పశ్చిమగోదావరి

ఇక బియ్యం కార్డులవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 13 : సాధారణంగా రేషన్ కార్డులని పేద వర్గాలు వాడుకలో బియ్యం కార్డులుగా మాట్లాడుకోవడం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తదాస్తు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దానికి నిదర్శనంగానే ఇక నుంచి రేషన్ కార్డులు పూర్తిగా బియ్యం కార్డులుగా మాత్రమే మిగిలే పరిస్థితి వచ్చేసిందనే చెప్పాలి. ఇంతకుముందు తొమ్మిది రకాల సరుకులు ఈ రేషన్‌కార్డులతో అందుబాటులోకి రావడం తెలిసిందే. ఆ సరుకుల సంఖ్య క్రమంగా తగ్గిపోయి ఇప్పుడు పంచదార, బియ్యం, కిరోసిన్‌లకు పరిమితమైనా తాజా పరిణామాల్లో పంచదార, కిరోసిన్‌లకు కూడా మంగళం పాడేసి చివరకు కార్డులపై బియ్యం మాత్రమే అందించే విధంగా పరిస్థితులను మార్చివేశారనే చెప్పాలి. ఒక ప్రక్క కేంద్ర ప్రభుత్వం పంచదారపై సబ్సిడీని ఎత్తివేయడంతో రేషన్‌కార్డులపై పంచదార పంపిణీని గత నెల నుంచే ప్రభుత్వం దారుణంగా తగ్గించి వేసింది. రానున్న రోజుల్లో ఇది పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కూడా స్పష్టమైంది. ఇవి ఇలా ఉంటే తాజాగా కిరోసిన్ కూడా వచ్చే నెల నుంచి కార్డులపై ఇచ్చేది లేదని ప్రభుత్వమే ప్రకటించడంతో ఇక మిగిలింది బియ్యం మాత్రమేనని చెప్పుకోక తప్పదు. మొత్తం మీద ఆ విధంగా రేషన్‌కార్డులను ప్రభుత్వం బియ్యం కార్డులుగా మార్చివేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిణామాలు సహజంగానే పేద వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. మరో వైపు ఇప్పటికే వామపక్షాలు కూడా ఈ పరిస్థితులపై ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. రేషన్ షాపుల్లో పంచదార, కిరోసిన్ పంపిణీని నిలుపుదల చేస్తే పేదలతో కలిసి ఉద్యమించి ఆందోళనలు చేపడతామని సిపి ఎం జిల్లా కార్యదర్శి బి బలరామ్ హెచ్చరించారు. పారిశ్రామిక వేత్తలకు కోట్లాది రూపాయల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు పేద ప్రజలకు అరకొరగా అందించే సబ్సిడీ వస్తువులను దూరం చేయడం ఏ వర్గ ప్రజల ప్రయోజనాలను కాపాడడానికని ఆయన ప్రశ్నించారు. జిల్లాను ప్రతీ అంశంలోనూ పైలెట్ ప్రాజెక్టు పేరుతో ఎంపిక చేస్తూ అన్ని రకాల ప్రజా వ్యతిరేక చర్యలకు జిల్లాను ప్రయోగశాలగా మార్చివేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికే స్కూళ్లు, హాస్టళ్లను పైలెట్ ప్రాజెక్టు పేరుతో మూసివేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రేషన్ షాపులనుకూడా ఎత్తివేసేందుకు కుట్ర పన్నిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరహా విమర్శలు దాదాపు అన్ని వర్గాల నుంచి ఎదురవుతుండటం గమనార్హం. పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈ పరిణామాల విషయంలో ప్రజలకు సమాధానం