పశ్చిమగోదావరి

బౌండరీ దాటిన బెట్టింగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 18 : ఓవల్ మైదానంలో ఇండియన్ క్రికెటర్ల బ్యాటింగ్‌లో ఎన్ని బౌండరీలు సాధించారో గానీ ఆ మ్యాచ్ ఆధారంగా ఇక్కడ బెట్టర్ల వ్యవహారాలు మాత్రం బౌండరీలు దాటి వెళ్లిపోయాయి. అయితే దాయాదుల పోరులో ఇండియాదే పైచేయి అన్న నమ్మకంతో ఇక్కడ బెట్టర్లు భారీ ఎత్తున బెట్టింగులు కాశారు. పాకిస్తాన్ ఈ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించడంతో వారంతా దారుణంగా దెబ్బతిన్నట్లు పరిస్థితి మారిపోయింది. కనీసం సగం స్కోరు కూడా సాధించకుండా భారత్ చతికిలపడటంతో అభిమానులంతా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఒక రకంగా గత చరిత్రలు, ఆటగాళ్ల స్ట్రైకింగ్ రేట్లు ఇలాంటివి అనేకం భేరీజు వేసుకుంటూ ఆ మైదానంలో ఏ జట్టుకు ఎక్కువ అనుకూలతలు వున్నాయి వంటివి అధ్యయనం చేసుకుని మరీ వీరంతా బెట్టింగు రంగంలోకి దిగినా చివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫైనల్స్‌లో దాయాదుల పోరులో వీరు కూడా దారుణంగా దెబ్బతిన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది ఇప్పటిలో తేరుకునే అవకాశమే లేదంటే అతిశయోక్తి కాదు. పాక్ ఇన్నింగ్స్ తరువాత నుంచి అందరిలోనూ కొంత నిరాశ కనిపించినా చివరి వరకు కూడా ఇండియా ఫేవరెట్టుగానే నిలవడంతో బెట్టర్లు అదే ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లారు. చివరకు పాక్ ఘన విజయం సాధించడంతో అందరూ మట్టైపోయినట్లు పరిస్థితి తయారైంది. ఈ మ్యాచ్ కోసం జనమంతా గత కొద్దిరోజులుగా తీవ్రమైన ఉత్కంఠతో ఎదురు చూస్తూనే వచ్చారు. బెట్టింగ్ ప్రపంచంలో ముందునుంచీ ఇండియా ఫేవరెట్టుగానే కొనసాగుతూ వచ్చింది. దానికి తగ్గట్టే ఈ మ్యాచ్ ఆదివారం రావడంతో దాదాపుగా జనమంతా టివిలకు అతుక్కుపోయారు. మ్యాచ్ ప్రారంభమైన తరువాత రహదారులు దాదాపుగా నిర్మానుష్యమవుతున్న పరిస్థితే కనిపించింది. ఇలా ఎక్కడికక్కడ యువతరం కూడా ఇండియా ఈసారి ఎలాగైనా గెలుస్తుందన్న ధీమాతో ముందుగానే విజయోత్సవాలకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఔత్సాహికులు అధిక శాతం మంది ముఖాలకు మూడు రంగులు వేసుకుని మరీ సిద్ధమయ్యారు. అయితే ఇంతటి ఉత్సాహం, ఉత్కంఠ మ్యాచ్ ప్రారంభమైన తొలి దశలోనే దెబ్బతిన్నట్లు వీరిని చూస్తే అర్ధమవుతుంది. పాకిస్తాన్ తొలి బ్యాటింగ్‌కు రాకుండా చూడాలని ముందునుంచి వ్యూహం ప్రచారంలో వుంది. అయితే చివరకు అదే పరిస్థితి మైదానంలో కనిపించడంతో కొంత నిరాశ కనిపించింది. అయినప్పటికీ ఇండియా ఫేవరెట్టుగానే కొనసాగింది. మరోవైపు అక్కడ పరుగులు వరద కొనసాగుతున్నా ఇండియావైపే అందరూ మొగ్గు చూపడంతో మన బెట్టర్లు కూడా క్రికెట్టు ఆటగాళ్లకు