పశ్చిమగోదావరి

జిల్లా సారథ్యం ఎవరికో...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 8: జిల్లాలో తిరుగులేని బలాన్ని కలిగివున్న తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న అంశం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 20,21 రెండు రోజుల పాటు జిల్లా పార్టీ ఎన్నిక జరగనుంది. అంతేకాకుండ ఇదే సమావేశంలో మినీ మహానాడులో తీర్మానాలు చేయనున్న అంశాలపై కూడా చర్చ జరగనుంది. అయితే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని మళ్లీ సెంటిమెంట్‌గా ప్రస్తుత పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి అప్పగిస్తారా? లేదా కొత్త వారికి ఈ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది ఉత్కంఠను రేపుతోంది. దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లా విషయంలో సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని మళ్లీ సారధ్య బాధ్యతలు రాజ్యసభ సభ్యురాలు, జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న తోటకే అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉన్న నేపధ్యంలో ఆయన రాష్ట్రానికి తిరిగి రాగానే జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించి కీలకమైన నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో 2009 ఎన్నికల్లో ఎంపీగా నరసాపురం పార్లమెంట్ నుంచి బరిలో నిలిచిన తోట సీతారామలక్ష్మి ఓటమి చెందిన విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబునాయుడు ఆమె చేసిన సేవలను గుర్తించి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆమెకు అప్పగించారు. అప్పటి నుంచి జిల్లాలో టిడిపి విజయబావుటా ఎగరవేస్తూనేవుంది. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో అన్ని లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం నియమించే కమిటీలు ఎన్నికల్లో కూడా పనిచేయనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధినేత సెంటిమెంట్‌గా ఉన్న జిల్లాలో ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తోట సీతారామలక్ష్మిని కొనసాగిస్తారా? లేదా కొత్తముఖానికి అవకాశం ఇస్తారా అన్నది ప్రస్తుతం పార్టీలో చర్చనియాంశంగా మారింది.

నెరవేరుతున్న పేదల సొంత ఇంటి కల
ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్
కొవ్వూరు, మే 9: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. పురపాలక సంఘ పరిధిలోని 15వ వార్డు బ్రిడ్జిపేటలోని శ్రీనివాసపురంలో మంగళవారం రాత్రి 52మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు మంత్రి జవహర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ జె రాధారాణి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా గృహనిర్మాణానికి రూ.3.5 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు. లబ్ధిదారులు వారికి కేటాయించిన స్థలాల్లో పక్కా గృహాలు నిర్మించుకోవాలని, ప్రతి ఇంటికీ విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ జె రాధారాణి మాట్లాడుతూ శ్రీనివాసపురంలో మంచినీటి ట్యాంకు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలన్నారు. సమావేశంలో ఆర్డీవో బి శ్రీనివాసరావు, తహసీల్దార్ కె విజయకుమార్, హౌసింగ్ ఇఇ రఘురామ్, టిడిపి నేతలు జెవిఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరిస్తాం
గన్నవరం విమానాశ్రయ అభివృద్ధిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు
ద్వారకాతిరుమల, మే 9: గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఆధునీకరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. ద్వారకాతిరుమల శివారులోని విర్డ్స్ ఆసుపత్రిలో సిఎస్సార్ పథకం ద్వారా సుమారు రూ.27 లక్షలతో కొనుగోలు చేసిన ఆర్థోస్కోపి మిషనరీని మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఆసుపత్రికి విచ్చేసిన కేంద్ర మంత్రికి ఆసుపత్రి ట్రస్టు ఛైర్మన్ ఎస్‌వి సుధాకరరావు, ఆనందరాజు, ప్రధాన వైద్యులు డాక్టర్ జగదీష్, చెలికాని రాజబాబు, ఆలయ ఇఒ వేండ్ర త్రినాథరావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రిలో ఇటీవల పోలియో శస్త్ర చికిత్సలు జరుపుతున్న రోగులను పరామర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ప్రారంభమైన ఆర్ధోస్కోపి మిషనరీ పనితీరును మంత్రికి డాక్టర్ జగదీష్ వివరించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం హర్షణీయమన్నారు. రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరగడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎంపిపి వడ్లపూడి ప్రసాద్, జడ్పీటీసీ మొగతడకల లక్ష్మీరమణి తదితరులు పాల్గొన్నారు.