చెప్పేందుకు కూడా వెనుకాడే పరిస్థితి నెలకొందనే చెప్పాలి. ఏది ఏమైనా గత ప్రభుత్వాల హయంలో రేషన్ కార్డులపై దాదాపు తొమ్మిది రకాల వస్తువులను సబ్సిడీ రేట్లపై అందిస్తూ వచ్చేవారు. వాటిని క్రమంగా ఒకటి వెనుక ఒకటి తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు బియ్యానికి పరిమితం చేశారు. దీనికి కూడా మరో విధానాన్ని తెరపైకి తీసుకువచ్చి ఈ మాత్రం బియ్యం కూడా ఎన్నాళ్లు ఇస్తారోనన్న అనుమానాలకు ప్రభుత్వం తెర తీసింది. రేషన్ దుకాణాల్లో బియ్యం అవసరమైన వారు తీసుకోవచ్చునని, అవసరం లేదని చెబితే ఆ మేరకు నగదు చెల్లించేస్తామని ప్రభుత్వమే ప్రకటించింది. ఆ విధంగా చూస్తే రానున్న రోజుల్లో ఈ వ్యవహారంలోనూ లోపాలు వున్నాయని చెప్పి బియ్యం పంపిణీని కూడా నిలిపివేస్తారేమోనన్న అనుమానాలను పేద ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చూసినా వచ్చే నెల నుంచి రేషన్ వ్యవస్థలో భారీ మార్పులే చోటుచేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే పేద వర్గాలకు జరిగే దారుణమైన నష్టంతోపాటు ఈ వ్యవస్థపై ఆధారపడి వున్న డీలర్లు, హమాలీలు, రవాణాదారులు ఇతరులు కూడా పూర్తిగా ఉపాధిని కోల్పోయే పరిస్థితే నెలకొంటుందని చెప్పవచ్చు.
తిరుపతిపురంలో కలకలం
హవాలా నిందితులు మహేష్, శ్రీనివాసరావులదే ఈ గ్రామమే
అత్తిలి, మే 13: విశాఖపట్నంలో డొల్ల కంపెనీల పేరుతో భారీ మొత్తాన్ని తమ కంపెనీల్లో జమ చేసుకుని వాటిని విదేశాలకు తరలించి, వైట్ మనీగా మార్చుకున్న ప్రధాన నిందితుడైన వడ్డి మహేష్, వడ్డి శ్రీనివాసరావులు మండలంలోని తిరుపతిపురం గ్రామానికి చెందిన వారు కావడంతో ఈ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. విశాఖపట్నంలో బ్యాంకులలో రూ.1500 కోట్లు భారీ హవాలా వ్యాపారం నిర్వహించి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు చిక్కారు. మహేష్ తండ్రి శ్రీనివాసరావు తండ్రి 25 ఏళ్ల క్రితం తన మేనమామ ద్వారా కోల్‌కత్తాకు జీవనోపాధి నిమిత్తం వెళ్ళారు. అక్కడ కమీషన్ వ్యాపారం నిర్వహిస్తూ స్థిరపడ్డారని బంధువులు తెలిపారు. తిరుపతిపురం గ్రామానికి చెందిన వడ్డి సూరన్నకు ముగ్గురు కుమారులు. వారిలో వడ్డి శ్రీనివాసరావు మూడవ కుమారుడు. శ్రీనివాసరావు అత్తిలికి చెందిన మేనమామ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం మేనమామతో కలిసి వ్యాపారం చేశాడు. అనంతరం శ్రీనివాసరావు కోల్‌కత్తా వెళ్ళి స్థిరపడినట్లు అతని సోదరుడు వడ్డి రామచంద్రరావు తెలిపారు. శ్రీనివాసరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలరు. రెండవ కుమార్తె వివాహం సుమారు సంవత్సరం క్రితం అత్తిలిలో అత్యంత వైభవంగా నిర్వహించాడు. ప్రధాన నిందితుని కుమారుడు మహేష్‌కు ఇంకా పెళ్ళి కాలేదు. శ్రీనివాసరావుకు సంబంధించి తిరుపతిపురం గ్రామంలోని పెంకుటింటిలో వాటా ఉంది.
