పశ్చిమగోదావరి

కోవింద్ ఎంపిక మంచి నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 20: రాష్టప్రతి అభ్యర్థిగా మంచి వ్యక్తి, అంబేద్కర్ ఆర్యాధ్యయోధుడు రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపిక చేశారని రాజ్యసభ మాజీ సభ్యుడు యర్రా నారాయణస్వామి వ్యాఖ్యానించారు. రాష్టప్రతి అభ్యర్థిత్వంపై మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఎంతో మందికి కోవింద్ ఆదర్శప్రాయుడన్నారు. ఆయన అంబేద్కరిజాన్ని నమ్మిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన సిద్ధాంతాలు దేశానికి అచరణీయమన్నారు. రామ్‌నాధ్ కోవింద్‌తో పాటు తాను కూడా తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యానని ఆనాటి జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. తొలిసారిగా ఇద్దరం ఒకేసారి రాజ్యసభలోకి అడుగు పెట్టామని, ఈకారణంగా ఆయనతో తనకు మంచి పరిచయం ఉందన్నారు. మీడియాలో వచ్చిన వార్తలు చూసినా ఎవరో అని అనుకున్నానని, తెల్లారి పత్రికల్లో ప్రచురితమైన వార్తాకథనాలను చూసి ఆశ్చర్యపోయానన్నారు. నీతి, నిజాయితీ కలిగిన రామ్‌నాథ్ కోవింద్ రాష్టప్రతిగా ప్రమాణ స్వీకారం చేస్తారని నారాయణస్వామి అభిలషించారు.

తుది దశకు ఎర్రకాలువ ఆధునికీకరణ
*ఆగస్టులో సిఎం పర్యటించే అవకాశం: ఎర్ర కాలువపై బ్రిడ్జి ప్రారంభ సభలో మంత్రి మాణిక్యాలరావు

తాడేపల్లిగూడెం, జూన్ 20: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఎర్ర కాలువ ఆధునికీకరణ పనులు తుది దశకు చేరాయని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. మంగళవారం రూరల్ మండలం కొమ్ముగూడెం వద్ద ఎర్ర కాలువపై 2.81 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఐదువేల క్యూసెక్కులు మాత్రమే ఎర్ర కాలువ ద్వారా దిగువకు వెళ్లేదన్నారు. ప్రతీ ఏడాది ఎర్ర కాలువ వరదతో పంటలు ముంపునకు గురయ్యేవన్నారు. 20,250 క్యూసెక్కుల సామర్థ్యంతో ఎర్ర కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టి పంట ముంపు నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. గతంలో నత్తనడకన నడిచిన పనులు ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో తుదిదశకు చేరుకున్నాయన్నారు. ఆగస్టు నెలలో సిఎం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అవకాశం ఉందన్నారు. రెండున్నర నెలల్లో ఎర్ర కాలువపై కొమ్ముగూడెం వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడం పట్ల అధికారులను అభినందించారు. కొమ్ముగూడెం వద్ద బ్రిడ్జి నిర్మాణంతో కొమ్ముగూడెం, కోరుమామిడి, నిడదవోలు మధ్య రాకపోకలకు మంచి సౌకర్యం ఏర్పడిందన్నారు. రైతుల ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కలిగిందన్నారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. అప్పారావుపేట నుంచి తాడేపల్లిగూడెం వరకు రూ.2.5 కోట్లతో రోడ్డు, కోరుమామిడి నుంచి అప్పారావుపేట వరకు రూ.2 కోట్లతో రోడ్డు నిర్మాణానికి మంజూరు చేశామన్నారు. అప్పారావుపేట - తాడేపల్లిగూడెం మధ్య రోడ్డును విస్తరించి అభివృద్ధి చేసేందుకు రూ.12 కోట్లతో టెండర్లు పిలవడం జరిగిందన్నారు. కొమ్ముగూడెం, తాడేపల్లిగూడెం, వీరంపాలెం, అనంతపల్లి రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లతో టెండర్లు పిలవడం జరిగిందన్నారు. కొమ్ముగూడెం శ్మశాన వాటిక నుంచి పట్టెంపాలెం రోడ్డును రూ.25లక్షలతో అభివృద్ధి చేస్తామన్నారు. నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో ఉపాధి హామీ పనులు అనుసంధానం చేసుకుని రూ.10లక్షలతో శ్మశానవాటికలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో ప్రతీ పాఠశాలకు బల్లలు ఏర్పాటు చేసేందుకు పిఎంఆర్ ట్రస్టు చర్యలు చేపట్టిందన్నారు. కొమ్ముగూడెం వద్ద ఎర్ర కాలువపై 30 ఏళ్లుగా సేవలందిస్తున్న మడికే సత్యనారాయణకు జీవనోపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎంసి ఎస్‌ఇ శ్రీనివాస్‌యాదవ్‌కు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా నవీన్, సర్పంచ్‌లు వెంకట్రావు, కృష్ణ, డిఇ డి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ పోతుల అన్నవరం, తహసీల్దార్ నాగమణి, బిజెపి నాయకులు శాంతకుమార్, ఎఇ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