మించి ఉత్సాహంతో ఇండియాపైనే విపరీతంగా బెట్టింగులు కాసేశారు. కొంతమంది అయితే లక్షల్లోనే ఈ వ్యవహారాలను నడిపించారు. దీనితో చావో రేవో అన్నట్లు వారి పరిస్థితి మారిపోయింది. ఇక ఆ తరువాత నుంచి ఓవర్ గడుస్తున్న కొద్దీ బెట్టర్ల హావభావాలు, బిపిల స్థాయిల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటూనే వచ్చాయి. పాకిస్తాన్ ఇన్నింగ్స్ పూర్తయ్యే సరికి విజయ లక్ష్యం భారీ స్థాయిలో కనిపించడంతో చాలా మంది పూర్తి నిరాశలో కూరుకుపోయారు. చివరి నిమిషంలో తమ బెట్టింగ్‌లను మార్పు చేసేందుకు అధిక శాతం మంది విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఎటు నుంచి పరిస్థితి ఎటు మారుతుందోనన్న ఆశ కూడా చాలా మందిని వెంటాడుతూ వచ్చింది. అయితే భారత్ ఇన్నింగ్స్ మొదలైన తరువాత మాత్రం వారు ఎప్పటికప్పుడు తీవ్ర నిరాశకు లోనవుతూ వచ్చారు. ఒకరితర్వాత ఒకరు పెవిలియిన్‌కు తరలి పోవడంతో ఇంత భారీ స్కోరును ఈ విధంగా సాధించడం దాదాపు అసాధ్యమన్న అభిప్రాయానికి బెట్టర్లు కూడా వచ్చేశారు. ఈ పరిణామాలన్నీ వారిని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. మరోవైపు జిల్లా కేంద్రమైన ఏలూరులోనే పలు కూడళ్లలో స్థానిక క్రికెట్ టీమ్‌లు ఇండియా గెలిస్తే ఉత్సవాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా దీనికి అండదండలు అందించారు. అయితే ఈ ఉత్సవాలను నిర్వహించే పరిస్థితి భారత్ ఇన్నింగ్స్ సాగిన తీరు చూసుకుంటే దాదాపుగా ఆ అవకాశం చేతికి అందే పరిస్థితి లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మరో విధంగా చూస్తే బెట్టింగ్ వ్యవహారం మాత్రం అధిక శాతం మందిని నట్టేట ముంచినట్లే కనిపిస్తోంది. భారత్ మొదటి నుంచి విజయం సాధిస్తుందన్న విశ్వాసం అందరిలోనూ వ్యక్తం కావడంతో బెట్టర్లు కూడా అటువైపే భారీగా మొగ్గు చూపారు. జిల్లా వ్యాప్తంగానే ప్రధాన పట్టణాల్లో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా భారీ ఎత్తున సాగిపోయింది. కొంతమంది ఆటమీద ఉత్సాహంతో మ్యాచ్‌ను చూడగా చాలా మంది మాత్రం తాము కాసిన బెట్టింగ్‌లు ఏమవుతాయోనన్న టెన్షన్‌తోనే మ్యాచ్‌ను చూసినట్లు కనిపించింది. వార్ వన్‌సైడ్ కావడంతో మ్యాచ్‌పై బెట్టింగులు కాసిన అధిక శాతం మంది దారుణంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. నిర్వాహకులు కూడా చివరి నిమిషం వరకు బెట్టింగ్‌లను ప్రోత్సహించే విధంగానే వ్యవహారం నడిపిస్తూ రావడంతో మరింత మంది ఈ జాబితాలోకి చేరిపోయినట్లు కనిపించింది. ఒక్క పూటలో జాతకం మారిపోతుందన్న ప్రచారం జోరుగా సాగడం మరోవైపు మ్యాచ్‌లో పరిణామాలు అనూహ్యంగా మారుతూ రావడంతో చాలా మంది జాతకాలు నిజంగానే దెబ్బతిని మారిపోయినట్లు తెలుస్తోంది.