ఆకివీడులో జగన్‌కు ఘనస్వాగతం
ఆకివీడు, మే 13: ఆకివీడులో శనివారం వైఎస్‌జగన్‌కు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జగన్ భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి వస్తూ మార్గం మధ్యలో మాదివాడ సెంటర్ వద్ద రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అయితే వైఎస్ జగన్ పాత బస్టాండ్ సెంటర్ వద్ద వైఎస్సార్ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. దీంతో జగన్ అభిమానులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. నాయకులకు అవగాహన కొరవడటంతో కేవలం కాన్వాయ్ నుంచి అభిమానులకు అభివాదం చేసి అక్కడ నుంచి నిష్క్రమించారు. అయితే అక్కడకు చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి కొద్దిసేపు కార్యకర్తలతో సంభాషిస్తారని భావించారు. దీనికి భిన్నంగా జరగడంతో కార్యకర్తలు, అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. జగన్ వెళ్ళిన కొద్ది నిమిషాలకే స్థానిక నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం ప్రారంభించారు. ఒక వర్గం వారు మాదివాడ సెంటర్‌లో ఆపితే మరో వర్గం వారు పాత బస్టాండ్ సెంటర్ వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించిందని బాహాటంగా విమర్శలు చేశారు.
పెట్రోలు బంకులకు ఆదివారం సెలవు
పగలు మాత్రమే అమ్మకాలు: కమిషన్ కోసం నేటినుంచి డీలర్ల ఆందోళన
నరసాపురం, మే 13: పెట్రోలు బంకుల నిర్వాహుకులు తమ డిమాండ్ల సాధనకు దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14 నుంచి ఆదివారం బంకులు మూసివేయాలని, మిగిలిన రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పెట్రో ఉత్పత్తులు విక్రయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని పెట్రోలు బంకుల వద్ద బ్యానర్లు, నోటీసు బోర్డులు ఏర్పాటు చేసారు. పెట్రో బంకుల నిర్వాహుకుల ఆందోళన ప్రభావం వినియోగదారుడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రజల జీవితంలో నిత్యావసరంగా మారిన పెట్రోలు, డీజిలు కోసం ఇక నుంచి అవస్థలు ఎదుర్కొనక తప్పేట్టులేదు. నరసాపురం నియోజకవర్గంలోని నరసాపురం, మొగల్తూరు ప్రాంతాలలో 12 పెట్రోలు బంకులున్నాయి. వీటిద్వారా నిత్యం లక్షల్లో పెట్రోలు, డీజిలు విక్రయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రొయ్యలు, చేపల సాగు విస్తృతంగా సాగుతున్న నరసాపురం నియోజకవర్గంలో రోజూ వేలాది లీటర్ల జీజిలును ఆక్వా రైతులు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాక ప్రతి ఇంటికి ఒక స్కూటరు లేక కారు ఉన్న కుటుంబాలు పెట్రోలును అధికంగా వినియోగిస్తున్నారు. వీటితో పాటు అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు చేరవేసే అంబులెన్సులపై కూడా పెట్రో ప్రభావం పడనుంది. అత్యవసర పరిస్థితుల్లో పెట్రోలు, డీజిలు అమ్మకాలు జరపకపోతే ప్రాణాలు సైతం గాలిలో కలసిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కమీషన్ పెంచాల్సిందే: పెట్రోలు బంకుల నిర్వాహణ కష్టతరంగా మారిన ఈ తరుణంలో పెట్రో ఉత్పత్తులపై కమీషన్ పెంచాల్సిందేనని బంకు నిర్వాహుకలు డిమాండ్ చేస్తున్నారు. 2012లో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆపూర్వచంద్ర కమిటీ సిపార్సులు అమలు చేయకుంటే బంకులు మూసివేయాల్సి వస్తుందని నిర్వాహుకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపూర్వచంద్ర కమిటీ సిఫార్సులను అనుసరించి పెట్రోలు అమ్మకాలపై లీటరుకు రూ.3.33 కమీషన్ ఇవ్వాల్సిఉండగా రూ.2.58 చెల్లిస్తున్నారు. డీజలుకు రూ2.12 చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.1.65 మాత్రమే ఇస్తున్నారని బంకు యజమానులు తెలిపారు.