ప్రజాసంక్షేమమే ప్రభుత్వాల ధ్యేయం
*అందరితో కలిసి అందరి అభివృద్ధి సమ్మేళన్‌లో మంత్రి మాణిక్యాలరావు

తాడేపల్లిగూడెం, జూన్ 20: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. మంగళవారం స్థానిక మాగంటి సీతారామదాసు కళ్యాణ మండపంలో ‘అందరితో కలిసి అందరి అభివృద్ధి’ (సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరితో కలిసి అభివృద్ధి నినాదంతో మోడీ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారన్నారు. వేలాది కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు గత మూడేళ్ళల్లో అందించామన్నారు. అవినీతి రహిత సుపరిపాలన అందిస్తూ ప్రగతిపథంలో దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. 2022 నాటికి ప్రతీ కుటుంబానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సొంతిల్లు కల్పించాలన్నదే ధ్యేయమన్నారు. గత మూడేళ్ళుగా ప్రజలకు అందించిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నర్సాపురం ఎం.పి గోకరాజు గంగరాజు మాట్లాడుతూ బిజేపి ప్రభుత్వం గడిచిన మూడేళ్ళుగా స్వచ్ఛపాలనతో పాలనతో పాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అందజేస్తుందన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజనను అడ్డగోలుగా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బిజేపి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. మరో ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మాట్లాడుతూ భారతావనిని అత్యుత్తమంగా నిలిపేందుకు కృషి చేస్తున్న మోడీకి ప్రతీ ఒక్కరూ అండగా ఉండాలన్నారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ మోడీ పాలనలో లోపాలు ఎత్తి చూపే అవకాశం మచ్చుకైనా లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బిజేపితోనే సాధ్యమనడంలో సందేహం లేదన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా భారత్‌ను ప్రధాని మోడీ నిలుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి, మాజీ ఎమ్మెల్యే రంగరాజు, సిహెచ్.సత్యనారాయణ, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా నవీన్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మాలతీరాణి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మూడేళ్ళలోని అభివృద్ధి కార్యక్రమాల పనితీరును నర్సాపురం ఎం.పి గోకరాజు గంగరాజు ఆవిష్కరించారు.

విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్ పోస్టులు 126 భర్తీ
*జాయంట్ కలెక్టర్ కోటేశ్వరరావు
ఏలూరు, జూన్ 20: జిల్లాలో గత రెండు సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకూ విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి 126 బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీగా వున్న ఏడు పోస్టులకు జెసి ఇంటర్వ్యూలు నిర్వహించి బధిరులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. నరసాపురం సబ్ కలెక్టరు కార్యాలయంలో రెండుపోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో రెండు, మున్సిపల్ శాఖలో ఒకటి, కలెక్టరేట్ రెవిన్యూ శాఖలో ఒకటి, కమర్షియల్ టాక్స్ శాఖలో ఒకటి కలిపి మొత్తం ఏడు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఆయా శాఖల్లో బధిర అభ్యర్ధులకు ఉద్యోగాలు కల్పించారు. ఇంత వరకు జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీగా వున్న బ్యాక్‌లాగ్ వేకెన్సీలు 119 భర్తీ చేయగా మంగళవారం భర్తీచేసిన ఏడు పోస్టులతో కలిపి మొత్తం 126 పోస్టులు విభిన్న ప్రతిభావంతులతో భర్తీచేశామని చెప్పారు. జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీగా వున్న దివ్యాంగులకు సంబంధించి బ్యాక్ లాగ్ వేకెన్సీలను వెలికితీసి వాటిని భర్తీ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలు మేరకు జిల్లాలో ఖాళీగా వున్న బ్యాక్ లాగ్ వేకెన్సీలను పూర్తిస్థాయిలో భర్తీ చేయడం జరుగుతుందని చెప్పారు. త్వరలో వివిధ శాఖల్లో ఉన్న దివ్యాంగులకు సంబంధించి బ్యాక్‌లాగ్ వేకెన్సీలను గుర్తించి వాటిని కూడా భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఉద్యోగం పొందిన అభ్యర్ధులు తమ విధులను సక్రమంగా నిర్వహించి ఆయా శాఖలకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఎడి ప్రసాదరావు, జిల్లా ఎంప్లాయ్‌మెంట్ వెల్ఫేర్ అధికారి రవికుమార్, కలెక్టరేట్ ఏవో సుబ్బారావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ, నర్సాపురం సబ్ కలెక్టరు కార్యాలయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కొత్త ఎస్పీగా రవిప్రకాష్

ఏలూరు, జూన్ 20: జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎం రవిప్రకాష్ జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. రవిప్రకాష్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా ఎస్పీగా పనిచేసిన భాస్కర్ భూషణ్ బదిలీ ఖాయమని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

జాతిపిత విగ్రహం ధ్వంసం
*తాళ్లపూడిలో గ్రామస్థుల ఆందోళన
తాళ్లపూడి, జూన్ 20: మండల కేంద్రం తాళ్లపూడిలో దాదాపు 80 సంవత్సరాల నాటి జాతిపిత మహాత్మాగాంధి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఉదంతం గ్రామస్థులను ఆగ్రహానికి గురిచేసింది. అన్ని వర్గాల ప్రజలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 1933లో మహాత్మాగాంధి తాళ్లపూడి వచ్చారు. గాంధీజీ పర్యటనకు గుర్తుగా గ్రామ కూడలిలో ఆయన విగ్రహాన్ని గ్రామస్థులు ఏర్పాటు చేశారు. జీర్ణస్థితికి చేరిన ఆ విగ్రహాన్ని సరిచేసి, మళ్లీ ఆ ప్రాంతంలో ఇటీవల ఏర్పాటుచేశారు. ఇలావుండగా విగ్రహం ఏర్పాటు చేసిన మూడో రోజునే గుర్తు తెలియని వ్యక్తులు దానిని ధ్వంసం చేశారు. ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు సింహాద్రి జనార్దనరావు ఆధ్వర్యంలో మంగళవారం మెయిన్ రోడ్డులో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తరువాత గాంధి నూతన విగ్రహాన్ని తిరిగి ఆ ప్రదేశంలో ఏర్పాటు చేశారు. త్వరలో ఆ విగ్రహం స్థానే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని జనార్దనరావు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఫీయుల్లాబేగ్ తాళ్లపూడి విచ్చేసి, నూతన విగ్రహానికి పూలమాల వేసి జాతిపిత పట్ల ప్రతిఒక్కరూ గౌరవంగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నామన పరమేశ్వరరావు, నక్కా చిట్టిబాబు, లకంసాని ప్రసాద్, సొలస ఉమ, వాసవీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తాళ్లపూడి ఎస్‌ఐ అశోక్ ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, విగ్రహ శకలాలను పంచాయతీలో భద్రపరిచారు.

