పశ్చిమగోదావరి

ఇక్కడింతే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 19: ఈ జిల్లాలో పరిస్ధితులు చూస్తుంటే ఇక్కడింతే... అన్నట్లుగా మారిపోతోంది. తహసిల్దార్లు జిల్లాకు శరపరంపరగా వస్తూనే ఉన్నా వారికి పోస్టింగ్‌లు ఇచ్చే విషయం మాత్రం ముందడుగు పడటం లేదు. వాస్తవానికి అవసరమైనచోట్ల సమర్ధులైన అధికారులు లేక, అర్హులైనవారు కానరాక పాలనాపరంగా ఎన్నో ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి పరిస్దితుల్లోనూ జిల్లాకు వచ్చిన అధికారులను ఉపయోగించుకోవటం కన్నా వారిని కూర్చొబెట్టి కష్టపెట్టే విధానమే జిల్లాలో నడుస్తోంది. ఇంతకుముందు ఒక తహసిల్దార్ ఇలాగే సిఆర్‌డిఎ నుంచి జిల్లాకు వచ్చినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా అలాగే ఉంచేశారు. చివరకు ఆయన గగ్గోలు పెట్టినా పట్టించుకున్న నాధుడు లేకుండాపోయారు. చివరకు ఆరోజు ఉద్యోగవిరమణ చేసే రోజు రాగానే ఉదయం పోస్టింగ్ ఇచ్చి సాయంత్రానికి ఆ పోస్టులో ఆయన్ని రిటైర్డు చేసేశారు. అవిధంగా సాంకేతిక అంశాన్ని పూర్తిచేసినా ఆయన మాత్రం జిల్లాకు వచ్చి ఏ పోస్టులోనూ పనిచేయలేకపోయారు. దీంతో సర్వీసులో రీజాయిన్ కాకపోవడంతో ఆ సమయం అంతా శెలవుగానే పరిగణించే అవకాశం ఉండటంతో అవిధంగా ఆసమయంలో రావాల్సిన జీతంతోపాటు ఎరెండ్ లీవ్ కూడా దారుణంగా నష్టపోయే పరిస్దితిని ఎదుర్కొన్నారు. అప్పట్లో ఈవ్యవహారం అధికారవర్గాల్లో సానుభూతిని, ఆవేదనను గణనీయంగా వ్యక్తం చేసినా ఇప్పుడు అదే పరిస్దితి మరో ఇద్దరు తహసిల్దార్లకు తప్పలేదు. రెండునెలల క్రితం సిఆర్‌డిఎ పరిధిలో పనిచేసి జిల్లాకు ముగ్గురు తహసిల్దార్లు వెనుతిరిగారు. వచ్చినవారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా అధికారయంత్రాంగం చోద్యం చూస్తూ వచ్చింది. ఈదశలో ఒక తహసిల్దార్ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ఒక మండలానికి తహసిల్దార్‌గా పోస్టింగ్ సంపాదించుకోగలిగారు. రాజకీయానికి తలొగ్గిన అధికారులు మిగిలిన ఇద్దరు తహసిల్దార్లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఉంచేశారు. వారిద్దరు ఇప్పుడు ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేయటం తప్ప మరొ అవకాశం లేని పరిస్దితిని ఎదుర్కొంటున్నారు. మరోవిధంగా చూస్తే జిల్లాలో అధికశాతం మండలాల్లో తహసిల్దార్ల పోస్టుల్లో పూర్తిస్దాయి అధికారులు పనిచేయటం లేదంటే ఆతిశయోక్తి కాదు. పలుచోట్ల ఎఫ్‌ఎసిలు ఇచ్చి, మరికొన్నిచోట్ల డిప్యూటీ తహసిల్దార్లకు అడహాక్ పదోన్నతుల పేరిట కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ స్ధానాల్లో పూర్తిస్దాయి తహసిల్దార్లను నియమించే అవకాశం ఉన్నప్పటికీ దానిపై అధికారులు కనీసం దృష్టి సారించకపోవటం గమనార్హం. దీంతో జిల్లాకు తిరిగివచ్చిన అధికారులు ఆగమ్యగోచరమైన పరిస్దితిని ఎదుర్కొంటున్నారు. తమ పరిస్దితి కూడా గతంలో ఒకరోజు ఉద్యోగం చేసి విరమణ చేసి తహసిల్దార్ మాదిరిగా ఎక్కడ తయారవుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. మండలాల పరిధిలోనే కాకుండా స్వయాన కలెక్టరేట్ ప్రాంగణంలోనే పూర్తిస్దాయి అధికారుల అవసరం ఎంతో ఉందని చెపుతున్నారు. అయా విభాగాలకు తహసిల్దార్లు నేతృత్వంలో వహించాల్సి ఉండగా ఆస్ధానాల్లో డిప్యూటీ తహసిల్దార్లను కొనసాగిస్తూ రావటం వెనుక ఉన్నతాధికారుల అంతర్యం ఏమిటో బోధపడటం లేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రాజకీయ పలుకుబడి ఉంటేనే పోస్టింగులు దక్కుతాయన్న విమర్శ రావడానికి జరుగుతున్న పరిణామాలే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ జిల్లాలో ఇంతే అన్నట్లుగా పోస్టింగుల వ్యవహారం మారిపోవటం వెనుక జరుగుతున్నది ఏమిటో వెలికి తీస్తే ఎలాంటి వ్యవహారాలు బయటపడతాయో వేచిచూడాలి.
