పశ్చిమగోదావరి

నిధుల వినియోగంపై దద్దరిల్లిన కౌన్సిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 15: 14వ ఆర్థిక సంఘం నిధులు 2.21 కోట్ల రూపాయల వినియోగంపై ఛైర్‌పర్సన్ సభ్యుల ప్రమేయం లేకుండా ఏకపక్షంగా ప్రతిపాదనలు రూపొందించారని ఆరోపిస్తూ శనివారం జరిగిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో పలువురు కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. వార్డుల్లో అవసరమైన పనులు ఆవార్డు కౌన్సిలర్లకు తెలుస్తాయా? మీకా? అంటూ 2వ వార్డు కౌన్సిలర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మిపై నేరుగా దాడికి దిగడంతో ఒక దశలో సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. వైస్ ఛైర్మన్ అట్లూరి రామ్మోహనరావు కల్పించుకుని ఇరువురిని శాంతింప చేసారు. 14వ ఆర్థిక సంఘ నిధులలో ఛైర్‌పర్సన్ వార్డులో అధిక నిధులు కేటాయించుకుంటూ ప్రతిపాదనలు రూపొందించారని, స్టారమ్ వాటర్ డ్రైన్ల పేరుతో 16 పనులు ప్రతిపాదించారని, ఈ ప్రతిపాదనలు ఏకపక్షంగా చేయడంతో ఈ తీర్మానం వ్యితిరేకిస్తున్నామని కౌన్సిలర్లు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు, మందపల్లి వెంకట శివమాధవి, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్ తదితరులు పట్టుబట్టారు. కౌన్సిలర్ల వాదనలతో మనస్తాపానికి గురైన ఛైర్‌పర్సన్ శివలక్ష్మి కొద్దిసేపు సమావేశం నుండి నిష్క్రమించారు. ఆమె తిరిగి వచ్చిన తరువాత కౌన్సిలర్లు ప్రతిపాదించిన విధంగా నిధులు కేటాయింపులు చేస్తూ తీర్మానం ఆమోదించారు. పట్టణంలో అశ్వారావుపేట రోడ్డులో సెంటర్ లైటింగ్ ఏర్పాటుకు 15 లక్షలతో 50 స్థంభాలు వేసేందుకు పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా పూర్తికావడం లేదని, పనుల్లో జాప్యంపై కౌన్సిలర్లు చింతల వెంకటేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు, వైస్ ఛైర్మన్ అట్లూరి రామ్మోహనరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. సెంటర్ లైటింగ్ కోసం 1.5 కిలోమీటర్ల మేర కేబుల్ వేసేందుకు 99 వేల రూపాయల నిధులు అవసరమవుతాయని అసిస్టెంట్ ఇంజనీర్ సూర్యభాస్కరరావు చెప్పడంతో, ముందుగా అంచనాలు ఎందుకు వేయలేదని సభ్యులు నిలదీశారు. కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావు కల్పించుకుని నెలాఖరుకు సెంటర్ లైటింగ్ పనులు పూర్తి చేయిస్తామని సమాధానం చెప్పారు. సెంటర్ లైటింగ్‌కు ఎల్‌ఇడి బల్బుల కొనుగోలుకు కౌన్సిల్ ఆమోదం కోరడంతో, ఎల్‌ఇడి బల్పుల ఏర్పాటుకు కాంట్రాక్టు ఇచ్చిన తరువాత మరల మున్సిపాలిటీ కొనుగోలు చేయడమేమిటని నిలదీసారు. పనులు కాక పోవడంతో ప్రజలు తమను నిలదీస్తున్నారని, ప్రజా ప్రతినిధులమని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నామని, మేమంతా రాజీనామా చేసి వెళ్ళిపోతాం మీరే పరిపాలించుకోండని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. పట్టణంలో పారిశుద్ధ్యం, యూజర్ ఛార్జీల వసూళ్ళు, వ్యాపార సంస్థల వద్ద లైసెన్స్ ఫీజుల వసూళ్ళలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ అలసత్వంపై కౌన్సిలర్లు తూటికుంట దుర్గారావు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, ఇంకా పలువురు అధికార్లను నిలదీసారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ సరైన సమాధానం చెప్పక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ గోవర్థనరావు అసహనానికి గురై కౌన్సిలర్లపై ఎదురుదాడికి దిగుతుండగా టౌన్‌ప్లానింగ్ అధికారి ఎ లక్ష్మీనారాయణ కల్పించుకుని కౌన్సిలర్లను శాంతింప చేసారు. సమావేశంలో మున్సిపల్ పరిపాలనాశాఖా మంత్రి పి నారాయణ హామీ మేరకు తాగునీటి పైపులైన్ల పనులు 116కు ఎజెండాలో చేసిన ప్రతిపాదనలు ఆమోదించారు. ఈ పనులకు ఎంతైనా నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి సభ్యులకు చెప్పారు.
ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తుకు గడువు పెంపు
ఏలూరు, ఏప్రిల్ 15 : ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు ఈ నెల 17వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు యూనివర్శిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ ఎ ముత్తారెడ్డి తెలిపారు. స్థానిక డిపి ఆర్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గడువు అనంతరం వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 25వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలతోపాటు కాకినాడ, తాడేపల్లిగూడెంలలోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్‌లో కూడా పిజి చేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎంట్రన్స్ పరీక్ష పాసైన అభ్యర్ధులు మాత్రమే పిజికి అర్హులని ఆయన తెలిపారు. మే 3వ తేదీన కామన్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తామని, ఈ నెల 26వ తేదీన వెబ్‌సైట్ ద్వారా హాల్ టిక్కెట్ పొందవచ్చునన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, రంపచోడవరం, భీమవరం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, విజయవాడల్లో పరీక్షా కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బెల్టు షాపులు తక్షణం మూసివేయాలి: మంత్రి మాణిక్యాలరావు

తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 15: నియోజకవర్గంలో బెల్టు షాపులు తక్షణం మూసివేయాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. శనివారం మంత్రి కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఎం చంద్రబాబు బెల్టు షాపుల రద్దుపై చాలా స్పష్టంగా ఉన్నారన్నారు. బెల్టు షాపులపై అధికారులు స్పందించకపోతే పోలీసు విధులను తానే నిర్వహిస్తానన్నారు. అనేక మంది పేద మహిళలు బెల్టు షాపులు కారణంగా తమ కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారన్నారు. మద్యానికి బానిసలై గ్రామీణ కుటుంబాలు ఎన్నో నాశనమవుతున్నాయన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో పర్యటించిన తనకు అనేక మంది మహిళలు తెలిపారన్నారు. ఎక్సైజ్ అధికారులకు ఈ విషయంపై సీరియస్‌గా చర్య తీసుకోవాలని తెలిపానని, స్పందించకపోతే తానే రంగంలోకి దిగి బెల్టు షాపులను నిరోధిస్తానన్నారు. నియోజకవర్గంలో బెల్టు షాపుల వివరాలు దేవాదాయ శాఖ మంత్రి స్థానిక కార్యాలయంలో ప్రజలు తెలపాలని కోరారు. ఎయిడ్స్, మధుమేహం, మూత్రపిండాల వ్యాధుల కంటే ఎంతో ప్రమాదకరమైంది మద్యం మహమ్మారి అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ యెగ్గిన నాగబాబు, పట్టణాధ్యక్షుడు కర్రి ప్రభాకర బాలాజీ, అయినం బాలకృష్ణ, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.