సైనికుల సేవలు చిరస్మరణీయం
*మంత్రి మాణిక్యాలరావు

తాడేపల్లిగూడెం, జూన్ 20: దేశ రక్షణలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న సైనికుల సేవలు చిరస్మరనీయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. రూరల్ మండలం మిలటరీ మాధవరంలో మంగళవారం అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనికుల పుట్టినిల్లు అయిన మిలటరీ మాధవరంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సహకారంతో రూ.11.50 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అప్పటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారేకర్ ఈ నిధులను మంజూరు చేశారన్నారు. సైనికులు, మాజీ సైనికుల నివాసిత ప్రాంతాల్లో నూరు శాతం ఉచిత విద్య అందించే పరిస్థితి తీసుకొస్తామన్నారు. మిలటరీ మాధవరంలో యువతకు ఉపాధి కల్పించేందుకు డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. స్థానికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూమి ఇవ్వగలిగితే సంబంధిత కుటుంబాల్లో ఒకరికి తప్పకుండా ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా సమాజ, గ్రామాభివృద్ధికి ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. దళిత వర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి అభ్యర్థిగా నరేంద్ర మోదీ ప్రకటించడం హర్షదాయకమన్నారు. ప్రముఖ సంఘ సేవకురాలు కోలా రోహిణమ్మ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ అభివృద్ధి పనులకు విరాళాలు అందించిన గుడిమెట్ల వెంకటరెడ్డి, పర్ల వెంకటరెడ్డిలను సత్కరించారు. మిలటరీ మాధవరాన్ని దత్తత చేసుకున్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఎండి పి. ఉదయభాస్కర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా నవీన్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పోతుల అన్నవరం, తహసీల్దార్ నాగమణి, ఎంపిడిఒ వివి రామాంజనేయశర్మ, సర్పంచ్ కవులూరి పరిమళ, మాజీ సైనికులు జి భరతుడు, వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు నూకల బుల్లియ్య, పంచాయతీరాజ్ ఎఇ శ్రీనివాసరావు, బిజెపి నాయకులు రామావతారం తదితరులు పాల్గొన్నారు.

గోపాలపురం చేరుకున్న గోదావరి జలాలు
గోపాలపురం, జూన్ 20: పోలవరం కుడి కాలువ ద్వారా విడుదలైన నీరు మంగళవారం గోపాలపురం చేరుకున్నాయి. పట్టిసీమ వద్ద ఈ నెల 19న అధికారులు గోదావరి నీటిని విడుదల చేశారు. ఆ గంగ శరవేగంతో ప్రవహిస్తూ గోపాలపురం ప్రవేశించింది. ఇక్కడ నుంచి కృష్ణా నదికి, అక్కడ నుంచి రాయల సీమ ప్రాంతానికి ఈ నీరు వెళ్లనుంది. ఇదిలా ఉంటే గతేడాది సక్రమంగా వర్షాలు లేకపోవడం, ఈ ఏడాది ఇప్పటికీ సక్రమంగా వర్షాలు కురవకపోవడంతో చెరువులు ఎండిపోయాయి. దీంతో ఈ ఏడాది వరి నారు వేసేందుకు సాగునీరు కరవైంది. తాడిపూడి కాలువ ద్వారా గోదావరి నీటిని విడుదల చేస్తే తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లోని వేలాది ఎకరాల్లో సాగునీరు అందుతుందని రైతులు చెబుతున్నారు.