మీ అభిమానమే నా ఆయుష్షు
*అది ఫాల్కే అవార్డు కన్నా మిన్న:సినీదర్శకులు కె విశ్వనాధ్
ఏలూరు, జూన్ 19: ప్రజలు చూపిస్తున్న అభిమానం తాను ఆరోగ్యంగా ఇంతకాలం సాగడానికి, రానున్న కాలానికి ఎంతోగానో ఉపయోగపడుతుందని సినీదర్శకులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాధ్ పేర్కొన్నారు. స్ధానికంగా సోమవారం ఏలూరు నగర బ్రాహ్మణ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విశ్వనాధ్‌ను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా విశ్వనాధ్ మాట్లాడుతూ తనకు వచ్చిన అవార్డు కన్నా ప్రజలు చూపిస్తున్న అభిమానమే తనకెంతో మిన్న అని పేర్కొన్నారు. ఇలాంటి ఫాల్కే అవార్డులు సంవత్సరంపాటు తనతో ఉంటాయని, అతర్వాత మరొకరు ఆస్ధానంలోకి వస్తారని, అయితే ప్రజల అభిమానంతో తనతో చిరస్ధాయిగా కొనసాగటం తాను చేసుకున్న అదృష్టమని చెప్పారు. ఏలూరుతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. అంబికా వారి కుటుంబంతో తన అనుబంధం విడదీయరానిదన్నారు. ఎందరో మహానుభావులున్న ఏలూరులో తనకు జరిగిన సన్మానం ఎప్పటికీ మరచిపోలేనని చెప్పారు. మీ అభిమానం చూస్తుంటే భయంగా ఉందని ఛలోక్తిగా వ్యాఖ్యానించారు. మన శక్తి అవసరమైనప్పడు ఖచ్చితంగా ఉపయోగించాలని, అప్పుడే ఫలితాలు వస్తాయన్నారు. అయితే శక్తి అనేది సందర్భాన్ని బట్టి ఉండాలని, అయితే ఐక్యత అనేది ఎన్నో పనులకు మూలకారణమవుతుందన్నారు. మనం ఏ కార్యక్రమం చేసినా క్రమశిక్షణ విడకూడదని పేర్కొన్నారు. ఈసందర్భంగా పదవతరగతిలో పదికి పది మార్కులు సాధించిన పి సాయినిహారిక, ఎం జ్యోతివల్లి, కళాకారులు ఉపాధ్యాయుల, ఎ పార్వతిరామచంద్రన్, చల్లపల్లి లక్ష్మినారాయణలను విశ్వనాధ్ ఘనంగా సన్మానించారు. అనంతరం విశ్వనాధ్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, డిప్యూటీ మేయరు గుడివాడ రామచంద్రకిషోర్, మాజీ డిప్యూటీ మేయరు చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు, ఉషాబాల అధినేత డాక్టరు వివి బాలకృష్ణారావు, ప్రముఖ వ్యాపారవేత్త అంబికా రాజా, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ డైరెక్టరు ఎంబిఎస్ శర్మ, కార్యక్రమ కన్వీనర్ సత్యవాడ దుర్గాప్రసాద్, కోకన్వీనర్ కె కృష్ణమాచార్యులు, బ్రాహ్మణ ఐక్యకార్యాచరణ సమితి కార్యదర్శి ద్రోణంరాజు వెంకటరమణ, నాయకులు మంత్రిప్రగడ శ్రీహరిరావు, ఈదర వెంకట రమణప్రసాద్, దర్భా విజయసాగర్, కోడూరి కనకదుర్గ, డాక్టరు నిర్మలదేవి, సిఎపి శ్రీనివాసరామానుజాచార్యులు, గుడిపాటి లలితాశర్మ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో రూ. 7.2కోట్ల చంద్రన్న తోఫా కిట్లు
కార్మిక సంక్షేమ శాఖామంత్రి పితాని
