ దుకాణాల్లో అమలుచేస్తున్న నగదురహిత విధానం ఫలితంగా బ్యాంకు ఛార్జీలతో ఆదాయాన్ని కోల్పోతున్నామంటూ రేషన్‌డీలర్ల సంఘం జిల్లా జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావుకు సోమవారం వినతిపత్రం సమర్పించింది. ఈ కష్టాల నుంచి తమను కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. రేషన్‌దుకాణాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు నగదురహిత విధానాన్ని అమలుచేస్తున్నామని, దీనివల్ల వినియోగదారుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. కొన్ని నెలలుగా నగదురహిత విధానాన్ని విజయవంతం చేసే ఉద్దేశ్యంతో పనిచేస్తున్న మాకు ఆంధ్రాబ్యాంకు వద్ద జీరో బేస్‌డ్ బ్యాంకు ఖాతాలు ఇప్పించారని తెలిపారు. అయితే ఈ ఖాతాలో తగిన నగదు నిల్వలు లేకపోతే ఒకరకమైన ఛార్జీని, అలాగే గత మూడు,నాలుగు నెలలుగా జరిగిన లావాదేవీలను బట్టి సర్‌ఛార్జిల రూపంలో డీలర్‌కు 200 నుంచి మూడువేల రూపాయల వరకు బ్యాంకు ఖాతాల్లో నగదు తగ్గించారని తెలిపారు. డీలర్లకు ఎటిఎం, చెక్‌బుక్ సౌకర్యం కావాలని బ్యాంకును కోరినా ఈవిధానంలో ఆ రెండు ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారని తెలిపారు. పాలకోడేరు మండలంలో కొన్ని షాపుల్లో నాలుగునెలలుగా నగదురహిత లావాదేవీలు నిర్వహించినా డీలర్ ఖాతాలో నగదు జమ అవటం లేదని తెలిపారు. ఈపరిస్దితులను అర్ధం చేసుకుని విధినిర్వహణలో వచ్చే కమిషన్‌పై ఆధారపడి జీవిస్తున్న డీలర్ల కుటుంబాలు బ్యాంకు ఖాతాలు, ఖర్చుల పేరుతో ఎంతో నగదును కోల్పోతున్నారని ఇది అన్యాయమని పేర్కొన్నారు. తక్షణం స్పందించి బ్యాంకు ఇబ్బందులను పరిష్కరించి తమను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు రాజులపాటి గంగాధరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి నరసింహారావు, నాయకులు ఎంవి సుబ్బయ్య, పెరుమాళ్ల సూర్యచంద్రరావు, షేక్ భాషా, చిందా కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
పంటచేలకు నీరందడం లేదని రైతాంగం నిరసన
ధర్నా, నాలుగు గంటలపాటు ప్రధాన రహదారిపైనే బైఠాయింపు..
ఆచంట, మార్చి 27:పంటచేలకు నీరందడం లేదని, పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆచంటకు చెందిన రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సోమవారం మార్టేరు-కోడేరు ప్రధానరహదారికి అడ్డంగా ములపర్రు ఛానల్ వద్ద టెంట్‌వేసి నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా నీరందక ఎండిపోతున్న వరిపంటను తీసుకువచ్చి ప్రదర్శనగా పెట్టారు. గత 15 రోజులు నుండి ములపర్రు ఛానల్‌కు నీరందడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్లువేసి నీరు తోడుకుందామంటే బోర్లద్వారా కూడా నీటి చుక్క రావడంలేదని, తాగడానికి, పశువులకు సైతం నీరందడం లేదన్నారు. తెల్లవార్లు నీటికోసం కాపలాలు కాసినా ప్రయోజనం ఉండడం లేదన్నారు. మండలంలో చాలా ప్రాంతాలకు నీరు బాగానే అందుతుందని, ఈ ఛానల్ పరిధిలో మాత్రం చుక్క నీరు అందడం లేదన్నారు. తాము అందోళన చేస్తామని తెలుసుకున్న అధికారులు ఆదివారం రాత్రి కొద్దిగా నీరు వదిలారని అన్నారు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయామని, సకాలంలో నీరందక పోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతాంగం వాపోయారు. ఇరిగేషన్ ఎఇ, డిఇలు వచ్చి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. కొద్దిసేపటికి వచ్చిన ఇరిగేషన్ ఎఇ శ్రీనివాస్, సిద్ధాంతం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ తమ్మినీడి ప్రసాద్ లపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో రైతులకు నీరందడానికి తమ ప్రయత్నం తాము చేస్తున్నామని, అయితే ఛానల్ చివరి వరకు నీరు వచ్చేందుకు తాము ఏమి చేయాలో మీరే చెప్పండని వారు రైతులను ప్రశ్నించారు.