వేసవి నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణ
మంత్రి మాణిక్యాలరావు

తాడేపల్లిగూడెం, మే 9: వేసవిలో నీటి ఎద్దడి నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి చర్యలు చేపట్టినట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంత శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. ఏలూరు కాలువలో కర్రనాచు శుభ్రంచేసి కాలువలో అడ్డుకట్టవేసి రెండవ విడత పట్టణంలో రిజర్వాయర్‌కు మంచినీటిని నింపేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో రూ.17లక్షలతో వేసవి మంచినీటి ప్రణాళికకు నిధులు మంజూరుజేసినట్టు తెలిపారు. అలంపురం, కడియద్దలో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తామన్నారు. మొత్తం రూ.3.2కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. పడాల, జట్లపాలెం, ఉమామహేశ్వరం రోడ్డును రూ1.15కోట్లతో నిర్మిస్తామన్నారు. నిట్ క్యాంపస్ నుంచి గణేష్ నగర్, శశి కాలేజీ మీదుగా కొండ్రుప్రోలు కొత్త కాలనీకి రూ.3.25కోట్లతో సిసి రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. గొలుసుకట్టు చెరువులు, మైనర్ ఇరిగేషన్ చెరువులు 14 పనులు నిమిత్తం రూ.మూడు కోట్ల, నాలుగు లక్షల, 33వేల నిధులు మంజూరయ్యాయన్నారు.
అక్రమ కార్యకలాపాలపై యువకులతో నిఘా
నియోజకవర్గంలో మట్టి అక్రమ రవాణా, బెల్టు షాపులు, ఎమ్మార్పీ కన్నా అధికంగా మద్యం అమ్మకాలపై గ్రామాల్లో యువకులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసులకు, అధికారులకు ఈ కమిటీలు సమాచారాన్ని అందిస్తాయన్నారు.
పట్టణంలో ప్రముఖుల విగ్రహాలు
పట్టణంలో ప్రధాన కూడలిలో తొమ్మిది మంది ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు. వీరిలో హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య, ఎస్‌వి రంగారావు, సైంటిస్టు యల్లాప్రగడ సుబ్బారావు, మాజీ డిప్యూటీ స్పీకర్ పసల సూర్యచంద్రరావు, బాబూ జగజ్జీవన్‌రామ్, జ్యోతిభాఫూలే, నందమూరి తారక రామారావు, పట్టణ మున్సిపల్ ప్రథమ ఛైర్మన్ కోడే వెంకట్రావు, వీరితోపాటు మరొకరి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అంబేద్కర్, కృష్ణదేవరాయలు, రుూలి ఆంజనేయులు విగ్రహాలు ఉన్నాయన్నారు.
ద్వారకాతిరుమలలో ఉచిత కౌంటర్లు
ద్వారకాతిరుమలలో బ్యాగులు, సెలఫోన్లు యాత్రీకులు పెట్టుకునేందుకు వీలుగా ఉచిత కౌంటర్లను ఏర్పాటుచేయాలని మంత్రి మాణిక్యాలరావు ఇఒ త్రినాథరావును ఆదేశించారు. సెల్‌ఫోన్‌కు రూ.5 వసూలు చేస్తున్నట్టు, బ్యాగుకు రూ.10లు యాత్రీకుల నుంచి వసూలు చేస్తున్నట్టుగా విలేఖర్లు తెలపడంతో దీనిపై మంత్రి స్పందించారు. ఈ సమావేశంలో బిజెపి కౌన్సిల్ నేత యెగ్గిన నాగబాబు, మాజీ ఎఎంసి ఛైర్మన్ పోతుల అన్నవరం, టిడిపి నాయకులు వలవల సూరిబాబు, ముప్పిడి సురేష్‌రెడ్డి, అయినం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా శ్రీవారి తిరు కల్యాణ మహోత్సవం
ద్వారకాతిరుమల, మే 9: సర్వాభరణ భూషితుడైన చిన వెంకన్న పద్మావతీ, ఆండాళ్లమ్మవార్లను మంగళవారం రాత్రి పరిణయమాడారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీవారి తిరు కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హేవళంబి నామ సంవత్సర వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం భక్తజన సందోహం, విశేష మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణ, వేద మంత్రోచ్ఛరణ నడుమ కడు రమణీయంగా జరిగింది. పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమాన్ని అనుసరించి జరిపిన ఈ కల్యాణ తంతును వీక్షించిన భక్తజనులు పరవసించారు.
కల్యాణ వేడుక ఇలా..
శ్రీవారి ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై చిన వెంకన్న కల్యాణాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. విశేషంగా అలంకరించిన కల్యాణ వేదిక వద్దకు తొళక్కం వాహనంపై స్వామి, అమ్మవార్లను తోడ్కొని వచ్చి వేదికపై వేంచేపుచేశారు. అనంతరం ఆలయ అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. వివిధ ఘట్టాలను పూర్తిచేసి శుభ ముహూర్త సమయంలో నూతన వధూవరులపై జీలకర్రా బెల్లం ధరింపజేసి, మాంగళ్యాధారణ, తలంబ్రాల వేడుకను ఘనంగా నిర్వహించారు. దేవస్థానం తరపున స్వామి, అమ్మవార్లకు ఆలయ ఛైర్మన్ ఎస్‌వి సుధాకరరావు పట్టువస్త్రాలను సమర్పించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఇవో వేండ్ర త్రినాధరావు పర్యవేక్షించారు. పలువురు ప్రముఖులు కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ముగ్గురికి తీవ్ర గాయాలు
యలమంచిలి, మే 9: పోడూరు మండలం జగన్నాథపురంలో మంగళవారం ఎదురుదెరుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న పమాదంలో ఇరువురు మృతిచెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. నర్సాపురం మండలం బియ్యపుతిప్పకు చెందిన సంగిశెట్టి నరేంద్రకుమార్ (25), తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన ఆకుల సురేష్‌కుమార్ (35) మోటారు వాహనంపై గణపవరంలో ఒక శుభకార్యానికి హాజరై మంగళవారం మధ్యాహ్నం తిరిగి పాలకొల్లు వైపు బయలుదేరారు. ఎదురుగా మోటారు సైకిల్‌పై వస్తున్న కవిటం గ్రామానికి చెందిన చిట్టుగుళ్ల బాలాజీ వీరిని ఢీకొట్టడంతో ఆ సమయంలో అటుపక్కగా వెళ్తున్న లోడు ట్రాక్టర్ చక్రాల కింద నరేంద్రకుమార్, సురేష్‌కుమార్ పడ్డారు. ఈ ప్రమాదంలో నరేంద్రకుమార్ అక్కడికక్కడే మృతి చెందగా సురేష్‌కుమార్ పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇలావుండగా ప్రమాదంలో బాలాజీతోపాటు మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తున్న చిట్టుగుళ్ల కృష్ణవేణి, సిర్రా సావిత్రి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన వైద్యం కోసం వారిని అక్కడి నుండి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోడూరు ఎస్‌ఐ పి రవీంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విలువలతో కూడిన బోధన జరగాలి
ఉపాధ్యాయుల శిక్షణా తరగతుల్లో ఎమ్మెల్సీ ఆరెస్సార్
ఏలూరు, మే 9 : విలువలతో కూడిన విద్యాబోధన అందించి భావిభారత పౌరులను తీర్చిదిద్దే బంగారు కృషిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు పిలుపునిచ్చారు. స్థానిక శాంతినగర్‌లోని శ్రీ భారతి విద్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సభలో సూర్యారావు మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యపరిచే నూతన విద్యావిధానం అమలులో ఉపాధ్యాయులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని కోరారు. జిల్లాలో విద్యారంగంలో ఆశించిన ఫలితాలుసాధించడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిదులు వెచ్చిస్తోందని ఈ సొమ్ము సద్వినియోగం కావాలంటే ప్రతీ టీచర్ తన పరిధిలో నిర్మాణాత్మకమైన విద్యాబోధన అందించి తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో అమలుచేయాలని కోరారు. సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ప్రతీ ఏటా టీచర్లకు శిక్షణకోసం అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతున్నదని, శిక్షణ కోసం ప్రభుత్వం వెచ్చించే ప్రతీ పైసా సద్వినియోగం కావాలంటే ఉపాధ్యాయులలు సమాజానికి ఆదర్శవంతులుగా ఉండాలని కేవలం డబ్బుకోసం విద్యాబోధన కాదని దేశాన్ని నడిపించగల సత్తా సామర్ధ్యం గల యువతను తయారుచేసే విద్యాలయాలను ఆధునిక దేవాలయాలగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఉపాధ్యాయుడూ నడుం బిగించాలని కోరారు. శిక్షణా కాలంలో మంచి విషయాలను గ్రహించి వాటిని పాఠశాలల్లో చక్కగా అమలు చేయగలిగితే ఆశించిన ఫలితాలు సాధించడం కష్టం కాదన్నారు.