సమిష్టిగా అభివృద్ధి సాధిద్దాం
*ప్రభుత్వ విప్ చింతమనేని
ఏలూరు, జూన్ 18 : మండల స్థాయి టిడిపి నాయకులు ఐకమత్యంగా వుండి ప్రజలకు సేవలు అందిస్తూ అభివృద్దికి సహకరించాలని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి ఏలూరు రూరల్, దెందులూరు, పెదపాడు, పెదవేగి మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అర్హులకే ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత మండలస్థాయి నాయకులపై వుందని చెప్పారు. ఉపాధి పనులు ముమ్మరంగా నిర్వహించాలని, గత ఏడాది రాష్ట్రంలోనే ప్రధమ స్థానం వచ్చిందని, ఈ ఏడాది కూడా అదే విధంగా వచ్చేలా వ్యవహరించాలన్నారు. వర్షాకాలం నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రజలను చైతన్యపర్చాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నేతల రవి, గుత్తా అనిల్‌కుమార్, మోరు శ్రావణి, కూరపాటి మార్తమ్మ, వీరమాచనేని ప్రభాకరరావు, మిల్లుబాబు, పప్పల సుశీల, ముమ్మిడి సక్కుకుమారి, చింతయ్య, దేవరపల్లి బక్కయ్య, తాతా సత్యనారాయణ, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

చావో..రేవో తేల్చుకుంటాం
*ఎనిమిది నియోజకవర్గాల్లో ముద్రగడ పాదయాత్ర: కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినమిల్లి

భీమవరం, జూన్ 18: కాపు రిజర్వేషన్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంతో చావో..రేవో తేల్చుకుంటామని కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు స్పష్టం చేశారు. చలో అమరావతి పాదయాత్రలోపు సిఎం చంద్రబాబునాయుడు కాపులకు స్పష్టమైన ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేశారు. ఆదివారం భీమవరంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్ర పోస్టర్లను పట్టణ కాపునాడు అధ్యక్షుడు బేతు కృష్ణారావు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చినమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో ముద్రగడ అడుగిడతారన్నారు. అక్కడ నుంచి నిడదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, భీమవరం, ఉండి తదితర నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర కొనసాగిస్తారని చెప్పారు. కాపు సోదరులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమపై ప్రభుత్వం దమననీతితో దౌర్జన్యం చేస్తోందని, దీనిని ఖండిస్తున్నామన్నారు. కాపుల సమస్యలను పరిష్కరించమని అడిగితే ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప రెచ్చగొట్టే ప్రకటనలు చెయ్యడం సమంజసంగా లేదన్నారు. ఆరేటి ప్రకాష్, ఉండవల్లి రమేష్‌నాయుడు, ఎస్‌ఎస్ రావు, గుద్దటి ఆంజనేయులు, కమ్మెల రాము, కోయ శ్రీరామ్మూర్తి, ముత్యాల రాము తదితరులు పాల్గొన్నారు.