దొంగరావిపాలెంలో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఉంటే తమకు ఇంత ఇబ్బంది ఉండేది కాదని రైతులు తెలిపారు. సోమవారం రాత్రికి పూర్తిస్థాయిలో నీరు అందిస్తామని ఎఇ శ్రీనివాస్, డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ ప్రసాద్‌లు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. ధర్నాలో రైతుసంఘం నాయకులు నెక్కంటి కృష్ణ, సజ్జారామారావు, గొడవర్తి చంద్రశేఖర్, తాళ్ళూరి అంజయ్య, గుడాల శ్రీరాములు, నెక్కంటి ఆదినారాయణ, గొడవర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పత్వరలో అన్ని బిల్లులూ చెల్లించేలా కృషి
కలెక్టరు భాస్కర్
ఏలూరు, మార్చి 27: జిల్లాలో ప్రభుత్వ శాఖలకు కేటాయించిన బడ్జెట్‌లు అన్నీ ఈనెలాఖరులోగా ఖర్చు చేయాలని, ట్రజరీలో తాత్కాలిక ఆంక్షలు ఉన్నప్పటికీ అందరికీ టోకెన్లు జారీ చేయాలని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ట్రజరీ ఉపసంచాలకులు లలితను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం ట్రజరీలో బిల్లులు తీసుకోవటం లేదని పలువురు అధికారులు కలెక్టరు దృష్టికి తీసుకురాగా ట్రజరీస్ డైరెక్టరుతో తాను మాట్లాడతానని త్వరలోనే అన్ని బిల్లులూ చెల్లింపు జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. ఈలోగా వివిధ ప్రభుత్వశాఖలు సమర్పించే అన్ని బిల్లులను స్వీకరించి టోకెన్లు జారీ చేయాలని కలెక్టరు చెప్పారు. పే అండ్ అకౌంట్స్ అధికారులు కూడా కార్యాలయంలో రాబోయే నాలుగురోజులు అందుబాటులో ఉండాలని, అన్నీ బిల్లులు చెల్లింపు జరిగేలా శ్రద్దవహించాలని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వందలాది కోట్ల రూపాయలు బిల్లులను సమర్పించటం జరిగిందని, ఈవిషయమై అర్ధికశాఖాధికారులతో సంప్రదించి అవసరమైన నిధులు విడుదల చేయిస్తానని కలెక్టరు చెప్పారు.

తుందుర్రులో ముట్టడికి సిపిఎం విఫలయత్నం

భీమవరం, మార్చి 27: సిపిఎం తన ఉనికిని కాపాడుకోవడానికి భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కుపై సోమవారం ముట్టడించే ప్రయత్నం చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ముట్టడిని మరోసారి పోలీసులు భగ్నం చేశారు. సిపిఎం నాయకులు బి బలరాం, గోపాలం, ముచ్చర్ల త్రిమూర్తులు, ఆరేటి వాసు తదితర సిపిఎం నాయకులు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా నినాదాలుచేసి ఆందోళనకు దిగడంతో వారిని, మరి కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం తుందుర్రు పరిసర గ్రామాల్లో సిపిఎం నాయకులు, కార్యకర్తలు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణాన్ని నిలిపివేయాలని నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. అనంతరం ముట్టడించేందుకు ప్రయత్నించడంతో మహిళా పోలీసులు మహిళా సిపిఎం కార్యకర్తలను, మహిళలను తదితరులను అడ్డుకున్నారు. పోలీసులు అదుపులో తీసుకున్న వారిని నరసాపురం, రూరల్, మొగల్తూరు పోలీసు స్టేషన్లకు తరలించారు. కాగా భీమవరం పట్టణంలోని ప్రకాశం చౌక్ సెంటర్‌లోని సిపిఎం అరెస్టులను నిరసిస్తూ ఆందోళన చేశారు. వీరితోపాటు భీమవరం నియోజకవర్గ వైసిపి కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఒక ప్రకటనలో తెలిపారు.
