పశ్చిమగోదావరి

డ్వాక్రా గ్రూపుల బలోపేతానికి ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 28: లాభాల బాటలో డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేయడానికి వ్యాపార రంగంవైపు మహిళలు ముందడుగు వేయడానికి ఒక ప్రణాళికను అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక టిటిడిసిలో మంగళవారం 80 లక్షల రూపాయల వ్యయంతో తణుకు, నల్లజర్ల మండల సమాఖ్యలు కొనుగోలు చేసిన మినీ ఆధునిక ప్రొక్లెయినరు, రోలర్ యంత్రాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డ్వాక్రా మహిళలు ఆర్ధికంగా బలోపేతం కావాలనే ఉద్దేశ్యంతో మండల సమాఖ్యల ఆధ్వర్యంలో చిన్న తరహా వ్యాపారాలను చేపట్టేలా తగు చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో ప్రతీ మండలంలో ఉత్పత్తిని పెంచే పలు యూనిట్లను స్థాపించడానికి డ్వాక్రా మహిళలకు వివిధ వృత్తుల్లో శిక్షణ కూడా అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే డ్వాక్రా మహిళలు ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోలులో కీలకపాత్ర పోషిస్తున్నారని కేవలం 6 నెలల వ్యవధిలో 20 కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించి దేశానికే పశ్చిమ డ్వాక్రా మహిళలు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. జిల్లాలో 62 వేల డ్వాక్రా గ్రూపులలో 6.20 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని ప్రతీ ఏటా వెయ్యి కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా డ్వాక్రా మహిళలకు బ్యాంకర్లు రుణాలు అందిస్తున్నారని ఆ డబ్బుతో ఉత్పత్తి ఆధార పరిశ్రమల స్థాపన వైపు డ్వాక్రా మహిళలు ముందడుగు వేసేలా తొలి ప్రయత్నంగా మినీ ఆధునిక యంత్రాలను కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చే నూతన వ్యాపారాన్ని మహిళా సమాఖ్యలు చేపట్టి లాభాల బాటలో అడుగులు వేస్తున్నారని ఇటువంటి స్థితిలో వారిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో 2017-18 ఆర్ధిక సంవత్సరంలో డ్వాక్రా మహిళలకు 1282 కోట్ల రూపాయలు రుణాలను అందించి మహిళల ఆర్ధిక పురోభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. జిల్లాలోని 909 గ్రామ పంచాయితీలకు మినీ ప్రొక్లెయినర్లు, రోలర్లు అద్దె ప్రాతిపదికపై ఇవ్వడానికి డ్వాక్రా మహిళలను ప్రోత్సహించినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటికే ఉండి, పాలకోడేరు, ఆకివీడు, కాళ్ల మండలాల్లో డ్వాక్రా సమైక్యల ఆధ్వర్యంలో ఈ ఆధునిక యంత్రాలను కొనుగోలు చేయించి వ్యాపార రంగంలో లాభాల బాట పట్టారని చెప్పారు. నల్లజర్ల, తణుకు మండల సమైక్యల ఆధ్వర్యంలో నేడు రెండు ఆధునిక యంత్రాలు ప్రారంభించామని వీటి పనితీరును, డ్వాక్రా సమాఖ్యలకు వస్తున్న లాభాలను బేరీజువేసి త్వరలోనే మిగిలిన 42 మండలాల్లో కూడా డ్వాక్రా సమైక్యలు వ్యాపార రంగంలో ముందడుగు వేసేలా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పల్లెల్లో బహుళ ప్రయోజనాలుపొందేలా ఈ మినీ ఆధునిక యంత్రాలను గ్రామ పంచాయితీలు సద్వినియోగం చేసుకునేలా పంచాయితీ సర్పంచ్‌లు, ఎంపిడివోలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం డ్వాక్రా మహిళలు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు, విస్తర్లు, కుట్టు మిషన్లు, పచ్చళ్ల తయారీ, చిరుతినుబండారాల తయారీపై మాత్రమే దృష్టి కేం ద్రీకరించారిన, డ్వాక్రా మహిళలు పారిశ్రామిక రంగం వైపు కూడా శ్రద్ధ వహించాలని కోరారు. డి ఆర్‌డి ఎ పిడి కె శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యాపార రంగంలో అనుసరించాల్సిన విధానాలపై డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించడం కూడా జరుగుతుందని చెప్పారు. బహుళ ప్రయోజనాలు చేకూర్చే ఈ ఆధునిక యంత్రాల వినియోగం వల్ల అటు పల్లెల్లో ప్రగతి, ఇటు డ్వాక్రా మహిళల్లో ఆర్ధిక అభివృద్ధి కనిపిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో తణుకు మహిళా సమైక్య అధ్యక్షురాలు బి సునీత, శ్యామసుందరీ మాణిక్యం, లక్ష్మి, నల్లజర్ల మహిళా సమైక్య అధ్యక్షురాలు సత్యవతి, అనంతలక్ష్మి, డి ఆర్‌డి ఏ ప్రాజెక్టు మేనేజరు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