నిర్వాసిత రైతులకు భూమికి భూమి అప్పగింత
వేలేరుపాడు, జూన్ 20: వేలేరుపాడు మండలంలోని ముంపునకు గురయ్యే పేరంటపల్లి, టేకుపల్లి, కాక్సినూరు గ్రామాల్లోని నిర్వాసిత రైతాంగానికి మంగళవారం పునరావాస ప్రాంతాల్లో భూములు అప్పగించారు. వేలేరుపాడు మండలంలో ముంపునకు గురయ్యే భూముల సర్వేను గతంలో ఎప్పుడో పూర్తిచేసిన అధికారులు గిరిజనులకు భూమికి భూమి అప్పగించాల్సి ఉంది. దీని కోసం పునరావాస ప్రాంతాలైన బుట్టాయగూడెం మండలంలోని దొరమామిడి, రౌతుగూడెం గ్రామాల్లో సేకరించిన భూములను ఐటిడిఎ పిఒ ఈ మండలాల ప్రత్యేకాధికారి అయిన షణ్మోహన్, వేలేరుపాడు తహసీల్దార్ శ్రీనివాసులు నాలుగు ఆర్టీసీ బస్సులలో నిర్వాసిత రైతులను తీసుకువెళ్లి ఎవరికి కేటాయిచిన భూములను వారికి అప్పగించి, తిరిగి ఎవరి గ్రామాలకు వారిని చేర్చారు. మిగిలిన రైతులను సైతం త్వరలోనే వారికి కేటాయించిన భూములను అప్పగిస్తామని తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు.

పేద విద్యార్థులకు దుస్తుల పంపిణీ
ఏలూరు, జూన్ 20: సమాజంలో పేద విద్యార్ధులకు వస్తద్రానం చేసి ఓ చిరుద్యోగి ఆదుకోవడాన్ని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ రాము సూర్యారావు అభినందించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మంగళశారం రాత్రి ఆసుపత్రి చిరుద్యోగి కె వీరభద్రరావు ఆర్ధిక సహాయంతో పేద విద్యార్ధులకు ఉచితంగా సమకూర్చిన దుస్తులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ ప్రతీ ఉద్యోగి సమాజంలో ఒక పేద విద్యార్దికి అవసరమైన దుస్తులు అందించాలని కోరారు.

ఆకివీడులో బ్లూకోట్స్
-ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాటు
ఆకివీడు, జూన్ 20: వాణిజ్యకేంద్రం ఆకివీడులో తీవ్రంగా మారిన ట్రాఫిక్ సమస్యపై పోలీసు శాఖ దృష్టి సారించింది. గంటల తరబడి జాతీయ రహదారి పై ట్రాఫిక్ నిలిచిపోతుండటంతో దీన్ని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది. పలు కూడళ్లల్లో ట్రాఫిక్ కానిస్టేబుళ్లను నియమించినప్పటికీ ఈ సమస్య తీరడం లేదు. దీంతో బ్లూకోట్స్‌ను జిల్లా అధికారులు నియమించారు. ప్రత్యేకంగా అందించే బైక్‌పై పోలీసు సిబ్బంది నిరంతరం జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూస్తారు. మంగళవారం బ్లూకోట్స్ వాహనంపై కానిస్టేబుల్ నరేంద్ర, హోంగార్డు ఆదిత్య ట్రాఫిక్ పర్యవేక్షణ నిర్వహించారు. ఎక్కడైనా వాహనాలు నిలుపుచేస్తే వాటిని తొలగిస్తూ ట్రాఫిక్ సమస్య పరిష్కార దిశగా చర్యలు చేపట్టారు.