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
మద్దూరులో ఆర్వో ప్లాంటు ప్రారంభించిన మంత్రి జవహర్
కొవ్వూరు, మే 9: రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా ప్రజలకు తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. మంగళవారం కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో ఎపి గ్యాస్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సహజ వాయువు విద్యుత్ కేంద్రం ఆర్థిక సహాయంతో ఏర్పాటుచేసిన ఆర్వో మినరల్ ప్లాంట్‌ను మంత్రి జవహర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్లాంట్ నిర్మాణానికి రూ.6లక్షలు వెచ్చించినట్టు చెప్పారు. ఈ ప్లాంటును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోని మరో నాలుగు గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని సంస్థ సిఎ వెంకటేశ్వరరెడ్డిని మంత్రి జవహర్ కోరారు. గతంలో కొవ్వూరు మండలంలోని సీతంపేట, పురుషోత్తపల్లి గ్రామాల్లో ఈ సంస్థ ద్వారా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. మద్దూరు గ్రామంలో రూ.3కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. మరో రూ.4కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. గ్రామంలో రూ.4లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును మంత్రి ప్రారంభించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన ఇంకుడుగుంతలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమాలలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి, ఎపిజిపిసిఎల్ జిఎం ఎం చిట్టిబాబు, ఒఎంఎస్ ప్లాంట్ మేనేజర్ ఎ శ్రీనివాస్, జెవిఎస్ చౌదరి, బి వీరరాఘవులు, ఎంపిపి వి రాజ్యలక్ష్మి, మద్దూరు సర్పంచ్ సిహెచ్ దమయంతి పాల్గొన్నారు.

ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
జమిలి ఎన్నికలపై మన రాజ్యం వ్యవస్థాపకుడు వర్మ
తణుకు, మే 9: కేంద్ర ప్రభుత్వం అమలుచేయతలపెట్టిన జమిలి ఎన్నికల విధానం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని మన రాజ్యం వ్యవస్థాపకుడు డివివిఎస్ వర్మ స్పష్టం చేశారు. మన రాజ్యం, జాతీయ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక సురాజ్య భవనంలో మంగళవారం నిర్వహించిన సభలో జమిలి ఎన్నికలు, దాని పర్యవసానాలు అనే అంశంపై ఆయన ప్రసంగించారు. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. జమిలి ఎన్నికలు ఏటా రాష్ట్రాల్లో ఎన్నికల తలనొప్పిని తొలగిస్తుందే తప్ప, మన ఎన్నికల వ్యవస్థను సంస్కరించడానికి అణుమాత్రం కూడా దోహదపడదన్నారు. తక్షణం జరగాల్సిన ఎన్నికల సంస్కరణలను వాయిదావేసే ఎత్తుగడగా మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రభుత్వ ఖజానాను గుల్లచేసే ప్రజాకర్షణ వాగ్దానాలను గుప్పిస్తున్నాయని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ జెండాలు మార్చేస్తూ నిరాటంకంగా పదవులు దక్కించుకుంటున్నారని వర్మ పేర్కొన్నారు. ఎన్నికల్లో ధన బలాన్ని తగ్గించేందుకు మన దేశానికి తగిన దామాషా ఎన్నికల పద్ధతిని అమలు చేయాలని ఆయన సూచించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించి ఓటు హక్కు, సభ్యత్వం రద్దయ్యే ఏర్పాటుచేయాలని వర్మ డిమాండు చేశారు. జమిలి ఎన్నికల విధానాలపైన, ఒకే దేశం..ఒకే ఎన్నిక ల్లాంటి నినాదాల వెనుక గల రాజకీయ కోణాలపైనా, తక్షణ అవసరమైన ఎన్నికల సంస్కరణలపైనా జరుగుతున్న చర్చల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వర్మ పిలుపునిచ్చారు. కేవలం ఒకే పార్టీ కేంద్రంలోను, రాష్ట్రంలోను పరిపాలించాలన్న లక్ష్యంతో ఏర్పాటుచేయతలపెట్టిన ఈ విధానం వల్ల మంచి ఫలితాలు ఉండవన్నారు. జాతీయ వేదిక అధ్యక్షుడు డాక్టర్ బిహెచ్ రమేశ్చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సభలో సీమాంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ జమిలి విధానం వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుందన్నారు. ఫాసిస్టు విధానాలల్లో ఇదో ఒక భాగమన్నారు. సీనియర్ జర్నలిస్టు గోపి, న్యాయవాది మద్దిపాటి రాజశేఖర్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, ప్రముఖ వైద్యుడు వి వెంకట్రాజు, పారిశ్రామిక వేత్త చిట్టూరి సుబ్బారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ, సిపిఐ ఏరియా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తప్పని ధ్రువపత్రాల తిప్పలు!
తాళ్లపూడి, మే 9: ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులకు వారు కోరకుండానే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ‘విద్యార్థి సేవలో రెవెన్యూ శాఖ’ అనే పేరుతో ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రక్రియ సంవత్సరాంతపు పరీక్షలకు ముందే ప్రారంభించినప్పటికీ నేటికీ ధ్రువీకరణ పత్రాలు సిద్ధం కాలేదు. ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లేవారు, వివిధ పోటీ పరీక్షలకు వెళ్లేవారికి అవసరమైన ఈ పత్రాల కోసం విద్యార్థులు ఇ సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రాథమిక పాఠశాల నుంచి యుపి పాఠశాలకు వెళ్లేవారికి, ఉన్నత పాఠశాల నుంచి జూనియర్ కళాశాలలకు, డిగ్రీ కళాశాలలకు వెళ్లేవారికి కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఇ సేవ కేంద్రాల చుట్టూ తిరగకూడదనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. అయితే పాఠశాలలు మూసివేసి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకూ వాటిని విద్యార్థులకు అందజేయలేదు. విద్యార్థుల వివరాలు సేకరించి కూడా నెల కావస్తోంది. ఈ ధ్రువీకరణ పత్రాలు జారీచేసేందుకు ప్రత్యేక తేదీని ఉన్నతాధికారులు నిర్ణయించలేదని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు మాత్రం ధ్రువీకరణ పత్రాల కోసం ఇ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సకాలంలో ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తేనే ప్రభుత్వ లక్ష్యం, విద్యార్థుల అవసరం తీరినట్లవుతుంది. ఉపాధ్యాయులు సైతం తమ పాఠశాలల్లోని విద్యార్థులకు అవసరమైన ఈ ధ్రువీకరణ పత్రాల కోసం ఏం చేయాలో తెలియక సందిగ్థంలో ఉన్నారు. తాళ్లపూడి తహసీల్దార్ పి శ్రీనివాసును ఈ విషయమై వివరణ కోరగా..ధ్రువీకరణ పత్రాల జారీ జరుగుతోందన్నారు.