చినవెంకన్న ఆలయంలో విస్తృత తనిఖీలు
ద్వారకాతిరుమల, మార్చి 28: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో మంగళవారం డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఆలయ భద్రతలో భాగంగా అన్ని ప్రధాన కూడళ్లు, దర్శన, ప్రసాద కౌంటర్ల వద్ద, ఆళ్వార్ల ఆలయాలు, మండపాల వద్ద పలు విభాగాల్లో ఈ బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేశాయి. డాగ్ లిజితోపాటు హేండ్లర్ ప్రసాద్, కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం తదితరులు భక్తులు సంచరించే అన్ని ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ప్రతీ విద్యార్థి ఆదికవి నన్నయ కావాలి
-నన్నయ వర్శిటీ విసి ముత్యాలనాయుడు

భీమవరం, మార్చి 28: సమాజం ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్ని గుర్తించాలని ఆదికవి నన్నయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం ముత్యాలనాయుడు అన్నారు. స్థానిక డిఎన్నార్ కళాశాలలో మంగళవారం గ్రాడ్యుయేషన్ డే (పట్ట్భద్రుల దినోత్సవం)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశేషమైన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన ఆదికవి నన్నయ పేరుతోనే ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం స్థాపించబడిందని, ఆ విశ్వవిద్యాలయం, దాని అనుబంద సంస్థల్లో చదివిన విద్యార్థులంతా నన్నయ స్థాయికి చేరుకోవాలని అభిలషించారు. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గోకరాజు వెంకట నరసింహరాజు, పాలకవర్గ సెక్రటరీ, కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) మాట్లాడుతూ తమ కళాశాల నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందిస్తుందన్నారు. అనంతరం కళాశాలలో గతంలో డిగ్రీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు విసి ముత్యాలునాయుడు చేతులమీదుగా డిగ్రీ సర్ట్ఫికెట్లను అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి రామకృష్ణరాజు, సహాయ కార్యదర్శి సిహెచ్ సుబ్రహ్మణ్యంరాజు, కోశాధికారి వి రామకృష్ణరాజు, పాలకవర్గ సభ్యులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తుందుర్రులో రాజకీయ సందడి
ఒకే రోజు వైసిపి, సిపిఎం, కాంగ్రెస్ నేతల పర్యటనలు

భీమవరం, మార్చి 28: వివాదాస్పదంగా మారిన గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణ ప్రాంత గ్రామాల్లో మంగళవారం రాజకీయ సందడి నెలకొంది. ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వైసిపి, సిపిఎం, కాంగ్రెస్ నేతల పర్యటనలతో ఈ ప్రాంతం సందడిగా మారింది. మరోపక్క ఫుడ్ పార్కుకు అండగా ఉంటామనిదళిత, ప్రజా సంఘాలు ప్రతినబూనాయి. పార్కు నిర్మాణం పూర్తిచేయడమే కాకుండా ప్రారంభించేంత వరకు అండగా ఉంటామని ప్రకటించాయ. మంగళవారం సిపిఎం, సిఐటియు, సిపిఐ నాయకులు ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటుచేసుకున్నారు. బి బలరాం, గోపాలన్‌లు అరెస్టుచేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తుందుర్రు పరిసర గ్రామాల్లో పర్యటించారు. మహిళలతో ఫుడ్‌పార్కు అంశంపై చర్చించారు. ఇక వైసిపి ఎమ్మెల్సీ ఆళ్ల నాని భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌తో కలిసి మంగళవారం తుందుర్రు పరిసర గ్రామాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. 144 సెక్షన్ ఎత్తివేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట గ్రంధి శ్రీనివాస్, సిపిఎం నాయకులు బి బలరాం, గోపాలన్, వైసిపి కౌన్సిలర్లు భూసారపు సాయి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు విషయంలో ఆది నుంచి అధికార టిడిపి, బిజెపిలు వౌనంగానే ఉన్నాయి. ఆయా రాజకీయ పార్టీలు గ్రామాల్లో పర్యటిస్తున్నా.. వీరు మాత్రం యధావిధిగా వౌనంగానే ఉండటం విశేషం.