బెల్టు షాపుల నిర్మూలనకు కృషి
* బెల్టు షాపులు, మట్టి మాఫియా, స్వచ్ఛ్భారత్ కమిటీ: మంత్రి మాణిక్యాలరావు
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, మే 13: నియోజకవర్గంలో బెల్టు షాపుల నిర్మూలనకు కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, ఎక్సైజ్, పోలీస్, జల వనరుల శాఖలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యానికి బానిసలై ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయన్నారు. నియోజకవర్గంలో బెల్టు షాపుల నిర్మూలనకు 12 మందితో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ నియోజకవర్గంలో స్వచ్ఛ్భారత్ ద్వారా గ్రామాల్లో ఆరోగ్య వాతావరణం నెలకొల్పడం, బెల్టు షాపుల నిర్మూలన, అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలింపుపై చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తుందన్నారు. సామాజిక మార్పుకోసం అందరూ కలిసి కృషిచేయాలన్నారు. ఈ కమిటీలో కర్రి సీతారామయ్య, చిట్టూరి ఇంద్రయ్య, దాసరి నరసింహారావు, జంగా రామ్‌రాయ్, మల్లిపూడి కనకదుర్గ, నల్లమల్లి వీరరాఘవరెడ్డి, తానేటి ఆనందరావు, కావలిపురపు వెంకటపతి, అయినం బాలకృష్ణ, సూరంపూడి వెంకటరమణ, జువ్వల వెంకటేశ్వరరావు, చోడగిరి సత్యనారాయణ (చినబాబు) సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు. మద్యం షాపుల్లో ఎమ్మార్పీకి అమ్మకాలు కొనసాగించేలా చూస్తారన్నారు. గృహాల సమీపంలో బెల్టు షాపుల వివరాలు నిరోధక కమిటీ ద్వారా సమాచారం అందిస్తే చర్యలు తీసుకోడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. అక్రమంగా మట్టిని తవ్వి అక్రమ రవాణా చేసేవారి వివరాలు రెవెన్యూ, పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. తాడేపల్లిగూడెంను అవినీతి రహిత నియోజకవర్గంగా ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతీ అధికారి, ప్రజాప్రతినిధి, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జల వనరుల శాఖ ఇఇ దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నీరు - చెట్టు కార్యక్రమంలో చెరువుల మరమ్మతు, పూడిక పనులు నిర్వహిస్తున్నామని, పది లస్కర్లకు ఒక్కరే అందుబాటులో ఉన్నారన్నారు. భూగర్భ జలాలు మూడు నుంచి ఎనిమిది మీటర్లు మధ్యలో ఉండాలని, ప్రస్తుతం 12 మీటర్ల కంటే దిగువ స్థాయిలో ఉన్నాయన్నారు. రెవెన్యూ సర్వేల ద్వారా చెరువుల హద్దులు సర్వే చేయించి రాళ్ళు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్సైజ్ ఎస్సై స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ బెల్టు షాపులపై దాడులు చేస్తున్నామన్నారు. ఎంపిడిఓ వివి రామాంజనేయశర్మ మాట్లాడుతూ నియోజకవర్గంలో స్వచ్ఛబారత్ నిర్వహిస్తున్నామని, బహిరంగ మల విసర్జన జరగకుండా అన్ని గ్రామాల్లో చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెంటపాడు తహసీల్దార్ వి.మధుసూదనరావు మాట్లాడుతూ క్రమశిక్షణతో ఎలాంటి పని అయినా సాధించవచ్చన్నారు. పట్టణ సిఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ గ్రామస్థాయి ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటే ఎటువంటి అవినీతి జరిగినా పోలీసులకు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కమిటీ అధ్యక్షుడు కర్రి సీతారామయ్య మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకనుగుణంగా అభివృద్ధి జరగాలన్నారు. రైతు సంఘం అధ్యక్షుడు నల్లమిల్లి వీరరాఘవరెడ్డి మాట్లాడుతూ మద్యం, బెల్టు షాపులు మూసేయాలని ప్రతీ మహిళ కోరుకుంటుందన్నారు. తానేటి ఆనందరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి అమ్మకాలు జరగాలన్నారు. తెలుగుదేశం నాయకులు చిట్టూరి ఇంద్రయ్య మాట్లాడుతూ గ్రామాల్లో చెరువులు సర్వే చేయించి సర్వే రాళ్ళు ఏర్పాటు చేయాలన్నారు. బిజేపి నాయకులు అయినం బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలన్నీ లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పెంటపాడు ఎంపిడిఓ మల్లికార్జునరావు, స్థానిక ఎస్సైలు ఎం.సూర్యభగవాన్, రూరల్ ఎస్సై వి.చంద్రశేఖర్, పెంటపాడు ఎస్సై సుబ్రహ్మణ్యం, బిజెపి ఫ్లోర్ లీడర్ యెగ్గిన నాగబాబు, బిజెపి జిల్లా కార్యదర్శి కంచుమర్తి నాగేశ్వరరావు, కౌన్సిలర్ కోట రాంబాబు, ఎఎంసి మాజీ చైర్మన్ పోతుల అన్నవరం తదితరులు పాల్గొన్నారు.