ఆనందా ప్రమాదంపై 18న మెజిస్టీరియల్ విచారణ
-మొగల్తూరు తహసీల్దార్ కార్యాలయంలో...
నరసాపురం, మే 9: మొగల్తూరు ఆనంద ఆక్వా ప్లాంటు ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృత్యువాత సంఘటనపై ఈ నెల 18 మెజిస్టీరియల్ విచారణ నిర్వహించనున్నట్టు కొవ్వూరు ఆర్డీవో బి శ్రీనివాసరావు తెలిపారు. మొగల్తూరు తహసీల్దారు కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ నిర్వహిస్తారు. ఈ సంఘటనకు సంబంధించి సాక్షులు, ప్రజలనుంచి వివరాలు సేకరిస్తామని శ్రీనివాసరావు తెలిపారు.

కారు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
ఏలూరు, మే 9 : ఒక ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని ఎదురుగా కారు ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఎండి ఇంతియాజ్ మంగళవారం తన బంధువుల ఇంటికి వచ్చి తన స్నేహితుడు లంక సాయి తేజతో కలిసి ద్విచక్ర వాహనంపై ఫైర్‌స్టేషన్‌కు వెళ్లి తిరిగి అశోక్‌నగర్ వెళుతుండగా తంగెళ్లమూడి నుంచి వస్తున్న ఒక కారు వేగంగా వచ్చి ఢీకొంది.

ఆయనెవరో నాకు ఐడియా లేదు...!
-పవన్ కల్యాణ్‌పై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు వ్యాఖ్య
ద్వారకాతిరుమల, మే 9: మీరు ఏదో పేరు చెప్పారు..అయనెవరో నాకు ఐడియా లేదు..అందరూ అంటున్నారు..ఎవరో సినిమా వాడట. సినిమాలు నేను చూసి చాలా సంవత్సరాలైంది. సినిమాల గూర్చి మాట్లాడితే నేనేమి చెప్పనంటూ విలేఖర్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గూర్చి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ద్వారకాతిరుమల శివార్లలోని విర్డ్స్ ఆసుపత్రిలో ఆర్థోస్కోపీ మిషనరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తరాది ఐఎఎస్‌ను టిటిడి ఇవోగా నియమించడంపై పవన్ చేసిన ట్వీట్‌పై విలేఖర్లు ప్రశ్నించగా ఆయన తనదైన శైలిలో పై విధంగా బదులిచ్చారు.