శ్రీ మద్ది క్షేత్రం కేంద్రంగా పోలవరం ప్రాజెక్టుతో కలిపి
పర్యాటక ప్యాకేజీ
*మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుజాత
జంగారెడ్డిగూడెం, జూన్ 18: మహా మహిమాన్వితుడైన స్వయంభూః శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయం కేంద్రంగా పోలవరం ప్రాజెక్ట్‌తో కలిపి పర్యాటక ప్యాకేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో పర్యాటక ప్యాకేజీ ఉందని మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యురాలు పీతల సుజాత వెల్లడించారు. స్వయంభూః శ్రీ మద్ది ఆంజనేయస్వామివారి క్షేత్రంలో 65 లక్షలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం సుజాత ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసారు. ఆలయానికి ఈశాన్య భాగాన పది లక్షలతో నిర్మించనున్న కోనేరుకు శంకుస్థాపన చేసారు. శ్రీ మద్ది ఆంజనేయస్వామివారి ఆలయ పడమర ప్రకారం నందు దాత పివిఆర్ గ్రూపు అధినేత పిపి రాజు 20 లక్షలతో నిర్మించిన ప్రాకార మండపాన్ని సుజాత ప్రారంభించారు. శ్రీ మద్ది క్షేత్రంలోని ఉపాలయం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 25 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రకారం, రఫ్ గ్రానైట్ ఫ్లోరింగ్, ఆలయ మండపమునకు శాలాహారం మొదలైన అభివృద్ధి పనులను సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ శ్రీ మద్ది ఆంజనేయస్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తులు విశ్వసిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే శ్రీ మద్ది ఆంజనేయస్వామివారు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారని, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు తెస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని చూస్తున్నారని, దీనిలో భాగంగా శ్రీ మద్ది ఆలయానికి ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తున్నారని చెప్పారు. ఆలయంలో నిత్యాన్నదానంతో పాటు ఇటీవలే ఆన్‌లైన్ సేవలు కూడా ప్రవేశపట్టెనట్టు గుర్తు చేసారు. ఈ ప్రాంతం పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా ఉందన్నారు. శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం కేంద్రంగా పోలవరం ప్రాజెక్టు, ఎర్రకాల్వ జలాశయం, పాపికొండలు, పట్టిసీమ, జీలకర్రగూడెం బౌద్ధ ఆరామాలు కలిపి టూరిస్ట్ హబ్ ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమాలలో దేవస్థానం ఛైర్మన్ యిందుకూరి రంగరాజు, ఇఒ పెనె్మత్స విశ్వనాధరాజు(శివ), తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మండవ లక్ష్మణరావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, జడ్పీటిసి శీలం రామచంద్రరావు, వైస్ ఎంపిపి ఉమ్మడి రాంబాబు, ఎంపిటిసి సభ్యులు ఖండవల్లి మరియమ్మ, పోతన బాపిరాజు, తెలుగుదేశం నేతలు దల్లి కృష్ణారెడ్డి, పెనుమర్తి రామ్‌కుమార్, వందనపు హరికృష్ణ, ముళ్ళపూడి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు తూటికుంట దుర్గారావు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, మున్సిపల్ కమిషర్ చోడగం వెంకటేశ్వరరావు, శ్రీ మద్ది దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై పోలీసు, రెవిన్యూ అధికారులకు
శిక్షణా తరగతులు
రాష్ట్ర షెడ్యూల్డు కులాలు, తెగల కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ
ఏలూరు, జూన్ 18 : రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టంపై పోలీసు, రెవిన్యూ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర షెడ్యూల్డు కులాలు, తెగల కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ చెప్పారు. స్థానిక జిల్లా పరషత్ అతిధిగృహంలో ఆదివారం సాయంత్రం షెడ్యూల్డు కులాలు, తెగల ప్రజల నుండి పలు సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టంపై ప్రధానమైన పోలీసు, రెవిన్యూ అధికారులను సరైన అవగాహన లేని కారణంగా షెడ్యూల్డు కులాలు, తెగల వారికి తగిన న్యాయం జరగడం లేదని, కేసులలో బాధితులకు సరైన సహాయ పునరావాస చర్యలు పూర్తి స్థాయిలో అందడం లేదన్నారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలుచేసేందుకు పోలీసు శాఖలో సిఐ, డిఎస్‌పి స్థాయి అధికారులకు జిల్లాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహించి దళిత, గిరిజనులకు రక్షణ కల్పిస్తామని, అనంతరం రెవిన్యూ అధికారులకు శిక్షణ అందిస్తామన్నారు. శిక్షణా తరగతులను సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులలో బాధితులకు రెండు నెలల కాలంలోనే తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో పశ్చిమగోదావరి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించి దళిత, గిరిజనుల సమస్యలను చర్చిస్తామని, జిల్లాలో అన్యాక్రాంతమైన దళిత, గిరిజనుల భూములను సర్వే చేయించి వారికి న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కొల్లేరు ప్రాంతంలోని షెడ్యూల్డు కులాల భూ భూ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా కొల్లేరు ప్రాంతంలోని షెడ్యూల్డు కులాల మత్స్యకార సొసైటీలకు ఆర్ధిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అందిన వినతిపత్రాలలో దళితులు భూముల ఆక్రమణ, షెడ్యూల్డు కులాలు, తెగల అటాస్రిటీ కేసులలో సరైన న్యాయం జరగలేదని, ఎస్‌సి, ఎస్‌టి వ్యవసాయ భూములలో బోర్లు ఏర్పాటు చేయలేదని తదితర సమస్యలపై ప్రజల నుండి ఇజ్ఞప్తులు అందాయని, వీటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవలసిందిగా సంబంధిత శాఖల అధికారులను కోరడం జరిగిందని చెప్పారు. ఛైర్మన్ వెంట జిల్లా ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సభ్యులు దాసరి ఆంజనేయులు, దళిత నాయకులు కొనగర్ల శ్యామ్, నేతల రవి, అబ్బూరి అనిల్, గుడిపూడి చక్రవర్తి, కామ దేవరాజు, వివిధ దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఆలయాల్లో ఆధ్యాత్మికత, ప్రశాంతత నెలకొల్పాలి
* ఎమ్మెల్యే సుజాత
జంగారెడ్డిగూడెం, జూన్ 18: ఆలయాలు ఆధ్యాత్మికత, ప్రశాంతతకు నిలయాలుగా మార్చేందుకు పాలకమండళ్ళు కృషి చేయాలని మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యురాలు పీతల సుజాత అన్నారు. స్థానిక శ్రీ సీతారామస్వామి దేవస్థానం పాలకమండలిచే ఆదివారం ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత శ్రీ సీతారామస్వామిని దర్శించుకున్న సుజాతను దేవస్థానం ఛైర్మన్‌గా ఎన్నికైన టివిఎ సుబ్బారాయుడు దంపతులు సత్కరించారు. ధర్మకర్తల మండలి సభ్యులుగా తడికిమళ్ళ వీరభద్ర అప్పల సుబ్బారాయుడు(సుబ్బారావు), ఊదర సుబ్బారావు, అరటికోట్ల దుర్గాప్రసాద్, రొంగల పుల్లయ్య, కొండాబత్తుల వెంకటాచలం, కొత్తూరి సత్తిబాబు, మదనంబేడి కృష్ణప్రియ, ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఆలయ ప్రధానార్చకులు వాడపల్లి శేషనారాయణాచార్యులు ప్రమాణ స్వీకారం చేసారు. అనంతరం సుజాత ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఛైర్మన్‌గా సుబ్బారాయుడు(సుబ్బారావు) పేరును మదనంబేడి కృష్ణప్రియ ప్రతిపాదించగా, దుర్గాప్రసాద్, ఊదర సుబ్బారావు బలపరిచారు. ఛైర్మన్‌గా వేరే పేరు ప్రతిపాదనకు రాక పోవడంతో టివిఎ సుబ్బారాయుడు (సుబ్బారావు) ఏకగ్రీవంగా ఛైర్మన్‌గా ఎన్నికైనట్టు సుజాత ప్రకటించారు. అనంతరం ఛైర్మన్, సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సుజాత మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పని చేసినవారిని విస్మరించకుండా సామాజిక సమీకరణాలతో, అన్ని వర్గాలను కలుపుకుపోతూ నామినేటెడ్ పదవులు ఇస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడేళ్ళుగా రాష్ట్భ్రావృద్దికి కృషి చేస్తూనే కార్యకర్తల సంక్షేమాన్ని కూడా మరువలేదన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఇప్పటికే కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటున్నారని చెప్పారు. కార్యకర్తలకు సంక్షేమంతో పాటు పదవులు ఇచ్చి గౌరవించాలన్నదే వారి ఆశయమని చెప్పారు. దేవస్థానం ధర్మకర్తల మండలి పదవులు లభించిన వారు ఆలయాలకు వచ్చే భక్తులకు సేవలందించాలన్నారు. దర్శనం, ప్రసాదం అందరికీ అందేలా చూడాలన్నారు. ఆధ్యాత్మిక చింతన, ప్రశాంతత ఆలయాలలో పెంపొందించాలన్నారు. వీటి కోసం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నూతన కమిటికి సూచించారు. కమిటీతో పాటు ముఖ్యమంత్రికి కూడా శ్రీ సీతారాముల ఆశీస్సులు కావాలన్నారు. తొలుత సభకు స్వాగతం పలికిన పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి మద్దిపాటి నాగేశ్వరరావు తన ప్రసంగంలో పార్టీలో కష్టపడి పని చేసేవారిని విస్మరించేది లేదన్నారు. పని చేసే కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలోనే గుర్తింపు ఉంటుందన్నారు. ఈ సభలో పార్టీ సీనియర్ నేత మండవ లక్ష్మణరావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, వైస్ ఛైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, పార్టీ నేత పెనుమర్తి రామ్‌కుమార్, జడ్పీటిసి శీలం రామచంద్రరావు, శ్రీ మద్ది దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు(శివ) తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ధర్మక్తల మండలి ఛైర్మన్, సభ్యులను పలువురు పూలమాలలతో సత్కరించి, అభినందించారు.
కెడిఎం పేరుతో దోపిడీ
* జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆగ్రహం

భీమవరం, జూన్ 18: ఇదేం జిల్లా..కల్తీల ఖిల్లా..నీరు, పాలు, డ్రింక్‌లు అన్నీ కల్తీలే. గ్రామ, మండల, పట్టణ స్థాయిలో పని చేయాల్సిన ఆహార సలహా సంఘాలు సక్రమంగా లేవు. కెడిఎం పేరుతో బంగారం దుకాణాలు వినియోగదారులను మోసం చేస్తున్నాయని జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య మండిపడింది. ఫిర్యాదుచేస్తే అధికారులు తనిఖీలు చెయ్యడంమాని నిద్రపోతున్నారని విమర్శించారు. జిల్లా సంఘం అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య అధ్యక్షతన ఆదివారం స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో వినియోగదారుల సంఘాల సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ మండళ్లు, వినియోగదారులు