మద్య నిషేధం అమలుచేయాలి
వీరవాసరం, జూన్ 20: రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలుచేయాలని సిఐటియు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన వీరవాసరంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్లో జరిగిన సభలో అంగన్‌వాడీ వర్కర్ల గౌరవాధ్యక్షురాలు కె విజయలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాజా రామ్మోహన్‌రావు, వాసుదేవరావు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ మద్యాన్ని నియంత్రించడంలో భాగంగా బెల్టు షాపులు తొలగిస్తామని చెప్పిన టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి మద్యానికి అనుకూలంగా చంద్రబాబు మొదటి సంతకం చేసి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా చేశారని విమర్శించారు. మద్యం కారణంగా రాష్ట్రంలో హింస, అత్యాచారాలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలకు కారణమవుతున్న రహదారుల వెంబడి మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. జిఒ నెం.217 ప్రకారం మద్యం వల్ల కలిగే నష్టాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మద్యం పాలసీని మార్చాలని ఆందోళన చేస్తే ఈ ప్రభుత్వం అరెస్టులు చేయిస్తోందని ధ్వజమెత్తారు. ఇకనైనా స్పందించి ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మద్య నిషేధానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకుడు విజయకుమార్, అంగన్‌వాడీ నాయకురాలు నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.

పోలవరం కుడికాలువపై ఐదు ఎత్తిపోతల పథకాలు
*ప్రభుత్వ విప్ చింతమనేని
పెదవేగి, జూన్ 20 : మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి పోలవరం కుడికాల్వపై 35 కోట్ల రూపాయలతో అయిదు ఎత్తిపోతల పధకాలను దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చెప్పారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ త్వరలోనే ఈ ఎత్తిపోతల పధకాలకు శంకుస్థాపన చేయడమే కాకుండా ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే తన ధ్యేయమన్నారు. పోలవరం నుండి కృష్ణా డెల్టా కోసం పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా నీరును మళ్లిస్తున్న తరుణంలో దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మెట్ట రైతులకు గోదావరి జలాలను అందించి భూగర్భ జలాల పెంపుదలకు రైతులకు కావాల్సినంత సేద్యపునీరు అందించడానికి ఈ లిఫ్ట్‌లు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 1100 గృహాలను నిర్మించాలని నిర్ణయించామని అర్హత గల పేద లందరికీ దశల వారీగా పక్కా ఇళ్లు నిర్మించి పేదలకు స్వంత ఇంటికలను సాకారం చేస్తామన్నారు. పేదల గృహ నిర్మాణానికి సిమెంటు బస్తా 240 రూపాయలకే అందిస్తామన్నారు. నూరుశాతం సబ్సిడీపై రైతులకు జింకు, జిప్సమ్ సరఫరా చేస్తామన్నారు. కవ్వగుంట, విజయరాయి తదితర గ్రామాల్లో కొంతమంది ఆరుబయట మలవిసర్జన చేస్తున్నారని అటువంటి వారిని గుర్తించి వారికి రేషన్ నిలుపుదల చేస్తామని, ప్రతీ ఒక్కరూ మరుగుదొడ్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు రధం పేరుతో నియోజకవర్గానికి 40 ట్రాక్టర్లు మంజూరయ్యాయని, దరఖాస్తులను జన్మభూమి కమిటీలు పరిశీలించి లాటరీ ద్వారా ఎంపిక చేసి 2.50 లక్షల సబ్సిడీపై అందిస్తామన్నారు. 2019 నాటికల్లా నియోకవర్గంలోని ప్రతీ పల్లెలో పక్కా రోడ్డు నిర్మించాలన్నదే తన ధ్యేయమన్నారు. సమావేశంలో ఎఎంసి ఛైర్మన్ మాగంటి సురేంద్రనాధ్ చౌదరి, ఎంపిపి దేవరపల్లి బక్కయ్య, ఎంపిడివో శ్రీనివాస్, తహశీల్దారు షా, సొసైటీ అధ్యక్షులు ఉండవల్లి వెంకట్రావు, అన్నపనేని రవికుమార్, బొప్పన సుధాకర్, చల్లగుళ్ల వెంకటేశ్వరరావు, మండల ఉపాధ్యక్షులు పామర్తి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.