పశ్చిమగోదావరి

సిసి రోడ్ల పనులు ఆలస్యంపై కలెక్టర్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 19 : జిల్లాలో పంచాయితీరాజ్ శాఖ గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణ పనులు ఆలస్యం చేయడం, నిర్మాణాలు పూర్తి అయినట్లు తప్పుడునివేదికలు ఇవ్వడం పట్ల పంచాయితీరాజ్ శాఖాధికారులపై కలెక్టర్ మండిపడ్డారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో పంచాయితీరాజ్ ఎ ఇ, డి ఇలతో కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిధులు మంజూరు చేసి సిసి రోడ్లు, అంగన్‌వాడీ, పంచాయితీ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయమని పదే పదే చెబుతున్నప్పటికీ తప్పుడు నివేదికలు చూపించడం పట్ల కలెక్టర్ పంచాయితీరాజ్ శాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత పై అధికారులకు, పంచాయితీరాజ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 499 పంచాయితీ భవనాలు ఏర్పాటు నిమిత్తం 344 గ్రామాల్లో స్థల సేకరణ పూర్తి చేయడం జరిగిందని మిగిలిన 79 గ్రామాల పంచాయితీ బిల్డింగులకు స్థల సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి పంచాయితీరాజ్ శాఖకు అప్పగించాలని డి ఆర్‌వో హైమావతిని ఆదేశించారు. త్వరితగతిన భవన నిర్మాణాలకు చర్యలుచేపట్టాలని పంచాయితీరాజ్ ఎ ఇలను కలెక్టర్ ఆదేశించారు. టి నర్సాపురం, కామవరపుకోట, తాళ్లపూడి, దెందులూరు గ్రామాల్లో మండల సమాఖ్యల బిల్డింగులు వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎ ఇలకు చెప్పారు. నివేదికలు ఖచ్చితంగా చూపించాలని తప్పుడు నివేదికలు చూపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో అంగన్‌వాడీ భవనాలు, సిసి రోడ్లు, సిసి డ్రైనేజీ నిర్మాణాల పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రతీ సమావేశంలో చెప్పినప్పటికీ ఇంకా ఆలస్యం చేయడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ ఎన్నిసార్లు చెప్పించుకుంటారని ఎ ఇలను మందలించారు. నిర్ధేశించిన లక్ష్యాలు మేరకు పంచాయితీరాజ్ శాఖ పనులు నిర్వహించాలని అలసత్వం వహించిన ఎ ఇలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డి ఆర్‌వో హైమావతి, పంచాయితీరాజ్ ఎస్ ఇ మాణిక్యం, డ్వామా పిడి వెంకటరమణ, డి ఆర్‌డి ఏ పిడి కె శ్రీనివాసులు, పంచాయితీరాజ్ శాఖ డి ఇలు, ఎ ఇలు తదితరులు పాల్గొన్నారు.
డ్రెడ్జింగ్ హార్బర్ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి పైడికొండల
నరసాపురం, సెప్టెంబర్ 19: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న డ్రెడ్జింగ్ హార్బర్ పరిశీలనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మంగళవారం విచ్చేశారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అధికారులతో కలిసి మాధవాయిపాలెం రేవు పంటు మీదుగా తూర్పు గోదావరి జిల్లా పయనమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ 214 జాతీయ రహదారిని తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మీదుగా నరసాపురం పట్టణానికి విస్తరింపచేయాలని కోరారు. దీనివలన ఉభయ గోదావరి జిల్లాల్లో రవాణా సౌకర్యం మరింత మెరుగుపడగలదన్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన వశిష్ఠ వంతెన నిర్మాణానికి చొరవ చూపాలని కోరారు. గోదావరి నదిపై వశిష్ఠ వంతెన నిర్మిస్తే హార్బర్ యంత్ర సామాగ్రిని అంతర్వేది చేరవేసేందుకు మరింత సౌలభ్యం ఉంటుందని ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు సూచించారు. దీనిపై స్పందించిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజేష్ త్రిపాఠి, కోస్టల్ ఇండియా డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ జివిఆర్ శాస్ర్తీ మాట్లాడుతూ ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
ఆర్యవైశ్యుల సేవలు ఎనలేనివి
*మంత్రి పైడికొండల
పాలకొల్లు, సెప్టెంబర్ 19: సామాజిక సేవలో ఆర్యవైశ్యుల సేవలు ఎనలేనివని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. ఆర్యవైశ్యులపై ఐలయ్య తన పుస్తకంలో రాసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలో మంగళవారం బంద్ పాటించారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటరులో నిర్వహించిన ధర్నాలో మంత్రి మాణిక్యాలరావు పాల్గొని ఆర్యవైశ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపారం చేయకపోతే వస్తువులు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలిసేది కాదన్నారు. ప్రతి కులంలోను కొందరు తప్పు చేసేవారు ఉంటే ఉండవచ్చని, కానీ వైశ్యుల్లో దానగుణం, దేశభక్తి ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. వారు తమ సంపాదనతో సత్రాలు కట్టించి, సామాజిక అవసరాలకోసం, అన్నదానం కోసం, విద్యకోసం వారు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైశ్యుల సేవాగుణం, దాన గుణం ఉన్న దేశభక్తులని, వారిపై చెడుగా పుస్తకం రాయడమంటే అంతకన్నా తప్పు మరొకటి లేదన్నారు. ఈ ధర్నాకు ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు నాళం బాపిరాజు, భోగవల్లి భూషణం, శ్రీఖాకొల్లు సర్వేశ్వరరావు, చక్కా గొల్లబాబు, కారుమూరి శ్రీరాములు, ఛాంబర్స్ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణ, మురహరి ఈశ్వరరావు, బంగారు బుజ్జి, ఎస్.కామేశ్వరరావు, మాఘం బాలకొండలరావు, నాళం బాబి, జవ్వాజి రాజా తదితరులు నాయకత్వం వహించారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు
*రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి జవహర్
కొవ్వూరు, సెప్టెంబర్ 19: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. మంగళవారం స్థానిక లిటరరీ క్లబ్‌లో కొవ్వూరు నియోజకవర్గం తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జవహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలను 7.91 కోట్లతో అభివృద్ధి చేసినట్టు చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే మేధావి వర్గంలో ఉన్న ఉపాధ్యాయులు కీలకపాత్ర వహించి ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేయాలన్నారు. ఆర్డీవో బి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు జెవిఎస్ చౌదరి, ఎపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుభాష్‌చంద్రబోస్, మున్సిపల్ చైర్మన్ జె రాధారాణి, వైస్ చైర్మన్ డి రాజారమేష్, ఎఎంసి చైర్మన్ వేగి చిన్న, ఎంఇఒ కెంపురత్నం తదితరులు పాల్గొన్నారు. అనంతరం 180 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి 18 మంది విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ప్రదానం చేశారు.