ఏ విధంగా మోసపోతున్నారు తదితర అంశాలపై చర్చించారు. అదే విధంగా పెట్రోల్ ఉత్పత్తులను కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆ విధంగా చేస్తే లీటరు పెట్రోల్ రూ.40లకే వస్తుందన్నారు. గ్యాస్ డోర్ డెలివరీ విషయంలో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఫిర్యాదులు చేసినా డీలర్లు పట్టించుకోవడం లేదని, కల్తీలు కనిపెట్టేందుకు జిల్లాలో ల్యాబ్‌ను ఏర్పాటుచెయ్యాలని, బంగారం దుకాణాల్లో కాటాల మోసాలు, జనరిక్ మందులపై జనరిక్ అని ముద్రించాలని చర్చించారు. మేళం దుర్గాప్రసాద్, గోపాలకృష్ణంరాజు, ఎఆర్‌కె హనుమంతరావు, రామభద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరులో ‘ అమీ తుమీ ’ సందడి
ఏలూరు, జూన్ 18 : స్థానిక అంబికా ధియేటర్‌లో ఆదివారం అమీ తుమీ చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులతో నేరుగా కొద్దిసేపు సందడి చేశారు. చిత్ర నిర్మాత నరసింహారావు మాట్లాడుతూ కధ, కధనం నూతనంగా వుందని, సాహసం చేసి చిత్రాన్ని నిర్మించామని, అయితే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, తమకు మరింత స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. దర్శకుడు ఇంద్రకంటి మోహనకృష్ణ మాట్లాడుతూ చిత్రం ఎలా వుంది, కధ ఎలా వుంది, పాటలు ఎలా వున్నాయని ప్రశ్నించగా కధ నూతనంగా వుందని, సంభాషణలు కూడా సందర్భోచితంగా వున్నాయని, మంచి కధాంశంతో తీసినందుకు కృతజ్ఞతలు అంటూ వర్ణించారు. హీరో వెనె్నల కిషోర్, హీరోయిన్ ఇషా రెబాన్‌లు ప్రేక్షకులతో నేరుగా సినిమా ఎలా వుందని ముచ్చటించారు. రానున్న సినిమాలు మరింత ఉత్సాహంగొలిపే విధంగా సినిమాల్లో నటించాలంటూ ప్రేక్షకులు సూచించారు. కార్యక్రమంలో తనికెళ్ల భరణి మాట్లాడుతూ కధలో సారాంశం వుంటే దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని తెలియజేయడానికి నిదర్శనం అమీ తుమీయేనని పేర్కొన్నారు. ఈసందర్బంగా యూనిట్ సభ్యులను పలువురు కరచలనం చేసేందుకు, ఆటో గ్రాఫ్‌లు తీసుకునేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. దాదాపు గంట పాటు ప్రేక్షకులతో యూనిట్ సభ్యులు సందడి చేశారు.

రైతులకు విస్తృత సేవలు అందించడమే ధ్యేయం
*డిసిసిబి ఛైర్మన్ ముత్యాల రత్నం
ఆకివీడు, జూన్ 18: సహకార సంఘాల ద్వారా రైతులకు విస్తృత సేవలు అందించడమే ధ్యేయమని డిసిసిబి ఛైర్మన్ ముత్యాల రత్నం అన్నారు. ఆదివారం మండలంలోని చెరుకుమిల్లి సొసైటీ బ్యాంకు పరిధిలో రూ.40 లక్షలతో నిర్మించిన గొడౌన్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా వివిధ వ్యాపారాలు చేసి ఆర్థికంగా బలపడేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎఎంసి ఛైర్మన్ మోటుపల్లి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. చెరుకుమిల్లి సొసైటీ అధ్యక్షుడు కలిదిండి శ్రీనగేష్‌రాజు మాట్లాడుతూ బ్యాంకు పరిధిలో సూపర్ మార్కెట్, ధాన్యం కొనుగోలు కేంద్రం తదితర వాటిని ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. సొసైటీకి వచ్చే బోనస్, షేర్‌లను సభ్యులకు సర్థుతున్నామన్నారు. గత దాళ్వా సీజన్‌లో బ్యాంకుకు రూ.20 లక్షలు లాభాలు వచ్చాయన్నారు. రైతుల క్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. జడ్పీటీసీ సభ్యురాలు మనె్న లలితాదేవి, ఎంపిపి పిన్నమరాజు వాణి, డిఆర్ సంకు మురళీకృష్ణ, ఒఎస్‌డి నాగభూషణం పాల్గొన్నారు.
