పశ్చిమగోదావరి

త్వరలో సత్యంబాబు కేసు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 2: ఆయేషా హత్యకేసులో దోషులను తప్పించేందుకే అప్పటి ప్రభుత్వం దళితుడైన సత్యంబాబును బలిచేసిందని, నిర్దోషి అయిన సత్యంబాబును జైలుకు పంపడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకునేందుకు త్వరలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఈ కేసు విచారణ చేపట్టనుందని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కారెం శివాజీ స్పష్టం చేశారు. స్థానిక ప్రియదర్శిని డిగ్రీ కళాశాల వద్ద ఆదివారం ఆయన వివిధ కేసుల్లోను, సంఘటనల్లోను బాధితులైన ఎస్సీ, ఎస్టీల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం ప్రముఖ విద్యావేత్త డాక్టర్ అలుగు ఆనందశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివాజీ మాట్లాడుతూ అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆయేషా హత్యకేసులో నిందితులను రక్షించేందుకు దళితుడైన సత్యంబాబును బలిచేసిందని, చేయని నేరానికి సత్యంబాబు ఎనిమిది సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించాడని అన్నారు. సత్యంబాబు నిర్దోషి అని ఆనాడు తానొక్కడినే ఒంటరి పోరాటం చేశానని గుర్తుచేశారు. కానీ న్యాయ వ్యవస్థ సత్యంబాబు నిర్దోషిత్వాన్ని గుర్తించిందన్నారు. చేయని నేరానికి సత్యంబాబును ఎనిమిదేళ్లు జైలుకు పంపడం దుర్మార్గమని, తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. సత్యంబాబును అన్యాయంగా జైలుకు పంపడానికి కారకులైన వారిని కమిషన్ విడిచిపెట్టే ప్రసక్తేలేదన్నారు. జైలులో సత్యంబాబు బీరువాలు తయారుచేసే పనిలో నిపుణత సాధించాడని, జైలు అధికారులు గుర్తించి బయటకు వచ్చిన తరువాత అతనికి బీరువాలు తయారుచేసే పరిశ్రమ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.
దూరదృష్టితోనే మంత్రివర్గ విస్తరణ
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దూరదృష్టితోనే మంత్రివర్గాన్ని విస్తరించారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కారెం శివాజీ అన్నారు. దళితులైన కెఎస్ జవహర్, నక్కా ఆనంద్‌బాబులను మంత్రి వర్గంలోకి తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తొలగించిన మంత్రుల పట్ల ఎటువంటి వ్యతిరేకత లేదని, వారికి రెండున్నరేళ్లపాటు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించే అవకాశం కల్పించారని, ఇప్పుడు మరికొందరికి మంత్రులుగా బాధ్యత అప్పగించారన్నారు.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని శివాజీ పేర్కొన్నారు. నూతన రాజధాని అమరావతిలో రూ.96.7 కోట్లతో 20 ఎకరాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం నిర్మిస్తోందన్నారు. దీనిలో 125 అడుగలు ఎతె్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్టులో ఎస్సీ, ఎస్టీలకు గతేడాది కన్నా 15 శాతం అధిక నిధులు కేటాయించారన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.9,876కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.3,957 కోట్లు కేటాయించినట్టు గుర్తుచేశారు.
కులవివక్ష, దాడులు ఉపేక్షించేది లేదు
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత అన్ని జిల్లాల్లోను విస్తృతంగా పర్యటించి కుల వివక్ష, ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న దాడులపై సమీక్షిస్తున్నట్టు డాక్టర్ శివాజీ చెప్పారు. దళిత, గిరిజన ఉద్యోగుల పట్ల అణచివేత, నిరాదరణ ప్రదర్శించినా, పదోన్నతులు నిలిపివేసినా, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉల్లంఘించినా చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. అనంతరం డాక్టర్ శివాజీని విద్యావేత్త అలుగు ఆనందశేఖర్ ఆధ్వర్యంలో దళిత నాయకులు ఘనంగా సత్కరించారు. తొలుత ఆనందశేఖర్ బుద్ధ వందనం చేశారు. సమావేశంలో వివిధ దళిత, గిరిజన ప్రజా సంఘాల నేతలు కొయ్యగర్ల శ్యామ్, కర్రి భీమేశ్వరరావు, కంపా రాజేంద్రప్రసాద్, కస్సే బాలకృష్ణ, కాటం ప్రసాద్, గొల్లమందల శ్రీనివాసరావు, ఎంవి శ్యాంబాబు, వెంపల రాజు, తోట కృపావరం, డాక్టర్ నెహ్రూ, బోడ ఆనంద్, జొన్నకూటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.