ఆచంట, జూన్ 19: రంజాన్ పండుగను పురస్కరించుకుని జిల్లాలో ముస్లింలకు రూ. 7.2 0కోట్ల విలువైన చంద్రన్న రంజాన్ తోఫా కిట్లు అందిస్తున్నట్టు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖామంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆచంట రామేశ్వరస్వామి సత్రంలో నిర్వహించిన చంద్రన్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మత సామరస్యానికి ప్రతీక గా నిలిచే రంజాన్ పండుగను పేదముస్లింలంతా ఆనందంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశ్యంతో చంద్రన్న రంజాన్ తోఫా అందిస్తున్నామన్నారు. గతేడాది 23,902 మందికి కిట్లు అందించగా ఈ ఏడాది కొత్తగా తెల్లకార్డు పొందిన వారిలో 5,783 మంది ముస్లింలు ఉన్నారన్నారు. వారితో కలిపి ఈ ఏడాది 29,685 మంది ముస్లిం కుటుంబాలకు కిట్లు అందిస్తున్నామన్నారు. రంజాన్ మాసంలో రాష్టవ్య్రాపితంగా 1.75 లక్షల ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లింలకు ఆయన కిట్లు అందచేశారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్లు ఉప్పలపాటి సురేష్‌బాబు, సానబోయిన గోపాలకృష్ణ, జడ్పీటీసీ బండి రామారావు, ఎంపిపి మేకా పద్మకుమారి, సర్పంచ్ బీర తిరుపతమ్మ, తహసీల్దారు కుక్కల రాజేంద్ర ప్రసాదరావు, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ ఎస్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
‘పట్టిసం’ నుంచి కుడికాలువకు నీరు విడుదల
పోలవరం, జూన్ 19: గోదావరి నీరు ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఇ విఎస్ రమేష్‌బాబు పట్టిసం ఎత్తిపోతలలోని 9 మోటార్లను ఆన్‌చేసి గోదావరి నీటిని కుడి కాలువలోకి వదిలారు. కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని తరలించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఎస్‌ఇ తెలిపారు. ఈ సీజన్లో సుమారు వంద టిఎంసిల నీటిని కృష్ణాకు తరలించడం లక్ష్యం కాగా, ప్రస్తుతం 9 మోటార్ల ద్వారా రోజుకు 3,150 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నామన్నారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 14.17 మీటర్లుగా నమోదైంది. రానున్న రోజుల్లో ఎత్తిపోతల్లోని 24 మోటార్లు ఆన్‌చేసి రోజుకు 8,400 క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తామని ఎస్‌ఇ తెలిపారు. ఈయన వెంట ఇఇ ఎస్ శంకరరావు, ఎఇలు ఉన్నారు. ఇదిలా ఉండగా..గుంటూరు జిల్లాకు చెందిన రైతులు పట్టిసం ఎత్తిపోతలను, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చారు. వారు వచ్చే సమయంలో ఎత్తిపోతల వద్ద మోటార్లు ఆన్‌చేయడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం పట్టిసం ఎత్తిపోతల ద్వారా వచ్చిన గోదావరి నీరు గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఎకరాకు 40 బస్తాల వరి దిగుబడి అయినట్టు చెప్పారు. ప్రస్తుతం జూన్ నెలలోనే ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించే ప్రక్రియ ప్రారంభించడంతో రైతాంగానికి మరింత మేలు జరుగుతుందని గుంటూరు జిల్లా రైతులు తెలిపారు.