పునరావాస ప్యాకేజీ అవార్డు ప్రక్రియపై
కుకునూరులో వాట్సప్ సందడి
కుకునూరు, జూన్ 18 : మండల కేంద్రమైన కుకునూరులో సోమవారం జరిగే పునరావాస ప్యాకేజీ అవార్డు ప్రక్రియ ముందుగానే ఐటిడి ఏ పివో వాట్సప్ నెంబర్ ఇవ్వడంతో ప్యాకేజీ అవినీతి పూర్తిస్థాయిలో వాట్సప్‌లో పెట్టినట్లు ఎక్కడ చూసినా ప్రజల్లో వాట్సప్ సందడే కనిపించింది. కుకునూరులో చిన్న ఇల్లు, పురాతన భవనాలు, పెంకిటిళ్లకు అధిక మొత్తంలో సొమ్ము వచ్చిన వారు ఉన్నత స్థాయి వ్యక్తులు కావడంతో వారిపై ఐటిడి ఏ పివో షాన్ మోహన్ వాట్సప్ బాణం ఎక్కుపెట్టడంతో ప్రతీ ఒక్కరూ ఈ వాట్సప్‌లో అధిక మొత్తం కాజేయాలనే వారి వివరాలను పెట్టడంతో గుట్టు రట్టు చేసినట్లవుతోందని ప్రతీ సెంటర్‌లో ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనితో అధిక మొత్తం ప్యాకేజీ పడిన వారు నోటిఫికేషన్ రోజున ఆనంద పడ్డారుగానీ వాట్సప్ సమాచారంతో తమ గుట్టు రట్టవుతోందని ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్కువ వచ్చిన వారు స్వచ్ఛందంగా ఒప్పుకుంటారా? లేదా? అనేది సోమవారం జరిగే గ్రామసభలో తేలనుంది. వీరు తేల్చకపోయినా పక్కాగా నిజాయితీతో నిలబడిన సబ్ కలెక్టర్ షాన్‌మోహన్ వాట్సప్‌ద్వారా వచ్చిన సమాచారాన్ని ప్రతీదాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తానని ముందుగానే హామీ ఇవ్వడంతో తప్పకుండా ఎక్కువ వచ్చిన వారి ప్యాకేజీలో తగ్గిస్తారని అందరూ నమ్ముతున్నారు. అందులో సందేహం లేదు. అది సోమవారం జరిగే గ్రామసభలో తేలిపోనుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఒకే ఇంటిని నలుగురు నుంచి ఆరుగురు వరకు ఇంటి పన్నులు కట్టి ఇంటికి కోటి రూపాయలు ప్యాకేజీ వచ్చే విధంగా చేసుకున్నారు. ఇది కూడా బట్టబయలు కాక తప్పదు. ఎందుకంటే కుకునూరులో జరిగే అవినీతిపై పివో పూర్తి దృష్టి సారించారు. సోమవారం జరిగే పునరావా ప్యాకేజీ ప్రక్రియకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొత్తముఖాలతో కుకునూరు కళకళలాడుతోంది. ఈ కొత్త ముఖాలకు సైతం ముందుగానే అన్ని అర్హతలు సాధించుకుని నోటిఫికేషన్‌లో మంజూరు చేయించుకున్నారు. ఇక గ్రామసభలో వీరి అవసరం లేకపోవడంతో ఈ అవినీతి ఎలా బయటకు వస్తుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికైనా వాట్సప్‌ను ఐటిడి ఏ పివో క్షుణ్ణంగా పరిశీలిస్తే అన్ని విషయలు బయటకు వస్తాయని, వచ్చిన అవినీతిని గ్రామసభలోనే అందరి ముందర తెలియజేస్తే మరోసారి ఇటువంటి తప్పిదాలకు తావుండదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సోమవారం జరిగే గ్రామసభతో అవినీతిపై కొరడా ఝుళిపించినట్లేనని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు
అత్తిలి, జూన్ 18 : కొమ్మర గ్రామంలో శ్రీవల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. భీమవరం మావుళ్ళమ్మ దేవస్థానం ఘనాపాటి ఈమని సీతారామచంద్ర సోమయాజులు ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. వెంకట సుబ్రహ్మణ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో అత్తిలి వెంకటరత్న ప్రసాద్ శర్మ దంపతులు పూజలు జరిపారు. గ్రామ పురోహితులు శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణలు నిర్వహించారు. ఘనాపాటి సీతారామచంద్ర సోమయాజులును సత్కరించారు.