పునర్విభజన జరిగితే జంగారెడ్డిగూడెం నియోజకవర్గం
జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో మూడు కొత్త నియోజకవర్గాలు వస్తాయని అంచనా
జంగారెడ్డిగూడెం, మార్చి 28: రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన దాదాపు ఖాయం కావడంతో జంగారెడ్డిగూడెం నియోజకవర్గం అవుతుందని రాజకీయ నిపుణుల అంచనా. పునర్విభజన జరిగితే రానున్న 2019 ఎన్నికలకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225కు పెరుగుతాయి. రాష్ట్ర జనాభాను పెరగనున్న నియోజకవర్గాల సంఖ్యతో భాగిస్తే వచ్చే జనాభాతో ఒక్కో నియోజకవర్గం ఏర్పాటవుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4,93,86,799. 2011 జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కావడంతో ఈసారి నియోజకవర్గాల పునర్విభజనలో ఈ లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటారు. దీని ప్రకారం ప్రతి 2,19,497 మంది జనాభాకు ఒక నియోజకవర్గం ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ జనాభాకు పది శాతం అదనం కావచ్చు లేక తగ్గవచ్చు. ఈ ప్రకారం చూస్తే జిల్లాకు కచ్చితంగా మూడు నియోజకవర్గాలు అదనంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా జనాభా 39,36,966. నియోజకవర్గానికి ఉండాల్సిన జనాభాతో భాగిస్తే జిల్లాలో 18 నియోజకవర్గాలు అవుతాయి. ప్రస్తుతం 15 ఉన్నాయి. దీనితో అదనంగా వచ్చే మూడు నియోజకవర్గాలు ఏమిటన్నది పార్టీలలోను, నాయకుల్లోను చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గత నియోజకవర్గ పునర్విభజన కమిటీ పాటించిన నిబంధనల మేరకు రెవెన్యూ డివిజన్ కేంద్రం, మున్సిపల్ కేంద్రం శాసనసభ నియోజకవర్గ కేంద్రాలు అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో 82 రెవెన్యూ డివిజన్లు ఉండగా, 81 రెవెన్యూ డివిజన్లు నియోజకవర్గ కేంద్రాలు అయ్యాయి, ఒక్క జంగారెడ్డిగూడెం తప్ప. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ 2003లో అయ్యింది. నియోజకవర్గ పునర్విభజన కమిటీ 2006లో ఏర్పాటయ్యింది. పునర్విభజన కమిటీకి జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ కేంద్రం అనే ఖచ్చితమైన పత్రం ప్రభుత్వం నుండి అందకపోవడంతో ఇదొక్కటి మిగిలిపోయింది. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో ఎల్లవరం నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికన రంపచోడరంగా మార్చివేశారు. పైగా మున్సిపాలిటీలను కూడా నియోజకవర్గాలు చేశారు. జిల్లాలో అప్పట్లో నిడదవోలు మున్సిపాలిటీ కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేది. నియోజకవర్గ పునర్విభజనలో నిడదవోలు నియోజకవర్గం చేశారు. ఇప్పుడు జంగారెడ్డిగూడెంకు అటువంటి సమస్యలు లేవు. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ కేంద్రమే కాకుండా మున్సిపాలిటీ కూడా అయ్యింది. జనాభా కూడా కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీలకంటే అధికంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 48,994. ప్రస్తుత జనాభా మరో 15 వేలు దాటి ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా, లేక రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చూసినా, లేక మున్సిపాలిటీగా చూసినా జంగారెడ్డిగూడెం నియోజకవర్గం అవ్వాల్సిందే. నియోజకవర్గ పునర్విభజన కమిటీ గత నిబంధనలు పాటిస్తే తప్పకుండా జంగారెడ్డిగూడెం నియోజకవర్గం అవుతుంది. ప్రస్తుతం జిల్లాలో మండలాల పునర్విభజన కూడా జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణం అర్బన్ మండలం అయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా (అర్బన్ మండల జనాభా) 48,994 కాగా, రూరల్ మండల జనాభా 60,820. వెరశి 1,09,814 మంది జనాభా. ఈ రెండు మండలాలకు పక్కనే ఉన్న కొయ్యలగూడెం మండలం కలిపితే ఒక నియోజకవర్గం ఏర్పాటు చేయవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కొయ్యలగూడెం మండల జనాభా 75,694. తాజా నిబంధనల మేరకు నియోజకవర్గ ఏర్పాటుకు ఈ జనాభా సరిపోతారు. నియోజకవర్గ పునర్విభజనలో కొత్తగా జిల్లాలో కలసిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను పోలవరం నియోజకవర్గంలో కలపాల్సి ఉంది. వాటిని కలిపితే ప్రస్తుతం పోలవరం నియోజకవర్గంలో ఉన్న కొయ్యలగూడెం మైదాన మండలం తొలగించాల్సి వస్తుంది. దీనితో పాటు టి నరసాపురం కూడా తొలగించాల్సి వస్తుంది. జంగారెడ్డిగూడెం నియోకవర్గం ఏర్పాటు అయితే చింతలపూడి నియోజకవర్గంలో టి.నరసాపురం మండలం చేర్చివేయవచ్చు. అప్పుడు చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, టి.నరసాపురం మండలాలు ఉంటాయి. పోలవరం నియోజకవర్గంలో పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడు మండలాలు ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కుకునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు దాదాపుగా జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో కలసిపోక తప్పదు. కావున భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకున్నా ఈ మండలాలు పోలవరంలో చేర్చవలసి ఉంటుంది. ఇక కొత్తగా ఏర్పడే జంగారెడ్డిగూడెం నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం అర్బన్, రూరల్ మండలాలు, కొయ్యలగూడెం మండలం ఉంటుంది. కాగా జిల్లాలో మెట్ట ప్రాంతంలోనే రెండు నియోజకవర్గాలు పెంచాల్సిన పరిస్థితి వస్తే ద్వారకాతిరుమల కేంద్రంగా మరో నియోజకవర్గం రావచ్చు. లేకుంటే డెల్టా ప్రాంతంలో అత్తిలి, పెనుగొండ పాత నియోజకవర్గాలు రావచ్చునని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.

మంచినీటి పథకాలకు విద్యుత్ షాక్
బిల్లులు చెల్లించలేక మూత
భీమడోలు, మార్చి 28: మైనర్ పంచాయితీలకు విద్యుత్ బిల్లుల చెల్లింపులు భారంగా మారడంతో గ్రామాల్లో ఇతర పనులను చేపట్టేందుకు నిధులు చాలక మైనర్ పంచాయితీల్లో పాలకవర్గ సభ్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాల్లో మంచినీరు అందించేందుకై ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్లకు వినియోగిస్తున్న విద్యుత్తు కేటగిరి -2 కింద నమోదు కావడంతో విద్యుత్ ఛార్జీలు కమర్షియల్‌గా నమోదై బిల్లులు అధికంగా వస్తున్నాయని గ్రామసర్పంచ్‌లు, కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని పలు ఆర్‌వో ప్లాంట్లు ఇప్పటికే ఈ సమస్యతో మూతపడ్డాయి. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మైనర్ పంచాయితీల సర్పంచ్‌లు, అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడం జరిగింది. గ్రామాల్లో మోటార్లకు, వీధి లైట్లకు పలు సర్వీసులు ఉంటున్నాయి. ఒక్కొక్క సర్వీసు నుంచి ఒక్కొక్క రేటుతో విద్యుత్ బిల్లులు వస్తుండటంతో పంచాయితీలకు కేటాయించబడిన నిధులు ఈ బిల్లులు చెల్లించేందుకే సరిపోతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం వుండటం లేదని మైనర్ పంచాయితీ అయిన కోడూరుపాడు గ్రామ సర్పంచ్ గంజి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనర్ పంచాయితీ అయిన కోడూరుపాడులో 90 శాతం ఎస్‌సిలో వున్నప్పటికీ ఆ గ్రామానికి ఎటువంటి రాయితీలు ఇవ్వడం లేదంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మైనర్ పంచాయితీలు అయిన దుద్దేపూడి, పొలసానపల్లి తదితర గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, ఆ గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మైనర్ పంచాయతీలకు రాయతీలివ్వాలి
మైనర్ పంచాయితీలకు విద్యుత్తు బిల్లుల టారీఫ్‌లను తగ్గించి పలు రాయితీలు ఇవ్వాలంటూ సర్పంచ్‌లు విజ్ఞప్తులు చేస్తున్నారు. కోడూరుపాడు గ్రామంలో 1227 మంది జనాభా వున్నారని, గ్రామానికి వస్తున్న నిధులలో 80 శాతం నిధులను కేవలం విద్యుత్ బిల్లులు చెల్లించేందుకే వినియోగించాల్సి రావడం పట్ల ఆ గ్రామ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుద్దేపూడి పంచాయితీలో కూడా అదే పరిస్థితి నెలకొందని సర్పంచ్ అనే్న వీరరాఘవులు తెలిపారు. తమ గ్రామాలకు విద్యుత్ బిల్లుల్లో రాయితీలు ఇప్పించాలంటూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాగా తీర్మానాలు చేసి పంపాలని వారు స్పష్టం చేశారన్నారు. ఇన్‌ఛార్జి ఎంపిడివో మురళీకృష్ణను వివరణ కోరగా మైనర్ పంచాయితీల్లో విద్యుత్ బిల్లుల విషయంలో తేడాలు వున్న విషయం నిజమేనని ఆ గ్రామ సర్పంచ్‌లు పంచాయితీల్లో తీర్మానాలు చేసి తమకు అందజేసినట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపామన్నారు.

కౌన్సిల్‌పై విమర్శలు సరికాదు
మంత్రి మాణిక్యాలరావుపై గూడెం మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి ధ్వజం

తాడేపల్లిగూడెం, మార్చి 28: అవినీతి లేని పాలన అందిస్తూ మున్సిపాల్టీ అభివృద్ధికి కృషిచేస్తున్న కౌన్సిల్ సహకరించడంలేదని మంత్రి మాణిక్యాలరావు విమర్శించడం సరికాదని మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మాగంటి సీతారామదాసు కల్యాణ మండపంలో అభివృద్ధికై సలహా సంఘ సమావేశం నిర్వహించారు. మూడేళ్లల్లో మున్సిపాల్టీలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి విజయానికి మున్సిపల్ కౌన్సిలర్లు, టిడిపి కార్యకర్తలు ఎంతో కృషి చేశారన్నారు. తెలుగుదేశం పార్టీని, కౌన్సిల్‌ను మంత్రి విమర్శిస్తున్నారన్నారు. కౌన్సిల్ ఏం సహకరించలేదో మంత్రి తెలపాలన్నారు. మంత్రితో తమకు గొడవల్లేవని, పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. మిత్రపక్షాన్ని విమర్శించాల్సిన అవసరం తమకు లేదన్నారు. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ తమకు పెద్ద మంత్రి మాణిక్యాలరావు అని, విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రజల్లో, మీడియాలో చులకన అవుతున్నామన్నారు. అభివృద్ధి విషయంలో పది మెట్లు దిగి సహకరిస్తామన్నారు. ప్రజాసహకారంతోను, లక్షల రూపాయల విరాళాలతో ఎల్‌ఇడి బల్బులు ఏర్పాటుచేయడంతో పాటు మున్సిపాల్టీకి విద్యుత్ ఆదా చేసిన మున్సిపల్ కౌన్సిల్, ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అభినందనీయులన్నారు. ప్రశ్నించే అధికారం ఓట్లువేసి గెలిపించిన ప్రజలకు ఉందన్నారు. పరిపాలనా వ్యవస్థలో ప్రజాప్రతినిధుల మధ్య సహకారం అవసరమన్నారు. ఎక్కడా లేని సమస్య తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రాజీలేని పోరాటం చేస్తామన్నారు. మంత్రి, మున్సిపల్ చైర్మన్ కలిసి అభివృద్ధి సమావేశాలు నిర్వహించాలన్నారు. జడ్పీ హైస్కూలులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నించారు. ఎవరి కోసం ఉద్యమం చేస్తున్నారని ప్రశ్నించారు. జడ్పీ హైస్కూలులో జూనియర్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. దూసనపూడి సోమసుందర్, మున్సిపల్ మాజీ ఛైర్మన్లు దేవతి పద్మావతి, కరణం అప్పారావు, ఈతకోట తాతాజీ, వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తి తదితరులు మాట్లాడారు. సమావేశంలో ఎఎంసి ఛైర్మన్ పాతూరి రామ్‌ప్రసాద్ చౌదరి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కిలాడి ప్రసాద్, మాజీ వైస్ ఛైర్మన్ గొర్రెల శ్రీ్ధర్, గమిని సుబ్బారావు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వబిలిశెట్టి నటరాజు, బత్తుల ప్రసాద్, బొలిశెట్టి రాజేష్‌లు పాల్గొన్నారు.

దాతలు కూడా సహకరిస్తేనే అభివృద్ధి
కొప్పాక జడ్పీ హైస్కూలుకు కెనరా బ్యాంకు సాయంతో బెంచీలు అందించిన చింతమనేని
పెదవేగి, మార్చి 28: ప్రభుత్వం అందిస్తున్న సహాయంతోపాటు దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధికి సహకరిస్తే అన్ని రంగాల్లో ముందడుగు పడుతుందని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. పెదవేగి మండలం కొప్పాకలోని జడ్పీ హైస్కూల్‌కు మూడు లక్షల రూపాయలు విలువ చేసే బెంచీలను కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ పి సాయిబాబా ఆధ్వర్యంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రభాకర్ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పిల్లలకు వౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఈ విషయంలో బ్యాంకులతోపాటు దాతలు కూడా ముందుకు వస్తే మరింత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఖాతాదారుల సేవలో ముందంజలో వున్న కెనరా బ్యాంకు సామాజిక సేవలో కూడా పాలుపంచుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. కెనరా బ్యాంకు జనరల్ మేనేజర్ పి సాయిబాబా మాట్లాడుతూ పాఠశాలల్లోని విద్యార్ధులు చక్కటి వాతావరణంలో మంచి విద్యను అభ్యసించేందుకు వీలుగా తమ బ్యాంకు ఆధ్వర్యంలో బెంచీలు అందజేసినట్లు వివరించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ బ్యాంకు చురుకైన పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, ఎంపిపి బక్కయ్య, ఎంపిడివో శ్రీనివాసరావు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సబ్-ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికైన మహిళా కానిస్టేబుల్
నల్లజర్ల, మార్చి 28: నల్లజర్ల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఊబా జ్యోతి ఇటీవల నిర్వహించిన ఎస్సై ఎంపిక పరీక్షల్లో అర్హత సాధించారు. దేవరపల్లి మండలం త్యాజంపూడికి చెందిన జ్యోతి మూడేళ్లుగా అనంతపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉన్నతోద్యోగిగా పనిచేయాలనే లక్ష్యంతో ఉన్న ఆమె మొదటిసారిగా కానిస్టేబుల్ ఎంపికలకు హాజరై ఎంపికయ్యారు. తర్వాత ఎస్సైగా లక్ష్యాన్ని సాధించారు. గ్రూపు-1లో ఉత్తీర్ణురాలై డిఎస్పీగా ఎంపికవ్వాలనేది తన లక్ష్యమని జ్యోతి పేర్కొన్నారు.

ఆంధ్రాబ్యాంకు ట్రైనింగ్ సెంటర్ పనుల పరిశీలన
ఏలూరు, మార్చి 28: సత్రంపాడు టిటిడిసి పక్కన రూ.50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఆంధ్రాబ్యాంకు ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ మంగళవారం పరిశీలించారు. ఆంధ్రాబ్యాంకు వివిధ వృత్తుల్లో యువతకు అందించే శిక్షణా కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించడానికి అనువుగా ఈ భవనం రూపుదిద్దుకుంటుందని చెప్పారు. నిరుద్యోగ యువత ఖాళీగా ఉండకుండా వివిధ వృత్తుల్లో శిక్షణ పొంది స్వశక్తిపై ఆర్ధిక ప్రగతి సాధించే స్థాయికి ఎదగాలని ప్రతీ మనిషీ కష్టపడితే అవకాశాలు లభిస్తాయని ముఖ్యంగా వృత్తుల్లో నైపుణ్యం సాధించి ఆయా రంగాలవైపు దృష్టి కేంద్రీకరిస్తే అభివృద్ధి సాధించడం ఎంతో సులువని ఆయన చెప్పారు. త్వరలోనే ఆంధ్రాబ్యాంకు శిక్షణా సెంటర్ భవనం ప్రారంభించి వివిధ శిక్షణా కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించడానికి అనువుగా ఈ భవనాన్ని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.

అసైన్డ్ భూముల సర్వేలో వివాదాలు
వేలేరుపాడు, మార్చి 28: వేలేరుపాడు మండలంలో పోలవరం భూసేకరణలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న అసైన్డ్ భూముల సర్వేలో పలు వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో బాధిత రైతులు మంగళవారం తహసీల్దారు శ్రీనివాస్‌ను ఆశ్రయించారు. మండల కేంద్రమైన వేలేరుపాడులోని వేపాకగొమ్ము రెవెన్యూ పరిధిలో 192 సర్వే నంబర్‌లో గత 40 సంవత్సరాలుగా వారసత్వంగా సాగు చేసుకుంటున్న భూమిని సంబంధంలేని వారు వచ్చి అడ్డుకున్నారని ఎస్‌కె నజీర్ అనే రైతు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కట్కూరు పంచాయతీలో తన అయిదున్నర ఎకరాల భూమిని మరెవరికో రాశారని మడకం రాముడు అనే రైతు ఫిర్యాదు చేశారు. నజీర్ తన భూమి విషయంలో ఒక విలేఖరి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, పత్రికను అడ్డు పెట్టుకుని సర్వే సజావుగా సాగనివ్వడం లేదని ఆరోపించారు. గతంలో ఇదే మండలంలో ఎంతోమంది రైతులను సైతం ఈవిధంగా దౌర్జన్యం చేసి, భూములు ఆక్రమించిన చరిత్ర ఉందని తహసీల్దారుకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం తమ భూమిని ప్రజల సమక్షంలో విచారించి తనకు న్యాయం చేయాలని నజీర్ కోరుతున్నారు.

ప్రజలకు ప్రముఖుల ఉగాది శుభాకాంక్షలు
ఏలూరు, మార్చి 28 : ఉగాది పర్వదినం సందర్భంగా పశ్చిమ ప్రజానీకానికి రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. హేవళంబీ నామ సంవత్సరంలో జిల్లా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి సాధించాలని, ప్రతీ ఒక్కరూ సుఖసంతోషాలతో ఆరోగ్యవంతంగా జీవనం సాగించాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, జిల్లా ఎస్‌పి భాస్కర్ భూషణ్, ఏలూరు ఎంపి మాగంటి బాబు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మేయర్ షేక్ నూర్జహాన్, ఎమ్మెల్సీ రాము సూర్యారావు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

రేపటి నుంచి లారీల బంద్
జంగారెడ్డిగూడెం, మార్చి 28: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగంపై విధిస్తున్న పన్నులు, జారీ చేస్తున్న ఆర్డినెన్స్‌లు, వేధింపులకు నిరసనగా ఈ నెల 30వ తేదీ ఉదయం 6 గంటల నుండి నిరవధికంగా లారీలు బంద్ చేస్తున్నట్టు జంగారెడ్డిగూడెం లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అట్లూరి సురేష్, కార్యదిర్శ చింతల రాంబాబు తెలిపారు. ఈ నెల 21న జరిగిన ఏడు రాష్ట్రాల లారీ యజమానుల సంఘాల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ బంద్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బంద్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. పెంచిన థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం రద్దుచేయాలని, పెంచిన చలానా ఫీజులు, జరిమానాలు రద్దుచేయాలని, రవాణా వాహనాలకు స్పీడ్ గవర్నర్ ఏర్పాటు ఉపసంహరించాలని, 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను స్క్రాప్ చేసే ఆలోచన విరమించుకోవాలని, డీజిల్‌పై పెంచిన నాలుగు రూపాయల వ్యాట్ పన్ను రద్దుచేయాలని డిమాండ్లతో ఈ బంద్ చేపట్టినట్టు వివరించారు.