ఆటోనగర్, పాలిటెక్నిక్ కళాశాలలకు భూములు కేటాయింపు

తాడేపల్లిగూడెం, మార్చి 27 :దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తాడేపల్లిగూడెం ఆటోనగర్ స్థల సమస్య పరిష్కారమైంది. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కృషితో ఆటోనగర్ నిర్మాణానికి 20 ఎకరాలు, కొండ్రుప్రోలు రెవెన్యూ గ్రామ పరిధిలో కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, వౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ( ఏపి ఐ ఐ సి) అభివృద్ధి చేయనున్నది. అదే విధంగా సొంత భవనాలు లేని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిమిత్తం విమానాశ్రయ భూమిలో ఐదెకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జెసి శర్మ సోమవారం జీవో జారీ చేశారు.
రహదారుల నిర్మాణానికి రూ.49కోట్లు కేంద్రం నిధులు
నియోజకవర్గ పరిధిలో రహదారుల అభివృద్ధికి రూ.49 కోట్లు కేంద్రం నిధులు మంజూరయ్యాయి. పెంటపాడు - వరదరాజుపురం రహదారి నిర్మాణానికి రూ.12 కోట్లు, పెదతాడేపల్లి - అనంతపల్లి రహదారి నిర్మాణానికి రూ.25 కోట్లు, తాడేపల్లిగూడెం - అప్పారావుపేట రహదారి నిర్మాణానికి కేంద్ర రహదారుల అభివృద్ధి నిధులు మంజూరు చేశారు.
ఆన్‌లైన్ మోసంపై ఫిర్యాదు
ఏలూరు, మార్చి 27: ఒక మహిళను ఆన్‌లైన్ ద్వారా విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి విడతల వారీగా లక్షా 65వేల రూపాయలు దండుకున్న వ్యక్తిపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ నిడమనూరుకు చెందిన ముసునూరు నాగలక్ష్మిని ఏలూరుకు చెందిన గుడిపూడి చక్రవర్తి అనే వ్యక్తి తనకు పలు మార్కెటింగ్ సంస్ధలున్నాయని, అగరుబత్తీ బిజినెస్ కూడా ఉందని, విదేశాల్లో సైతం ఉద్యోగాలు కూడా ఇప్పిస్తానంటూ రెండువిడతలుగా ఆన్‌లైన్ ద్వారానే లక్షా 65వేల రూపాయలు తీసుకున్నాడు. ఈవిషయమై పలుమార్లు నాగలక్ష్మి ఫోన్ చేసి ఉద్యోగం, డబ్బు విషయమై అడగటంతో ఆమెను బెదిరించటం ప్రారంభించాడు. దీంతో నాగలక్ష్మి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పూర్తి స్థాయిలో నీటి పంపిణీకి చర్యలు: ఆర్డీవో
అత్తిలి, మార్చి 27 :సాగు నీటి సమస్య ఉన్న ప్రాంతానికి ప్రస్తుతం వంతులో పూర్తి స్థాయిలో నీటి పంపిణీ చేస్తున్నట్టు కొవ్వూరు ఆర్డీవో వి శ్రీనివాసరావు తెలిపారు. అత్తిలి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నీటి పారుదల శాఖ, సాగు నీటి సంఘాల సభ్యులతో సాగు నీటి పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఏ ఒక్క ఎకరం ఎండకుండా సాగు నీటిని పంపిణీ చేస్తున్నామన్నారు. సాగు నీటి సరఫరాపై ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలన్నారు. ఈడూరు, మంచిలి, కొమ్మర, తిరుపతిపురం, బొంతువారిపాలెం తదితర ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉన్నట్టు గుర్తించి పరిష్కరించినట్లు తెలిపారు. తిరుపతిపురం, ఉనికిలి, ఆరవల్లి, బొంతువారిపాలెం గ్రామాల్లో పర్యటించి తాగునీటి ఎద్దడి ప్రాంతాలను పరిశీలించారు. ఆయన వెంట నీటి పంపిణీ కమిటి చైర్మన్ నల్లూరి చిన్ని, నీటి సంఘం అధ్యక్షులు రాజశేఖర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యేశ్వర రాజు, ఎంపిపి కేతా సత్యనారాయణ, నీటి పారుదల శాఖ డి ఇ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ కాలనీల్లో వౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర పణాళిక
అధికారులకు కలెక్టర్ భాస్కర్ ఆదేశం