చినవెంకన్నను దర్శించుకున్న ఫైర్ సర్వీసెస్ డిజి
ద్వారకాతిరుమల, మే 13: ప్రముఖ పుణ్యక్షేత్రమైన చినవెంకన్న ఆలయాన్ని ఫైర్ సర్వీసెస్ డిజి కె సత్యనారాయణ శనివారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, పండితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో ఆయనకు అర్చకులు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనం అందజేశారు. ఆ తర్వాత ఆలయ సూపరింటెండెంట్ జగ్గారావు ఆయనకు స్వామివారి చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఆయనతో రీజనల్ ఫైర్ అధికారి మురళీమోహనరావు తదితరులు పాల్గొన్నారు.
ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా
నరసాపురం, మే 13: పట్టణంలో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నట్టు మున్సిపల్ చైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాల సాయి తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ లాకుపేట, పొన్నపల్లి, చినమామిడిపల్లి, గ్రేస్ నగర్, జవదాలవారిపేట తదితర ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నామన్నారు. అలాగే మంచినీటి చెరువు, పంపింగ్ స్టేషన్‌లో ప్రత్యేక జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా పైపులైను లీకైతే తక్షణం అత్యవసర సిబ్బంది మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించామని చైర్‌పర్సన్ రత్నమాల సాయి చెప్పారు. సమావేశంలో మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ చండీదేవసేన, ఆర్‌ఐ శిరిగినీడి శివాజి, ఎఇ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
వివాహ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
ఏలూరు, మే 13 : జిల్లా కేంద్రమైన ఏలూరులో శనివారం జరిగిన మాజీ ఎమ్మెల్యే, వై ఎస్ ఆర్ సిపి నేత ఘంటా మురళీరామకృష్ణ కుమార్తె పావని వివాహ మహోత్సవ వేడుకల్లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన వధూవరులు డాక్టర్ పావని, నిషాంత్‌లకు అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు స్థానిక నరసింహరావుపేటలోని జిల్లా వైకాపా అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఇంటికి వచ్చిన వై ఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆ పార్టీ నేతలు ఆళ్ల నాని, కోటగిరి శ్రీ్ధర్, పిల్లి సుభాష్ చంధ్రబోస్, ముదునూరి ప్రసాదరాజు, మేకా శేషుబాబు, మంచెం మైబాబు, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, గుడిదేశి శ్రీనివాసరావు, గోలి శరత్‌రెడ్డి, బొద్దాని శ్రీనివాస్, పి రాము తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి గన్నవరం చేరుకుని విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భీమడోలు విద్యార్థిని రాణి
భీమడోలు, మే 13 : మండలంలోని పొలసానిపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్ధిని బి రాణి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ టిఏ ఆశాలత తెలిపారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామానికి చెందిన బొడ్డు దావీదు, నాగమణిల కుమార్తె రాణి పదవ తరగతి వరకు అదే గ్రామంలో విద్యాభ్యాసం చేసింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో పొలసానపల్లి గురుకుల పాఠశాలలో చేరింది. పాఠశాల నుంచి పర్వతారోహణ కార్యక్రమంలో భాగంగా గతంలో ఎతె్తైన పర్వతమైన (17 వేల మీటర్లు) రినాక్ పర్వతాన్ని ఇతర విద్యార్ధులతో కలిసి అధిరోహించింది. అనంతరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకై ఎంపిక చేసిన విద్యార్ధులతోపాటు రాణి కూడా శిక్షణ పొందింది. శిక్షణ అనంతరం శనివారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది.