పశ్చిమగోదావరి

నేడు 3233 కేంద్రాల్లో పల్స్‌పోలియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 1 : జిల్లాలోని 48 మండలాల్లో ఆది, సోమ, మంగళవారాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె కోటేశ్వరి తెలిపారు. ఆదివారం 3233 కేంద్రాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, జిల్లాలోని అయిదు సంవత్సరాలలోపు పిల్లలు 4 లక్షల 366 మంది వున్నారని చెప్పారు. 12908 టీమ్ సభ్యులు పనిచేస్తారని పేర్కొన్నారు. 307 మంది సూపర్‌వైజర్లను నియమించామని, మొత్తం 13215 మంది పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొంటారని, వారిలో ఆరోగ్య శాఖకు చెందిన 2046 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు 3483 మంది, ఆశా కార్యకర్తలు 2967 మంది, నర్సింగ్ స్టూడెంట్స్ 626 మంది, వాలంటరీస్ 4093 మంది పాల్గొంటారని తెలిపారు. వ్యాక్సిన్ అన్ని కేంద్రాలకు పంపించడం జరిగిందని, ఆదివారం కేంద్రాల్లో అయిదుసంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, సోమ, మంగళవారాల్లో తమ సిబ్బంది ఇంటికీ వెళ్లి ఆదివారం పోలియో చుక్కలు వేయించని వారిని గుర్తించి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, లక్ష్యాలను అధిగమించేందుకు గాను పక్కా ప్రణాళికతో పయనిస్తున్నామని పేర్కొన్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

కళ్లెదుటే వృధా..సాగునీటి వ్యధ!
కలెక్టర్ భాస్కర్ ఆవేదన
ఏలూరు, ఏప్రిల్ 1 : జిల్లాలో పది కిలోమీటర్ల దూరంలో గోదావరి జలాలు కళ్లెదుటే వృధాగా సముద్రంలో కలిసిపోతుంటే దగ్గరలో ఉన్న పొలాలకు సాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం జాతీయ రహదారులు, రైల్వే, ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల ప్రగతిపై కలెక్టర్ భాస్కర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రక్కనే గోదావరి ఉన్నా తమ పొలాలకు నీరెందుకు రాదని రైతాంగం బాధపడడమే తప్ప వారికి మేలు చేయాలనే ఆలోచన ఇరిగేషన్ అధికారులకు ఎందుకు కలగడం లేదని ప్రశ్నించారు. దశాబ్ధాలు గడుస్తున్నా చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడానికి కేవలం అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల బద్ధకమే కారణమని చెప్పారు. జిల్లాలో ప్రతీ ఏటా గోదావరి నుండి మూడు వేల టి ఎంసిల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవని పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా ఇప్పటికైనా కొంత వరకు కృష్ణా డెల్టా ఆయకట్టుకు సేద్యపునీరు అందించగలుగుతున్నామని త్వరలోనే రైట్ మెయిన్ కెనాల్ వెంబడి ఎక్కడ రైతాంగానికి నీరు అవసరమో అక్కడ ప్రత్యేక లిఫ్ట్‌లను ఏర్పాటుచేసి సేద్యపునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మే 12వ తేదీ లోగా కాల్వల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏప్రిల్ 10వ తేదీన కాల్వలు మూసివేస్తున్న దృష్ట్యా జిల్లాలోని కాల్వల అభివృద్ధి పనులను ప్రారంభించాలన్నారు. మే 12వ తేదీ నాటికి పనులు పూర్తి చేసే విధంగా అందుకు కావాల్సిన ఇసుక, సిమెంటు, స్టీలు ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. యంత్రాలను, సిబ్బందిని ఏర్పాటుచేసుకుని పనులు నిరంతరం సాగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది, అధికారులు పనిచేసే ప్రాంతాలలో అందుబాటులో వుండాలన్నారు. ఏప్రిల్ నెలలో తాను క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల ప్రగతిని పర్యవేక్షిస్తానని ఆ సమయంలో సిబ్బంది పని చేసే ప్రాంతంలో అందుబాటులో వుండాలన్నారు. ఈ ఖరీఫ్ నాటికి పోణంగి పుంత ద్వారా ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించి తీరాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శేషావతారం ఛానల్‌కు సంబంధించి భూమి అప్పగించి సంవత్సర కాలం అయినా పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించిన శెట్టిపేట ఇ ఇ శ్రీనివాస్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగంగా జరగడానికి అయిదు భాగాలుగా చేసి కాంట్రక్టరుకు అప్పగించాలని తాను ఆదేశించినా మొత్తం పనిని ఒకే కాంట్రాక్టరుకు ఎందుకు అప్పగించారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు విభజించి అప్పగించడం వలన పనులు వేగంగా జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. కాల్వలు కట్టే ఈ సమయంలో ఆయా పనులకు టెక్నికల్ శాంక్షను ఇస్తున్నామని ఇ ఇ చెప్పడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ టెక్నికల్ శాంక్షను ఈ సమయానికే ఇచ్చి కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాల్సి వుందని రైతుకు ఉండే కనీస కామన్‌సెన్స్ కూడా మీలో లేదని చెప్పారు. రైతు పంటలు వేసే సమయానికి ముందే నారు వేసుకోవడం పిల్ల కాల్వలు బాగు చేసుకోవడం వంటి పనులు చేసుకుని సిద్ధంగా ఉంటారని, అటువంటి ఆలోచన కూడా మీలో లేకపోవడం మీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. నరసాపురంలో ఏర్పాటు చేయబోయే పోర్టుకు మూడు ప్రాంతాలను గుర్తించారని వాటిలో ఏ ప్రాంతం అనుకూలంగా ఉన్నదో తెలియజేస్తే భూమిని సేకరిస్తామని కలెక్టర్ చెప్పారు. పోర్టును అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో పోలవరం పనులకు సంబంధించి చెల్లించాల్సిన నిధులకు కొరత లేదని బిల్లులు రూపొందించి సిద్ధంగా ఉండాలన్నారు. పనులు నిరంతరం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెసి పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డి ఆర్‌వో కట్టా హైమావతి, భూసేకరణ ప్రత్యేక కలెక్టరు భాను ప్రసాద్, ఐటిడి ఏ పివో షాన్ మోహన్, నరసాపురం సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్ గాంధీ, ఆర్‌డివోలు జి చక్రధరరావు, బి శ్రీనివాసరావు, లవన్న, పోలవరం ఎస్ ఇ శ్రీనివాసయాదవ్, భూసేకరణ అధికారులు సూర్యనారాయణ, పుష్పమణి, ఆర్ అండ్ బి ఎస్ ఇ నిర్మల, హౌసింగ్ పిడి శ్రీనివాసులు, సోషల్ వెల్ఫేర్ డిడి రంగలక్ష్మీదేవి, వ్యవసాయ శాఖ జెడి సాయి లక్ష్మీశ్వరి, ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.