ఏలూరు, మార్చి 27: జిల్లాలో 2017-18 ఆర్దికసంవత్సరంలో అన్ని ఎస్సీ కాలనీలలో వౌలిక సదుపాయాలు కల్పించడానికి సమగ్ర ప్రణాళికను సిద్దం చేయాలని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఎస్సీ కాలనీల్లో అన్ని వౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక సిద్దం చేస్తే ఏప్రిల్ మొదటివారంలో ఎస్సీ సబ్‌ప్లాన్‌పై ప్రత్యేక సమావేశాన్ని నిర్ణయించి అవసరమైన నిధులను ప్రభుత్వం నుండి రాబడతామన్నారు. చంద్రన్న బీమా పధకం కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో జూన్ నెలాఖరునాటికి ఫైబర్‌గ్రిడ్ ద్వారా ఇంటింటికి కేబుల్,ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. జిల్లాలో ఎలక్ట్రానిక్ పాలనా విధానాన్ని మరింత సమర్ధవంతంగా అమలుచేస్తామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, జెసి-2 ఎంహెచ్ షరీఫ్, డిఆర్వో కె హైమావతి, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, డ్వామా పిడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం వౌనప్రదర్శన
ఏలూరు, మార్చి 27: జిల్లాలోని తుందుర్రులో స్ధానికుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ స్ధానిక పవరుపేట సిపిఎం కార్యాలయం నుంచి వసంతమహల్ సెంటరు వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు నోటికి నల్లరిబ్బన్‌లు కట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ నేత మంతెన సీతారాం మాట్లాడుతూ తుందుర్రులో నిర్మిస్తున్న అక్వా మెగా ఫుడ్‌పార్కును వ్యతిరేకిస్తూ మూడేళ్లుగా ఆ ప్రాంతంలో ప్రజలు పోరాడుతున్నారని చెప్పారు. ఈనేపధ్యంలో తుందుర్రు ప్రాంతంలో ఫుడ్‌పార్కు వ్యతిరేక పోరాటకమిటీ నాయకులను, ప్రజలను వారికి మద్దతు తెలుపుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరామ్, ఇతర నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. పర్యావరణవేత్తలు ఫుడ్‌పార్కు నిర్మాణం వల్ల పర్యావరణానికి హానికలుగుతుందని, భవిష్యత్‌లో ఈప్రాంత ప్రజల తాగు,సాగునీరు కలుషితం అవుతుందని చెపుతున్నారన్నారు. అయినప్పటికీ యాజమాన్యం మొండిగా నిర్మాణం కొనసాగించటం సరికాదన్నారు. ఉన్న పరిస్దితిని ప్రభుత్వం, యాజమాన్యం దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బి సోమయ్య, పి కిషోర్, కె శ్రీనివాస్, పి రవికుమార్, జె సత్యనారాయణ, పి ఆదిశేషు, పివి రామకృష్ణ, డి శివకుమార్, బి జగన్నాధం, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
తణుకు 3వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా గుబ్బల
తణుకు, మార్చి 27: తణుకు 3వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా గుబ్బల నాగలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాసరావు సోమవారం ప్రకటించారు. ఈ వార్డు కౌన్సిలర్ గుబ్బల రామారావు మృతిచెందడంతో వచ్చే నెల 9న జరగబోయే వార్డు ఉప ఎన్నికకు నాగలక్ష్మితోపాటు ఆరుగురు నామినేషన్లు వేశారు. అయితే అయిదుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగలక్ష్మి కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కమిషనర్ తెలిపారు. అనంతరం ఆమె టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా నాగలక్ష్మిని మున్సిపల్ ఛైర్మన్ పరిమి వెంకన్నబాబు, మాజీ ఛైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, వైస్ ఛైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, పట్టణ టిడిపి అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ, టిడిపి ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతీరావులు అభినందించారు.