పశ్చిమగోదావరి

చినఅమిరం గ్రామానికి స్వశక్తీకరణ్ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 9: భీమవరం మండలం చినఅమిరం గ్రామ పంచాయతీ పంచాయత్ స్వశక్తీకరణ్ పురస్కార్‌కు ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం ఎంపికైన గ్రామాలను ఆదివారం రాత్రి ప్రకటించింది. రాష్ట్రం నుంచి ఎంపికైన గ్రామాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చినఅమిరం గ్రామం ఒకటి. గ్రామ అభివృద్ధి, స్వచ్ఛ్భారత్, నిధులు వినియోగం తదితర అంశాలను ప్రాతిపదికన తీసుకుని ఈ పురస్కార్‌కు ఎంపిక చేసింది. ఎంపికైన గ్రామాలకు ఈ నెల 24న పంచాయితీరాజ్ దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం చేస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్యశాల అభినందనీయం
పెనుగొండ, ఏప్రిల్ 9: గ్రామీణ ప్రాంతంలో ఆధునిక వసతులతో కూడిన వైద్యశాలను నిర్మించడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఏలేటిపాడు పిఎసిఎస్, తురగా ఛారిటబుల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో పేకేరు గ్రామంలో నిర్మించిన తురగా సూర్యభగవాన్లు, సుబ్బలక్ష్మి మెమోరియల్ ఆరోగ్య కేంద్రంను ఆదివారం ఎమ్మెల్యే ఆరిమిల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా సొంత గ్రామంలో ఒక ట్రస్టు ఏర్పాటుచేసి, ఉచితంగా వైద్యం అందించాలనే ఆలోచన కల్గడం ఎంతైనా ఆనందదాయకమన్నారు. సుమారు రూ.48 లక్షల వ్యయంతో ఆధునిక లేబరేటరీ, సామాన్యులకు సైతం మెరుగైన వైద్యమందించాలనే ఉద్దేశ్యంతో ఈ వైద్యశాలను ట్రస్టు నిర్మించిందని ట్రస్టు సభ్యులు డాక్టర్ తురగా సూర్యనారాయణమూర్తి తెలిపారు. కర్రి నర్శిరెడ్డి, విశే్వశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు రూ.10లక్షలు, డాక్టర్ సత్తిరెడ్డి రూ.6లక్షలు, వేలేటిపాడు సొసైటీ రూ.20లక్షలు వెచ్చించినట్టు సొసైటీ అధ్యక్షుడు కర్రి విశే్వశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 500మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.
ఏలేటిపాడు సొసైటీ ఆధ్వర్యంలో పేకేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగు, వైస్ ఎంపిపి సూర్యప్రకాష్‌రెడ్డి, సిఇఒ పులగం బాలకృష్ణారెడ్డి, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.
పాత పెన్షన్ విధానం కోసం మహా శాంతి ర్యాలీ
ఏలూరు, ఏప్రిల్ 9 : ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథక ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ఉద్యోగులు మహా శాంతిర్యాలీ నిర్వహించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి ఓపి ఎస్ రావాలి, సిపి ఎస్ పోవాలంటూ నినాదాలు చేశారు. కెపిడిటి పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఎపి సిపి ఎస్ ఇ ఎ జిల్లా అధ్యక్షులు వీరవల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, నూతన పెన్షన్ విధానానికి స్వస్థి పలకాలని పిలుపునిచ్చారు. పాత పెన్షన్ విధానంలో అనేక సౌకర్యాలు, రాయితీలు వున్నాయని పేర్కొన్నారు. ఇందులో ప్రభుత్వం ట్రస్టీగా వుంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా గ్రాట్యుటీ కూడా ఉంటుందని, 15 సంవత్సరాల తరువాత పి ఎఫ్‌లో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం వుందని పేర్కొన్నారు. ఏడాది సర్వీసు పూర్తి చేయకుండా ఉద్యోగి మరణించినా కుటుంబానికి పెన్షన్ వస్తుందని చెప్పారు. ఉద్యోగం నుంచి తొలగించిన సందర్భంలో సైతం క్రమశిక్షణాధికారి ఉద్యోగికి లభించే పెన్షన్‌లో 2/3వ వంతు మంజూరు చేయవచ్చునని పేర్కొన్నారు. కనీసం పది సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన సందర్బంలో కూడా దామాషా ప్రాతిపదిక ద్వారా పెన్షన్ లభిస్తుందని, అది పి ఆర్‌సికి అనుగుణంగా పెన్షన్ పెరుగుతుందని పేర్కొన్నారు. ఇన్ని సౌకర్యాలున్న పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానం వలన అనేక సమస్యలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ విధానంలో ప్రైవేటు సంస్థలు ట్రస్టీగా వుంటాయని, గ్రాట్యుటీ కూడా లేదని, పది సంవత్సరాల తరువాత 25 శాతం మాత్రమే విత్‌డ్రాకు అవకాశం కేవలం మూడుసార్లేనని స్పష్టం చేశారు. కాబట్టి ఈ నూతన పెన్షన్ విధానం ఎంత మాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అనంతపురంనకు చెందిన రాష్ట్ర అధ్యక్షులు పి రామాంజనేయ యాదవ్, విజయనగరానికి చెందిన రాష్ట్ర జనరల్ కార్యదర్శి ఎల్‌బి యుగంధర్, నెల్లూరుకు చెందిన రాష్ట్ర ఫైనాన్స్ కార్యదర్శి షేక్ ఖాజా రహ్మతుల్లా, యూనియన్ రాష్ట్ర నాయకులు కె మణిప్రసాద్, కె పార్ధసారధి, సి ఎం దాసు, పఠాన్ బాజీ, మారుతీ ప్రసాద్, జిల్లా నాయకులు సిహెచ్ అనిల్‌కుమార్, బి ఆశీర్వాదం, కె గణేశ్వరరావు, ఆర్ నాగదుర్గారావు, రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, మహిళా ప్రతినిధులు హాజరయ్యారు.
పాత పెన్షన్ విధానం అమలులోకి వచ్చే వరకు ఐకమత్యంగా పోరాటం సాగిద్దామంటూ సంఘీభావంతో ప్రతిజ్ఞ చేశారు.